June 24, 2024

కౌండిన్య కథలు – మారని పాపారావు

రచన: రమేశ్ కలవల

మాయ మాటలతో మభ్యపెట్టడం పాపారావుకు పుట్టుకతో అబ్బిన కళ. సిగరెట్టు బడ్డీకొట్టు దగ్గర మాటల గారడి చేసిడబ్బులు సంపాదించాడు పాపారావు. పట్నం నుండి హోల్ సేల్ లో కొత్త వెరైటీ లైటర్స్ తీసుకురమ్మని చెప్పాడుట ఆ బడ్డీకొట్టు ఓనర్.

పాపారావు ఎలాంటి వాడో కొంచెం తెలిసింది కదా, తన గురించి మిగతాది తరువాత తెలిసుకుందాం, ఎందుకంటే ఆ డబ్బులు తీసుకొని అటు వెడుతుంటే పోస్ట్ మ్యాన్ ఓ టెలిగ్రాం అందచేసాడు. అందులో “తాత సీరీయస్ స్టార్ట్ ఇమిడియట్లీ”, అని ఉంది మెసేజ్. తాతయ్యంటే పాపారావు కు చాలా ఇష్టం. ఆ వార్త చూసి దిగులు పడ్డాడు. ఎలాగైనా బయలుదేరి వెళ్ళాలను కున్నాడు. జేబు తడువుకున్నాడు. దాంట్లోంచి ఇందాకా ఆయన ఇచ్చిన డబ్బులు బయటకు తీసాడు. ఆలోచిస్తున్నాడు, తాతయ్యా లేక లైటర్లా? కానీ ఓ సమస్య కనిపించింది, ఆయన ఇచ్చిన డబ్బులు తన ప్రయాణానికి, అక్కడ ఖర్చులకు చాలవు. మరి ఏలా? తను ఎలాగూ పట్నం వెడదామను కుంటున్నాడు. అక్కడ తను తరుచూ వెళ్ళే పేకాట క్లబ్ ఒకటి ఉంది. అదిగుర్తుకొచ్చింది. బయటకు ఓ చిరు నవ్వు నవ్వాడు కానీ తాతయ్య గుర్తుకొచ్చి లోపల హృదయంలోనుంచి దుఃఖం తన్నుకొచ్చింది. పాపారావు తట్టుకోలేక భోరున ఏడ్చాడు. కొంత సేపటికి తేరుకొని స్టేషన్ కు బయలుదేరాడు. పట్నం చేరాడు. ట్రైన్ టికెట్ కు, దారిలో తిండికి కొంత ఖర్చు చేసాడు. ఇంక మిగిలిన వాటినంతా వాడకూడదని అనుకుంటున్నాడు. కొంత డబ్బులు తీసి కింద జేబులో పెట్టాడు. కనీసం వాటితోనైనా కొన్ని లైటర్స్ తీసుకెళ్ళచ్చను కున్నాడు. క్లబ్ దగ్గరకు చేరుకున్నాడు. అటు ఇటూ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తారేమోనని చూసాడు. ఎవరూ లేరని నిర్థారించుకొని లోపలకు వెళ్ళాడు.

పాపారావు కు “పేకాట రాయుడు”, అని ముద్దు పేరు. రంగం లోకి దిగాడంటేనే, అన్నీ మరిచి పోతాడు. కొన్ని సార్లు రోజులు తరబడి ఆడి గడ్డాలు మీసాలు వేసుకొని స్నానాలు పానాలు లేకుండా ఇంటికెడుతున్న ఆయనను చూసి చేతిలో రెండు రూపాలు పెట్టినవారున్నారు, వాళ్ళ ఇంటి ఓనర్ గారి భార్యతో వెళ్ళెళ్ళు బాబు చేతులు ఖాళీ గా లేవు అనిపించు కున్న రోజులున్నాయి. సిగెరెట్ తాగుతూ ఆట ఆడడం వల్ల ప్యాంట్లకు, షర్టులకు సిగెరెట్ బొక్కలు, ఆ దట్టమైన పొగలలో ఓ సారి షో చూపించి ముక్కను సరిగా చూసుకోలేదని గుద్దులాటలు అయిన రోజులున్నాయి. ఇంకో సారి రెండు వారాలు ఏమీ తినక నిరాహారదీక్ష చేసినవాడిలా తయారై ఆసుపత్రి కి వెడితే ఆయన అవస్థ చూసి దయతో ఉచితంగా సిలైన్ బాటిల్స్ ఎక్కించుకొని ఇంటికొచ్చిన రోజు ఉన్నాయి. పాపారావు గురించి ఇంతకంటే చెప్పనక్కర్లేదు. కధలోకి వెడదాం.

ఆ క్లబ్లో అందరూ తెలిసిన వాళ్ళే, ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళు తప్పా, అందరూ చేతులూపారు. ఆ కొత్త వాళ్ళు ఎందుకైనా పనికొస్తారని వాళ్ళని ప్రత్యేకంగా వెళ్ళి పలకరించాడు. ఇంకొకతను లేచి తనవైపు రాబోయాడు. ఇంతక ముందు బాకీ తాలూకా కాబోలు. మళ్ళీ అతని టేబుల్ వాళ్ళు త్వరగా ముక్క వేయమంటే కూర్చుండి పోయాడు. అమ్మయ్యా అనుకుంటూ వెళ్ళి ఓ టేబుల్ లో వెళ్ళి కూర్చున్నాడు. ఆట మొదలు పెట్టాడు. మొదటి ఆట షో చూపించాడు. ఆ ముక్కలకు ముద్దుల వర్షం కురిపించాడు. బోణి అయ్యింది. రోజూ లాగా కాకుండా పాపారావుకు తాతయ్య టెలిగ్రాం మదిలో వద్దన్నా మెలుగుతోంది. అయినా విలాసపురుషుడు చేతినుండా డబ్బులు లేకుండా అక్కడికి వెళ్ళడానికి మనసు ఒప్పదు. ఎలాగూ సాయంత్రంకు కానీ ట్రైన్ లేదు. ఈ లోపల జేబు నింపుకుంటే సరిపోతుందను కున్నాడు. హెచ్చులు తగ్గులు. మధ్యహ్నం అయ్యే సరికి గెలుచుకున్న వాటితో సిగిరెట్లకు పోగా మిగిలింది మొదలు పెట్టిన రొక్కమే. లాభం లేదు అనుకున్నాడు, ఇంకా జాగ్రత్త గా ఆడాలని మొదలు పెట్టాడు, సాయంత్రానికి అవికూడా స్వాహా. ఇంక మిగిలిందల్లా కింద జేబులో డబ్బులే. తాత మళ్ళీ గుర్తుకొచ్చాడు. ఇంక తప్పలేదు. మనసులో సిగెరెట్ బడ్డీ కొట్టు ఆయనకు క్షమించమని అడిగి, ఆ డబ్బులు కూడా తీసాడు. ఆడడం మొదలు పెట్టాడు. ఈ సారి ఇంకా పట్టుదలగా ఉన్నాడు. తనకు కావలసిన డబ్బులు గెలుచుకున్నాడు, ఇంక ఆపి బయలదేరదామను కొని లేచి కొంచెం పని ఉంది వెళ్ళాలి అన్నాడు. ఒకడు రసపట్టులో ఉంటే ఎలా వెడతావు కూర్చోమని లాగాడు. ఆ లాగుడుకీ సరిగ్గా తన కుర్చీలో పడ్డాడు. పోనీలే గెలుస్తున్నాడు కదా ఓ అరగంట ఆడదామని కూర్చోగానే మళ్ళీ ఆట మొదలైయ్యింది. ఆ పేకలకు ఏమి తెలుసు తాతయ్య సంగతి. మీరు ఊహించినట్లే డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. మరి తాతయ్య సంగతేంటి?

ఖాళీ జేబులు చూపించాడు. ఇంకో అప్పు చేయ దలుచుకోలేదు పైగా ట్రైన్ టైమ్ కూడా అవుతోంది. దీనంగా బయటకు నడిచాడు, తాతయ్య గుర్తుకొచ్చి మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏది ఏదైనా వెళ్ళాలని నిశ్చయించుకొన్నాడు. చిల్లి గవ్వ కూడా లేకుండా స్టేషన్ కు బయలు దేరాడు. ట్రైన్ ఎక్కేసాడు, టిసీ గారు వస్తే చూసుకోవచ్చులే అని. దొరికిన చోట కూర్చుని ఆయన గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. కళ్ళల్లో వద్దన్నా నీళ్ళు వస్తున్నాయి, ఆ సీట్లో ఆయన గమనించి పసిగట్టి సంగతి కనుక్కున్నాడు, పొద్దున్న పాపారావు ను ఆ క్లబ్లో చూసాడుట. ఈ మధ్యనే ఆయన కూడా పేకాట మొదలెట్టాడుట. ఇంకేముంది ప్రాణం లేచొచ్చింది. మళ్ళీ పేకాట మొదలు. ఎదురి వాడు కొత్తవాడు కదా పాపారావు పైచేయి. ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ రాదు తనకు, గెలుస్తున్నాడు, ఆ ఎదుటాయన అమాయకుడిలా ఉన్నాడు. డబ్బులు వరస అయ్యింది, దాని తరువాత ఆయన చేతికేసుకన్నవి, మెడలో వేసుకున్నవి తారు మారయ్యాయి. ఇంకమిగిలినవి ఆ బట్టల సూట్కేస్ అంతే. ఇంక ఆపేద్దామన్నాడు పాపారావు. అవమానం అనిపించి ఆయన ససేమీరా ఒప్పుకోలేదు. కొంత సేపటికి కట్టుకున్న గుడ్డలతో మిగిలాడు ఎదుటాయన. ఆయనకి ఇంటికి వెళ్ళడానికి కొంత అప్పు ఇచ్చాడు మళ్ళీ ఆ క్లబ్ లో ఎప్పుడైనా పనికివస్తాడని. నిద్ర పోయి లేచాడు తన స్టేషన్ వచ్చింది.

పొద్దున్నే దిగాడు స్టేషన్లో. హడావుడి గా బయటకు బయలు దేరాడు. రిక్షా ఎక్కి త్వరగా పోనివ్వ మన్నాడు. దారిలో ఆ సూట్ కేసు నుండి మంచి షర్ట్ లాగి పాతది విసిరికొట్టాడు రోడ్డు మీద. ఇళ్ళు చేరాడు. తాతయ్య కనిపించడం లేదు కానీ ఎవరో కొత్త అమ్మయి కనిపించింది. ఆ అమ్మాయి తను వైపు, ఆ షర్ట్ వైపు, తను వేసుకున్న గొలుసు, ఉంగరాల వైపు పదే పదే వింతగా చూస్తోంది, ఇంతలో తాతయ్య బయటకు వచ్చాడు, దుక్కలా ఉన్నాడు. శుభ్రంగా చెరుకుగడ నవుతున్నాడు. కోపంగా తాతయ్యను బుద్ధి ఉందా లేదా అని అరిచి ఆ వచ్చిన టెన్షన్ కు మేడపైకి సిగిరెట్ పీకడానికి వెళ్ళాడు. తాతయ్య వచ్చాడు, అలా టెలిగ్రామ్ కొడితే గానీ రావనీ అలా రాసానన్నాడు తాతయ్య. ఇంతలో పైన నుండి సైగలు చేసి ఆ అమ్మాయిని పిలిచాడు. నిన్ను పిలిచింది మన దూరపు బంధువలమ్మాయి కి నీకు పెళ్ళి శుభవార్త చెప్దామని పిలిపించానన్నాడు. ఇద్దరూ మాట్లాడుకొని రమ్మని తను కిందకి వెళ్ళాడు, వెడుతూ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నను కూడా పిలిపించా నన్నాడు తాతయ్య. ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడు కున్నారు. పాపారావు కు ఆ అమ్మాయి నచ్చింది. కిందకొచ్చి తాతయ్యకు సిగ్గుతో చెప్పాడు. ఇంతలో ఓ రిక్షా ఇంటి ముందు ఆగింది. ఆయన లోపలికి వస్తూ పాపారావు ని చూసి “నువ్వా” అన్నాడు. పాపారావు కంగుతిని “మీరా”, అన్నాడు. చేతికి వేసుకున్నవి, మెడలో వేసుకున్నవి తీసి ఇచ్చాడు. షర్ట్ విప్పబోతూ ఆ అమ్మయి ముందు సిగ్గుపడుతూ ఆ సూట్ కేస్ ఇచ్చి వాళ్ళ నాన్నకు ఇవ్వమనీ లోపలికి పరిగెత్తాడు. షర్ట్ విప్పి తాతయ్య లాల్చీ తగిలిచ్చి ఆ షర్ట్ తో బయటకు వచ్చాడు, ఆయన లేడు, ఆ పిల్లా లేదు అక్కడా. ఆ ఎన్నిసార్లు ఓడిపోలేదు ఇదే లెక్కా? అనుకున్నాడు పాపారావు. తాతయ్య కు ఏమైయ్యందో అర్థం కాలేదు. నే చెప్తారా అంటూ తాతయ్యను తో మాటలతో లోపలికి తీసుకెళ్లాడు మన పాపారావు!
శుభం భూయాత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *