April 19, 2024

చీకటి మూసిన ఏకాంతం 6

రచన: మన్నెం శారద

 

నిశాంత పెళ్ళి హితేంద్రతో నిరాడంబరంగా రిజిస్ట్రాఫీసులో జరిగిపోయింది.

సాక్షి సంతకాలు సాగర్, అతని తరపున సినిమా రంగం తాలూకు ఇద్దరు వ్యక్తులు పెట్టేరు.

పెళ్ళిరోజు వరకు నవనీతరావు భార్యకా సంగతి చెప్పలేదు. చెబితే ఎంత రాద్ధాంతమవుతుందో అతనికి తెలుసు. అందుకే మౌనం పాటించేడు.

నిశాంత కూడ చివరి రోజు వరకు తల్లిదండ్రులతో ఆ సంగతి చర్చించలేదు. కారణం – సాగర్ ఆమెకు – ఆమె తండ్రి ఎంతమాత్రం ఈ పెళ్ళికి సుముఖంగా లేడని చెప్పాడు.

“రేపు నా పెళ్ళి. మీరొస్తారా?” అనడిగింది పెళ్ళికి ముందురోజు ఒంటరిగా చూసి.

“వచ్చేవాణ్ణయితే నేనే చేసేవాణ్ణి!” అన్నాడు నవనీతరావు నిర్లిప్తంగా.

“అమ్మకి చెప్పమంటారా!”

“కూతురి పెళ్ళికి బంగారు కుంకుమ భరిణె పట్టుకుని పిలుపులకి వెళ్ళాలన్నది మీ అమ్మ చిరకాలపు కల! నువ్వే నీ పెళ్ళికి దాన్ని పిలిస్తే అది తట్టుకోగలదో లేదో మరి! ఆలోచించి చెప్పు!”

తండ్రి మాటకి నిశాంత స్తబ్ధంగా నిలబడిపోయింది కాస్సేపు. తండ్రి ఈ పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదని అల్లరి చేసి గొడవ చేస్తే తనూ మొండిగా మారి ఎదిరించి ఈ పెళ్ళి చేసుకునేది‌

కాన… తండ్రి చాల సౌమ్యంగా తన అంగీకారాన్ని తెలియజేస్తున్నాడు.

“క్షమించండి. మీ మనసు నొప్పించినట్లున్నాను.” అంది బాధగా.

“నువ్వేం తప్పు చేసావని క్షమించాలి. సాగర్ తో అయితే నీ పెళ్ళి మీ అమ్మని కాదని చేద్దామని సిద్ధపడ్డవాణ్ణి. హితేంద్రని మాత్రం అంగీకరించలేకపోతున్నాను. అదంతా మనస్తత్వాల మధ్య జరుగుతున్న సంఘర్షణ మాత్రమే. విష్ యూ ఎ హాపీ మారీడ్ లైఫ్!”

“థాంక్స్ డేడీ! అమ్మకిక మీరే చెప్పండి. నేను చెప్పలేను.” అంటూ వెళ్ళిపోయింది. నిశాంత గడప దాటుతుంటే నవనీతరావు కళ్ళు పూర్తిగా నీళ్ళతో నిండిపోయేయి.

ఈ సృష్టిలో మనిషికే ఎందుకిన్ని మమకారాలు! పక్షి తన కూనల్ని రెక్కలొచ్చేవరకే సంరక్షిస్తుంది. పశువులు కూడ అంతే! తమ మేత తాము సంపాదించుకునే శక్తి పొందగానే – బిడ్డలు  తల్లిని వదిలేస్తాయి. తండ్రికసలు బాధ్యతే లేదు. కాని… ఈ మనిషెందుకు చచ్చేవరకు సంతానం కోసం పరితపిస్తాడు! ఇదొక రకంగా భగవంతుడు మనిషికి వేసిన శిక్షేమో!

అప్పుడే అక్కడకొచ్చిన వసుంధర భర్త కళ్ళలో నీరు చూసి చలించిపోయింది.

“ఏంటండీ, ఏం జరిగింది, ఏడుస్తున్నారు?” అంది ఆందోళనగా.

నవనీతరావు నవ్వడానికి ప్రయత్నించేడు.

“ఇది ఏడుపు కాదే, ఆనంద భాష్పాలు!”

వసుంధర అర్థం కానట్లుగా చూసింది.

“కూతురికి శుభమా అని పెళ్ళి జరుగుతుంటే – ఆ దృశ్యం తలచుకొని ఏ తండ్రయినా నవ్వుతాడు కాని – ఏడుస్తాడా?”

“పెళ్ళా? ఎప్పుడు కుదిరింది. ఆ కృష్ణారావు గారితో మాట్లాడేరా?” అనడిగింది వసుంధర గబగబా.

“ఆ పరిస్థితి మనక్కల్పించడం లేదు మన కూతురు. హితేంద్రని రిజిస్టరు పెళ్ళి చేసుకోబోతున్నది.”

వసుంధర ఆ మాట విని షాకయిపోయింది.

“హితేంద్రంటే…?”

“నీ దృష్టిలో ముష్టివాడు. లోకం దృష్టిలో గొప్ప ప్లేబాక్ సింగర్.”

“అయ్యో అయ్యో! నేను చెబుతూనే వున్నాను – దానికంత స్వేఛ్ఛ ఇవ్వొద్దని. ఆఖరికి నేనన్నంత పనీ చేసింది. అదెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చున్నారా! నాలుగీడ్చి గదిలో పెట్టి తాళం వెయ్యక!” అంటూ గోల గోల చేసింది వసుంధర.

నవనీతరావు జవాబు చెప్పలేదు.

వసుంధర ఏడుస్తుంటే ఊరడించలేదు.

ఆమె దుఃఖపు పొంగు తీరడానికి అరగంట పట్టింది.

ఎంత పుల్లవిరుపుగా మాట్లాడినా ఆమె ఆడది. తొందరగా రాజీ పడిపోయింది.

“ఎవరూ లేనట్లు – దానికా సంతకాల పెళ్ళి ఖర్మ దేనికి? మనమే చేద్దాం. దాన్నింటికి పిలుచుకురండి.” అంది కళ్ళు తుడుచుకుంటూ.

పడగ పట్టిన పాము పక్కకి తిరిగినట్లు సర్రున భార్యవైపు తల తిప్పి చూసాడు నవనీతరావు.

“వీల్లేదు. ఆ పని నేను చెయ్యను గాక చెయ్యను. రేపు పెళ్ళనగా అదిప్పుడు చెప్పింది. అభిమానంలో నేను దాని బాబుని గాని దాని బిడ్డని కాను.” అన్నాడు కోపంగా.

“మరయితే ఈ పెళ్ళి ఆపన్నా ఆపండి.” అంది వసుంధర వేదనగా.

“మేజరయిన కూతురు దానికి నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంటే అంగబలంతో ఆపడానికి నేనేం పశువుని కాను. మనిషిని.”

“మరి?” అర్థం కానట్లుగా చూసింది వసుంధర.

“ఇక్కడ సిద్ధాంతాల మధ్య విభేదమే గాని – దానికి మనం శత్రువులం కాదు. పిచ్చిదానా! జరగనివ్వు. విధిని దేవుడే ఎదిరించలేడు!” అన్నాడు.

వసుంధర మాత్రం కన్నీళ్ళతో లోనికెళ్ళి పడుకుంది.

పెళ్ళయిన మరుక్షణం హితేంద్ర నిశాంతని “మీ ఇంటికెళ్ళి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుందామా?” అనడిగేడు.

“వద్దు.” అంది నిశాంత ముభావంగా.

“ఏం?”

నిశాంత అతని కళ్ళలోకి చూసి “ఇప్పుడు మీరు నా భర్త. మిమ్మల్నెవరయినా అవమానిస్తే నేను సహించలేను.” అంది.

హితేంద్ర అర్ధమయినట్లుగా నవ్వి ఆమెని దగ్గరకి తీసుకున్నాడు. “నువ్వు లభించడం నా అదృష్టం. నా కోసం దిగివచ్చిన దేవతవి నువ్వు!”

నిశాంత కిలకిలా నవ్వింది.

“ఈ మాట పాతికేళ్ళ తర్వాత చెప్పండి. చాల సంతోషిస్తాను.” అంది.

“అంటే… అప్పటికి నాలో ప్రేమ నశించిపోతుందనా? జన్మ జన్మలకీ నువ్వే నా భార్యవి కావాలని కోరుకుంటాను.” అన్నాడు హితేంద్ర పరవశంగా.

సుభద్రమ్మ గుమ్మం అవతల సన్నగా దగ్గింది – తన ఉనికిని తెలియజేస్తూ.

భార్యాభర్తలిద్దరూ దూరంగా జరిగేరు.

“అమ్మా నిశాంతా! సాగర్ గారొచ్చారమ్మా!”

ఆ మాట విని గబగబా హాల్లోకొచ్చింది. ఆమె వెనుకే హితేంద్ర అనుసరించొచ్చేడు.

“సారీ ఫర్ ద డిస్ట్రబెన్స్. మీ డేడీ పంపితే వచ్చేను ” అన్నాడు సాగర్ నవ్వుతూ.

నిశాంత భయాందోళనలతో చూసింది సాగర్ వైపు ‌

“ఏం జరిగింది, ఆయనెలా వున్నారు?”

“ఆయనకేం పర్వాలేదు. కొంచెం దిగులుగా వున్నారంతే. మీ పెళ్ళి దగ్గరుండి జరిపించలేకపోయేను. కనీసం ఈ ఫ్లయిట్ టిక్కెట్సన్నా వాళ్ళకిచ్చిరండి. సౌత్ ఈస్టరన్ కంట్రీస్ కి హనీమూనన్నా వెళ్తారని చెప్తే వచ్చేను. తీసుకోండి.” అన్నాడు సాగర్.

నిశాంత భర్త వైపు చూసింది.

“అవసరం లేదు. భార్యని హనీమూన్ కి తీసుకెళ్ళేంత సంపాదిస్తున్నాడామె భర్తని చెప్పండి” అన్నాడు హితేంద్ర.

“నీ జవాబూ అదేనా?” సాగర్ నిశాంత వైపు చూశాడు.

“భర్త జవాబే భార్యదని మీకు తెలీదా?” అని హితేంద్ర రెట్టించేడు.

సాగర్ ఆ ఇద్దరి వైపూ నిర్లిప్తంగా చూసి “వస్తాను. ఈ బ్రీఫ్ కేసులో వున్నవి మీ అమ్మగారు నీకిమ్మన్న నగలు. వాటిని మాత్రం ఇంతభిమానం గల హితేంద్ర తీసుకుంటాడనుకోను.” అన్నాడు వెనుదిరుగుతూ.

“ఆగండి.” అన్నాడు హితేంద్ర.

సాగర్ ఆగేడు.

“నిశాంతకి సంబంధించినది కాదనడానికి నాకు హక్కు లేదు. తల్లి మనసేంటో నేను గ్రహించగలను. ఆ నగలు తిప్పికొడితే ఆమె కృంగిపోతుంది. వాటిని నిశాంతకిచ్చి వెళ్ళండి.”

భర్త మాటలకి నిశాంత తెల్లబోతూ చూసిందతని వైపు.

హితేంద్ర నవ్వుతూ భార్య భుజం తట్టి “తీసుకో. నాకేం కోపం లేదు.” అన్నాడు.

నిశాంత ఆ బ్రీఫ్ కేసందుకుంది.

సాగర్ మనసు చేదు తిన్నట్లుగా అయిపోయింది.

హితేంద్ర పట్ల అతనిక్కొంత అనుమానం కూడ ఏర్పడింది. అయినా మనసులో దాన్ని యిముడ్చుకొని అతనికి నమస్కరించి బయటకొచ్చేసేడు.

 

*************

 

లత కొద్దిగా లేచి నడుస్తున్నది. ఆమెని రెగ్యులర్ గా ఎక్సర్సైజులకి తీసుకెళ్తున్నాడు సాగర్.

ఆమెకిప్పుడు చాలా త్వరగా ఇదివరకులా నడవాలనే ఆశ కల్గుతోంది. తను తొందరపడి చేసిన తప్పుకి బాధ పడుతోంది కూడ.

సాగర్ ఫిక్స్ చేసిన టార్గెట్ దాటి కూడ ఆమె అతను లేనప్పుడు ప్రాక్టీసు చేస్తోంది. ఆమెలోని ప్రోగ్రెస్ చూసి డాక్టర్ బ్రహ్మానందం కూడ తెల్లబోతున్నాడు.

“రియల్లీ షి ఈజ్ వెరీ లక్కీ. నేనామెకు నడక వస్తుందని ఏమాత్రం అనుకోలేదు.” అన్నాడు.

లత అతని మాటలతో ఇంకా పుంజుకుంది.

ఇప్పుడామె మానసికంగా చాల ఉత్సాహంగా ఉంది. దానిక్కారణం నిశాంత పెళ్ళి తననుకున్నట్లుగా తన బావతో జరగకపోవడం. ఇప్పుడు తనకి లైన్ క్లియర్!

కాలింగ్ బెల్ మోగడంతో లత తన ఆలోచనల నుండి బయటపడి మెల్లిగా కాళ్ళీడుస్తూ నడిచి తలుపు తెరిచింది.

“మీరా అక్కా! ఒక్కరే వచ్చేరా!?” అంది నవ్వుతూ.

“అవును. ఆయనకి తెల్లవారుఝామునుండి – అర్ధరాత్రి వరకూ రికార్డింగులే. బోర్ కొట్టి నిమ్న చూడాలని వచ్చేను.

” థాంక్స్ అక్కా!”

“అన్నట్లూ నువ్వు నడిచేస్తున్నావే! రియల్లీ ఇటీజే వండర్ఫుల్ థింగ్. సాగర్ లేడా?”

“లేడు. ఉద్యోగ వేటలో పడ్డాడు.” అంది లత.

నిశాంత ఫేన్ క్రింద కూర్చుంటూ “కాసిని మంచినీళ్ళు ఇస్తావా.” అని “వద్దులే. నేను తీసుకుంటాను.” అంటూ లేవబోయింది.

“మీరు నన్నింకా అనుమానిస్తున్నారు. మీకు ఒక్క మంచినీళ్ళేం ఖర్మ. కాఫీ కూడ చేసుకొస్తానలా కూర్చోండి” అంటూ చిన్నగా వెళ్ళి ఫ్రిజ్ తెరచి ఒక బాటిల్, గ్లాసు తీసుకొచ్చి నిశాంతకందించింది.

నిశాంత ఆమెని విభ్రమంగా గమనిస్తోంది. లత కాఫీ చేసుకొస్తానంటూ లేవబోయింది.

నిశాంత ఆమె చేతిని పట్టుకొని వారిస్తూ “వద్దు. కాస్సేపు కూర్చుని మాట్లాడు” అంది.

“ఏం మాట్లాడను?” అంది లత దీనంగా చూస్తూ.

“నువ్వు నడిచేస్తున్నావు. ఈ సంగతి నువ్వు ప్రేమించిన వ్యక్తికీ చెప్పి బుధ్ధి చెబుతాను. అతని పేరు చెప్పు!” అంది నిశాంత.

“అసలతనికి నేను ప్రేమించినట్లు తెలిస్తేగా మీరు బుద్ధి చెప్పడానికి. ఇందులో అతని తప్పేం లేదు.” అంది.

“మరి?”

“నేనే ప్రేమించేను. నాన్న ఈ పెళ్ళి జరగదన్నాడు.”

“ఎందుకని?”

“అప్పటికే అతనెవర్నో ప్రేమించేడట!”

“ఐసీ! ఏం చేద్దాం మరి!” అంది నిశాంత బాధగా.

“కాని… ఆ అమ్మాయతన్ని ప్రేమించలేదు. ఆమె పెళ్ళి వేరే వ్యక్తితో జరిగిపోయింది.”

ఆ జవాబు వినగానే నిశాంత కళ్ళు ఉత్సాహంగా మెరిసేయి.

“అయితే అతనెవరో చెప్పు. నేనతనికి నచ్చజెప్పి… మీ పెళ్ళి జరిపిస్తాను.” అంది లత చేతులు పట్టుకుని.

“కాని…”

“కానీలు, అర్ధణాలు లేవిప్పుడు. తొందరగా చెప్పు!”

“మా బావే!”

ఆ జవాబు విని అదిరిపడింది నిశాంత.

“ఏంటి నువ్వంటున్నది?” అందాశ్చర్యపోతూ.

“నిజమేనక్కా! బావ మిమ్మల్ని ప్రేమించేడు. అందుకే ఈ పెళ్ళి జరగదన్నాడు నాన్న!”

“ఛ ఛ! మీరు మా స్నేహాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. మా మధ్య అలాంటి ప్రసంగమే జరగలేదు.” అంది నిశాంత.

లత నిస్పృహగా నవ్వింది.

“బహుశా మీరు ప్రేమించలేదేమో! మీ పెళ్ళయిందగ్గర్నుండీ బావ సరిగ్గా భోంచేయడం లేదు. నిద్రపోవడం లేదు. ఎవరితో సరిగ్గా మాట్లాడటం లేదు.” అంది లత.

నిశాంత ఆశ్చర్యపోతూ “లతా! నువ్వు చెబుతోంది నిజమేనంటావా?” అనడిగింది.

“ముమ్మాటికీ నిజమక్కా”

నిశాంత కాస్సేపు మౌనం వహించింది. ఆ తర్వాత లేచి నిలబడుతూ “ఇది నిజమయితే ఇందులో నా బాధ్యతేం లేదు లతా! కాని… నీ జీవితం నిలబెట్టే ప్రయత్నం మాత్రం చేస్తాను. సాగర్ నిన్ను పెళ్ళి చేసుకునేట్లుగా ఒప్పిస్తా.” అంది.

లత నిశాంత చేతులు పట్టుకుంది.

“నీ మేలు మరచిపోలేను. బావ లేని నా జీవితం వ్యర్ధం.” అంది కన్నీళ్ళతో.

నిశాంత ఆమె కళ్ళు తుడిచి నవ్వి “ఇంకెందుకు ఏడుపు మీ బావ నీ సొంతం కాబోతుంటే” అని వెళ్ళిపోయింది.

కాని ఆమె మనసులో సముద్రంలోని కెరటాల్లా అనంతకోటి ప్రశ్నలు ఎగసి పడుతున్నాయి జవాబు దొరక్క.

 

***************

ఆ నెల హితేంద్ర మేగ్జిమమ్ పాటలు పాడేడు. తమళ, కన్నడ భాషల్లో కూడ అతను పాడటం ప్రారంభించేడు.

కనీసం అతని పాటలు రోజుకు మూడయినా రికార్డు అవుతున్నాయి.

అతన్నింటర్వ్యూ చేయడానికెళ్ళిన వివిధ పత్రికల జర్నలిస్టులు కూడ రికార్డింగ్ ధియేటర్ ముందు పడిగాపులు పడుండాల్సొస్తున్నది. అన్ని ఇంటర్వ్యూల్లో అతను భార్య గొప్పదనం గురించి చెబుతున్నాడు. ఆమె తన స్ఫూర్తని – ఆమె లేకపోతే తన గొంతు పలకదని అతను చెబుతున్న జవాబులు చదివింది నిశాంత.

“ఎందుకలా నా గురించి చెప్పడం! నాకు సిగ్గనిపిస్తున్నది.” అంది భర్తతో.

“ఉన్న మాటేగా చెప్పేను డియర్! నువ్వు లేకపోతే నేనింకా పేవ్మెంట్సు మీద పాటలు పాడుతూ…” అతని మాట పూర్తి కాకుండానే నిశాంత అతని నోటిని మూసేసింది.

“ఇంకోసారిలా మాట్లాడేరంటే నేనూరుకోను.” అంది నిశాంత.

“ఏం చేస్తావ్?” హితేంద్ర నవ్వుతూ రెట్టించేడు.

“నోరు మూయిస్తాను.”

“ఎలా?”

‘ఇలా’ అంటూ నిశాంత అతని పెదవులతో తన పెదవుల్ని కలిపింది.

ఆ సంఘటన గుర్తొచ్చి నిశాంత నవ్వుకుంటుంటే – సుభద్రమ్మ లోనికొచ్చింది.

అత్తగారి‌ని చూసి నిశాంత లేచి నిలబడబోయింది.

“ఎందుకమ్మా ఇంకా మన్ననలు. కూర్చో!” అంది.

నిశాంత కూర్చుని “చెప్పండి” అంది.

“ఏం లేదు. నాకు తోచిన మాట నేను చెబితే నువ్వేమనుకోవుగా!”

అనుకోనన్నట్లుగా తలూపింది నిశాంత.

“నువ్వు చదివిన చదువు సామాన్యమైనది కాదు. డాక్టరు కోర్సు. పదిమందికి సేవ చేసే చదువది. వాడేమో తెల్లవారుఝామున వెళ్ళి ఏ అపరాత్రికో వస్తాడాయె. నువ్వెందుకిలా ఖాళీగా కూర్చోవడం. ప్రాక్టీసు పెట్టరాదూ! కాలక్షేపం, మానవ సేవ చేసినట్లుంటుంది.” అంది.

అత్తగారి సలహా బాగానే అనిపించింది నిశాంతకి.

“ఆయన్నడిగి చూస్తాను” అంది.

“అడుగు. వాడికి చెప్పకుండా నేనేది చెయ్యమనను. బహుశ వాడు కూడ కాదనడులే!” అందామె నవ్వుతూ.

అప్పుడే సరిగ్గా హితేంద్ర తనీ మధ్య కొన్న సెకండ్ హేండ్ మారుతిలో దిగేడు. అతన్ని చూసి సుభద్రమ్మ తన గదిలోకెళ్ళిపోయింది.

“అబ్బో! అటు సూర్యుడిటు పొడిచినట్లుందే! తొందరగా వచ్చేసేరేంటి!” అంది నిశాంత.

హితేంద్ర చిరాగ్గా సోఫాలో కూర్చుంటూ “నాతో ఈ కొత్త పిల్లని ఇంట్రడ్యూస్ చేసేడు డైరెక్టరు. ఆ పిల్ల ఎంతకీ సరిగ్గా కలిసి పాడలేకపోతోంది. నాక్కోపం వచ్చి వచ్చేసేను” అన్నాడు.

అతని జవాబు పూర్తయిందో లేదో ఫోను రింగయింది.

రిసీవరెత్తి “మీ కోసం” అంటూ భర్తకందించింది నిశాంత.

హితేంద్ర రిసీవరందుకుని “మీకు నష్టం వస్తే నన్నేం చేయమంటారు! రైల్లో అడుక్కోడానిక్కూడ బాగోదావిడ గొంతు. ఎక్కడ దొరికిందండీ ఆ శాల్తీ!” అన్నాడు కోపంగా.

“………………..”

అంటే నన్ను చూసి భయపడుతుంది గాని బాగానే పాడుతుందంటారా? అసలు సరిగమలు తెలుసా?” వెటకారం ధ్వనించిందతని కంఠలో.

“………………..”

“ఉహు! మీరెన్ని చెప్పినా ఈ రోజుకి నేను రాలేను. నా మూడ్ చెడిపోయింది.” అంటూ రిసీవర్ పెట్టేసేడు హితేంద్ర.

నిశాంత భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ “మీకీమధ్య కోపం కూడ వస్తున్నదే!” అంది.

“ఏం నేను మనిషిని కానా?”

హితేంద్ర ఎదురు ప్రశ్నకామె జవాబు చెప్పలేదు. అతనికి వేడివేడి కాఫీ తెచ్చిచ్చి “అప్పుడే పాత – కొత్త అని మాట్లాడుతున్నారు, మీరెన్నాళ్ళయిందేమిటి ఫీల్డుకొచ్చి” అంది నవ్వుతూ.

“ఏంటీ ఎవరో తెలీని కొత్త పిల్లని వెనకేసుకొస్తున్నావు. కొంపదీసి ఏదైనా ఫెమినిస్ట్ సంఘంలో జేరేవా?”

భర్త ప్రశ్నకి నవ్వి “అదేం లేదు. పాపం, కొందరు క్రొత్తలో కంగారు పడతారు. మీరుత్సాహపరిచి పాడించాలి గాని విసుక్కుంటే… ఎలా?” అంది.

“నాకు ఊరందర్నీ ఉత్సాహపరిచే టైమ్‌ లేదు డియర్! ఈ వంకన వచ్చేస్తే… నీతో కాస్సేపు గడపొచ్చని!” అంటూ భార్యని దగ్గరకు లాక్కున్నాడు హితేంద్ర.

అతని కౌగిల్లో ఇమిడిపోతూ “నేను ప్రాక్టీసు చేద్దామనుకుంటున్నాను” అంది.

“ఏమిటి’ డాన్సా’?”

“ఛీ పొండి! నర్సింగ్ హోం తెరుద్దామనుకుంటున్నాను. మీరు లేక నాకు బోరు కొడుతోంది” అంది.

“అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకు. నేను సంపాదిస్తున్నది చాలు మనకి.”

“చాలదని కాదు. కాలక్షేపానికి.”

“నా సేవ చాలదా నీకు?” అంటూ కన్ను గీటేడతను.

“మీతో నేను మాట్లాడలేను. మీ సేవ చేయడానికైనా మీరుండాలి కదా!” అంది.

“నేనింట్లో లేకపోయినా నా పనులు చాలానే ఉంటాయి. నా ఆల్బమ్స్ తయారు చెయ్యడం, నాకే ఫుడ్ పడుతుందో తెలుసుకొని వంట చెయ్యడం, నా ఇమేజ్ ని పెంచే డ్రెస్సులు సెలక్టు చేయడం, నా కాంట్రాక్టులు చూసుకోవడం – అన్నింటికన్నా ముఖ్యం నేను రాగానే కడిగిన ముత్యంలా తయారయి నాకెదురొచ్చి నన్ను ప్లీజ్ చేయడం! ఇవి చాలవా నీకు!”

నిశాంత అతని మాటల్ని కొట్టిపారేయలేకపోయింది. తను నర్సింగ్ హోం తెరిస్తే అర్ధరాత్రి – అపరాత్రి అని లేకుండా పేషెంట్స్ ని చూడాల్సొస్తుంది. తనూ అలిసిపోతుంది. భర్త ఇన్స్పిరేషన్ కోసమే తనని పెళ్ళి చేసుకున్నాడు. తనతన్ని పట్టించుకోకపోతే అతని గొంతు మూగబోతుంది. తన శ్రమంతా వృధా అయిపోతుంది.

“ఏంటాలోచిస్తున్నావు?”

“మీ గురించే!”

“ఏవిటో?”

“మీ ఔన్నత్యంలోనే నా గొప్పతనమిమిడుందని. నేను మీ నీడలోనే ఒదిగిపోవడంలో అందముందని.”

“థాంక్ యూ డాలింగ్!” అంటూ హితేంద్ర ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు.

 

**************

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *