February 23, 2024

గరిమెళ్ల సత్యనారాయణ గారు

రచన: శారదాప్రసాద్

స్వాతంత్య్రోద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణ గారిది విశిష్టమైన స్థానం. గరిమెళ్ల గేయాలు జాతీయ వీర రసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూ గించాయి. అతను వ్రాసిన ‘మా కొద్దీ తెల్ల దొరతనం’ పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండంలోని ప్రియాగ్రహారంలో 1893 జూలై 15న జన్మించారు. బి. ఏ. డిగ్రీ పూర్తి చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా కొంతకాలం పనిచేశారు. గరిమెళ్ల చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహాం చేసుకున్నారు. 1920 డిసెంబర్లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం ఆమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ల ‘మాకొద్దీ తెల్లదొరతనం’ పాటను వ్రాశాడు. ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఆ పాట నకలు కాపీలు ఒకొక్కటి 12 పైసలు చొప్పున అమ్ముడుపోయాయట. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్లకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. జైలు నుండి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నో చోట్ల సన్మానాలు చేశారు. ఆయన జీవితంలో మధుర ఘట్టం ఇదొక్కటే. ఆ తరువాత కొద్దిరోజులకు భార్య చనిపోయింది.  అప్పుడాయనకి ఇద్దరు కుమార్తెలు. గరిమెళ్ళ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో పద్దెనిమిది పుస్తకాలు అచ్చువేశారు.

1921లో గరిమెళ్ళ ‘స్వరాజ్య గీతములు’ పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ల చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు. గరిమెళ్ళ జైలులో ఉండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే ఒదులుతామని చెప్పారట. కాని గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే ఉన్నాడు. జైలులో తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నారు. ఆ భాషల గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ‘ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా’ను తెలుగులోకి గరిమెళ్ళ అనువదించారు.

గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా గారి వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత ఆంధ్రప్రభలో చేరాడు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడుగా పనిచేశాడు. కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించాడు. గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు కొంత సహాయపడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులుగారు ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసాడు. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు. గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తూనే ఆనారోగ్యం పాలయ్యారు. స్వాతంత్య్రానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం అందలేదు. చరమదశలో దుర్భర దారిద్య్రాన్ని అనుభవించిన గరిమెళ్ళ 1952 డిసెంబర్ 18న మరణించారు. ఆయన అంత్యక్రియలు ఇరుగుపొరుగు వారు జరిపారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం చంపుకున్న మరో స్వాతంత్ర్య యోధుడు ,జాతీయ కవి గరిమెళ్ళ గారికి అశ్రునివాళి!

(మూలం-అమరావతి పబ్లికేషన్స్ వారి తెలుగు వెలుగులు)

12 thoughts on “గరిమెళ్ల సత్యనారాయణ గారు

  1. గొప్ప వారి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు సర్

  2. స్వాతంత్రయోధులు, పేదరికం అవినావ సంబంధం. భగవంతుడు వాళ్ళను ఎందుకు శిక్షిస్తాడు . కవి గరిమెళ్ళ గారికి అశ్రునివాళి.
    నాగయ్య 

  3. ఈ తరం వారికి ఇటువంటి వారి పరిచయం కలగటం అదృష్టం!

  4. విశిష్ట వ్యక్తులను గురించి ,మీ పరిచయాలు బాగుంటున్నాయి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *