March 29, 2024

అతివలు అంత సులభమా…..

రచన: ఆర్. ఉమాదేవి

 

అదురుతున్న గుండెను అదిమిపట్టుకుంటూ.. ఒక్క ఉదుటున తన సీట్లోకి వచ్చి పడింది సుమన.

ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఆమెకి. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటల్ తీసి గటగటా నీళ్ళు తాగింది. కాసేపటి తర్వాత గాని ఆమె స్థిమితపడ లేకపోయింది.

గదిలో జరిగింది తలుచుకుంటూ ఉంటే మళ్ళీ గుండెలు గుబగుబలాడాయి.

*****

సాయంత్రం ఆఫీస్ అవగానే ఇల్లు చేరింది సుమన. అన్యమనస్కంగానే వంట గదిలో పనులు చేస్తోంది.

“సుమనా! కాస్త కాఫీ ఇవ్వవూ..తల నొప్పిగా వుంది.” అడిగాడు ఆమె భర్త.

ఆలోచనల్లో ఉన్న సుమనకు వినిపించలేదు.

“సుమనా!” మరో సారి పిలిచాడు.

భర్త మూడో సారి పిలిచేవరకు ఆమె ఈ లోకం లోకి రాలేదు.

“ఏమిటండి?” ఈ సారి ఆమె గదిలోంచి బయటకు వచ్చి అడిగింది.

“కాఫీ అడిగాను. ఏమాలోచిస్తున్నావ్? ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లెమా?”

“అబ్బే అదేం లేదండి. పనిలో పడి వినిపించుకోలేదు. ఇప్పుడే తెస్తాను.” అంటూ లోపలికెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది భర్తకు.

*****

సుమనకు పాతికేళ్ళు ఉంటాయి. ఓ ప్రైవేటు కంపనీలో చిరుద్యోగి. అదే ఆఫీస్ లో పని చేస్తున్న ప్రభాకర్ తో  పరిచయం ప్రేమగా మారడం…పెళ్ళితో వారిద్దరూ ఒక్కటవ్వడం త్వరత్వరగా జరిగి పోయాయి. కాని దురదృష్టవశాత్తూ పెళ్ళైన ఏడాది తిరక్కుండానే ప్రభాకర్ కు జరిగిన  యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. మంచం మీద నుండి కదలలేని పరిస్థితి. అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుందన్నారు డాక్టర్లు.

మధ్య తరగతి కుటుంబ నేపథ్యం…కొత్త సంసారంలో పూర్తిగా కుదుట పడకనే చుట్టుముట్టిన ఆర్ధిక ఇబ్బందులు వారిని కొంత ఉక్కిరిబిక్కిరి చేసాయి.

సుమన ఉదయాన్నే లేచి భర్త అవసరాలన్నీ చూసుకొని వంట ముగించి ఆఫీస్ కు వెళుతుంది. ఇంటికి ఆఫీస్ దగ్గరే అవటంతో మధ్యాహ్నం మళ్ళీ వచ్చి అతడికి భోజనం పెట్టి తనూ తినేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం రాగానే ఇంటి పని… వంట పని… భర్తకు సపర్యలు వీటితో సరిపోతుంది.

ఇంటి పరిస్థితులు, ఆఫీస్ పనులతో మొదట్లో  కాస్త ఇబ్బంది పడినా ఇప్పుడిప్పుడే  అలవాటు పడుతోందామె. సహచరుడి భార్యగా, సాటి ఉద్యోగినిగా  ఆమెకు కలిగిన కష్టానికి ఆఫీస్ లో  మిగిలిన వాళ్ళందరూ సానుభూతితో సహకరించేవారు. ఆమె కూడా తన బాధలను మనసులోనే దాచుకుని తన పనిని నిబద్ధత తో పూర్తి చేసేది. ఎలాగోలా బతుకు బండి నడుస్తోంది అనుకునేలోగా ఆ ఆఫీస్ కు కొత్తగా వచ్చిన మేనేజర్ సుధాకర్ రూపంలో ఆమెకు కష్టాలొచ్చి పడ్డాయి.

అతడు రాగానే అందరు ఉద్యోగుల గురించి తెలుసుకునే క్రమంలో సుమన గురించి, ఆమె భర్త గురించి తెలుసుకున్నాడు……వెనకా ముందూ పెద్దగా బలగం లేని మనిషని…….అన్నిటికి మించి  వయసులో ఉన్న అందమైన అబల అని కనిపెట్టాడు.

మెల్లమెల్లగా ఆమెని తన దారిలోకి తెచ్చుకోవడానికి  తన శైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

మొదట్లో ఆమెకు కలిగిన కష్టానికి సానుభూతి ప్రకటించేవాడు. నీకేం భయం లేదు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను ..నేను నీ శ్రేయోభిలాషి ని ..అనేవాడు. భర్తను ఒకోసారి హాస్పిటల్ కు తీసుకెళ్ళాల్సి వచ్చేది ఆమె. అలాంటపుడు సెలవు అడిగితే ఇంతోటి దానికి సెలవెందుకు? పని చూసుకుని వచ్చి వర్క్ అటెండ్ అవమని చెప్పేవాడు. సుమన తన ధోరణిలో తనుండి అతడి మనసులో దురుద్దేశాన్ని కనిపెట్టలేకపోయింది. తనకు అతను ఎంతో ఉపకారం  చేస్తున్నాడని ఆమె మనసు అతడి పట్ల కృతజ్ఞత తో నిండిపోయేది. ఇంట్లో భర్తతో కూడా అతడు తనకెంత సహాయం చేస్తున్నదీ చెప్పేది.

ఆమె తనని పూర్తిగా నమ్మిందని రూడీ అయ్యాక తర్వాతి అంకం లోకి దిగాడు సుధాకర్.

ఫైల్స్ ఆమెకు ఇచ్చేటపుడో తీసుకునేటపుడో చేతి వేళ్ళు తగిలించడం…..ఆమె దేనిగురించైనా బాధలో ఉంటె భుజం తట్టడం..లాంటివి మొదలు పెట్టాడు. సుమన ఇంకా గుర్తించలేదు.

ఆ రోజు సుమన..ప్రభాకర్ ల పెళ్లి రోజు. ఉన్నంతలో కాస్త మంచి చీర కట్టుకుని ఆఫీస్ కు బయలుదేరింది సుమన.

అసలే అందమైన ఆమె, కాస్త ప్రత్యేకంగా కనపడే సరికి సుధాకర్ లోని మృగాడు నిద్ర లేచాడు. సుమన యధావిధిగా పంపవలసిన లెటర్స్ టైపు చేసి అతడి సంతకాల కోసం మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్ళింది.

“ ఏమిటి ఈ రోజు కొత్తగా ఉన్నావ్?” ఫైల్స్ అందుకుంటూ అడిగాడు సుధాకర్.

“ ఈ రోజు మా పెళ్లి రోజు సర్. మా ఆయన ఈ రోజైనా మంచి చీర కట్టుకోమని చెప్పారు. ఇప్పుడున్న ఇబ్బందుల్లో ఎందుకని నేను వద్దన్నా వినలేదు.” కాస్త బిడియంగా చెప్పింది సుమన.

“ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావ్. అందుకే కట్టుకొమ్మని చెప్పి వుంటారు.” అదోలా నవ్వుతూ అన్నాడు.

మొదటిసారిగా సుమనకు అతడి తరహా ఏదో తేడాగా అనిపించింది. ఏం మాట్లాడలేదు.

“పాపం మీ ఆయన బాగుంటే పెళ్లి రోజు చక్కగా ఎంజాయ్ చేసేవారు కదూ….ఈ వయసులో నీకు రాకూడని కష్టం వచ్చింది.”

అతడి చూపులో, మాటలో వెకిలితనం ఆమె ఆడమనసుకు తెలుస్తోంది. కానీ పై అధికారి అవడంతో ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది.

ఆమె మౌనం అతడికింకా బలాన్నిచ్చింది.

“ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నువ్వు ఊ అనాలే గాని నీ పెళ్లి రోజును నేను సెలబ్రేట్ చేయనూ…” సంతకాలు చేసిన లెటర్స్ అందుకుంటున్న ఆమె చేతిని పట్టి తన మీదకి లాక్కున్నాడు.

అది ఊహించని ఆమె తూలి అతడి మీద పడబోయి, చివరి క్షణంలో టేబుల్ పట్టుకుని తమాయించుకుంది.

ఒక్క విదిలింపు తో అతన్ని విసిరికొట్టి గబగబా ఆ గది లోంచి బయటకు వచ్చేసింది.

బయటకు వచ్చిన చాలా సేపటి వరకు ఆమె ఆ షాక్ లోంచి తేరుకోలేకపోయింది.

ఇన్నాళ్ళూ ఇతడినా తను మంచి వాడనుకుంది. మనసులో ఇంత విషం పెట్టుకుని తనకు సహాయం చేసినట్టు నటించాడు దొంగవెధవ. ఇక ఆ రోజు మనసు పెట్టి పని చేయలేకపోయింది. ఎలాగోలా అయిందనిపించి ఆఫీస్ లోంచి బయటపడింది.

ఈ విషయం భర్త తో ఎలా చెప్పుకోగలదు. ఉద్యోగం లేకపోతే తమ బతుకులు అంతంత మాత్రమే. ఆ వెధవ…. ఈ రోజు ఇంత సాహసం చేసినవాడు రేపటి నుండి తన జోలికి రాడనే గారెంటీ లేదు. ఇక తనకు దిన దిన గండమే….

ఆమె ఈ ఆలోచనల్లో పడే భర్త అన్ని సార్లు పిలిచినా పలుక లేదు.

ప్రభాకర్ ఆమె అన్యమనస్కంగా ఉండటం చూసి మరోలా అనుకున్నాడు.

వంట పూర్తి చేసి ప్రభాకర్ కు పెట్టి తనూ కాస్త తిన్నాననిపించింది. తిండి కూడా సరిగా సహించలేదు ఆమెకు.

“సారీ సుమా! ఈ రోజు ఎంతో ఆనందంగా గడపాల్సిన రోజు. నేనిలా అయిపోవటంతో నా సేవతోనే నీకు రోజు గడిచిపోయింది.” అన్నాడు బాధగా.

“ఛ! ఛ! అవెం మాటలండీ! మీరు కోలుకుంటే నాకు అంతే చాలు. మీరు మనసులో ఏం పెట్టుకోకుండా పడుకోండి.” అంది అతడి పడక సరిచేస్తూ.

ఆమె అనుకున్నట్టుగానే తర్వాతి రోజు నుండి సుధాకర్ విశ్వరూపం చూపసాగాడు.

ఆమె అతడి గదిలోకి వెళ్ళడమే మానుకుంది. లెటర్స్ ఏమైనా ఉంటే అటెండర్ చేత పంపుతోంది. కాని ఏదో ఒక నెపంతో అతడు ఆమెను గదిలోకి పిలుస్తున్నాడు. ద్వంద్వార్థ మాటలు ఆమె మీద ప్రయోగిస్తున్నాడు.

రోజు రోజుకి అతడి టార్చర్ ఎక్కువవుతోంది. నీ ఉద్యోగం నా దయా దాక్షిన్యాలపైనే ఆధారపడి ఉంది. నీ పనితనం సరిగా లేదని పైకి రిపోర్ట్ రాస్తే నిన్ను ఉన్నపళం గా పీకి అవతల పడేస్తారు. నువ్వు నా దారికి రాక తప్పదు అంటూ ఈ మధ్య బెదిరింపులకు  కూడా దిగుతున్నాడు.

ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. యాజమాన్యానికి ఫిర్యాదు చేద్దామా అనుకుంది. కానీ ఎక్కువ మాట్లాడితే ఈ ఉద్యోగం మానేసి వెళ్ళవచ్చు అంటారేమో…అలా అనుకోగానే ఆమెకు ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. ఇక తన బతుకు ఇంతేనా…ఆ మేనేజర్ గాడు ఏదో ఒకరోజు తనను కబలించేస్తాడేమో….ఈ ఉద్యోగం చెయ్యలేని.. వదిలెయ్యలేని… తన అసహాయతను తనే తిట్టుకుంది.

మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్ళగానే మరో కొత్త అమ్మాయి కనిపించింది. ఎవరని ఆరా తీస్తే నెల క్రితం ఇంటర్వ్యూ జరిగిన స్టెనో పోస్ట్ కు సెలెక్ట్ అయిన పిల్ల హాసిని. వయసు పాతికేళ్ళ లోపే ఉంటుంది. కాస్త మోడరన్ గా ఉంది. అందంగానూ ఉంది. ఇంగ్లీష్ లో గలగలా మాట్లాడేస్తోంది. సుమనని చూసి పలకరింపుగా నవ్వింది. కాసేపట్లో ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరూ.

హాసిని వచ్చాక సుధాకర్ దృష్టి ఆ పిల్ల మీదకి మళ్ళినట్టుంది. సుమన జోలికి రావడం తగ్గించాడు. హాసిని ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడు అచ్చం అప్పుడు సుమనను చేసినట్టే. సుమన ప్రాణానికి ఇప్పుడు కాస్త హాయిగా ఉన్నా వాడికి హాసిని బలి అయిపోతుందేమో అని బాధ పడసాగింది.

అక్కడికీ హాసినిని హెచ్చరిస్తూనే ఉంది అతడితో జాగ్రత్త అని. ఆమె సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. సుమన చెప్పినపుడు నిర్లక్ష్యంగా నవ్వి ఊరుకుంటోంది.

సుధాకర్ మొదటి స్టేజి దాటి రెండో స్టేజి లోకి వచ్చాడు. హాసిని తెలిసినా తెలియనట్టు ఉంటోంది. అతడు మరో అడుగు ముందుకేసాడు.

ఆ రోజు డిక్టేషన్ తీసుకుంటున్న హాసిని వెనుకవైపుగా వచ్చి ఆమె భుజాల మీద చేతులేసాడు. అంతే….దిగ్గునలేచి అతడి చెంపలు చెళ్ళుమనిపించింది. అంతటితో ఆమె ఆగలేదు. అతడి షర్టు పట్టుకుని గదిలోంచి బయటకు లాక్కొచ్చింది.

సుధాకర్ ఎదురుచూడని ఈ అవమానానికి బిత్తరపోయాడు.

“యూ డెవిల్. చూడు నిన్నేం చేస్తానో” అన్నాడు రోషంగా..

“షట్ అప్ యూ ఇడియట్ .నువ్వు నన్ను ఏమిటి చేసేది? నేనే నిన్ను ఏం చేస్తానో చూడు.” సుమన ప్రక్కనున్న ల్యాండ్ ఫోన్ నుండి ఓ నెంబర్ డయల్ చేసింది హాసిని.

ఆఫీస్ లో అందరూ అవాక్కయి చూస్తున్నారు.

“డాడీ! మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే ! ఇక్కడ మేనేజర్ ఓ పెద్ద రోగ్. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అంటే ఏం చేసినా పడుండే ఆటబొమ్మలని అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ కి చెడ్డపేరు. వెంటనే డిస్మిస్ చేయండి.” అంది.

ఆ మాటలతో ఆఫీస్ వారికి ఆమె తమ బాస్ కూతురని అర్థం అయిపోయింది. సుధాకర్ తో సహా అందరూ అటేన్షన్ లోకి వచ్చేసారు. కాని ఆమె ఇన్నాళ్ళూ ఇలా తమ మధ్య అజ్ఞాతంగా ఎందుకు ఉందో, సుధాకర్ గురించి ఎవరు ఫిర్యాదు చేసారో వారికి అర్థం కాలేదు.

ఆమె ఇంకా ఫోన్ లో మాట్లాడుతోంది. అవతల తమ బాస్ ఏం చెప్తున్నాడో…..

“…………………”

“వాడికి ఛాయిస్ ఎందుకు డాడీ! పోలీసులకు అప్పగించక….”

“…………………”

“సరే డాడీ! అలాగే!” ఫోన్ పెట్టేసింది ఆమె.

అప్పటికే సుధాకర్ బిక్క చచ్చిపోయాడు. తమ బాస్ కూతురు ఎక్కడో విదేశాల్లో చదువుతోందని తెలుసు. సినిమాల్లో చూపినట్టు ఆమె ఇక్కడికి రావడం ఏమిటి? తనకు తెలియకుండా పోవడం ఏమిటి? తన కర్మ కాలిపోయి ఆమెతోనే అసభ్యంగా ప్రవర్తించాడు. అయినా తన మీద ఎవరు ఫిర్యాదు చేసి ఉంటారు? ఆఫీస్ లో అందరినీ తను చెండాడుతూనే ఉంటాడు. ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చే ఉంటాడు. బయటకు వెళితే ఎంత అవమానం? ఇప్పుడు తనకేది దారి? ఆలోచిస్తుంటే అతడికి ఒళ్లంతా చెమటలు పట్టేసాయి.

“మిస్టర్ సుధాకర్! నీ మీద నిర్భయ కేసు పెట్టి జైలుకు పంపేద్దాం అన్నంత కోపం ఉంది నాకు. కాని కంపెనీ పరువు పోకుండా ఉండటానికి  డాడీ నీకు మరో ఆప్షన్ ఇద్దామని అన్నారు. నువ్వు చేసిన వెధవ పనులన్నీ ఓ కాగితంలో రాసి, నీ రాజీనామాను ఇచ్చి తిరిగి చూడకుండా వెళతావా? లేక పోలీసులను పిలిచి జైల్లో తోయించమంటావా? నువ్వే నిర్ణయించుకో. సుమన గారిని నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో ఆవిడా, నన్ను ఏం చేసావో నేను రాసి ఇస్తే నువ్విక జన్మలో బైటకు రాలేకుండా మా డాడీ చూసుకుంటారు.” అంది హాసిని.

సుధాకర్ ఎక్కువ సేపు ఆలోచించలేదు. ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం చూసుకోవచ్చు అనుకుని ఆమె చెప్పినట్టే రాసి ఆమె చేతికి అందించాడు.

అతడు రాసిన లెటర్ ను ,రాజీనామా ను మెయిల్ ద్వారా హెడ్ ఆఫీస్ కు కూడా పంపమంది. అతను అలాగే చేసాడు.

“ గెట్ అవుట్ ఫ్రం హియర్ “

అతడు తల దించుకుని వెళ్ళిపోయాడు.

అప్పటి వరకు ఉత్కంట గా చూస్తున్న స్టాఫ్ అందరు  కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాళ్ళూ తమ మధ్య ఉన్న బాస్ కూతురితో తాము ఏదైనా తప్పుగా ప్రవర్తించామా అని లోలోపలే ఆలోచించుకోసాగారు.

అయోమయంగా చూస్తున్న సుమన దగ్గరికి వచ్చింది హాసిని. ఆమె తమ యజమాని అని తెలియగానే సుమన మునుపటిలా చొరవగా మాట్లాడలేకపోయింది.

“మీరు అతడి వల్ల ఎన్ని బాధలు పడుతున్నా నోరు విప్పలేదేందుకు? కనీసం ఇంట్లో వాళ్లకు కూడా చెప్పుకోలేరా? ఇలా మనం నోరుమూసుకున్న కొద్దీ ఇలాంటి వెధవల ఆగడాలు ఎక్కువ అవుతాయి అని గుర్తించరెందుకు?” అడిగింది హాసిని.

“ మేడం! మీకు …..మీకెలా తెలుసు నేను అతడి వలన ఇబ్బంది పడుతున్నానని. స్వయంగా మీరే వచ్చారు. నేనెవరికి చెప్పనే లేదు…” తడబాటుగా అడిగింది సుమన.

“నాకెవరూ చెప్పలేదు.” అంది హాసిని.

“మరి మీకెలా?…”

“వెధవ పనులు చేసేవాడు ఎంతటి తెలివైన వాడైనా ఎక్కడో ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పే అతడిని పట్టిస్తుంది.” అంది.

“అది ఏమిటి?” అని  అడిగే సాహసం చేయలేదు సుమన.

“ఓకే అందరూ మీ పనులు మీరు చేసుకోండి “ అంటూ ఆఫీస్ లో సీనియర్ క్లర్క్ ను పిలిచి ఆ రోజుకు ఆఫీస్ తాళాలు అతని దగ్గర పెట్టుకోమని చెప్పి తను బయలుదేరి వెళ్ళిపోయింది.

*********

రెండు రోజుల తర్వాత ఆఫీస్ కు వెళ్ళిన సుమన పక్క సీట్లో హాసినిని చూసి కంగారు పడింది.

“మేడమ్! మీరిలా…మళ్ళీ…”

“అయ్యో సుమన గారూ! ఎందుకు నన్ను చూసి కంగారు పడతారు? నీ మీ స్నేహితురాలు హాసినినే! నాకు అనవసర మర్యాదలు అక్కర్లేదు.”

“మీరు…మీరు మా బాస్ కూతురు కాదా?” ఇంకా ఆమె గొంతులో ఇంకా అపనమ్మకం.

“కాదండి బాబు! ఏదో పొట్ట గడవక ఉద్యోగానికి వచ్చిన దాన్ని.ఇలా రండి.నా పక్కన కూర్చోండి.”

మొన్నటి కంటే ఈ రోజు ఎక్కువ షాక్ తింది సుమన.

అంతలో ఆఫీస్ లో ఏదో కలకలం…. యం.డి. గారు వస్తున్నారు అని…అందరూ వారి వారి సీట్లలో సర్దుకున్నారు.

ఆయన రానే వచ్చారు. వెంట మరో మేనేజర్, మరి కొంత మంది ఉన్నారు.

“ డియర్ ఫ్రెండ్స్! మన ఆఫీస్ లో హాసిని అనే అమ్మాయి ఎంత గొప్ప సాహసం చేసిందో మీకు తెలియదు కదూ! మిస్ హాసిని! కం హియర్ !”

హాసిని లేచి ఆయన దగ్గరికి వెళ్ళింది.

“లైంగిక వేధింపులకు గురి చేస్తున్న పాత మేనేజర్ కు ఎంతో తెలివిగా తగిన బుద్ధి చెప్పింది. తను ఎన్నుకున్న మార్గం తప్పే అయినా తన తెలివితేటలను అభినందిస్తున్నాను. మా అమ్మాయి అని చెప్పి అతడి తప్పులను అతడి చేతనే ఒప్పించి రాజీనామా ఇచ్చేలా చేసింది. మీరు నేరుగా ఫిర్యాదు చేసినా అటువంటి వారు సాక్ష్యాలు లేక తప్పించుకునే అవకాశం ఉంది. కానీ హాసిని తిరుగులేని సాక్ష్యం సంపాదించి అతడికి అతడే శిక్ష విధించుకునేలా చేసింది. జరిగినది అంతా వెంటనే నన్ను కలిసి చెప్పి, అతడి రాజీనామాను అందజేసింది. అమ్మాయిలు తమని తాము కాపాడుకోవడంలో ఇలాంటి నేర్పరి తనం ప్రదర్శించాలి. మొదటి తప్పుగా భావించి హాసినిని క్షమించి వదిలి వేస్తున్నాం. ఇక మీదట ఇక్కడ పని చేసే ఆడవారికి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా నాకు నేరుగా ఫిర్యాదు చేసే వీలు కల్పిస్తున్నాను.” ఆయన చెప్పడం ముగించారు.

అందరూ ఆశ్చర్యం లోంచి ఇంకా తేరుకోలేదు. ఆపై అందరూ ఆమెని అభినందించారు.

కొత్త మేనేజర్ ఛార్జ్ తీసుకున్నారు.

హడావిడి అంతా సద్దుమణిగాక సుమన అడిగింది హాసినిని… ఇంతకూ సుధాకర్ దొరికిపోవడం లో చేసిన తప్పేమిటీ అని.

ఏముందీ! నేను బాస్ కూతురిని అని కాస్త బిల్డప్ ఇవ్వగానే కంగారు పడి రాజీనామా ఇవ్వడమే…ఇక్కడ ఎవరూ బాస్ కూతుర్ని చూడకపోవడం అలా నాకు కలిసొచ్చింది….. గలగలా నవ్వింది హాసిని.

 

 

 

 

 

 

 

 

1 thought on “అతివలు అంత సులభమా…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *