April 22, 2024

గుర్తింపు

రచన: శైలజ విస్సంశెట్టి

పిల్లలు రాసిన ఆన్సర్ షీట్స్ దిద్దటానికి ముందు వేసుకుని కూర్చున్న చరితకి మనసు వాటిపై లగ్నం కావటంలేదు. ఈమధ్య చాలాకాలంగా తన మనసులో సన్నగా రాజుకుంటున్న అసంతృప్తి ఇటీవల కాలంలో వటుడింతై అంతై అన్నట్లుగా పెరిగిపోయి ఏ పనిచేస్తున్నా అదే విషయం తన ఆలోచనలకు కేంద్రబిందువు కావటం చరితకి తెలుస్తూనే ఉంది. చేతిలో పెన్నుక్యాప్ మూసివేసి ప్రక్కకు పడేసి తాను కూర్చున్న హాలునంతా ఒక్కసారి పరికించి చూసింది.

8 సంవత్సరాల క్రితం తమ మామగారు ఆయన స్వంత సంపాదనతో కట్టిన 6 గదుల ఇంటిని తన భర్త, మరిది కలిసి నాలుగు అంతస్థుల భవనంగా మార్చటమే కాక టెర్రేస్ పైన తమ అభిరుచికి, అవసరానికి తగినట్లుగా తాను ట్యూషన్స్ చెప్పుకోవటానికి అనువుగా పెంట్ హౌస్ కట్టించటం తాము ఇప్పుడు ఉంటున్న రెండవ అంతస్థు లోని ప్రతిగదిని తన ఆలోచనలకు ప్రతిరూపంగా, అందంగా మలచుకోవడం అంతా అందమైన కలగా అనిపించింది చరితకు. మామగారు తన కొడుకుల ఎదుగుదల చూసుకోవటానికి ఇప్పుడు లేకపోయినా తమ తోడికోడళ్ళను తన కూతుళ్లుగా భావించి తమకు వెన్నుదన్నుగా నిలిచిన అత్తగారు గుర్తు రాగానే చరితకు కొండంత భరోసాగా అనిపించింది. డిగ్రీ పూర్తికాగానే పెళ్లి అయిన తనను పీజీ చేయటానికి ప్రోత్సహించటమేకాక అప్పుడప్పుడే రూపుదిద్దుకొంటున్న ఆ కాలనీలోని పిల్లలకి ట్యూషన్స్ చెప్పమని అత్తగారు ఇచ్చిన ప్రోత్సాహం చరిత ఎప్పటికి మరువదు.

అలా ఆలోచిస్తూనే సోఫాలో నిద్రలోకి జారుకున్న చరితకి కాలింగ్ బెల్ మ్రోగటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి గడియారంవంక చూసి క్రింది అంతస్తులోని సౌభాగ్య ఆంటీ కాసేపు కాలక్షేపానికి వచ్చే టైం అయింది అనుకుంటూ తలుపు తెరిచి ఆవిడను లోనికి ఆహ్వానించింది. “ఏమిటి చరితా ఈవేళప్పుడు పడుకున్నావు? ఎప్పుడు ఏదోక పని చేస్తూనే ఉంటావు, మీ అత్తగారు మరిది దగ్గరకు వెళ్లేసరికి ఇంటిపని ఎక్కువ అయ్యిందా ఏమిటి?” అంటూ టివికి ఎదురుగా ఉన్న సోఫాలో సెటిలయ్యారు.

“అదేం లేదు ఆంటీ” అంటున్న చరితను పరీక్షగా చూస్తున్న సౌభాగ్యగారు “ఏమిటో చరితా ఈ మధ్యకాలంలో నీలో ఏదో పరధ్యానం కనిపిస్తోంది. ఆరోగ్యం బాగుండటం లేదా! ఒకసారి జనరల్ చెకప్‍కి వెళ్లి రాకూడదు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకమారు చెకప్‍లు చేయించుకోవాలి అంటున్నారు కదా” అని అన్నారు.

తనలోని అంతర్మధనాన్ని ఎవరితో పంచుకోవాలా అని ఆలోచిస్తున్న చరితకు తన మనసులోని మాటను సౌభాగ్యగారితో పంచుకుంటే ఎలా ఉంటుంది అని అనిపించింది ఒక్క క్షణం. నిజానికి రోజువారీ జీవితంలో తనకి వచ్చే చిన్న చిన్న సమస్యలకు ఆవిడ చిటికెలో చూపే పరిష్కారాలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి కదా అనుకున్న చరిత “ఏమిలేదు ఆంటీ ఈ మధ్య తరచుగా నన్ను ఒక కోరిక వేధిస్తోంది మీరు నవ్వనంటే చెపుతాను” అంటూ సంశయంగా ఆగింది చరిత.

“అలా అంటావేంటి చరితా.. మీరు ఈ ఇల్లు కట్టుకున్నపటి నుంచి అద్దెకు ఉంటున్న మాకు మీకు ఎప్పుడైనా పొరపొచ్చాలు కానీ అభిప్రాయం భేదాలు కానీ వచ్చాయా, నిక్షేపంగా నీ సంశయమేమిటో బయటపెట్టు” అన్నారు సౌభాగ్యగారు. “ఏమిలేదు ఆంటీ ఈమధ్యకాలంలో నా ట్యూషన్స్ కు డిమాండ్ పెరిగి చాలా మంది పిల్లలు వస్తూంటటం మీరు చూస్తున్నారు కదా, అలాగే ట్యూషన్స్ పై వచ్చే సంపాదన బాగానే పెరిగింది కానీ వీరేంద్ర, అదే మా ఆయన ఒక్కసారి కూడా ఆ విషయంగా మెచ్చుకోరు, నీకు పని ఎక్కువైంది కదా అనే మాటా అయితే అసలు ఆయన నోటి నుంచి రానే రాదు. అదే నాలో ఒక అసంతృప్తిగా మారి పెరిగి పెద్దదైపోతోంది ఆంటీ నాకు ఈమధ్య. ఆయన నుంచి ఒక్క చిన్న గుర్తింపుకానీ మెప్పు కానీ లేనప్పుడు నేను ఎంత చేసి ఏమి లాభం అనిపిస్తోంది” అంటూ తనకి సౌభాగ్యగారికి టీ పెట్టటానికి వంటింటిలోకి వెళ్ళింది చరిత. టీ కప్పులు, మంచినీళ్లు తెచ్చిన ట్రే టీపాయ్ పెట్టి “తీసుకోండి ఆంటీ, అనవసరంగా మీ బుర్ర కూడా పాడు చేశాను కదా” అంటూ తాను ఒక కప్పు అందుకుంది చరిత.

తాను కూడా టీ కప్పు చేతిలోకి తీసుకున్న సౌభాగ్య గారు – “చూడు చరితా ఏమి అనుకోను అంటే నాకు తోచిన మాటలు నాలుగు చెపుతాను” అని చరితకు అంగీకారమేనా లేదా అన్నట్టు చరిత ముఖం వైపు చూస్తూ ఆగారు సౌభాగ్య గారు. “చెప్పండి ఆంటీ మీరు నాకంటే పెద్దవారు నాకంటే చాలా జీవితాన్ని చూసిన వారు, అందుకే కదా మీతో నా మనస్సులోని మాట పంచుకున్నది” అంది చరిత.

“చరితా నువ్వు ఎప్పుడూ అంటుంటావు కదా ఇప్పుడు నువ్వు నడుపుతున్న ట్యూషన్ సెంటర్ ఈ స్థాయికి రావటం వెనుక వీరేంద్ర సహాయం చాలా ఉంది అని. పెంట్ హౌస్ నీ అవసరాలకు తగినట్లు కట్టించటం దగ్గరనుంచి, పిల్లలకు నీవు పెట్టే పరీక్షలకు పేపర్లు సెట్ చేసిపెట్టటం, వాటి కాపీలు అదే జెరాక్సులు తీయించటం, ఎవరన్నా పిల్లలు హోమ్ వర్క్ చేయటం ఆలస్యం అయితే వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇళ్లకు తీసుకువెళ్లడం మొదలైన పనులు చేస్తాడు వీరేంద్ర అంటుంటావు కదా… రోజూ తన ఆఫీస్‍కు తాను వెళ్లి వస్తూ తన పని తాను చేసుకుంటూ నీ పనిలో అతను అంత సహాయకారిగా ఉంటుంటే అది నువ్వు గుర్తించక అతను నోటితో చెప్పలేదని అసంతృప్తికి లోనవుతున్నావు. నీకు తెలుసు కదా ప్రార్ధించే పెదవులకన్నా సాయపడే చేతులు మిన్న అనే మదర్ థెరిస్సా మాటలు” అంటూ చరిత మొహంలో భావాలు గమనించటానికి ఒక్క నిమిషం ఆగిన సౌభాగ్యగారు ఊపిరి తీసుకుని మళ్ళి ఇలా అన్నారు…

“నీకు తెలియంది ఏముంది చరితా, పెళ్లి కాక ముందే ప్రేమికులు కలుసుకున్నప్పుడు, ఫోన్లల్లో పలకరించుకొనేటపుడు ఐ లవ్ యూ అంటూ చెప్పుకుంటారు. అదే పెళ్లి అయ్యాకా ఇద్దరూ దగ్గరగా ఉండి ఒకరి సమక్షాన్ని ఒకరు అనుభవిస్తూ చేయీ చాచి అందుకునే దూరంలో తనకిష్టమైన వ్యక్తి ఉన్నపుడు తనకు చేతనైన పనులతో సహాయాన్ని సహకారాన్నీ, అందించుకునే ఆ జంట మధ్యన ఐ లవ్ యు అనే మాటలు మాయమైపోతాయి. అంతమాత్రాన వారికి ఒకరిపట్ల ఒకరికి ప్రేమలేదనా? ఒకరు ఇంకొకరిని గుర్తించటం లేదనా? ఇలాంటి చిన్న విషయాలు ఏమి మనసులో పెట్టుకోకు.. ఈరోజు ఇంత పెద్ద ట్యూషన్ సెంటర్ నడుపుతూ నీతోపాటు ఇంకా నలుగురు టీచర్స్‍కు జీవనోపాధి కలిగిస్తున్నవు అంటే దీని వెనుక వీరేంద్ర సహాయ సహకారాలు ఉండబట్టే కదా కొంచం పాజిటివ్‍గా ఆలోచించి చూడు నీకే అర్థం అయిపోతుంది” అంటూ ఆగారు సౌభాగ్యగారు.

ఆవిడ మాటలు విన్న చరిత “నిజమే ఆంటీ మీరు చెప్పింది. ఇంతకు ముందు ఇదే మాట నా స్నేహితులిద్దరి దగ్గర చెపితే మా భర్తలు కూడా ఇంతే. ఈ మగాళ్లంతా ఇంతే అంటూ అనడంతో అదే భావనలో ఉండిపోయాను. నిజంగా ఈరోజు మీరు ఈ సమస్యను విశ్లేషించిన విధం నా మనస్సులోని అసంతృప్తిని పూర్తిగా తుడిచివేసింది. ఏదైనా మనం చూసే విధానం బట్టి ఉంటుంది ఆంటీ” అంటున్న చరిత పెదవులపై సంతృప్తితో కూడిన చిన్నచిరునవ్వు విరియడంతో “మరి నేను వెళ్ళి వస్తా, ఇలానే సంతోషంగా ఉండండి ఎప్పుడూ కూడా” అంటూ లేచారు సౌభాగ్యగారు.

పిల్లలకోసం మరిన్ని కథలను చెప్తున్నారు శైలజగారు.

సహజమైన కథలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *