April 16, 2024

ఖాజాబీబి

రచన: డా.కె . మీరాబాయి (. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం )

చింత చిగురు అమ్మే ఖాజాబీబి చాన్నాళ్ళుగా కనబడడం లేదు.
” చిగురమ్మోయ్ ” అంటూ వణికే గొంతుతో ఖాజాబీబి కేక వినబడగానే కాలనీ లోని ఇల్లాళ్ళు హడావిడిగా నిద్ర లేచి గుమ్మం లోకి వస్తారు. పేరుకు చింతచిగురు ఖాజాబీబి అని అంటాముగానీ , ఆకు కూరలు, రేగి పళ్ళు, సీతా ఫలాలు, జామ పళ్ళు, ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో ఇంటి ముందుకు తీసుకు వచ్చి అమ్ముతుంది.
ఆమె ఆకారం చూస్తే ఇంత ఓపిక ఈమెకు ఎక్కడిదీ ఆన్న ఆశ్చర్యం కలిగేట్టు వుంటుంది.. ఒక్కిపోయిన పోయిన ఒళ్ళు, చికిలించిన కళ్ళు, ముడుతలు పడిన ముఖం, వెలిసి పోయిన చీర, వదులుగా వేలాడే రవిక, పండిపోయిన జుత్తు, వంగిపోయిన నడుము, చేతిలో కర్ర, తల పైన ఆకుకూరల బుట్ట ఇదీ ఖాజాబీబి అవతారం.
కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచే చిన్న టేకూరు ఖాజాబీబిని ఎరుగని వాళ్ళు మా కాలనీలో లేరు అనాలి.
అనప గింజలు, పచ్చి చెనిక్కాయలు తెచ్చినప్పుడు ముందుగా మా ఇంటికే వస్తుంది .
నా బోణీ మీద నమ్మకం ఆ అమ్మికి అందుకే ముందు నాకే అమ్మకం. బుట్ట కింద పెట్టి , పైన కప్పిన తడి బట్ట తీస్తే ఇంద్ర జాలికుడిలాగా రకరకాలు బయటకు తీస్తుంది. . ఆకుకూరలు పెద్ద కట్టలను ఒబ్బిడిగ విడదీసి చిన్న కట్టలుగా కట్టి మనకు భలే మంచి బేరం అనిపించేలా నాలుగు కబుర్లు చెప్తూ అమ్మేస్తుంది.
” కాపీ చుక్క పోయవూ? ” ఆంటూ మనదగ్గరే కొసరు లాగుతుంది.
మొలనున్న చిన్న చిక్కం సంచీ లో నుండి రెండు తమలపాకులు, ఒక్క పేడు తీసుకుని బుగ్గన పెట్టుకుని వెడద నవ్వు నవ్వుతుంది.
” చింత చిగురు తేవడం లేదేమి ఖాజాబీబి? ” అని అడిగితే ” చెట్లన్నీ కొట్టేసి మిద్దెలు కడుతుంటే వాన చినుకు పడకుంటే చిగురు యాడ తెచ్చేది ?” అని మనల్నే ఎదురు ప్రశ్న వేస్తుంది.
“ఆకుకూరలు కూడా ఇంత ప్రియమా? ” అంటే ” బోర్లు ఏసి ఏసి భూమి గుండె ఎండిపాయె నేనేం చేతు?” అని తప్పు మనదేనంటుంది.
సంక్రాంతి కైనా, ఉగాదికైనా ఖాజాబీబి మామిడాకులు, అరటి పళ్ళు తెస్తేనే పండగొస్తుంది మా కాలనీకి.
ఇంత గా మాకందరికీ అలవాటయిపోయిన ఖాజాబీబి చాన్నాళ్ళుగా రాక పోయేసరికి ముసలామె మంచాన బడిందా ఏమి అని అందరూ అనుకోబట్టిరి.
నాకైతే ఇంకా గుబులు బుట్టింది. ఎందుకంటే అదేమీ కర్మమో నా చేత్తో చింత కాయ తొక్కు పెడితే నెల్లాళ్ళకే బూజు పడుతుంది .ఆమాటె ఒకసారి ఖాజాబీబితో అంటే ” నేను దంచిస్తాను చూడు మరి రెండేండ్లయినా కొత్త తొక్కు వున్నటే వుంటుంది ” అంది.
” నువ్వా? ” అన్న నా సందేహం చూసి “చేత్తో ముట్టనులే చెక్క గరిటతొ తీస్తా” అని దారి చూపింది.
” నువ్వేమి దంచగలవు అవ్వా? “అని మొహమాట పడుతుంటే ” జొన్నలు దంచిన చేతులు నావి ” అని గుండమ్మ కథలో సావిత్రి అంత ధీమాగా చెప్పింది.
కాయలన్నీ శుభ్రంగా తుడిచి, నేను పసుపు, ఉప్పు మెంతిపొడి తెచ్చి పెడితే ఒక్కో వాయికీ సరిపడా వేస్తూ చుట్టు చిందకండా దంచింది
చింత తొక్కు జాడీలోకి గరిటతో వేసి ” మరి మా ముసలాయనకు అన్నంలోకి ఇంత పెట్టవూ!” అని అడిగితే ఆ మాత్రం నాకు తోచలేదే అని సిగ్గేసింది.
నిజంగానే ఖాజాబీబి పెట్టిన చింత కాయ పచ్చడి ఏడాది దాటినా పచ్చగా కొత్త తొక్కు లాగ వుంది.
అందుకే ఈ ఏడు పచ్చడి పెట్టే సమయానికి ఖాజాబీబి రావడం మానేసిందని నాకు దిగులు గా వుంది.
. ” బుట్ట దించేదానికి ఒక చేయి వెయ్ అమ్మా ” అంటుంది. కడుపు నిండా బిడ్డలను కన్న తల్లి ఖాజాబీబి.
“ఈ వయసులో ఎందుకంటే కష్టపడతావు ఖాజాబీబి. నీ బిడ్డలు మీ ఇద్దరు ముసలోళ్ళను చూడరా? ” అని అడిగితే నోరంతా తెరిచి నవ్వింది ఆ రోజు.
” ఈ రెండు చేతుల కష్టం తో నలుగురు కొడుకులను , ఒక కూతుర్ని సాకినాను. వాళ్ళ నాయన బండికింద పడి చేయి విరగ్గొట్టుకునే. ముసలాయననూ బిడ్డ లెక్కన సాకాల్సి వచ్చే . వాండ్లకందరికి పెడ్లిండ్లు చేసేంత వరకు కూలికి పోతూంటి. నలుగురు కొడుకులు కలిసి మా ఇద్దరినీ సాకేదానికి కాలేదు. ఎవరి సంసారం వాండ్లదే. నేను మా ముసలోడు వేరుగా వుంటము. నడుము వంగినాక కూలికి పోలేక ఆకుకూరలు అమ్మబట్టినా. ” అంది.
చింత చిగురు అమ్మే చిన్న టేకూరు ఖాజాబీబి చాన్నాళ్ళుగా రాకపాయె అని కాలనీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
వెలిసి పోయి , చిరుగు పట్టిన చీరెలో వున్న ఖాజాబీబికి నావి నాలుగు పాత పాలిఎస్టర్ చీరలు ఇచ్చాను చింత తొక్కు దంచినందుకు కూలి, చింతకాయల ఖరీదుకు అరవై రూపాయలు చేతిలోపెట్టి .
” నాకైతే చీరలిచ్చినావు. ముసలోనికి ఒక అంగీ ఈయవూ? ” నోరంతా తెరిచి నవ్వుతూ అడిగింది.
నువ్వు కొసరు వేయవు గానీ మా దగ్గర కొసరుతావు ” అని లోపలికి పోయి రెండు పాత షర్టులు తెచ్చి ఇస్తే ఆనందంగా అందుకుంది. ముఖం అంత నవ్వు పులుముకుని “మా యమ్మ చల్లగా వుండు ” అంది
“ఇప్పుడు షేర్ ఆటో కూడ పది రూపాయలు అడుగుతుండ్రు ” ఇచ్చిన డబ్బు ఇంకో చిన్న సంచీలొ వేసి ,రవికలో దాచుకుని పైకి లేస్తూ అంది.
ఇంకో పది రూపాయల కాగితం చేతిలో పెడితే నవ్వుకుంటూ వెళ్ళింది.
మరునాడు చింకి చీర బదులు నేనిచ్చిన చీర కట్టుకు వస్తుందేమో అని చూస్తే మళ్ళీ అదే చీరలో వచ్చింది.
” నాలుగు చీరలు ఇచ్చినాను కదా కట్టుకోరాదాబీబీ? ”
” నా బేటీ షం షాద్ వచ్చిందమ్మ . నువ్వు ఇచ్చిన చీరలు చూసి ఖుషీ పడింది. నేను నాలుగు దినాలు కట్టుకుని ఇస్తానమ్మా అని తీసుక పోయింది. ముసలిదాని నేను ఏది కట్టుకున్నా ఒకటే కదా.” అని నవ్వింది.
నిజమే మెడలో నల్ల పూసలు, చేతికి రంగు రంగు గాజులు, ముఖాన నవ్వు ఇవి చాలు బీబీకి.

నా కోడళ్ళు లాప్ టాప్ ఒళ్ళో పెట్టుకు పుట్టిన వాళ్ళు. మైక్రో ఓవెన్, కరెంట్ కుకర్, మిక్సీలు మాత్రమే వాడడం తెలుసు. రుబ్బు రోలు, రోకలి, తిరగలి వంటి వస్తువులు వచ్చే తరం వాళ్ళు బొమ్మలు లోను , పురాతన వస్తువుల ప్రదర్శన లోను మాత్రమే చూడగలరు. ఇంట్లో అందరికీ చింతకాయ పచ్చడి ఇష్టమే గానీ పెట్టేందుకు బీబి రావాలి కదా.
నెల్లాళ్ళ ముందు ఒకనాడు కొత్త సమస్య గురించి చెప్పి అంగలార్చింది ఖాజాబీబి.
” మూడో కొడుకు దుబాయి పోతనని పట్టిండమ్మ . మా గుడిసె వున్న స్థలం అమ్మి దుడ్లు తీస్కరా అంట పట్టినాడు. ”
” నీ ఇల్లు అమ్మ బాక బీబీ. తిన్నా, తినకున్న తల దాచుకునే చోటు వుంది ఇప్పుడు. అదీ పోగొట్టుకోకు. బ్యాంకులో అప్పు అడిగిపొమ్మను. ” సలహా ఇచ్చాను.
” ఏంది చూసి ఇస్తారమ్మా అప్పు? ” అప్పు చేసి ఆటో కొని నడుపుకున్నాడు గానీ కంతులు కట్టలే . బ్యాంకులో వాళ్ళే బండి తోలుకు పోయిండ్రు. దుబాయిలో మస్తుగ సంపాదించుక వచ్చి నాకు ఇల్లు కట్టిస్తడంట .” మన దేశంలో గంజి తాగి బతికినా సుఖం నాయనా. దుడ్లు సంపాదిస్త మంటు అప్పులు జేసి దేశమిడిచి పోయినోళ్ళు వెనక్కి రాలేక అక్కడ తండ్లాడుతుండరు. ” అంటా మంచిమాట ఆడితే ‘నీకు కడుపున పుట్టిన కొడుకు కంటే గుడిసె జాగా మీద ప్రేమ ఎక్కువ ‘అని విదిలించి పోయే. ఏమి చేసేదమ్మా?” కండ్లు తుడుచుకుంది బీబి.
యాభై గజాల ఇంటిజాగా అమ్మి కొడుకును దుబాయి పంపే పనిలో వుందేమో బీబి.
దసరాకి పండుగకు పూర్ణం పోళీలు ,పులిహార ,ఆకులో పెట్టి “తిను బీబీ “అని ఇస్తే కొడుకు కోసం తాను తినకుండా బుట్టలో పెట్టుకుని తీసుకుపోయిన మనిషికి ఇంత అన్నం పెట్టలేని కొడుకులు.
చింత చిగురు అమ్మే చిన్న టేకూరుఖాజాబీబి చాన్నాళ్ళుగా కనబడడం లేదని కాలనీ వాళ్ళంతా మాటాడుకుంటున్నారు
పదిరోజులు పోయాక ఒక నాడు నేను బీబీకి ఇచ్చిన పాలిఎస్టర్ చీర కట్టుకుని ,గంప నెత్తిన పెట్టుకుని కాలనీకి వచ్చింది ముప్ఫై ఏళ్ళ ఆడ మనిషి. ఇంటి ముందుకు వచ్చాక పోల్చుకున్నా ఖాజాబీబి పోలికలు
” షం షాద్ అంటె నువ్వేనా? .
. ” అమ్మ ఎట్లుంది ? నువ్వు తెచ్చినావే ఆకు కూరలు? ” గంప దించక ముందే ఆత్రంగా అడిగాను.
గంప కింద పెట్టి కళ్ళు తుడుచుకుంది షం షాద్.
“మీ అన్న దుబాయి పోయినాడా? బీబి గుడిసె జాగా అమ్మేసిందా? ”

“ఇల్లు అయితే అమ్మేసింది. కానీ భాయిజాన్ దుబాయికి పోయేదానికి కాదు. అన్నకు కడుపులో కాలేయం చెడిపోయిందంట. అమ్మిజాన్ తన కడుపులో నుండి తీసి పెట్టమంది . ఆన్న బాగున్నాడు. అమ్మ ఆల్లాహ్ దగ్గరికి పోయింది .. కళ్ళ నీళ్ళు కారుస్తూ చెప్పింది షం షాద్.
తనని కన్న అమ్మ కడుపుకు ఇంత అన్నం పెట్టని కొడుకు కోసం కడుపు కోసి ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది ఖాజాబీబి . బండి కింద పడి కుడి చేయి విరిగి పోయినాక పెండ్లాము ప్రేమతో సాకుతుంటే ముప్ఫై ఏండ్లు బతికిన ఖాజాబీబి మొగుడు ఆ యమ్మ పోయినంక మూడు రోజులు కూడా బ్రతుక లేదంట.
చింత చిగురు అమ్మే ఖాజాబీబి చాన్నాళ్ళుగా రావడం లేదని ఎదురు చూసిన మా కాలనీ వాసుల ముఖాలు బీబీ ఇక రాదని తెలిసి చిన్న బోయాయి .
ఇప్పుడు ఖాజాబీబీ కూతురు గొంతు పొద్దున్నే ఖంగున వినబడుతోంది మా కాలనీలో ” ఆకుకూరలమ్మో “అంటూ .
——– ———- ———–

1 thought on “ఖాజాబీబి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *