April 25, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 42

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అనుభవించే  ఆగామి, సంచితము, ప్రారబ్ధము అనే మూడు కర్మలను ఉద్దేశించి “మీకిక పనిలేదు…వెళ్ళిపొండి” అంటున్నాడు. తను శ్రీవేంకటేశ్వరుని పరమ భక్తుడనని తెలుపుతూ తనని వదిలేయమని వాటిని కోరుతున్నాడు.

కీర్తన:

పల్లవి: ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు
యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి    ॥పల్లవి॥

 

చ.1 పెట్టినది నుదుటను పెరుమాళ్ళ లాంఛనము
దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర
నెట్టన నాలుకవిూఁద నీలవర్ణునామమిదె
అట్టె హరిదాసులకంటునా పాపములు         ॥ఉమ్మ॥

 

చ.2 మనసునఁ దలచేది మాధవుని పాదములు
దినముఁ గడుపునించేది హరిప్రసాదము
తనువుపైఁ దులసిపద్మాక్షమాలికలు
చెనకి హరిదాసులఁ జేరునా బంధములు      ॥ఉమ్మ॥

 

చ.3 సంతతముఁ జేసేది సదాచార్యసేవ
అంతరంగమున శరణాగతులసంగ మిదే
యింతటాను శ్రీవేంకటేశుఁడు మమ్మేలినాఁడు
అంతటా హరిదాసుల నందునా అజ్ఞానము   ॥ఉమ్మ॥

(రాగం: సాళంగనాట, సం.4 సంకీ.132)

 

 

విశ్లేషణ:

పల్లవి: ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు
యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి

ఆగామి, సంచితము, అనే రెండు కర్మలను ఉభయ కర్మములు అంటారు. ఈ కర్మలను తప్పించుకోవడం సాక్షాత్తు పరమశివునికే తప్పలేదు. ఇంక మానవ మాత్రులెంత! కానీ తాను ఆ ఏడుకొండలవాని పరమ భక్తుడనని వివరిస్తూ తన జోళికి రావద్దని విన్నవిస్తున్నాడు అన్నమయ్య. నానాటి బదుకు నాటకము అనే కీర్తనలో “ఒడి గట్టుకున్న ఉభయ కర్మములు గడి దాటినపుడె కైవల్యము” అంటాడు. మనిషి ఈ కర్మలను అనుభవించి తీరవలసినదే! కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని, మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే! కర్మలు మూడు రకాలు. 1) ఆగామి కర్మలు 2) సంచిత కర్మలు 3) ప్రారబ్ధ కర్మలు. ఆగామి కర్మలు అనగా మనము చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మలలో ఫలితాన్నిస్తాయి.అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు! అయితే ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితాన్నివ్వలేకపోయినప్పటికీ, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ‘అగామికర్మలే’! సంచిత కర్మలు అంటే మనము పూర్వ జన్మలలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి వేరొక జన్మకు మనము తీసుకుని వెళ్తాము.జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలి పెట్టకుండా అతడితో వస్తుంటాయి. జీవుడు ఈ శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతాడు. దీనికి కారణం ‘సంచిత కర్మలు’. ఇక ప్రారబ్ధ కర్మలు మూడో రకం.  సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనము చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. మనము చేసుకున్న కర్మల ఫలితమే మనము అనుభవిస్తాము. ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు.అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది. కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదు. ఈ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించేవరకూ జీవుడు మరల మరల జన్మిస్తూనే ఉంటాడు. ఇలాంటి కర్మలు మాకు వద్దనే వద్దు. వెళ్ళిపోండి దూరంగా అని అభ్యర్ధిస్తున్నాడు అన్నమయ్య.

 

చ.1  పెట్టినది నుదుటను పెరుమాళ్ళ లాంఛనము
దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర
నెట్టన నాలుకవిూఁద నీలవర్ణునామమిదె
అట్టె హరిదాసులకంటునా పాపములు

మేము నుదుట విష్ణువు యొక్క తిరునామం ధరించాము. మా ఇరు భుజముల మీద శంఖుచక్రాలను ధరించి యున్నాము. మా నాలుకపై సదా హరినామమే ఉచ్ఛరింపబడుతూ ఉంటుంది. మా వద్దకు పాపము ఎలా రాగలుగుతుంది. రాలేదు గాక రాలేదు. అందువల్లనే చెప్తున్నాను. కర్మలారా! మాజోళికి రావద్దు అంటున్నాడు అన్నమయ్య.

చ.2 మనసునఁ దలచేది మాధవుని పాదములు
దినముఁ గడుపునించేది హరిప్రసాదము
తనువుపైఁ దులసిపద్మాక్షమాలికలు
చెనకి హరిదాసులఁ జేరునా బంధములు

మా మనస్సు గురించి కూడా వినండి. మేము ఎల్లప్పుడూ ఆ విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటూ ఆయన నామమే సదా జపిస్తూ ఉంటాము. మేము మా కడుపులు నింపుకొనేదీ ఆ శ్రీవారి ప్రసాదంతోనే! మేము సదా విష్ణు తులసిమాలలను ధరిస్తాం. మరి మాకు పాపాలు అంటుకుంటాయా? మాదగ్గరకు రావడానికి సాహసిస్తాయా? అందుకే చెప్తున్నాను. కర్మలారా! మా జోళికి రావద్దు అంటున్నాడు అన్నమయ్య.

3 సంతతముఁ జేసేది సదాచార్యసేవ
అంతరంగమున శరణాగతులసంగ మిదే
యింతటాను శ్రీవేంకటేశుఁడు మమ్మేలినాఁడు
అంతటా హరిదాసుల నందునా అజ్ఞానము

మేము రోజూ గడిపే దినచర్యగురించి కూడా చెప్పవలసి ఉంది. మేము సదాచార సేవలో నిమగ్నమై ఉంటాము. మా అంతరంగ తరంగాలలో సదా ఆ శ్రీహరి శరణాగతులే కొలువై ఉంటారు. అదే మాకు నిత్య తృప్తినిచ్చే విషయం. మేము ఇంత నిష్టగా ఆయనను కొలుస్తాము కాబట్టే ఆ శ్రీహరి మమ్ములను అన్నివిధాల కాపు కాస్తూ ఉంటాడు. మా లాంటి వారిని అజ్ఞానం ఆవహిస్తుందా? చెడ్డ కర్మలకు ప్రేరేపిస్తుందా? అందుకే మాజోళికి ఎన్నడూ రావద్దు అని కర్మలను హెచ్చరిస్తున్నాడు అన్నమయ్య.

 

ముఖ్యమైన అర్ధాలు: ఇమ్ముల = వెనువెంటనే, ఇప్పటికిప్పుడు – కళింగాంధ్రలో సంఖ్యావాచకంగా వాడతారు అనగా అనేక అనే అర్ధంలో; పెరుమాళ్ళ లాంఛనము = తిరునామాలు, పంగనామాలు;  దైవ శిఖామణి ముద్ర = రెండు భుజములపై వైష్ణవులు ధరించే శంఖు చక్ర ముద్రలు; చెనకుట = ఎదిరించుట, తాకుట; సదాచార్య సేవ = సద్గురువుల సుశ్రూష; సంగము = కలయిక, చేరి ఉండుట.

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *