February 27, 2024

**** అమ్మమ్మ – 8 *****

రచన: గిరిజ పీసపాటి

అమ్మమ్మ, తాతయ్య నాగను బజారుకి తీసుకెళ్ళి అప్పటికప్పుడు పట్టు లంగా, జాకెట్టు క్లాత్ తీసి టైలర్ కి గంటలో కుట్టి ఇమ్మని చెప్పి, అక్కడి నుండి బంగారం షాపుకి వెళ్ళి అనార్కలి మోడల్ నెక్లెస్, చెవులకు బెంగాలీ రింగులు, జడ గంటలు కొన్నారు. అప్పటి వరకు నాగకి చెవులు కూడా కుట్టించని కారణంగా అటునుంచి అటే కంసాలి వద్దకు వెళ్ళి చెవులు కుట్టించి, బెంగాలీ రింగులు పెట్టించారు.

చెవులు కుట్టించాక ఆ నొప్పికి నాగ ఏడుస్తుంటే చెరుకు రసం ఇప్పించి, నాగను ఊరుకోబెట్టారు. తరువాత టైలర్ దగ్గరకు వెళ్ళి లంగా, జాకెట్టు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సాయంత్రం మొదటిసారి తాము కొన్న కొత్త బట్టలు కట్టి, జడ గంటలతో పూలజడ వేసి నాగ పుట్టిన రోజు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈరోజుల్లో లాగా అప్పుడు కేక్ కట్ చెయ్యడం ఉండేది‌ కాదు కనుక ముత్తైదువలందరూ హారతి ఇచ్చి, బొట్టు పెట్టి, అక్షింతలు వేసారు. వారికి పండు, తాంబూలం నాగ చేత ఇప్పించింది అమ్మమ్మ.

బంధుమిత్రులే కాక తెలిసిన వారు కూడా వచ్చి నాగకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అప్పటి నుండి అమ్మమ్మ నాగను తనకి నచ్చినట్లు ముస్తాబు చేసి మురిసిపోయేది. రకరకాల పువ్వుల జడలు వెయ్యడంలో అమ్మమ్మది‌ అందెవేసిన చెయ్యి అని చెప్పాను కదా! తన ముచ్చట తీరా నాగకు రకరకాల పూలజడలు వేసేది.

ప్రతిరోజూ నాగకు ఒంటి నిండా వెన్న పట్టించి, ముందు కచ్చూరాలు, బావంచాలు, వట్టివేళ్ళు మొదలైన సుగంధద్రవ్యాలతో తయారు చేసిన నలుగు పిండితో, తరువాత మైసూర్ శాండిల్ సోప్ ఒళ్ళు రుద్ది స్నానం చేయించేది. తల స్నానానికి కేవలం షీకాకాయ మాత్రమే వాడేది. తల నూనె కూడా ప్రత్యేకంగా తయారు చేసేది. అమ్మమ్మ తీసుకున్న ఈ జాగ్రత్తల కారణంగా నాగ జుత్తు చక్కగా పట్టుకుచ్చులా ఉండడమే కాకుండా లావుగా, పొడుగ్గా పెరగసాగింది.

అమ్మవారు తీవ్రంగా పోసిన కారణంగా పొక్కులు మాడినా ఒళ్ళంతా చిన్న చిన్న మచ్చలు, గుంటలు పడి, చర్మం నల్లబడిన కారణంగా మెర్క్యురీ వేక్స్ అనే ప్రత్యేకమైన ఇంపోర్టెడ్ క్రీమ్ ను తెప్పించి రాత్రళ్ళు ఒళ్ళంతా రాసేది. అది కళ్ళకి, నోటికి తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేది. కొద్ది కాలానికే మచ్చలు, గుంటలు పూర్తిగా పోయి నాగ శరీరం నున్నగా మారింది. మునుపటంత కాకపోయినా నలుపు రంగు పోయి శరీరం పచ్చని రంగు వచ్చింది.

ఇంట్లో కూడా ఖరీదైన వెండి జరీ పట్టు లంగాలు మాత్రమే కట్టుకునేది నాగ. ఒకరోజు నాగ తాతయ్య పక్కన పడుకుని నిద్ర పట్టక అటూ-ఇటూ అసహనంగా మంచం మీదే కదలుతుండగా అది గమనించిన తాతయ్య “ఏం నాగేంద్రుడూ! నిద్ర రావటం లేదా!?” అని అడగడంతో “పరికిణీ గుచ్చుకుంటోంది నాన్నా” అంది.

వెంటనే తాతయ్య అంత రాత్రి వేళ కూడా బట్టల దుకాణం యజమాని ఇంటికి వెళ్ళి, అతనిని నిద్ర లేపి, షాపు తెరిపించి అరడజను శాటిన్ లంగా బట్టలు కొని, టైలర్ ఇంటికి వెళ్ళి అతడిని కూడా నిద్ర లేపి అప్పటికప్పుడే ఒక పరికిణీ కుట్టించి ఇంటికి తీసుకు వచ్చి నాగకు కొత్త ఆ పరికిణీ వేసి “ఈ పరికిణీ గుచ్చుకోదు. ఇక పడుకో నాగబ్బాయ్” అని పడుకోబెట్టారు. నాగని అందరూ ‘నాగేంద్రుడూ, నాగబ్బాయ్, నగులూ’ అని పిలవసాగారు.

తరువాత నాగ పగలు పట్టు లంగాలు, రాత్రి శాటిన్ లంగాలు వాడేది. ఇలా నాగకు ఎప్పుడు ఏ విషయంలో అసౌకర్యం కలిగినా తను చెప్పకుండానే గమనించి, తనకి అన్ని సౌకర్యాలు సమకూర్చేవారు. ఒక మంచి ముహూర్తం చూసి ఘనంగా అక్షరాభ్యాసం కూడా చేసి, తాతయ్య పనిచేసిన స్కూల్ లోనే జాయిన్ చేసారు. నాగ కూడా చక్కగా చదువుకునేది.

ఆరోజుల్లో నాగకు తెలుగు టీచర్ ప్రముఖ హరికధా కధకుకులైన శ్రీ మునుకుట్ల సదాశివ శాస్త్రి గారు. వారి శిక్షణలో చక్కగా రాణించసాగింది. కొద్ది రోజుల్లోనే కూచిపూడి నృత్యంలో కూడా శిక్షణ ఇప్పించసాగారు తాతయ్య. అమ్మమ్మకు మాత్రం నృత్యం కాకుండా సంగీతం నేర్పించాలని ఉండేది. కానీ తాతయ్య వినలేదు.

చేతుల్లో, తలమీద దీపాలు ఉంచుకుని పళ్ళెం మీద డాన్స్ చేయడం వరకు నృత్యం నేర్చుకుంది నాగ. ఇంకో వారం రోజుల్లో డాన్స్ ఆరంగేట్రం అనగా నాగకు టైఫాయిడ్ జ్వరం రావడం, ఈ రోజుల్లో లాగా అప్పుడు సరైన మందులు లేకపోవడంతో రెండు నెలలపాటు జ్వరంతో బాధపడి నీరసించిపోయింది. దాంతో డాన్స్ మానేయాల్సి వచ్చింది.

ఈలోగా పీసపాటి నరసింహమూర్తి తాతయ్య, తెనాలి తాతయ్యల మధ్య స్నేహం మరింత బలపడి పేర్లు పెట్టి పిలుచుకునే స్థాయిని దాటి బావా అంటే బావా అని పిలుచుకోసాగారు. పీసపాటి తాతయ్య ఒకసారి ఒక ఏరియాలో, ఆ చుట్టుపక్కల ఊర్లలోనే నాటకాలు ఉండేలా డేట్స్ ఇచ్చేవారు. ప్రయాణం ఇబ్బంది కాకూడదని, తనవల్ల నాటకం ఆలస్యం కాకూడదని ఈ జాగ్రత్తలు తీసుకునేవారు. అప్పటి రంగస్థల కళాకారులంతా ఇలానే చేసేవారు. పీసపాటి తాతయ్యతో పాటు ట్రూప్ మేనేజర్ గా తెనాలి తాతయ్య కూడా వెళ్ళేవారు.

తెనాలి చుట్టుపక్కల ఊర్లలో (గుంటూరు, కృష్ణా జిల్లాల్లో) ఎక్కడ నాటకం అయినా తెనాలి వచ్చి వీరింట్లోనే బస చేసేవారు పీసపాటి తాతయ్య. దానితో నాగ కూడా మామయ్య గారూ అంటూ పీసపాటి తాతయ్యతో చనువుగా మాట్లాడేది. అమ్మమ్మ కూడా పీసపాటి తాతయ్యను అన్నయ్య గారూ అని పిలుస్తూ, ఆయనకు ఇష్టమైన వంటకాలు వండి పెట్టేది. ముఖ్యంగా అమ్మమ్మ చేసే రోటి పచ్చళ్ళు, దోసకాయ పప్పు ఇష్టంగా తినేవారు పీసపాటి తాతయ్య.

నాగను చూసిన ప్రతిసారీ పీసపాటి తాతయ్య తెగ మెచ్చుకునేవారు. పిల్ల అందంగా శిల్పంలా ఉంటుంది, నిలబడ్డా నాట్య భంగిమలానే ఉంటుంది, నడిచినా నాట్యం చేస్తున్నట్లే ఉంటుంది అనేవారు. అప్పుడప్పుడూ పీసపాటి తాతయ్య కుటుంబ సభ్యులు (భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు, వదిన గారు) తెనాలి వచ్చేవారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా స్నేహం బలపడింది.

నాగకు ఆరో ఏడు నిండి ఏడవ ఏడు వచ్చినప్పుడు పీసపాటి తాతయ్య కొడుకులు ఇద్దరూ చదువు రీత్యా తెనాలి వచ్చి కొంతకాలం వీరింట్లో ఉండి చదువుకోసాగారు. నాగ వాళ్ళిద్దరినీ పెద్ద బావా, చిన్న బావా అని పిలిచేది. వారు కూడా నాగని ఆడిస్తూ, సినిమాలకు తీసుకెళ్ళేవారు.

చిన్నబ్బాయి అప్పుడప్పుడు కోప్పడుతూ ఉండడం వల్ల అతనితో కన్నా పెద్దబ్బాయితో ఎక్కువ స్నేహంగా ఉండేది నాగ. అతనైతే నాగకు దెబ్బ తగిలినా, ఆరోగ్యం బాగోలేక పోయినా ఎత్తుకుని తిప్పేవాడు. తోటి పిల్లలు ఆటల్లో నాగను ఏమైనా అనడం వల్ల నాగ ఏడిస్తే నాగకు ఇష్టమైనవి కొనిచ్చి ఊరుకోబెట్టేవాడు. నిద్రొస్తే జోకొట్టి నిద్ర పుచ్చేవాడు. దాంతో సహజంగానే పెద్దబ్బాయితో చనువుగా ఉండేది నాగ.

***** సశేషం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *