April 25, 2024

ఏమైంది. ?????

రచన – శ్రీకాంత గుమ్ములూరి.

బుడిబుడి నడకల బుజ్జి పాపాయి
తడబడు అడుగుల బుల్లి బుజ్జాయి….
ఇల్లంతా …ఒకటే పరుగు …
అడ్డూ ఆపూ లేకుండా…
కాళ్ళకడ్డొచ్చిన వస్తువేదైనా….
చిన్నదైనా…పెద్దదైనా…లెక్కచేయక
వాటిమీద అడుగులు వేస్తూ…
వాటిని తప్పించు కుంటూ…
అతి లాఘవంగా…. ఆనందంగా….
నెలవంక నవ్వుతో….
సిరి వెన్నెల మోముతో…..
తాను చూచినది చేతితో తాకాలని…
దానిని నోట్లో పెట్టుకొని రుచి చూడాలని….
అసలదేమిటో…దాని అంతు చూడాలని!

గోడ మీద గండు చీమ …వడివడి గా పాకుతోంది.
చిట్టి పొట్టి చేతులతో అందుకోను పరుగెడుతూ…
కిందపడ్డా…లెక్క చేయక ….
వెంటపడి … ప్రయత్నం కొనసాగిస్తూ…
ఎట్టకేలకు తన పిడికిలి లో బంధించి
సున్నా లాంటి మూతికి అందించబోయి,
“అమ్మా! చెల్లి చీమ తింటోంది” అన్న
ఆరేళ్ళ అన్న అరుపుకు అదిరిపడి… పాపాయి
బెదురు చూపులతో మూతి బిగించింది!
పిడికిలి సడలి పోయింది….
గండుచీమ తప్పించుకు పారిపోయింది!!

“పోనీలే…అల్మైరా అంచునున్న …స్ట్రా వున్న …
ఎర్ర పూల.. చక్కదనాల లోటా… అందుకుంటా…
రోజూ…అన్న తాగే జూసు… నేనూ తాగి చూస్తా…
అన్న లాగే స్ట్రాతో …పీలుస్తా…”
అనుకున్నదె తడవుగా…అల్మైరా వద్ద కెళ్ళి….
మునిగాళ్ళను ఎత్తి పెట్టి.. కొస వేళ్లతో తాక బోతే…
వేలి అంచు తగిలి లోటా ధడాలున క్రింద పడింది
గిరగిరా తిరుగుతూ… బరబరా దొర్లుతూ!!
“అమ్మో! అన్న అమ్మతో అంటాడుగా…
వాడి లోటా కింద పడేసి…విరిపేసాననీ …”
అంతే….హడిలి పోయి చిట్టి పాప లంకించుకుంది
గాట్టిగా….ఏడుపు……
చక్రాల్లాంటి కళ్ళల్లో మెరిసాయి కన్నీటి తారలు !!
బ్యారుమన్న చెల్లిని చూసి తెల్లబోయాడు అన్న!!

పడింది ముందరి కాళ్ళకు బంధం….
అరవక ముందే పడింది వాడి నోటికి తాళం !!

****************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *