April 16, 2024

ప్రపోజ్…

రచన: మణి గోవిందరాజుల—

“ఛీ! నా జీవితం” అప్పటికి వందోసారి తిట్టుకున్నాడు విశాల్. తనని ఆ పరిస్థితుల్లోకి నెట్టిన ఫ్రెండ్ మీద పిచ్చి కోపం వచ్చింది.
“యేమయిందిరా?” కొడుక్కి టీ ఇస్తూ అడిగింది వాళ్ళమ్మ భారతి.
“ఈ కక్కుర్తి గాడేమి చేసాడో తెలుసా?”
“వాడేమి చేసాడ్రా?మళ్ళీ పెళ్ళి కుదిరింది కదా?”
“ఆ! మళ్ళీ మళ్ళీ కుదిరింది”
“మళ్ళీ మళ్లీ కుదరడమేంట్రా? ఆ మధ్య ఒకటి చెడిపోయింది కదా? అప్పుడూ ఇంటి కొచ్చినప్పుడు చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి కుదిరింది.ఈ అమ్మాయి తో చాలా బాగా సెట్ అయింది అని కూడా చెప్పాడు.”
“అవును బానే సెట్ అయింది. మేమందరమూ కూడా ఊపిరి పీల్చుకున్నాము హమ్మయ్య అనుకునే లోగానే అది కూడా బెడిసింది.
“అవునా అలా యెలా? పాపం వాడికి పెళ్ళెలా అవుతుందిరా?”
“యెలా అవడమేమిటి? మూడోది కుదిరింది. మొన్న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది”
“పోనీలే పాపం ఎలానో అలా పెళ్ళి చేసుకుంటున్నాడు సంతోష పడింది భారతి.
“పాపం వాడు కాదు నేను” కోపంగా అన్నాడు విశాల్.
“అదేంరా పాపం?అంతమాట అనేసావు?”
“అమ్మా! ఇప్పుడు వాడు ప్రపోజ్ చేస్తాడట?”
“అదేంట్రా?నాలుగో అమ్మాయా?” తెల్లబోయింది భారతి.
“కాదు మూడొ అమ్మాయికే”
“మూడో అమ్మాయికి ఎలా చేస్తాడు? ఎంగేజ్మెంట్ అయిందంటున్నవు కదా? తాంబూలాలు తీసుకున్నాక కూడా ప్రపోజ్ చేస్తారా?”
“ప్రపోజ్ చేయించుకోవడమంటే ఆ అమ్మాయికి ఇష్టమట అందుకని”
“పోన్లేరా! మంచిపనే చేస్తున్నాడు కదా? పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని సంతోషపెడ్తున్నాడు. మంచిపిల్లాడు” మెచ్చుకుంది మనఃస్ఫూర్తిగా.
“మంచిదే! కాని న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో ప్రపోజ్ చేస్తాడట”
“ఎంత రోమాంటిక్ ఫెలో రా బడుద్దాయ్..” మళ్లీ మెచ్చుకుంది.
“అవును! రొమాంటికే! ఇప్పుడు వాడి రొమాన్స్ చూట్టానికి మేము న్యూయార్క్ వెళ్ళాలట”
మళ్ళీ కోపం వచ్చింది విశాల్ కి.
“పోనీలేరా! పాపం.రెండు సార్లు పెళ్ళాగిపోయింది పిచ్చి వెధవకి. ముచ్చటగా మూడోసారి అన్నీ కుదిరి చేసుకుంటున్నాడు. కాస్త వెళ్ళొస్తే పోలా?” ఏదో అమలాపురం నుండి వైజాగ్ వెళ్ళిరా అన్నంత తేలికగా చెప్పింది.
తల్లి అమాయకత్వానికి కోపం పోయి నవ్వొచ్చింది విశాల్ కి. ఇంతలో మొబైల్ రింగ్ అయింది. యెవరా అని చూస్తే డాలస్ నుండి కార్తిగాడు. ఫోన్ ఆన్ చేసి స్పీకర్ లో పెట్టాడు విశాల్.
“ఏరా! నీకు ఫోన్ వచ్చిందా వాడి దగ్గర్నుండి?” ఆన్ చేయగానే అవతల నుండి అడిగాడు.
కార్తీ.
“అవున్రా! నీక్కూడా వచ్చిందా?”
“నాక్కూడా ఏంటి?మనవాళ్ళు స్వాతి, వినయ్, అజయ్ అందరినీ ఆహ్వానించాడ్రా?” ఏడుపు గొంతుతో చెప్పాడు కార్తి.
“ఎందుకురా ఏడుస్తున్నావు?” జాలిగా అడిగాడు విశాల్.
“లేకపోతే ఏంట్రా? మనల్నందరినీ న్యూయార్క్ రమ్మంటున్నాడ్రా…ఎలా వెళ్తాం రా? పోనీలే వెళదామంటే వర్కింగ్ డేస్”
“వర్కింగ్ డేస్ కాకపోతే వెళ్దామనే?” ఆశ్చర్యంగా అడిగాడు విశాల్.
“ఛాయిస్ ఉందారా? నీకైనా నాకైనా?” దీనంగా అడిగాడు కార్తి.
“ఊ!….” తను కూడా దీనంగా మొహం పెట్టాడు విశాల్.
వీళ్ళీద్దరి సంభాషణ వింటున్న భారతికి ఏమి అర్థం కాలేదు. “ఎందుకురా అంత ఏడుస్తున్నారు ఇద్దరూ?” భారతి ప్రశ్నకు ఇద్దరూ ఒకేసారి ఫక్కున నవ్వేసారు.
“అమ్మా! వాడి సంగతి తెలిస్తే నువ్విలా మాట్లాడవు. నీకెంతసేపటికి మేము వాడి గురించిన ఫీడ్ బ్యాక్ మంచిగా ఇచ్చాము కాబట్టి నీకు వాడు మంచివాడనే తెలుసు. కాని వాడి అసలు రూపం ఇంకోరకం” నవ్వాడు కార్తి.
భారతికి ఏమీ అర్థం కాలేదు. “కాస్త అర్థం అయ్యేట్లు చెప్పండ్రా!” విసుక్కుంది.
“అమ్మా! వాడు స్వాతిముత్యం లో కమలహాసన్ లాంటివాడు వాడి పని చేయించుకోవాలంటే. ఇక మనకు ఛాయిస్ ఉందదు వాడేదన్నా అడిగాడంటే. వాడి పని అయ్యిందాకా అలా వెంటపడుతూనే ఉంటాడు. ఆ నస తట్టుకోలేక అడిగింది చేస్తే పోలా అనుకుంటాము.అదే మనమేదన్నా అడిగామనుకోమ్మా చాలా క్యాజువల్ గా చెప్పేస్తాడు కుదరదని. కుదరక పోవటానికి వాడు చెప్పే రీజన్ కూడా మనం కాదనలేని రీతిలో ఉంటుంది. అందుకే వాడేదన్నా అడుగుతే అందరం కిందా మీదా పడుతుంటాము ఎలా కాదనాలా అని. కాని కుదరదు.కనీసం మేమడిగింది వాడితో చేయిద్దామన్నా కుదరదు వి ఆర్ హెల్ప్ లెస్” చెప్పాడు విశాల్.
“అవునాంటీ! ఒకసారేమయిందో తెలుసా?అప్పుడు మేమందరమూ యూనివర్శిటీ లోనే ఉన్నాము.ఇంకా ఎవరికీ జాబ్ రాలేదు. అప్పుడు….
ముగ్గురి కళ్లముందరా రింగులు తిరగసాగాయి.
ఇందాకటి నుండి వీళ్ళు వాడు అంటున్న అప్పిగాడు అలియాస్ అప్పల నారాయణ అటు ఇటూ హడావుడిగా తిరుగుతున్నాడు. స్వాతి,వినయ్,విశాల్,కార్తి,శాలినీలు దడ దడ లాడుతున్నారు..ఇప్పుడేమి అడుగుతాడో ఏంటో అని అందరూ పీచు పీచు మంటున్న గుండెల్ని అరచేతిలో పట్టుకుని కూర్చున్నారు. పోనీ అక్కడ్నుండి పారిపోదామా అంటే కొద్దిగా కదలడం ఆలస్యం కాళ్లా వేళ్ళాపడి ఆపుతున్నాడు.
“అరేయ్! మీరే నన్ను ఆదుకోవాలిరా..” ఫైనల్ గా వాడి నోట్లోంచి మాట వచ్చింది.
“బాబోయ్ మా దగ్గర డబ్బులేమీ లేవురా” అందరూ ఒకేసారి అన్నారు.
“యెహె! డబ్బు సమస్య కాదు. నా దగ్గరే ఉన్నాయి” అంటూ నోట్ల బొత్తి చూపించాడు.
“హమ్మయ్య!” అందరూ మూకుమ్మడిగా ఊపిరి పీల్చుకున్నారు. “మరేంట్రా?”
“నాకు పెళ్ళి కుదిరింది”
“వావ్! కంగ్రాట్స్.చెప్పవేమిరా? పార్టీ ఇవ్వల్సిందే?” వాడితో పార్టీ ఇప్పించుకునే ఛాన్స్ వచ్చిందనే సంతోషం తో అందరూ కంగాళీగా అడిగేసారు.
“తప్పకుండారా. కాని ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ అమ్మాయి ఆస్టిన్ లో ఉంటుంది. ఇక్కడికి వస్తానంది రేపు సండే. నాకా డ్రైవింగ్ రాదు. కాని మీరంతా వచ్చి తీసుకొస్తారని నేను మాట ఇచ్చేసాను. వినయ్, విశాల్,కార్తిగాడు నేను మనందరం ఆదివారం పొద్దున్నే నాలుగింటికల్లా బయలుదేరుదాము. మళ్ళీ పదింటికల్లా ఇక్కడికి రావచ్చు. ఈలోపు స్వాతి, శాలినీలు ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటారు”
“ఏర్పాట్లంటే?” అడిగింది శాలిని.
“ఆ అమ్మాయి ముందు రోజు వండిన అన్నం తినదట. ఇక్కడ అమేరికా లో అందరూ చద్దన్నాలు తింటారు యాక్.. అంది. అందుకని అదేరోజు వంట ఏర్పాట్లు అన్నమాట” చాలా హాయిగా అన్ని పనులూ అందరికీ అప్పచెపుతున్న అప్పిగాడి వంక వెర్రి చూపులేసుకుని చూస్తుండగా సన్నగా వెక్కిళ్ళు వినపడ్డాయి.
అవి వినయ్ గొంతులోంచి తన్నుకోనొస్తున్నాయి. “అరేయ్ మనకే ఎందుకిలా జరుగుతున్నదిరా? మనమేమి పాపం చేసామని భగవంతుడు ఇలా శిక్షిస్తున్నాడు? ఆ దేవుడికసలు దయ అన్నదే లేదా?”
“మేమేమన్న వంటలోళ్ళమనుకుంటివా? సమస్యే లేదు. కావాలంటే హోటల్కి తోల్కపో” అరిచింది శాలిని.
“అవును నీకేమన్న మేము డ్రైవర్లమా? మేమూ రాము. మస్తు పైసలున్నయ్ కదా? టాక్సి మాట్లాడుకో” అదిగో అప్పుడు మొదలయ్యింది టార్చర్.
“అరేయ్ నాకిప్పుడు ముప్పై రెండు ఏళ్ళు. కుదరక కుదరక కుదిరింది. ఇదిపోతే ఇక జన్మలో నాకు పెళ్ళి కాదు. అప్పుడు ఆ దోష మంతా మీదే అవుతుంది. అయినా మన స్నేహం గురించీ మీ మంచితనం గురించీ మా పెళ్ళి మాటలకంటే ఎక్కువ చెప్పాను. ఇప్పుడు మీరు రాకపోతే నన్నొక అబద్దాలకోరనుకుంటుంది. ఎలాగో ఒకలాగ ఆ మూడు ముళ్ళూ పడితే ఆ తర్వాత పుట్తే పిల్లలకు మీ పేర్లే పెట్టుకుంటాను. ఒప్పుకోండిరా… ప్లీజ్ రా…” ఇక ఏడుపొక్కటే తక్కువగా బతిమాలడం మొదలుపెట్టి సరిగా అన్నం కూడా తిననివ్వలేదు అందరూ ఒప్పుకునేదాకా.
ఇంతా చేసి అంత దూరం వెళ్ళొస్తే ఆ పెళ్ళికూతురు వీడితో వేవ్ లెంత్ కుదరలేదని చేసుకోను పొమ్మంది. ఫినిషింగ్ టచ్ ఏంటంటే రిటర్న్ లో కారు చెడిపోతే అయిన రిపేర్లకు అందరూ వాటాలేసుకోవాల్సిందే నని మా అందరితో డబ్బులు కట్టించాడు కక్కుర్తిగాడు. ఆఖరికి డీజిల్ కూడా మాతోనే నింపించాడు” అక్కసుగా అంటూ ముగించాడు కార్తి.
“ఆ తర్వాత రెండో పెళ్ళి చూపులకి కూడా మా తోనే ఖర్చు పెట్టించి డాలస్ అంతా ఆ అమ్మయినేసుకుని తిప్పాడు. రెండురోజులు తిరిగి వీణ్ణి తట్టుకోలేక వదిలేసి పారిపోయిందా అమ్మాయి. ఇది ముచ్చటగా మూడోది”
పగలబడి నవ్వసాగింది భారతి. “మరి ఇప్పుడేంటటా?” నవ్వుతూనే అడిగింది.
“ఇప్పుడేంటంటే … న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో వాడికంటే ముందే మేమెళ్ళి ఒక అరకిలో మీటరు పూలు పరవాలట. తిక్క నా కొడుగ్గాకపోతే సెంట్రల్ పార్క్ లో పూలు పరవడమేంటి? అయిందా ఆ తర్వాత వాడు ఆ అమ్మాయి ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే మేము తెలీని వాళ్ళలా వాళ్లదగ్గరకెళ్ళి “వాటె బ్యూటిఫుల్ కపుల్?!! అని మాలో మేము మెచ్చుకుని ఎదో హైటెక్ బిచ్చగాళ్లలా ఒక ఫొటో తీసుకుంటామని అడగాలిట. మళ్లీ ఆ ఫొటో చూస్తూ మళ్లీ మెచ్చుకోవాలిట. అప్పుడు మేమంతా చూస్తుండగా వాడు ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడట. అప్పుడు మళ్ళీ మేము వాటె రొమాంటిక్ అయిడియా అని వాళ్లను పొగడాలట. అసలు ఎంగేజ్ మెంట్ అయ్యాక ప్రపోజలే ఒక వింత అనుకుంటే వీడింకా రొమాంటిక్ అనుకుంటూ ఆ అమ్మాయిని నవంబర్ నెల చలిలో పొట్టి డ్రెస్ వేసుకు రమ్మన్నాడట. ఇక ఈసారి ఫినిషింగ్ టచ్ ఏంటంటే వాళ్లను లంచ్ కి ఇన్వైట్ చేయాలిట. అక్కడ కూడా లంచ్ ఖర్చు మాతోనే పెట్టించాలని.కక్కుర్తిగాడు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు.” చిరాగ్గా అన్నాడు విశాల్.
“అయ్యో! మీకెన్ని కష్టాలొచ్చాయిరా పాపం. ఇప్పుడు వాడి కాంటాక్టులన్ని మీ ఫోన్ లతోనే కదా? స్విచ్చాఫ్ చేసేయండి”
“ఎంత కాలమని చేస్తాము? దొంగ వెధవ కాచుక్కూర్చుంటాడు”
“పోని వస్తామని చెప్పి వెళ్ళకండి”
“అమ్మో! అదింకో రకం టార్చర్. కనీసం ఒక నెల రోజులు తింటాడు బుర్ర. అది కూడా అయింది”
కొద్దిసేపు ముగ్గురూ నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించారు. సడన్ గా భారతి నా కొక అయిడియా వచ్చింది అని అరిచింది.
వెంటనే ఇద్దరూ ఆసక్తిగా చూసారు.
“ఎలాగూ రెండు పెళ్ళిల్లూ మీరు హెల్ప్ చేసినా సరే చెడిపోయాయి కాబట్టి మేము వస్తే నీకు మంచి జరగటం లేదు. పెళ్ళి చెడిపోతున్నది. ఈసారి అలా అవడం మాకిష్టం లేదు. అందుకని మేము రాము అని చెప్పండి. మూఢనమ్మకాని పడిపోని వాళ్ళుండరు”ధీమాగా చెప్పింది భారతి.
“అమ్మా! నువ్వు కేక!” సూపర్గా మెచ్చుకున్నారిద్దరూ. వెంటనే మిత్ర బృందానికి ఫోన్ చేసి చెప్పగానే వాళ్లందరూ కూడా చాలా ఎక్జైట్ అయ్యారు. ఇన్నాళ్ళకి కాదనడానికి ఒక కారణం దొరికిందని పొంగిపోయారు.
వెంటనే అందరూ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుని అప్పిగాడికి ఫోన్ చేసారు.
“అరే అప్పిగా! నేనొకటి చెప్తా వింటావా?మేమందరమూ కూడా న్యూయార్క్ బయలు దేరుతున్నాము. అయితే ఒక సమస్య వచ్చిందిరా. మొదటి రెండు పెళ్ళిళ్ళకి మేము రావడం వల్లే నీకు కలిసి రాలేదేమో నని ఇప్పుడు మాకనిపించిందిరా. ఇప్పుడు ఆల్ రెడీ నీకు ముప్పయ్యారేళ్ళు దాటుతున్నాయి. ఈ పెళ్ళి కూడా తప్పిపోతే మళ్లీ నీకు కుదిరేటప్పటికి ముసలాడివవుతావేమో. అందుకే మాకెంత రావాలని ఉన్నా ఈసారికి రావొద్దని నీ మంచి కోరి నిర్ణయించుకున్నామురా. ఆల్ ద బెస్ట్” లోలోపల నవ్వుకుంటూ గొంతులో జ్వాలిని ధ్వనింప చేస్తూ చెప్పాడు విశాల్.
కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు అప్పిగాడు. ఒక పది సెకన్ ల తర్వాత “ఆ! ఏముందిరా?ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలా?ఏ యుగం లో ఉన్నాము మనం?నా కలాంటి ఛాదస్తాలు ఏమీ లేవు. హాయిగా వచ్చి ఎంజాయ్ చేయండి” అని నాలుక చప్పరించి అటు ఫోన్ పెట్టేయడమూ, ఇటు ఫోన్ల దగ్గరున్న అందరూ ఢామ్మని కింద పడ్డమూ ఒక్కసారే జరిగాయి…..

2 thoughts on “ప్రపోజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *