April 18, 2024

విశ్వపుత్రిక వీక్షణం – అమ్మ. . విశాలాక్షి

రచన: డా.విజయలక్ష్మీ పండిట్.

దివ్య తన రెండునెలల కూతురు విశాలాక్షికి పాలిస్తూ పాప చిరుపెదవులతో తనపాలు కుడుస్తున్నప్పటి ఆ మాతృత్వపు మాధుర్యాన్ని కళ్ళుమూసుకుని అనుభవిస్తూ ఆస్వాదిస్తూంది.
ఆ మాతృత్వపు అనుభూతి దివ్యలో అలజడిని రేపుతూంది. తన మనోసంద్రంలో తాను తప్పుచేశానన్న పచ్ఛాతాప కెరటాలు లేచిపడుతున్నాయి. వాళ్ళ అమ్మ విశాలాక్షి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి దివ్యను.
“ఎంత నిర్లక్ష్యం చేసి ఎంత చులకనగా చూసిందితను అమ్మను” తలుచుకున్న దివ్యకు కంట్లో నీళ్ళుతిరిగి చెంపలపై కారాయి.
హృదయం బరువెక్కింది అమ్మ జ్ఞాపకాలతో .
అంతలో బుజంమీద మెత్తగ చేయి అనడంతో భర్త చేయి స్పర్శను గుర్తించి కండ్లు తెరిచింది.
భర్త రాకను గమనించలేదు దివ్య.
భర్త ఆనందు ఆఫీసునుండి వచ్చి కాళ్ళుచేతులు కడుక్కొని కూతురును చూడాలని రూములోకి రావడం. దివ్య కళ్ళుమూసుకుని మంచానికి తల వెనుకకు ఆన్చి బాధపడడం గమనించి ఓదార్పుగాదివ్య బుజం మీద చేయి వేశాడు.
“అత్తమ్మ గుర్తుకొచ్చారా దివ్యా” అన్నాడు ఆనందు.
భర్త ఓదార్పు మాటలకు దివ్యకు దుఖం కట్టలు తెంచుకుని బయటపడింది. దివ్యపక్కన కూర్చొని దివ్య తలను తన బుజానికి ఆన్చుకొని తల నిమురుతుండి పోయాడు.
కొంతచసేపయినాక పాపను ప్రక్కన ఊయలలో
పడుకోబెట్టింది దివ్య. ఊయలపై చేతులాన్చి కూతురిని చూస్తూ పాప చేయి సుతరాము మెల్లగ తాకాడు ఆనందు.
“నేను అమ్మ ప్రేమను, విలువను గుర్తించకుండా
నిర్దయగా ప్రవర్తించానండి . మా అమ్మ విషయంలో
కూతురుగా మా అమ్మపై చూపాల్సిన ప్రేమ ఆప్యాయత , సహాయము సేవ చేయలేక
పోయాననే బాధ నేను తల్లినైనప్పటి నుండి నన్నింకా తొలిచేస్తుందండి. ”అనింది దివ్య.
ఏదో కొత్త విషయం వింటున్నట్టు చూశాడు దివ్య వైపు ఆనందు.
***
దివ్య ఆనందుతో చెప్పసాగింది .
“దాదాపు సంవత్సరం ముందు మన పెండ్లి
అయిన ఆరు నెలలకు మా అమ్మ చనిపోవడంతో మా నాన్న ఒంటరివాడయిపోయాడు. అమ్మ చనిపోయినపుడు నేను అత్తగారింటిలో వున్నందున అమ్మ చనిపోయే
ముందు తుదిగడియలలోఅమ్మదగ్గర లేకపోయిను. అమ్మకు జ్వరంతీవ్రంగా
వున్నా నన్ను పిలిపిస్తానని నాన్నంటే అమ్మే వద్దనిందట. దివ్య వచ్చి ఏమి చేస్తుంది
కొత్త పెండ్ల కూతురు”అని.
“నా మొండివైఖరి కన్నింటికి నాన్న నన్ను
సపోర్టు చేస్తూ అమ్మ చెప్పేమాటలు
పట్టించుకొనేవాడు కాదు. మా ఇద్దరి వల్ల అమ్మ మనసు బాధపడేలా చేయడానికి నేనే కారణం. మా నాన్న నన్ను ఎక్కువ గారబం చేయడంతో ఆ చిన్న వయసులో అమ్మ చూపించే క్రమశిక్షణ నచ్చక నేనంటే నాన్నకే ఎక్కువ ఇష్టమనే భావనతో అమ్మను బాధపెట్టి నేను సంతోష పడేదాన్ని. నా నిర్లక్షపు చేష్టలను మౌనంగా భరించింది .
నా ప్రవర్తన తలుచుకుంటే ఇప్పుడు గుండె పిండినట్టవుతుందండి” అని ఆగి మరల కొనసాగించింది.
“ఎంత క్రూరమైన మనసు నాది! ఎందుకలా తయారయాను నేను? ఎవరు కారణం ? నాన్న చేసే మురిపం నాలో మొండితనాన్ని ,అమ్మ పట్ల
నా నిర్లక్షాన్ని పెంచాయా? ఇప్పుడు ఈ ప్రశ్నలు నన్ను తొలిచేస్తున్నాయండి.
మా అమ్మ క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చేది .
ఒకే కూతురయినయినా
‘మొకై వంగనిదే మానైవంగదు‘ అనే సామెతన్నట్టు చిన్నప్నటి నుండి మంచి చెడు తెలియాల పిల్లలకు. చిన్నపిల్లల మనస్తత్వం నుండి మనసు క్రమంగా ఎదగాలి వయసుతో పాటు అని అనవసరమైన వాటికి వద్దనేది. నాన్నేమో నా కోరకలను నా ఏడుపును చూసి కరగిపోయి అమ్మకు వ్యతిరేకంగా నా డిమాండ్లను
తీర్చేవాడు. అమ్మపట్ల నాకు ఒక వ్యతిరేక భావన చోటుచేసుకొంది. నా పెంపకం పట్ల సమన్వయం లేని అమ్మా నాన్నల నిర్ణయాల? ఏది కారణం?తర్జన మొదలయింది నాలో . ”
“మన పాపను నాలా కాకుండా అమ్మ నాన్న అంటే ప్రేమ ,అప్యాయత అనురాగం పంచుకొనే మొదటి స్నేహితులనే భావనతో పెరిగేలా తల్లి తండ్రులం మనమిద్దరం జాగ్రత్తగా పెంచుకోవాలండి. ” అనింది.
“అలాగే చేద్దాం గాని నీవు బాధపడకు “ అన్నాడు ఆనందు.
దివ్య మరల “నేనుఅమ్మ కాబోతున్నానని తెలిసినప్పటి నుండి నాలో చోటుచేసుకున్న శరీరక మార్పులే కాకుండా మానసికంగా కూడా మార్పులు రాసాగాయి. అమ్మను గురించిన ఆలోచనలు ఎక్కువయ్యాయి. తప్పుచేసానన్న భావన. ఆ ఆలోచనలు నాలో పఛ్చాతాపాన్ని కలుగచేసాయి. ఏదో తెలియని వెలితి నన్ను వెంటాడేది. అమ్మ ప్రేమంటే ఏమిటో తెలియరాసాగింది.
నేను అమ్మను నిర్లక్షం చేసినా నాకు బాగలేనప్పుడు మా అమ్మ విశాలాక్షి అడిగి అడిగి బుజ్జగించి నా విసుగుదలను భరిస్తూ నాకేమి ఇష్టమో అడిగి చేసి ఆప్యాయంగా కథలు చెపుతూ అన్నంపెట్టేది , స్నానం చేయించి బట్టలు మార్చి జోకొడుతూ నిద్ర పోయేంతవరకు ప్రక్కన కూర్చొని వెళుతూ మెల్లగ నా నుదురు బుగ్గలను ముద్దాడేది. ఎంత హాయనిపించేది అమ్మ తోడు . . !
నేను గర్భం దాల్చిన తరువాత మొదటి మూడునెలలు అన్నం కూరలు వండే వాసనలు సయించక అమ్మ చేతివంటలు తినాలని ఎంతనిపించిందని నాకు. రాను రాను అమ్మలేని వెలితి భూతంలా పెరగసాగింది. నేనేమి
కోల్పోయానో తెలిసి వచ్చిందండి. నేను లోలోపల ఒంటరిగా బాధపడసాగాను. మీతో చెప్పుకోవాలని ఎన్నోమార్లు అవుతున్నా కాని మీ అమ్మగారితో మీ ప్రవర్తన మీరు చూపే గౌరవం , ప్రేమ చేసే సేవ చూసినపుడు నేను కుంచించుక పోయేదాన్ని. మా అమ్మ పట్ల నా ప్రవర్తనను విని నన్ను మీరు అసహ్యించుకుంటారేమో అని. ”
దివ్య తన మనసులోని బాధనంతా వెళ్ళబోసుకుంటుంటే . . తనకు ఊరట కలుగుతుందని ఆనందు అడ్డు చెప్పకుండా
వింటున్నాడు.
దివ్య దిగులుగా ఉన్నపుడు అనందు ఆడపిల్లలకు గర్భంతో ఉన్నప్పుడు ఆ సమయంలో అమ్మలేని లోటు ఎవరు తీర్చలేనిదని ఓదార్చేవాడు కాని దివ్య తను వాళ్ళ అమ్మ పట్ల తప్పుచేశానన్న ఆ భావన వల్ల ఎక్కువ బాధపడుతుందని తెలియదు.
దివ్య మరలా ఆనందుతో. . ,
“ఇంటికి రాగానే మీరు మొదట మీ అమ్మగారి గదిలోకి వెళ్ళి పరామర్శించి “అన్నం తిన్నావా,మందులేసుకున్నావా అమ్మా అంటూ అత్తమ్మ దగ్గర కూర్చొని అప్పుడప్పుడు కాళ్ళు వత్తుతూ మాట్లాడి తర్వాత వచ్చి భోంచేయడం, అత్తమ్మకు కావాల్సినవి అడిగి అడిగి తెచ్చిపెట్టడం, సాయంత్రాలపూట బాల్కనీలో కూర్చొని మీరు తనతో కబుర్లు చెప్పడం నేను పెండ్లయినప్పటి నుండి గమనించాను. నేను మా అమ్మ పట్ల ఆ ప్రేమ గౌరవం ఆప్యాయత చూపలేదు పంచుకోలేదన్న భావన నన్ను ఎంతో బాధపెడుతూంది” అనింది దివ్య.
“నీ బాధను అర్థంచేసుకున్నా దివ్యా . చిన్నప్పుడు పిల్లలు అమ్మ నాన్నలను చాల అనుసరిస్తారు. వారిలో నైతిక విలువలకు నడవడికకు పునాది ఇంటివాతావరణం. అమ్మ నాన్నలు ఒకరినొకరు గౌరవించుకుంటు పిల్లల ముందు తగువులాడకుండ ఒక సమతుల్యతతో సంయమనంతో పిల్లలను పెంచుకోవాలి. అలాంటి ఇంటివాతావరణం మా ఇంటిలో వుండేది”అన్నాడు ఆనందు. మరలా కొద్ది సేపాగి ఆనందు అన్నాడు దివ్యతో. .
“మా నాన్న మా అమ్మను ఎప్పుడు ఆప్యాంగా ఆమె మాటలకు విలువిస్తూ “ అమ్మ చెప్పిందిగా ఇంకేంటి “అని మా ముందు అమ్మను సమర్తించి ఏ దయినా అమ్మకు చెప్పదలచుకుంటే వాళ్ళిద్దరే ఉన్నప్పుడు చెప్పేవారు.
అమ్మ కూడ మా నాన్నను సపోర్ట్ చేస్తూ
“నాన్న చెప్పారు కదరా నాన్న అట్లే చేద్దాము “అని అది ఎందుకలా చేయాలో విడమరిచి చెప్పి మా అన్నను నన్ను ఒప్పించేది మా అమ్మ. ”
“నిజమేనండి మా నాన్నకు మా అమ్మంటే ఎంతో ప్రేమ . అమ్మ చనిపోవడంతో నా కంటే కూడా మా నాన్న అమ్మను ఎక్కువ మిస్ అవుతున్నారన్నది గ్రహించాను . వారివురి ప్రేమను గుర్తించలేదు నేను. మూర్ఖురాలిని. కాని నా పెంపకంలోని నాన్న మా అమ్మను నిర్లక్ష్యం చేశారు నాముందు. బహుశ నాపై దాని ప్రభావం,పర్యవసానం ఊహించి వుండరు మా నాన్న. నేను మా అమ్మ నాన్నలకు ఒక్క బిడ్డకావడం , నాకు చిన్నపుడు అలాంటి పెంపకం లేనందున నేను ఆడింది ఆట పాడింది పాటగా వుండి అమ్మ మనసును, ప్రేమను గుర్తించ లేకపోయానండి” అని బాధ పడింది.
పాప ఊయలలో కదలడంతో దివ్య ఆనందు లేచి ఊయల దగ్గరకు వెళ్లారు . ఊయలను మెల్లగ ఊపింది దివ్య.
ఆనందు పాపవైపు చూస్తూ మీ అమ్మ పోలికలని మీ అమ్మ పేరు “విశాలాక్షి “అని పేరు పెట్టుకున్నావు కదా. నాకు మా అమ్మకు నచ్చిందా పేరు . మీ అమ్మగారు కూడా చాల మంచి మనిషి.
పాప కండ్లు తెరిచింది . ఆనందు కూతురును జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా చూస్తూ . . మన అమ్మ విశాలాక్షిని ప్రేమగా పెంచుకుందాము. పాప నీ లాగా తయారుకాకుండా వాళ్ళ అమ్మను, అదే నిన్ను ప్రేమగా చూసుకోనేటట్టు పెంచే బాధ్యత ఇక నాదికద దివ్యా “ అన్నాడు ఆనందు.
భర్త మాటలతో తన మనసులోని భారం కొంచెం దిగిపోయినట్టనిపించింద దివ్యకు.

*****

1 thought on “విశ్వపుత్రిక వీక్షణం – అమ్మ. . విశాలాక్షి

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ 2019 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *