April 22, 2024

తల్లి మనసు

రచన: నళిని ఎర్ర

పచ్చని మావిడి తోరణాలు కట్టిన గుమ్మంలోకి భర్త చిటికెనవేలు పట్టుకుని అత్తవారింటికి వచ్చిన సావిత్రి గడప లోపలికి అడుగుపెట్ట బోయింది ..
వదినా అన్నయ్య పేరు చెప్పి వెళ్ళు అంటూ వరసకు ఆడపడుచులు అంటుంటే వర్థనమ్మ విసుక్కున్నారు
చాల్లే సంబడం అవన్నీ అవసరమా పదండి లోపలికి అంటూ కసురుకున్నారు..
ఒక్కసారి ఉలికిపడింది సావిత్రి రామారావు చేయి గట్టిగా పట్టుకుని లోపలికి అడుగు పెట్టింది..
ఆరోజు మొదలు సావిత్రి రోజుకు పది సార్లు ఉలికి పడుతూనే ఉంది..
వర్థనమ్మగారి కుటుంబం దొరల కుటుంబం పని వాళ్ళు వీళ్ళని దొర దొరసాని అనే పిలుస్తారు
రామారావు పుట్టిన 4 సంవత్సరాల తరువాత పచ్చ కామెర్లతో వర్థనమ్మ భర్త రుదప్రసాద్ గారు చనిపోయారు..
అది వర్ధనమ్మ గారికి కోలుకోలేని దెబ్బ..
కానీ ఏడుస్తూ కూచుంటే పనులు జరగవని ఇంటి పెత్తనం ఇంటి బాధ్యతలు అన్నీ చేతుల్లోకి తీసుకుని అన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నది..
అంత తెలివిగల ఇల్లాలు కొడుకు విషయంలో మటుకు చాలా బలహీనురాలైన తల్లి ..
భర్తను పోగొట్టుకున్న వర్ధనమ్మ కొడుకుకు దూరంగా ఉండలేదు.. ఎవరినీ కొడుకుకి దగ్గర కానివ్వదు..
ఇంత కొడుకును వదలలేని ఆవిడ రేపు పెళ్ళి చేసి కోడలితో ఎలా ఉండనిస్తుంది .
ఆ కోడలే తనవైపు తిప్పుకుని తల్లికి దూరం చేస్తే ఏంచేస్తుంది అని బంధువుల మాటలతో వర్ధనమ్మలో అభద్రతా భావం నెల కొన్నది
అందుకే కొడుకు కోడలు వలలో పడకుండా విపరీతమైన జాగర్తలు తీసుకుంది.
ప్రతి పనిలో తప్పులు వెతికేది అనవసరంగా నలుగురిలో అవమానించేది..
రామారావు కి పనులు ఏమీ ఉండేవి కావు వెళితే పొలానికి లేదా ఊళ్ళో ఉన్న గ్రంధాలయంలో చదువు కన్నా కబుర్లకోసం వచ్చే వాళ్ళతో కాలక్షేపానికి వెళ్ళడం ..
వర్ధనమ్మగారు కూడా రామారావుకు ఏ పనులు అప్పచెప్పకుండా బాధ్యత తెలీనీకుండా పెంచి పెద్ద చేసింది ..
అందుకే పెళ్ళయ్యాక రామారావుకి సావిత్రి కాలక్షేపం గా మారింది ..
కానీ సావిత్రికి భర్త అలా పని పాట లేకుండా తిరగడం నచ్చేది కాదు..
పొలానికి వెళ్ళమని జమా ఖర్చులు చూడమని చెప్పేది.
మెల్ల మెల్లగా రామారావులో మార్పువచ్చింది పొలానికి ఎరువులు ఏపంట వేయాలి ఏది వేస్తే లాభం ఇవి తెలుసుకుని రైతులకు సలహాలిస్తూ పంట రెండింతలు చేసాడు .
వర్థనమ్మ కొడుకును తన కనుసన్నలనుండి దూరం కానివ్వలేదు.
కాల గమనంలో సావిత్రి కూడా కొడుకుకు జన్మనిచ్చింది.
కూతుర్ని కంటే ఊరుకోను అని బెదిరించిన అత్తగారిని చూసి విస్తుపోయింది
హమ్మయ్య కొడుకే అని ఆనంద పడుతున్న అత్తగారిని చూసి నవ్వుకుంది..
కానీ సావిత్రికి అప్పుడు తెలీదు తన కొడుకు తనకు దూరం అవుతాడని..
తాతయ్య పేరు రుద్ర ప్రసాద్ అని నామకరణం చేసారు.
వర్ధనమ్మ పని కట్టుకుని మనవడిని సావిత్రికి దూరం చేయడం మొదలు పెట్టింది.
భర్త పేరు భర్త పోలికలున్న రుద్రను చూసి మురిసి పోయింది మా బాబు దొరబాబు అంటూ రుద్రను కాలు కింద పెట్టనివ్వకుండా గారాబం చేస్తూ 5 సంవత్సరాలు నిండుతున్నా స్కూల్లో వేయక పోవడం చూసి సావిత్రి రామారావుని నిలదీసింది .
రామారావు తల్లిని ఒప్పించి బడిలో చేర్పించాడు..
చేరడమయితే చేరాడు కానీ చదువు అబ్బటంలేదు
పైగా పెద్దవుతున్న కొద్దీ బామ్మ ఇచ్చే డబ్బులు స్వేచ్ఛ స్నేహితులతో బలాదూర్ గా తిరగాడానికి ఉపయోగ పడుతున్నాయి..
ఇలాకాదని రామారావు హైదరాబాదు తీసుకుని వెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించాడు ..

కాలం ఎవరికోసం ఆగదు మనవడి మీద బెంగతో వర్థనమ్మ కన్ను మూసింది.
అంతే వెంటనే సావిత్రి కొడుకు విషయంలో జాగ్రత్త పడడం మొదలు పెట్టింది..
స్కూల్ నుండి ఇంటర్మీడియట్ కి వచ్చాడు రుద్ర ప్రైవేట్ హాస్టల్ లో చేర్పించారు..
దాంతో స్నేహితులతో స్వేచ్చగా తిరిగే అవకాశం దొరికింది..
రామారావు ఆరోజు హైదరాబాదు వెళుతుంటే ముందే చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో కొడుకు చేతికి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వ కూడదని ..
రుద్ర ఎంత గింజుకున్నా నామ మాత్రంగా డబ్బులిచ్చి వచ్చేవాడు రామారావు.. .
దాంతో రుద్ర స్నేహితులు రావడం తగ్గించారు.. అది భరించలేని రుద్ర అప్పులు చేసి అప్పుల వాళ్ళను ఇంటి మీదకు పంపించడం మొదలు పెట్టాడు .
ఇక లాభం లేదని రామారావు నువ్వేం చేసినా నేను డబ్బివ్వలేను ఆస్తి అమ్మ పేరు మీద ఉంది అనగానే తండ్రిని తిట్టడం మొదలు పెట్టాడు ..
దాంతో ఇంక తల్లి మీద ద్వేషం పెంచుకున్నాడు..
సావిత్రి కాస్తా సావిత్రమ్మ అయ్యింది
ఎలాగో అలా కష్టపడి డిగ్రీ సంపాదించిన కొడుకు
పెళ్ళి చేస్తే బాగు పడతాడేమో అనుకుని పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెడితే చేసుకోనని మొండికేసాడు..
సావిత్రి ఎంత ప్రయత్నం చేసినా చేసుకోలేదు చివరకు రామారావు గారి బాబాయ్ మనవరాలు గిరిజ బావను నేను చేసుకుంటానంటే పెళ్ళి జరిపించారు..
హైదరాబాదు లోనే కాపురం ఉంటామన్న కొడుకుకు నామ మాత్రంగా డబ్బులిచ్చి ఇంటి నిర్వహణ బాధ్యతను కోడలికి అప్పగించారు.
డబ్బు కోసం గిరిజను సతాయించడం మొదలు పెట్టాడు . ఒకటి రెండు సార్లు ఇచ్చిన గిరిజ ఆ డబ్బు గుఱ్ఱప్పందాలకు ఖర్చు పెట్టడం చూసి భరించలేక పోయింది
ఇక ఇవ్వడం మానేసింది.
దాంతో రెచ్చి పోయిన రుద్ర ఇంటికి రావడం మానేసి స్నేహితులతో ఉండడం మొదలు పెట్టాడు..
ఒకటి రెండు సార్లు పందెం గెలిచిన రుద్ర ఆ మత్తులో పడిపోయాడు.
అప్పుచేసి మరీ ఆడడం మొదలు పెట్టాడు కానీ ప్రతిసారీ ఓడి పోయాడు..
అప్పులు తలకు మించిన భారమయ్యాయి.
అదే సమయంలో ఊర్లో కరణం గారి మనవరాలు పెళ్ళి అని గిరిజ ఊరెళ్ళింది.
అంతే రుద్రకు విచిత్రమైన క్రూరమైన ఆలోచన తట్టింది
తన స్నేహితులతో కలిసి పెళ్ళికి వెళ్ళి అక్కడ తల్లిని నిలదీస్తే పరువు కోసం డబ్బులిస్తుందనే పన్నాగంతో ఊరికి బయలుదేరాడు..
తన స్నేహితులను పెళ్ళి పందిట్లో దింపి ఇంటివైపు వెళ్ళాడు అమ్మ నాన్న ఇంట్లో లేరని రూఢీ చేసుకుని పందిట్లో పరువు తీయాలని పరగున కల్యాణ మంటపం చేరుకున్నాడు
పెళ్ళి జరుగుతున్న హాలులోకి అడుగుపెట్టిన రుద్ర, తన స్నేహితుల కోసం అటూ ఇటూ చూస్తూ ముందుకు కదులుతున్నాడు.
తండ్రిని చూసి ఆగాడు మా స్నేహితులు వచ్చారు వాళ్ళకు మొత్తం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి మీరివ్వక పోతే వాళ్ళు ఇక్కడి నుండి కదలరు అని చెప్పాడు
ఇప్పుడంత డబ్బు ఇక్కడికి తేముకదా ఎలా ఇస్తాం అన్న తండ్రితో అమ్మను పిలవండి ఇంటికొచ్చి ఇవ్వ మనండి అన్నాడు
అదుగో గిరిజ … గిరిజకు చెప్పు అన్నాడు తండ్రి..
గిరిజ అత్తగారి దగ్గరకు వెళ్ళి నట్టే వెళ్ళి రుద్ర దగ్గరకు వచ్చి అత్తయ్య రానన్నారు డబ్బు కూడా ఇవ్వనన్నారు ఏంచేసుకున్నా ఫరవాలేదు అని చెప్ప మన్నారు అని చెప్పింది..
దాంతో రెచ్చి పోయిన రుద్ర విసురుగా అడుగులు ముందుకు వేసాడు ..
ఎవరో భుజం పట్టి ఆపటంతో అటు చూసాడు. అక్కడ దూరపు బంధువు పరమేశ్వరం, రుద్రకు వరుసకు మామయ్య అవుతాడు.
“ఏమోయ్ రుద్రా! చాలా కాలం అయ్యింది నిన్ను చూసి. నేను గుర్తున్నానా? మా చెల్లి, మీ అమ్మ ..సావిత్రమ్మ ఎలా ఉంది?” అన్నాడు.
“చచ్చిపోయింది. ” మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి కదిలాడు నలభయ్యేళ్ళ రుద్ర.
అక్కడికి దగ్గరలో మంది మధ్యలో కూర్చున్న “సావిత్రమ్మ”… ఆ మాట వినగానే తలవంచుకుంది.
పచ్చని మేని ఛాయలో, ఆకు పచ్చని పట్టు చీరలో, పెద్ద బొట్టుపెట్టుకొని లక్ష్మీ కళతో చూడగానే… చేతులెత్తి నమస్కరించాలని పించేలా ఉన్న అరవయ్యేళ్ళ సావిత్రమ్మ మనసు విలవిల లాడింది.
తల వంచి కూర్చొన్న ఆమె కంటి నుండి వెచ్చని కన్నీటి బొట్లు ఆమె ఒడిలో రాలి పడ్డాయి .
పరమేశ్వరరావుగారు అయోమయానికి లోనయ్యాడు. ఎంత దూరబ్బంధువైనా తన చెల్లి చనిపోతే తనకు తెలియకుండా ఉంటుందా అని ఆశ్చర్య పోయాడు .
అదేంట్రా అన్నాడు ..అదంతే అని బయటకు కదిలాడు.. రుద్ర
మెల్లగా సావిత్రమ్మ దగ్గరకు వచ్చిన పరమేశ్వరాన్ని చూసి సావిత్రమ్మ నవ్వింది..
ఆ నవ్వు వెనక విషాదంతో పాటు అగాధం కూడా ఉంది..
కానీ రుద్రకు తెలియని విషయం ఒకటే..
రుద్ర స్నేహితులతో కలిసి వస్తున్న విషయం గిరిజ ద్వారా తెలుసుకున్న రామారావు సావిత్రమ్మలు డబ్బులతో ముందుగానే వచ్చారు..
రుద్ర ఇంటికి వెళ్ళిన సమయంలో రుద్ర స్నేహితులకు డబ్బులిచ్చి దయచేసి మా అబ్బాయికి తిరిగి అప్పుగా డబ్బులివ్వకండి.
మీరివ్వక పోతే మా వాడు వ్యసనం మానేసి తన సంసారం నిలబెట్టు కుంటాడు.. అని ప్రాధేయపడ్డారు…
అసలు విషయం తెలియని రుద్ర తల్లిని ద్వేషిస్తున్నాడు…
తన అప్పు తీర్చలేక వారిని మళ్ళీ అడగలేక ఆకోపం నిస్సహాయత తల్లి పై ద్వేషంగా మారింది
కానీ కొడుకు వ్యసనానికి దూరమవడం చూసి సావిత్రమ్మ సంతోష పడింది…
తల్లికి అంతకంటే కావలసినదేముంది
తాను కరిగి పోతూ పిల్లలకు వెలుగు నిస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *