March 30, 2023

యాత్రా మాలిక – నేపాల్ యాత్రా విశేషాలు

రచన: చెంగల్వల కామేశ్వరి


అందరికీ నేపాల్ యాత్ర అనగానే గుర్తొచ్చేవి. పశుపతినాథ్, ముక్తినాథ్, మణి మహేష్ హిమాలయాలు ట్రెక్కింగ్ మౌంట్ కైలాష్ ఇంకా ముందుకెడితే మానససరోవరయాత్ర ఇలా ఎన్నో ప్రదేశాలు గుర్తొస్తాయి.కానీ అన్నీ తలొక మూలా ఉంటాయి.
నేపాల్ వెళ్లాలంటే ముందుగా గోరక్ పూర్ కాని పాట్నా కాని రైలులోనో, విమానంలోనో, వెళ్లి అక్కడినుండి పోఖ్రా విమానంలో కాని, రోడ్ మార్గాన కాని వెళ్లొచ్చు. ఖాట్మండ్, లుంబిని, చిట్వాన్, మనోకామన, అన్నీ రోడ్ మార్గానా ప్రయాణం చేయొచ్చు. కాని ముక్తినాథ్ వెళ్లాలంటే రోడ్ మార్గాన జీప్ లలో కాని, బస్ లలో కాని వెళ్లొచ్చు లేదా విమానాలలో జామ్సమ్ దాకా వెళ్లొచ్చు. కాని అ ప్రయాణం మాత్రం మన అదృష్టాలని బట్టి, వాతావరణాల మీద కాని ఆధారపడుతుంది అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
విమానంలో టికెట్స్ బుక్ చేసుకున్నా వాతావరణం బాగోక మూడేసి రోజులు పడిగాపు కాసి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ దర్శనం చేసుకుని వెళ్లినవారున్నారు. నిరాశ చెంది దర్శనం చేసుకోకుండా తిరుగు ప్రయాణమైన వారున్నారు.
రోడ్ మీద నిత్యం స్రవించే అనేక జలపాతాల వలన ఏ క్షణాన కొండ చరియలు విరిగిపడతాయో ఎవరికీ తెలియదు. అవి పడితే రోడ్ ప్రయాణాలు అపేస్తారు.ఉన్నట్టుండి జడివానలు కురిస్తే ఆకాశం నిర్మలంగా లేకుంటే విమానాలు వెళ్లవు. ఇవన్నీ తెలిసీ ముందు జాగ్రత్తగా గూగులమ్మని అడిగితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు మంచిది నేపాల్ యాత్రకు అంది. సెప్టెంబర్ మంచిది ! ఎందుకంటే పెళ్లి ముహూర్తాలుండవు. అక్టోబర్ దేవీ నవరాత్రులు పండుగలు. నవంబర్ కార్తీకమాసం హడావిడులు అనుకున్నాను.
సరే అని సెప్టెంబర్ నెల మధ్యలో, ప్రయాణానికి ఆనందాది యోగం, ట్రైన్ సౌలభ్యం అన్నీ చూసుకుని సెప్టెంబర్ పదమూడో తారీకు ఉదయం ట్రైన్ లో బయల్దేరేలా మా నేపాల్ యాత్రకు శ్రీకారం చుట్టాను. ఒక్క పశుపతినాథే కాదు.ముక్తినాథ్ కూడా చేర్చండి అని అందరూ అడగటంతో కాస్త దూరమే అయినా, మరో రెండురోజుల యాత్ర పెరిగినా సరే తద్వారా ఖర్చు పెరిగినా వాకే అనుకుని పదిరోజులు తొమ్మిదిరాత్రుల యాత్రను ప్రకటించేసాను. అనుకోవడమే తరవాయి.అతి త్వరగానే నాతో కలిపి ముప్పయి ఆరుమంది యాత్రకు రెడీ అనుకున్నాము. అందరికీ ఉన్నంతవరకు సెకండ్ ఏసి అయిపోతే థర్డ్ ఏసీ టికెట్స్ బుక్ చేసాను.
ఒక ఆరుగురు గోరక్ పూర్ కూడా విమానంలోనే రానూ పోనూ అనుకున్నారు. సరే అని మిగతావారందరికి యుధ్దప్రాతిపదిక మీద ఏసి టికెట్స్ బుక్ చేసేసాను.ఇంక ప్రయాణం రోజు కోసం ఎదురు చూస్తూ రెండవ తారీకున వినాయక చవితి పండుగ చేసేసుకున్నాము.
పండుగ అయ్యాక నాకు హడావిడి మొదలయ్యింది. జర్నీ డేస్ తో కలిపి మొత్తం పన్నెండు రోజులు వాళ్ల ఫుడ్, వసతి, ప్రయాణం విషయాలలో సకల సదుపాయాలు కలగ చేస్తానని అందరికీ చెప్పాను కదా! ట్రైన్ టికెట్స్, ఫుడ్, నా బాద్యత ప్రయాణం వసతి మా ఆర్గనైజర్స్ బాద్యత! ఏ టూర్ కయినా. ఇంతమందికి ఫుడ్ వండాలన్నా, వడ్డించాలన్నా సమయం ఎక్కువే పడుతుంది. ఇంక వాటికి కావలసిన సరంజామా స్థలం అన్నీ ఏర్పర్చటం, వంట క్వాలిటీగా ఉండాలంటే వాళ్ల వెనక ఎవరైనా ఉండాల్సిందే!
వాళ్లొండేసి వస్తు నాశనం పట్టించి టేస్ట్ కుదరకపోతే “ఎందుకండీ ఈ టైమ్ వేస్ట్ ఏదో ఒకటి తినేవాళ్లం కదా! ఫుడ్ కోసం టైమ్ వేస్ట్ చేస్తున్నారు.! అనే ఎవరో ఒకరిద్దరు మొదలెట్టే భాషణలు వినడం, మిగతావారు వంత పాడటం, (తినేని తింటూ బాగుందని అంటూనే ఇలా అనడం ఒక టూర్ లేక అనుభవం) మనం అవస్థలు పడటం దేనికి? అనుకుని నాలుగు టూర్లనుండి వంటవాళ్లను హెల్పర్లను ఆపేసాను.
టిపిన్ మేము స్టే చేసిన హొటల్స్ లోనే కాంప్లిమెంటరీ గా అయిపోతుంది.
ఏ హొటల్ లో అయినా రెండుకూరలు సాంబార్ పెరుగు రైస్ వస్తాయి. పచ్చళ్లు పొళ్లు, నెయ్యివంటివి, సాయంకాలం టీ కి ముందు తినడానికి స్నాక్స్ మా స్వగృహ ఫుడ్ అతనికి ఆర్డర్ ఇస్తే, ఏడువారాల నగలు లాగా మొత్తం పన్నెండురోజులకి పన్నెండు రకాల స్వీట్స్, హాట్స్ ట్విన్ ప్యాక్ లు చేసి ఒక్కో రకం నలభై లెక్కన సమయానికి అందించేస్తాడు.
కాకపోతే పన్నెండు రకాల పచ్చళ్లు ఒక పన్నెండు కేజీలు, సుమారు పాతిక కిలోల బరువుండే ఈ స్నాక్స్ వెరసి ముప్పయివేడు కిలోల బరవు ఎగస్ట్రా పట్టుకెళ్లకపోతే కుదరదంతే! నా లగేజి కాకుండా మరో రెండు బ్యాగ్ లు తప్పవు. కాకపోతే చిన్న బెనిఫిట్ ఏమిటంటే నేను ఏదయినా షాపింగ్ చేసుకున్నా, ఖాళీ అయిపోయిన బ్యాగ్ లు బాగా ఉపకరిస్తాయి.
ఈసారి కొన్ని పచ్చళ్లు జంధ్యాల పచ్చళ్ల ముకుంద్ గారికి ఆర్డరిచ్చి మిగతావి నేను చేసినవే ! అవి తెచ్చినందుకు మాతో వచ్చినవారందరూ హేపీయే! లేకపోతే ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండు రోజులు సుమారు నలభైమందిని మెయింటెయిన్ చేయాలంటే నలుగురు ఆడపిల్లల పెళ్లి చేసినట్లే!
ఇలా ప్రయాణపు ఏర్పాట్లు చేసుకున్నామా! ఇంకొక దిగులు నాకు.వచ్చేప్పుడు వెళ్లేప్పుడు ట్రైన్స్ సమయాలు ఉదయపు వేళలు. ఏడూ ఇరవై కి ట్రైన్ బయల్దేరిపోతుంది. (ఏ పనీ లేకుంటే ఉదయం నేను లేచే టైమ్ అది ) ఆ సమయానికి అందరూ రావాలి అదొక టెన్షన్,
ట్రైన్ లో ఉండే రోజున్నర ప్రయాణంలో మొదటి రోజయినా ఇంటి భోజనం ఇవ్వాలని నా తాపత్రయం ట్రైను లో కొనుక్కోవచ్చులే అనుకోడానికి ఇద్దరో ముగ్గురో కాదు ఏకంగా ముప్పయి మంది కొందరికి ఫుడ్ దొరికి కొందరికి దొరకకపోతే ఆదిలోనే హంసపాదు అన్నట్లు అవుతుంది కదా!
ఆ సమయానికి ఎవరికయినా ఆర్డర్ ఇద్దామన్నా వాళ్లు అందించకపోతే డబ్బులు కూడా గోవిందా కదా!అందుకే అదొక సవాల్ గా స్వీకరించి తెల్లవారు ఝామునే లేచి మా చంద్ర, మా వదిన సహాయంతో ఉప్మా టిఫిన్ కి, దానికి టమాటా చట్నీ,ప్యాకింగ్, రైస్, రాత్రే తరిగి పెట్టుకుని కూర కారంతో,కూర, కొబ్బరిపచ్చడి, టమాటపప్పు నా అక్షయపాత్ర కరెంట్ కుక్కర్ తో అన్నం వండేయడం అ డ్యూటీ! అవన్నీ సిల్వర్ ఫాయిల్ కవర్స్ లలో ప్యాక్ చేసి పెద్ద క్యారీ బ్యాగ్ లో వేయడం వాళ్ల డ్యూటీ!
రాత్రి కోసం ఒక కేటరింగ్ వాళ్లకిచ్చిన నాలుగుచపాతీలు టమాట కూర ప్యాక్ లు వచ్చాయి అవి, వాటితో పాటు మూడు బ్రెడ్ లు జామ్ స్యాచెట్, బటర్ టిన్ ఉన్న కవర్ ఒకటి బిస్కట్ ప్యాకెట్, రెండురోజుల స్నాక్స్, రెండు రకాల ఫ్రూట్స్ అన్నీ వేసిన కవర్స్ ముప్పయి రెడీ చేసుకుని ఆరింటికి స్టేషన్లో మా కోచ్ దగ్గరకు చేరాము.
వచ్చినవారికొచ్చినట్లుగా వారి ఫుడ్ కవర్, టికెట్, మొత్తం బ్యాచ్ లో ఉన్న ముప్పయి ఆరుమంది పేర్లు వాళ్ల కోచ్ వివరాలు, ఫోన్ నెంబర్స్ ఉన్న పేపర్ కూడా ఇచ్చి మా కోచ్ ఎక్కాము. అప్పుడు హమ్మయ్య అనుకున్నాము.
చక్కగా అందరూ టిఫిన్స్ తిని పడకేసి పదిన్నరకు ఒక్కొక్కరూ ఏక్టివ్ అయ్యారు. ఎవరెవరెక్కడున్నారో చూసుకుంటూ అందర్నీ పరిచయం చేసుకుంటూ, హుషారు మాటలు పాటలు తంబోలా ఆటలతో ప్రయాణం
మాతో వచ్చిన రాజ్య శ్రీ, బాగా రకరకాల క్విజ్ లు పెట్టడం, లీల రాజ్యశ్రీ గారి శ్రీవారు పాడినపాటలు అంత్యాక్షరితో ప్రయాణం బాగా సాగింది.
అలా మర్నాడు సాయంత్రానికి గోరక్ పూర్ లో ఉన్న మానస్ ఇంటర్నేషనల్ హొటల్ కి చేరుకున్నాము. అందరూ స్నానాలు చేసి ఫ్రెషప్ అయ్యాము. కొందరు గోరక్ నాథ్ టెంపుల్ కి వెళ్లి వచ్చారు. మరికొందరం మాత్రం ఉదయం వెళ్లాము.
మర్నాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందరే గోరక్ నాథ్ గుడికి మిగతావారందరం వెళ్లొచ్చాము. టిఫిన్స్ అయ్యాక బస్ లు ఎక్కి దేవతలందర్నీ స్మరించుకుని మా అమ్మ రాసిపాడిన అమ్మ వారి పాటలు వింటూ మెల్లగా నేపాల్ దారి పట్టాము. మాతో కమల్ అనే ఒక గైడ్ కూడా వచ్చాడు.
సరిగ్గా పన్నెండు అయ్యేసరికి నేపాల్ ఇండియా బార్డర్ దగ్గరకు చేరాము. ఈ బస్ డ్రైవర్ల తెలివితేటలో, మరే ఇబ్బందో తెలీదు కాని, అక్కడ ఇదిగో అరగంట అదిగో అరగంట అంటో రెండుమూడు గంటలు ఉంచేసాడు.
మేమంతా కొత్త ఉత్సాహం కదా! క్విజ్ లు కండక్ట్ చేసుకుంటూ బస్ కదిలితే లంచ్ కి ఆగాలి. అనుకుంటే లంచ్ టైమ్ అక్కడే దాటింది. ఏం దొరికితే అదే ఇక్కడే తినేద్దాము అని వెడితే ఏ హోటల్ లోను ఇంతమందికా చేయలేమంటారు.
అలాగే వెతగ్గా వెతగ్గా ఒక హొటల్ అతను ఓకే అన్నాడు కాని అరగంట టైమ్ కావాలన్నాడు. సరే అన్నాము.
ఎలాగో మా పచ్చడి సహితంగా లంచ్ అయిందనిపించి బయల్దేరాము
పోఖ్రా చేరేసరికి భారీ వర్షం..గంటల తరబడి కురిసిన వాన వల్ల రోడ్లన్నీ జలమయం!


ల్యాండ్ మార్క్ హొటల్ కి చేరాము. హొటల్ బాయ్స్ సామాన్లు ఎవరి రూమ్ లో వారివి పెట్టారు. మొత్తం పదిహేను రూమ్స్ మావి .చాలా బాగున్నాయి.
ఉదయం లేచి ఫ్రెషప్ అయ్యాము బఫే గా అమర్చిన బ్రేక్ ఫాస్ట్ చేసాము. నేపాల్ ఆర్గనైజర్ రాజ్ రావడం కలవడం అయింది. అతను చెప్పినట్లు ఆ రోజు పోఖ్రాలో వారాహి టెంపుల్ దేవీ ఫాల్, గుప్తేశ్చరీ కేవ్స్ చూసాము. మర్నాడు ఉదయం ముక్తినాథ్ ప్రయాణం బస్ లో! ప్రస్తుతం కొండచరియలు పడ్డాయి రోడ్ క్లియర్ అయ్యాకే మీ ప్రయాణం! అన్నాడు . సరే అన్నాము.
మర్నాడు అందరం రెడీ అయ్యాము. కాని, తొమ్మిదయింది పదయ్యింది. పదకొండయ్యింది. మేము “ఆ రాజ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్లచ్చులే !” అనుకుని మా రూమ్ లో పడుకున్నాము. మాతో టూర్ వచ్చిన వాళ్లు”ఇలా అయితే ఎలా నిన్న వేస్ట్ అయింది ఇవాళ కూడా వేస్ట్ అయ్యేట్టు ఉంది. ఆ ఖాట్మండ్ ఎల్లుండి బదులు ఈ రోజే పోదామని రాజ్ కి చెప్పండి. దారి ఇలా ఉంటే ఎలా వెడతాము? అని ఒకరి తర్వాత ఒకరు వచ్చి పోతుంటే నేను ఆ రాజ్ కి కాల్ చేసి చెప్పాను.
మేమలా చెప్పకుంటే వాడేం చేసునో! మా మాట ప్రకారం మూడు పెద్ద వ్యాన్స్ పదిహేను సీటర్స్ ఏసి బళ్లు తెప్పించాడు.అందర్నీ ఎక్కించాడు. దారిలో మనోకామనా చూడమన్నాడు.బయల్దేరాము. అప్పటికే పన్నెండయింది.
అంతా ఘాట్ రోడ్ ఎక్కడా ఒక్క హొటల్ లేదు ఒక వైపు ప్రవాహం, మరో వైపు కొండలు మా కన్నా ముందర వెళ్లిన బండి ఒక హొటల్ దగ్గర ఆగిందని డ్రైవర్ కి వర్తమానం. వెళ్లాము ఆర్డరిచ్చాము. షరామామూలే! అందరి భోజనాలు అయి బయల్దేరి మనోకామన చేరాము కాని , కేబుల్ కార్లు లో పైకి వెళ్లొచ్చు కాని క్రిందకి రావు టైమ్ అయిపోతుంది. అయిదయ్యాక కేబుల్ కార్లు నడవవు. మీకు టైమ్ సరిపోదు. అనేసరికి అందరికీ మూడ్ ఆఫ్! ముక్తినాథ్ చూడటం కాలేదని, మనోకామనా కూడా మిస్ అయిందని అందరికీ ఒకటే బాధ!
“వచ్చేప్పుడు చూడొచ్చు! తిరుగు ప్రయాణం ఇటు వైపే !అన్నాక శాంతించారు. రాత్రికి ఖాట్మండ్ చేరాము. నాకు మనసులో టెన్షన్ మొదలు ఎందుకిలా అవుతోంది. ప్రోగ్రామ్ అనుకున్నట్లుగా సాగటంలేదు అనిపించి మా వాణికి కాల్ చేసి ఈ వారం వినాయకుడికి నువ్వు ఉండ్రాళ్లు. చేసి నైవేద్యం పెట్టు ! వచ్చేవారం నుండి నేను చేస్తాను. అన్నాను. మా ప్రయాణం మంచిగా సాగాలని మరోసారి దేముడికి మొక్కాను. ఆ మర్నాడు వర్షం తగ్గింది.
ఖాట్మండ్ లోని పశుపతినాథ్, వింధ్యవాసిని , నీలకంఠ్ బుద్దా, చూసాము
ఇంక ఆ రోజు రాత్రి హొటల్ కి వచ్చాక మా ఆర్గనైజర్ రాజ్ ఫోన్ ఎనిమిదింటికి “మేడమ్! మీ అందరూ ముక్తినాథ్ కి వెళ్లాలంటే రేపుదయమే మీరంతా పోఖ్రా ఫ్లైట్ కి వెళ్లిపోతే, అక్కడినుండి వెహికిల్స్ లో ముక్తినాథ్ వెళ్లొచ్చు. అని అలా ఒప్పుకుంటే అందరూ తలొక రెండువేల అయిదువందలు ఇవ్వాలి.

ఈ వెహికిల్స్ కి మొత్తం రెండున్నరవేలు వెరసి ఒక్కొక్కరికి అయిదేసి వేలు అవుతాయి. మీ వాళ్లందరకూ ఇష్టమయితే వెంటనే చెప్తే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. అన్నాడు.
అది వినగానే అందరూ ఎగిరి గంతేసారు ముఖ్యంగా మాతో వచ్చినవాళ్ల ల్లోబాగా పెద్దవారిద్దరున్నారు. వారితో వారి బంధువులు మరో ఇద్దరు. సుగుణామామి, సుందరి మామి, లీలావతి మామి, శాంత మామి, కేవలం ముక్తినాథ్ కోసమే వచ్చారు. వాళ్లల్లో ఇద్దరిని ముక్తినాథ్ తీసుకురావొద్దని ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఇబ్బంది అయితే కష్టమని చెప్పాడు.
అది విని వాళ్లు బాధపడటం ఇక్కడ మాత్రం ఏమీ కామని గేరంటీ ఏముంది మేమొస్తాము అని వాళ్ల వాళ్లు కూడా ఆగిపొమ్మని చెప్పారు‌ కాని వాళ్లు నలుగురూ కలసి వాళ్ల పిల్లలకు ఒకటే చెప్పారు.
“మా నలుగురు కోసం రెండేసి లక్షలు దగ్గరుంచుకోండి. మేమేదయినా అయితే వచ్చి తీసుకుపోండి. ఎక్కడయినా పోయేదే ఆ ముక్తినాథ్ లో పోతే ఇంకా పుణ్యం ! మా బ్రతుకులో ఈ నేపాల్ ఎప్పుడు రావాలి? ఎపుడు చూడాలి? అదేదో ఇపుడే చూస్తాము. అని చెప్పేసారు.
వాళ్ల నమ్మకం పట్టుదల చూసి నాకు కాస్త ధైర్యమొచ్చింది ఇంక “నేను మీ ఎవ్వరికీ ఏమీ కాదాంటీ !! పదండి పోదాము అన్నాను. అందరూ ఒప్పుకున్నారు. ఆ రాత్రంతా నిద్ర లేదు మాకు. మూడు బ్యాచ్ లు గా పదింటికల్లా అందరికీ ఖాట్మండ్ నుండి పోఖ్రాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయి.
ఉదయం పదిన్నరకల్లా అంచెలంచెలుగా రెక్కల విమానంలో పోఖ్రా రావడం ఒంటిగంటకల్లా లంచ్ చేసి రెండు గంటలకి ఏడుగురు ఒక జీప్ లో లెక్కన అయిదు జీపులొచ్చాయి ఎక్కాము. ముక్తినాథ్ దారి పట్టాము.
ఇంక ఆ దారి ఎంత రమణీయంగా ఉందో అంత భయంకరంగా ఉంది. నీలాకాశంలో తేలియాడే తెల్లని మబ్బులు గుంపులు గుంపులు. ఒక వైపు ఎత్తయిన కొండలనుండి నిరంతరం జాలువారే జలపాతాలు అడుగడుగునా కనిపిస్తుంటాయి. మరోపక్క లోయలో పరవళ్లు తొక్కుతూ నురగలతో ప్రవహించే గండకీనది.
పోఖ్రానుండి ముక్తినాథ్ కి ఉన్న దూరం కేవలం రెండువందల ఇరవై కిలో మీటర్ల దూరమే! కాని పది గంటల ప్రయాణం ఆ ఎగుడు దిగుడు రాళ్ల దారిలో జీప్ ప్రయాణం ఒళ్లంతా కుదిపేస్తూ మనం రోలర్ కోస్టర్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ జీపు డ్రైవర్ల నైపుణ్యం చాలా గొప్పది.
మావాళ్లు చాలా భయపడ్డారు.
ఆ కుదుపులు భరించలేనివి నాకయితే జ్వరమొచ్చేసింది. రాత్రి పదకొండున్నరకు జామ్సమ్ లో దిగేసరికి ముందుగానే ఆర్డరిచ్చి చేయించిన డిన్నర్ చేసి మాకిచ్చిన రూమ్ లో పడుకొన్నాము . అన్ని జీపులు అంచెలంచెలుగా వచ్చాయి.
అక్కడ ఎకామడేషన్ చాలా సామాన్యంగా ఉంటుంది.


మర్నాడు ఉదయం ఏడున్నరకు టిఫిన్ చేసి లంచ్ కి ఆర్డరిచ్చి ముక్తినాథ్ బయల్దేరాము అక్కడికి రెండున్నర గంటల ప్రయాణం చేసి ముక్తినాథ్ చేరుకున్నాము. అక్కడికి హిమాలయాలు చాలా దగ్గరగా కనిపిస్తాయి.
కాలిమార్గాన మెట్లు ఎక్కి గుడికి చేరడానికి రెండు మైళ్ల దూరం నడవాలి. లేదా గుర్రం మీద వెళ్లాలి. నాకప్పటికే ఒళ్లు తెలియని జ్వరమొచ్చేసింది. అంతవరకొచ్చాక దర్శనం చేసుకోకుండా ఎలా అందుకే డోలీ ఎక్కాను.
శబరిమలలో కూర్చుని వెడితేనే నవ్వొచ్చింది. ఇంక ఇక్కడ డోలీ ఎవరెక్కినా పడుకోపెట్టే తీసుకెడతారు.
మండుటెండగా ఉందేమో ! పైన ఒక దుప్పటి కూడా పడేసి హ –హ,,,,,,హ ఇప్పుడు రాస్తుంటే నవ్వొస్తోంది కాని మా వాళ్లందరికీ మనసంతా ఏదోలా అయిపోయిందిట. నడిచి ఎక్కినవారందరూ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ఎక్కారు. నేను అవి మిస్ అయ్యాను కాని ఫ్రెండ్స్ తీసిన వీడియోలు ఫొటోలలో చూసాను.
మొత్తానికి ఆ డోలి వాళ్ల పుణ్యమా అని మా చంద్ర సహాయంతో ముక్తినాథుడిని చక్కగా దర్శించుకున్నాను.
మళ్లీ జామ్సమ్ వచ్చి హోటల్ వారిచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ తీసుకుని జీప్ లలో పోఖ్రా దారిపట్టాము . అలాగే ఆ ఎగుడు దిగుడు దారులలో మసక వెన్నెలలో అర్ధరాత్రికల్లా మా హోటల్ ల్యాండ్ మార్క్ హొటల్ కి చేరాము.
ఎవరైనా ముక్తినాథ్ కి వెళ్లాలంటే ఫ్లైట్ లో జామ్సమ్ కి వెళ్లి జీప్ లో ముక్తినాథ్ వెడితే కాస్త ఈజీ అవుతుంది. రోడ్ మీద వెడితే అందరూ తట్టుకోలేరు. మా సీనియర్ ఆంటీలందరూ చాలా హేపీ విచిత్రమేమిటంటే వారికేమి కాలేదు కాని ఒకరిద్దరికి కాస్త ఇబ్బంది అయింది.
ఆ మర్నాడు ఉదయమే మధ్యాహ్నం లంచ్ ప్యాక్ చేయించుకుని మనోకామనా దర్శించుకుని సాయంకాలానికి చిట్వాన్ చేరేలా వెహికిల్స్ లలో బయల్దేరాము. మనోకామనా దేవి దయవలన అందరం కేబుల్ కార్ ఎక్కి బాగానే దిగాము కాని గుడికి నూటేభై మెట్లు ఎక్కవలసి వచ్చింది.
అమ్మవారిని దర్శించుకుని క్రిందకొచ్చి చిట్వాన్ చేరాము. రాత్రి ఫారెస్ట్ లో రిస్సార్ట్ లో ఉన్బాము మర్నాడు ఉదయం ఆర్మీ వెహికిల్స్ వచ్చాయి మమ్మల్నందరినీ ఎక్కించుకుని రెండుగంటల సేపు ఫారెస్ట్ అంతాచూపించి తీసుకొచ్చారు.
ఆ తర్వాత మళ్లీ మా టిఫిన్స్ అయ్యాక మా లంచ్ ప్యాక్ లు తీసుకుని లుంబినిలో బుద్దుడు పుట్టిన ప్రదేశం. ఒకే ఆవరణలో కట్టిన వివిధ దేశాల బుద్దుని ఆలయాలు దర్శించుకుని రాత్రి దారిలోనే డిన్నర్ చేసి గోరక్ పూర్ చేరాము. మర్నాడు ఉదయమే ఆరూ ఇరవైకి ట్రైన్ ఎక్కి మర్నాటికి మన భాగ్యనగరం చేరాము.

3 thoughts on “యాత్రా మాలిక – నేపాల్ యాత్రా విశేషాలు

  1. కామేశ్వరి గారు, మన నేపాల్ టూర్ గురించి చాలా చక్కగా విపులీకరించారు. చిన్న చిన్న ఇబ్బందులు అధిగమిస్తూ అందరం టూర్ బాగా ఎంజాయ్ చేశాం.
    ధన్యవాదాలు

    1. ధాంక్యూ లీలా! మనతో టూర్ వచ్చిన మీ అందరూ సంతోషించారు. చాలా సంతోషఙ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2019
M T W T F S S
« Oct   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031