April 23, 2024

యాత్రా మాలిక – ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు / విహార యాత్ర నైనితాల్

రచన: నాగలక్ష్మి కర్రా

దేశరాజధానికి సుమారు 330 కిలో మీటర్ల దూరంలో ఉత్తరాఖంఢ్ రాష్ట్రం లో వుంది నైనితాల్ . దేశవిదేశాలలో పేరుపొందిన వేసవి విడిది . సుమారు 6,840 అడుగుల యెత్తులో వుంది .

ఢిల్లీ నుంచి రైలుమార్గం ద్వారాకాఠ్ గోదాంవరకు  వుంది . నైనితాల్ వెళ్లదల్చుకున్నవారు ట్రైన్ లో కాఠ్ గోదాంవరకు వచ్చి అక్కడనుంచి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో కాని టాక్సీ లలో గాని ప్రయాణించి చేరుకోవచ్చు .

మేం మా కారులో ప్రయాణించేం కాబట్టి రోడ్డు మార్గం లోనే వెళ్లేం  .

ఢిల్లీ , గజియాబాదు దాటిన తరువాత గజరోలా , మురాదాబాదు రుద్రాపూర్ మీదుగా హలద్వాని చేరుతాం , అయితే ఢిల్లీ దాటాకఘడ్ ముక్తేశ్వర్అనే గ్రామం వస్తుంది , ఈ గ్రామం గుండా గంగానది ప్రవహిస్తూ వుంటుంది . ఘడ్ ముక్తేశ్వర్ అంటే ముక్తేశ్వర్ కోట అని అర్దం ,  ఇక్కడ గంగానదికి స్నాన ఘట్టాలు కట్టివున్నాయి , చాలా పురాతనమైన కట్టడాలు , బ్రిజ్ ఘాట్ దగ్గర స్నానం చెయ్యడానికి వీలుగా వుంటుంది . పక్కనే యెన్నో ఆశ్రమాలు వున్నాయి , యీ గ్రామంలో వున్న ముక్తేశ్వర మహదేవ్ మందిరం చాలా పురాతనమైనది , యీ శివలింగం పరశురాముడు స్థాపించినదని స్థానికులు చెప్పేరు . ఇక్కడ గంగా డెల్టాలో వరి , చెరకు , మామిడి విరివిగా పండుతాయి . మనలాంటి పర్యాటకులకు కనువిందు జేస్తూ వుంటాయి .  గంగా పుష్కరాలకు భక్తులు యిక్కడ స్నానాలు చేస్తూ వుంటారు .

బ్రిజఘాట్ కి యెదురుగా అంటే గంగకు అవతల వొడ్డున వున్న ఘాట్ ని మీరాబాయి ఘాట్ అని అంటారు . మీరాబాయి యీ ప్రదేశంలో వుండి ప్రతీరోజూ స్నానం చేసుకొనేదట .

హలద్వాని భోజనసదుపాయాలున్న ప్రదేశం , ఈ వూరు దాటితే అంతా ఘాట్ రోడ్డే , హలద్వాని నుంచి నైనితాల్ సుమారు 42 కిలోమీటర్లు . దట్టమైన అడవులతో వున్న కొండలు , ఇక్కడ యెక్కువగా మెట్ల వ్యవసాయం కనిపిస్తూ వుంటుంది . హలద్వాని నుంచి కుమావు పర్వత శ్రేణులు మొదలవుతాయి . ఈ అడవులు టేకు , దేవదారు , ఓక్ వృక్షాలకు ప్రసిధ్ది . కొండలు మబ్బులను తాకుతూ వుంటాయి , అంతా పచ్చని పచ్చదనం , అక్కడక్కడ ప్రవహిస్తున్న సెలయేటి గలగలలు , చల్లగా వీచేగాలి మనని మురిపిస్తూ వుంటుంది .

ఎప్పటిలానే మా భోజనాలు మా దగ్గరే వున్నాయి కాబట్టి ఆకలైనచోట కారాపుకొని మామిడి తోపులలో భోజనాలు చేసుకొని తిరిగి బయలుదేరేం . అప్పట్లో రోడ్లు బాగుండేవికావు , సాయంత్రానికి నైనితాల్ చేరుకున్నాం , అప్పట్లో ఆన్ లైనులు లేవు కాబట్టి అక్కడచేరేక ఓ మోస్తరు హోటలులో దిగేం , రాత్రి మాల్ రోడ్డు తిరిగేం , చూడవలసిన ప్రదేశాల గురించి వాకబు చేసుకొని వచ్చేం .

బయట యెంత చల్లగా వుందో హోటలు గదిలో దానికి రెట్టింపు చలి అనిపించింది . రాత్రి చలికి సరిగా నిద్దరరాక హీటర్లు లేవు , ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కొరత , మరి రజ్జాయిలే దిక్కు . అంతలావు రజ్జాయిలుకూడా చలిని ఆపలేకపోయేయి .

పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకొని వూరు చూడ్డానికి వెళ్లేం . మా హోటలుకు యెదురుగా నైనితాల్ సరస్సు . పొద్దున్న పేరు తెలియని పక్షులు అక్కడక్కడ వాలి నీటి జీవులను తింటూ కనిపించేయి . గంట తిరగడానికి బోటు తీసుకున్నాం , బోటతను నైనితాల్ ని గురించి కొన్ని వివరాలు చెప్పేడు .

ముందు నైనితాల్ గురించి తెలుసుకుందాం . నైనితాల్ అనే పేరు యీ నగరానికి రావడానికి రెండు కథలు చెప్పాడు మొదటది యిక్కడ తొమ్మిది సరస్సులు వుండడం వల్ల యీ ప్రాంతం నౌతాల్ గా పిలువబడేదని , ఆంగ్లేయుల నోళ్లల్లోపడి యిది నైన్ తాల్ గా మారిందని , రెండవది సతీదేవి యొక్క కన్ను పడ్డ ప్రదేశం యిలా సరస్సుగా మారిందని కన్ను పడ్డ ప్రదేశం కాబట్టి దీనిని నయన తాల్ అని పిలిచేవారని , ప్రజానీకం నోళ్లల్లోపడి నైనితాల్ గా మారిందనేది మరో కథనం . ఈ సరస్సు ఒడ్డున నయనాదేవి శక్తిపీఠం వుంది . ఈ సరస్సు యిక్కడ సంభవించిన మూడు నాలుగులేండ్ స్లైడింగులకి ముందు కన్ను ఆకారంలో వుండేదట . ఈ వివరాలు మా బోటు నడిపే అతను యిచ్చినవి .

నైనితాల్ ను గురించి కొన్ని నిజాలు ఉత్తరాఖండ్ లోని కుమావు ప్రాంతం నేపాలు రాజులచే ఆక్రమింపబడుతూ వుండేది . మిగతా భారతదేశం అంతా ఆంగ్లేయులపాలనలోకి వచ్చినా యీ ప్రాంతపురాజు నేపాలు రాజుతో చేతులు కలిపి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేస్తూనే వుండేవారు . 1841 లో జరిగిన ఆంగ్లోనేపాలు యుధ్దమపుడు అప్పటి సైనికాధికారి యీ ప్రాంతంలో తన సేనలతో గుడారాలు నిర్మించుకున్నాడు . ఆ యుధ్దం లో గెలిచిన ఆంగ్లేయులు యీప్రాంతాన్ని మొదటి ఆసియా వేసవి విడిదిగా గుర్తించేరు . అదే సంవత్సరంలో యిక్కడయురోపియన్ హౌస్అనే లాడ్జి ప్రాంభించబడింది . ఎండాకాలంలో కూడా అతిచల్లగా వుండడంతో యూరోపియన్ అధికారులు వారి కుటుంబాలతో మైదానాలలో వుండే వేడినుంచి తప్పించుకోడానికి రాసాగేరు . 1860 లోసైంట్ జాన్చర్చ్ నిర్మాణం జరిగింది . ‘ యునైటెడ్ ప్రోవిన్స్అధికారిక వేసవి నివాసం యిక్కడకు తరలించబడింది . 1890 ప్రాంతంలో యురోపియన్ పిల్లల చదువులకోసంసైంట్ జోసెఫ్పేరుతో టిఫిన్ టాప్ అనే కొండపైన  మొదటి రెసిడెన్షిల్ స్కూలు నిర్మాణం జరిగింది . ఇప్పుడు యిదిఆల్ సైంట్స్అనే పేరుమీద నడపబడుతోంది . కొద్ది కాలం కిందట 125 వ నిర్మాణోత్సవం జరుపుతుంది యీ కళాశాల . దాని తరువాత 1910 ప్రాంతాలలో సుమారు అరడజను స్కూల్స్ తెరువబడ్డాయి . జమీందారుల పిల్లలు , మహారాజుల పిల్లలు చదువుకునే ఆ స్కూల్స్ దేశ స్వాతంత్ర్యానంతరం ధనవంతులకు అందుబాటులో కొచ్చేయి . అక్కడ చదువుకున్న వాళ్లల్లో మనదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్ గాంధి , హిందీ చలనచిత్ర సుప్రసిధ్ద నటుడు అమితాబ్ బచ్చన్ మొదలైన వారు  నైనితాల్ స్కూల్స్ లో చదువు కున్నవారే . వివిధకంపేనీల అధినేత బిర్లాలు కూడా యిక్కడ విధ్యాసంస్థలు నెలకొల్పేరు .

చుట్టారా తెల్లని మంచుకప్పబడ్డ పర్వతాలతో వూరికి మధ్యలో మంచినీటి సరస్సు , సరస్సు చుట్టారా నిర్మింపబడ్డ హోటల్స్ యేదో చెయ్యతిరిగిన చిత్రకారుడు చిత్రించిన చిత్రంలా వుంటుంది .

ఏ కాలమైనా రోజులో నాలుగైదు గంటలు వర్షం పడే ప్రాంతం కావడం తో వూరంతా చితచిత లాడుతూ వుంటుంది . పర్యాటకుల తాకిడి యెక్కువగా వుండే ప్రదేశం కావడంతో ముందుగా బస బుక్ చేసుకోవలసిందే . చిన్న వూరు పర్యాటకులు యెక్కువ కావడంతో పిచ్చ రెష్ గా వుంటుంది మాల్ రోడ్డు . వూరిలోకి ప్రవేశించడానికే మూడు నాలుగు గంటలు పడుతుంది . భద్రతాదళాల ముఖ్యకార్యాలయం  కూడ వుండటంతో యెక్కువ భాగం వారి ఇళ్లకు గెస్ట్ హౌసులు మొదలగు వాటికి కేటాయించ బడ్డాయి . మిలిటరీ రాకపోకలతో మరింత రద్దీగా మారిపోయింది .

మాల్ రోడ్డు కి పై భాగాన వున్న రోడ్డులో మహదేవమందిరం , పాషాణ దేవీ మందిరం కూడా దర్శించుకోవచ్చు . నైనితాల్ నైనా , దేవపథ్ , ఆయార్ పథ్ , అనే పర్వత శిఖరాల మధ్య వున్న ప్రదేశం కావడంతో బోటులో షికారుచేస్తూ  మంచుతో కప్పబడ్డ యీ పర్వతాలను చూడ్డం ఓ మరచిపోలేని అనుభూతి .

1890 ప్రాంతం లో యిక్కడ పెద్ద భూస్కలనం జరిగింది అప్పుడు ఆమ్లా పర్వతంగా స్థానికులచే పిలువబడే పర్వతం నేలమట్టమైంది . ఔత్సాహికులైన స్థానికులు అక్కడ పడ్డ రాళ్లను మట్టిని వుపయోగించి ఆ ప్రదేశాన్ని పెద్ద మైదానంగా తీర్చిదిద్దేరు . ఈ ప్రదేశం నైనాదేవి మందిరానికి యెదురుగా వుంటుంది . ఆటలపోటీలు లేని సమయంలో దీనిని పార్కింగుగా వుపయోగిస్తున్నారు .

భూస్కలనంలో పూర్వం వున్న మందిరం పూర్తిగా కూలిపోతే అదేస్థానంలో  కొత్తమందిరాన్ని కట్టేరు . చిన్నమందిరం , నైనీతాల్ కి అవతల వొడ్డున వుంటుంది .

సతీ దేవి నయనం పడ్డ ప్రదేశం , 51 శక్తిపీఠాలలో ఒకటి . మందిరం చూసుకొని యింకా చూడవలసిన ప్రదేశాలను గురించి వాకబు చేసుకొని కొన్ని యెంచుకున్నాం , నైనితాలు మేం సుమారు ఓ యిరవై మార్లు వచ్చివుంటాం . కాబట్టి ఒక్కోమారు కొన్నికొన్ని మా వీలును బట్టి చూసుకున్నాం .

సాత్తాల్ఇది మంచి పిక్ నిక్ స్పాటు , చుట్టారా కొండల మధ్యన యేడుసరస్సులు , జూన్ జూలైలలో యేడు సరస్సులు వేరు వేరుగా కనబడతాయికాని మిగతా సమయాలలో రెండో మూడో వుంటాయి , అంటే నీరు యెక్కువగా వున్నందువల్ల అన్ని కలసిపోయి కనిపిస్తాయన్నమాట .

ఈ నీరు కొంత నీలంగా , ఓ పక్క ఆకుపచ్చగా కనిపిస్తూ   కనువిందు చేస్తాయి . చుట్టుపక్కల నగరాలనుంచి యిక్కడకి వచ్చి రోజంతా గడిపి సాయంత్రానికి యిళ్లకు వెళ్తూవుంటారు ఈ సాత్తాల్ కి వెళ్లేదారిలో నకుచియతాల్ అనే సరస్సును కూడా చూడొచ్చు .

టిఫిన్ టాప్బ్రిటిషర్స్ కాలం నుంచి యిది పిక్నిక్ స్పాట్ గా గుర్తించబడింది . 2290 మీటర్ల యెత్తున ఆర్యపధ్ కొండలలో వున్న ప్రదేశం . ఈ కొండలను ఆయార్పథ్ పర్వతశ్రేణులు అని అంటారు , కుమావు భాషలో అయార్ అంటె కటికచీకటి అని అర్దం . ఈ కొండలలో వున్న అడవులు సూర్యకిరణాలను నేలపై పడకుండా అడ్డుకునేంత దట్టంగా వుండేవట ( ఇప్పటికీ అలాగే వున్నాయి ) అందువల్లే యీ పర్వతాలను ఆయార్ పథ అని పిలిచేవారు . కాలక్రమేణా వీటిని ఆర్యపథ్ అనసాగేరు , లేక పోతే యిక్కడ వున్నఆర్యభట్ట రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్  సైన్సెస్ ‘ 2004 లో నిర్మించేరు . అందువల్లే ఆ పర్వతాలను ఆర్యపథ్ గా వ్యవహరిస్తున్నారో మరి తెలీదు . ఈ టిఫిన్ టాప్ ని డోరతి సీటు అని కూడా అంటారు , రాళ్లు పరచిన నడక దారిలో కాస్త ముందుకు వెళితే కొండ పైన వుంటుంది , ప్రసిధ్ద చిత్రకారిణికెల్లెట్ డోరతిఆ ప్రదేశం లో కూర్చొని బొమ్మలు వేసుకొనేదట , అందుకే ఆ ప్రదేశాన్ని డోరతి సీటు అనే పేరు వచ్చింది .

స్నోవ్యూ పాయింట్

నైనితాల్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వుందీ ప్రదేశం , నడకన గాని , లోకల్ టాక్సీలలో గాని ప్రయాణించి యీ ప్రదేశం చేరుకోవచ్చు , యిక్కడనుంచి మంచుతో కప్పబడ్డ పర్వత శిఖరాలను చూడొచ్చు . మంచు ప్రదేశాలకు వెళ్లిన మాకు ఆ కొండలను అంత దూరం నుంచి చూడడం పెద్ద వుత్సాహాన్ని యివ్వలేదు .

కృపాతాల్ —-

నైనితాల్ తో సహా పరిసర గ్రామాలకు మంచినీరు సరఫరా ఈ సరస్సు నుంచి జరుగుతుంది . ఈ సరస్సు లో నీటి వూటలు వున్నాయని అంటారు . చూడదగ్గ ప్రదేశం యేమీ కాదు ఊసుపోకపోతే వెళ్లే ప్రదేశం తప్ప యిక్కడ యేమీ లేదు .

సరియతాల్ ——-

పచ్చని ప్రకృతి మధ్యలో యెత్తైన కొండల నడుమ వున్న హృదయాకారపు సరస్సు .  ఆకుపచ్చని నీటితో వుండి అహ్లాదాన్ని కలుగ జేస్తుంది . ఓ గంట సేపు యిక్కడ గడపొచ్చు .

గర్నిహౌసు

ఆర్యపర్వతాలలో వుంది . ప్రసిధ్ద వేటగాడు , జంతు అధ్యయన కర్త గా పేరుపొందిన జిమ్ కార్బెట్ నిసించిన భవనం .

గౌన్ హిల్

పంగొటిఅనే చిన్న గ్రామం వున్న ప్రదేశం , పర్యాటకులు చిన్న చిన్న ట్రెక్కింగులు చెయ్యడా నికి వస్తూ వుంటారు . ఎక్కుగా రద్దీ లేని ప్రదేశం కావడంతో ప్రశాంతంగా శలవులు గడపడానికి పర్యాటకుల యీ ప్రదేశాన్ని యెంచుకుంటున్నారు . చుట్టారా వున్న కొండలు ఓక్ , దేవదారు , వెదురు వృక్షాలతో కూడిన అడవుల మధ్య నడక అహ్లాదకరంగా వుండడమే కాక ఆరోగ్యకరంగాను వుంటుంది .

భీమ్ తాల్ ——-

 

నైనితాల్ గ్రామం యూరోపియన్ల వల్ల నిర్మింబడినది కాని భీమతాల్  గ్రామం చాలా పురాతనమైనది . టిబెట్ , నేపాలు నుంచి వచ్చే పాదచారులు , వర్తకులు భీమతాల్ గ్రామంమీదుగా ప్రయాణించి మైదాన ప్రాంతాలు చేరుకునే వారుట , ఒకప్పుడు మనదేశానికి చైనాకి గల వాణిజ్య పరమైనసిల్క్ రూట్లో  భాగమేమో ? . యిప్పటికీ గ్రామీణులు ఆ నడకదారిని వుపయోగించి కాఠ్ గోదాం చేరుతూ వుంటారు .

మహాభారతకాలం నుంచి భీమ తాల్ సరస్సు వుందని అంటారు . మహాభారత కాలంలో పాండవుల వనవాస సమయంలో ఓ రోజు భీముడు యీవనంలో సంచరిస్తూ  వుండగా అశరీరవాణి శివలింగ ప్రతిష్ట చేసుకొని పూజించుకోమని చెప్పగా భీముడు అక్కడ శివలింగ ప్రతిష్ట చేసి తన గదతో నేలను మోదగా అక్కడ జలవూరి సరస్సుగా మారిందట , భీముని చే ప్రతిష్టించ బడ్డ లింగం కాబట్టి భీమేశ్వర మహదేవ్ గా పిలువబడసాగింది . అలాగే సరస్సు కూడా భీముడి పేరుమీదుగా పిలువబడసాగింది . .

భీమతాల్ సరస్సు చుట్టూ హోటల్స్ వున్నాయి , అన్ని వర్గాలవారికి అందుబాటులో వుండే రకరకాల హోటల్స్ వున్నాయి . భీమ తాల్ చుట్టూరా యెత్తైన కొండలు ఆ కొండలు నీటిలో ప్రతిఫలిస్తూ వుంటే ఆ ప్రతిబింబాలు చూస్తూ బీమతాల్ కి యెదురుగా కూర్చోడం ఓ అనుభవం . భీమతాల్ వొడ్డున వున్న ఘరెవాల్ వికాస మండలి వారి గెస్ట్ హౌసులో వున్నాం .

పదిహేడు శతాబ్దంలో కుమావు ప్రాంతాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజా బాజ్ బహదూర్ యీ మందిరాన్ని నిర్మించేడు . కొండలలో వుండే మందిరాలకు యిక్కడ కురిసే హిమపాతం వల్ల వానలవల్ల కొండచరియలు విరిగి పడడం వల్ల క్షతి కలుగుతూనే వుంటుంది .

జనవరి నెలలో నైనితాల్ లో హిమపాతం జరుగుతుంది , నైనితాల్ కి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో వున్న భీమ్ తాల్ లో యిప్పటి వరకు హిమపాతం జరగలేదు . హిమపాతం చూడదల్చుకున్నవాళ్లు నైనితాల్ లో బసచేసుకోవాలి . దసరా శలవులలో నైనితాల్ వెళ్లకుండావుంటే మంచిది . శలవులలో ముఖ్యంగా బెంగాలీల రద్దీ యెక్కువగా వుండి బస దొరకడం కష్టమౌతుంది .

మరి ఆలశ్యమెందుకు నైనితాల్ యాత్రకి బయలుదేరండి .

శలవు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *