April 19, 2024

తేనెలొలుకు తెలుగు –

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

పద్యప్రేమ-2

దాదాపుగా అన్ని భారతీయ భాషలకు మాతృస్థానంలో ఉన్న సంస్కృతం తెలుగు భాషలో పాలలో చక్కెరలా కలిసిపోయింది. ఎంత తెలుగులోనే మాట్లాడాలని పట్టుదల కలిగిన వారైనా, సంస్కృత భాషను ఇచ్చగించని వారైనా, సంస్కృతపదాలను వాడకుండా మాట్లాడటం కష్టమైనపని. అయితే తొలిదశలో అప్పుడప్పుడప్పుడే తెలుగు భాషకు ఒక లిఖితరూపం ఏర్పడే కాలంలో పద్యరచన సంస్కృత సమాసాలతోనే సాగింది.
మచ్చుకి నన్నయ గారి పద్యం చూద్దాం.

బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీభరమజస్ర సహస్ర ఫణాళిదాల్చిదు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికి బాయకశయ్యయైనయ
య్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు బ్రసన్నుడయ్యెడున్

ఇందులో ఒకటి రెండు తప్ప మిగతావి అన్నీ సంస్కృత పదాలే. నన్నయ పదవ శతాబ్దం వాడైతే
తిక్కన పన్నెండవ శతాబ్దం వాడు. తిక్కన పద్యాలలో సంస్కృత పదాలు తక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు భంగపడిన ద్రౌపది కృష్ణునికి తన గోడు చెప్పుకునే సందర్భంలో

వరమునబుట్టితిన్ భరతవంశముజొచ్చితి నందు బాండు భూ
వరులకు గోడలైతి జనవంద్యుల బొందితి నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్
సరసిజనాభ ఇన్నిట బ్రశస్తికి నెక్కిన దాననెంతయున్.

ఏ మాత్రం అన్వయ కాఠిన్యం లేని పద్యం.
ఎఱ్ఱన వీరి తర్వాతి కాలం వాడైనా పూరించింది ఆరణ్య పర్వ శేషం గనుక అటు నన్నయ ధోరణి నుండి ఇటు తిక్కన ధోరణి దాకా చక్కని పద్యవారధి నిర్మించాడు. నన్నయ చివరి పద్యం

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హారపంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూరపరాగ పాండురుచి పూరములంబర పూరితంబులై

ఉజ్వలంగా ప్రకాశిస్తున్న నక్షత్ర మాలికలతో అందంగాఉన్న శరత్కాలపురాత్రులు, అప్పుడేవికసించిన కలువపూల సువాసన కలిగిన గాలితో, చంద్రకిరణ కాంతితో కలిసి ఆకాశమునిండా కర్పూరపు పొడి చల్లినట్లుగా ఉన్నాయి. కర్పూరంతో పోల్చడంలో కవి గొప్ప తనము తెలుస్తుంది. కర్పూరం వెన్నెల లాగా తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కలువపూలవాసన లాగా కమ్మని వాసన కలిగి వుంటుంది. మెరిసే నక్షత్రాలలాగా తళుకులుంటాయి. ఇక్కడ నన్నయ్య అరణ్యపర్వాన్ని ఆపితే కిందిపద్యంతో ఎర్రన అరణ్యపర్వశేషాన్ని మొదలు పెడతాడు. నన్నయ వెంనేలరాత్రిని వర్ణించి ఆపితే ఎర్రన సూర్యోదయంతో ప్రారంభిస్తాడు చూడండి

ఎర్రన మొదటి పద్యం
స్ఫురదరుణాంశు రాగరుచి బొంపిరివోవ నిరస్త నీరదా
వరణములై దళత్కమల వైభవ జృంభణముల్లసిల్ల ను
ద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
గరమువెలింగె వాసరముఖమ్ములు శారదవేళ చూడగన్

దట్టమైన ఎర్రని సూర్యకిరణాల కాంతికి ఎరుపెక్కిన మేఘాలు, వికసించిన కమలాల వైభవం , వాటిచుట్టూ మూగిన హంసలు, బెగ్గురుపక్షులు, తుమ్మెదల సవ్వడులు వ్యాపిస్తు ఉండగా శరత్కాలపు ఉద్యమనే ముఖం వెలిగి పోయిందట. ఎఱ్ఱన కూడా నన్నయ్య కు తీసిపోకుండా పద్యం రాశాడు. ముఖం ఎప్పుడు వెలుగుతుంది. సంతోషం ఎప్పుడు కలుగుతుంది. ఇష్టమైనవాళ్లు ఇంటికి వచ్చినప్పుడు. మరివచ్చినప్పుడు మెల్లిగా పకరిస్తామా ? హడావుడి అల్లరితో పలకరిస్తాం . కమలాలకు ఇష్టమైనవాడు సూర్యుడు వచ్చాడు, కమలాలు వికసించాయి. కమలాలు వికసించగానే హంసలు, తుమ్మెదలు తదితర పక్షులు శబ్దాలు చేశాయి. ఆవిధంగా ఎర్రన సూర్యోదయ వర్ణనతో ఆరణ్యపర్వశేషం మొదలవుతుంది. ఎర్రన అంటే ఎర్రని వాడు అని కడ్డ అర్థం . తనపేరుకూడా స్ఫురించే విధంగా స్ఫురదరునాంశు పద్యంతో ముందుకుసాగినాడు.
శారదరాత్రులుజ్వల అన్నప్పుడు పోతన్న పద్యం కూడా గుర్తుకు వస్తుంది. అన్నీ తెల్లని వస్తువులను ఏరి ఏరి రాసిన పద్యం.

శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషారఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధాపయోధి సిత తామరసామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!. . .

ఇలా తెలుగు పద్యం మన ప్రబంధ కవుల చేతుల్లో ఎన్ని సోయగాలు పోయిందో చెప్పలేం. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి.
అందుకే విశ్వనాథవారు తెలుగు పద్యాలలోని మేలిమి పద్యాలను మూడు వందలదాకా ఎంచుకొని వాటికి తనదైన వ్యాఖ్యతో కావ్యసురభి అనే పుస్తకం వేశారు అప్పట్లో. కావ్యాలను చదివి ఎలా ఆనందించాలనే వారి కావ్యానందం తెలియజేస్తుంది.
ఆటవెలదులతో ఆటలాడుకున్నాడు వేమన.
సీసపద్యాలతో చిత్రాల చేసాడు శ్రీనాథుడు.
రామరాజభూషణుని సంగీతజ్ఞత ఆయన పద్యాలలో
ఇమిడి ఉంటుంది. రాసిక్యత చూడాలంటే అల్లసాని,
భక్తి భావానికి పోతన ఇలా నాటి కవుల పద్యాలు కొన్నైనా నోటిమీద ఆడాలి. ఒక్కో సందర్భాన్ని ఒక్కో కవి ఎంత విశిష్టంగా చెప్పాడో గమనించాలి. అవి జీర్ణించుకుంటే పద్యం మనల్ని వరిస్తుందని నా భావన

1 thought on “తేనెలొలుకు తెలుగు –

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ 2019 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *