April 23, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 43

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

స్వామీ! శ్రీవేంకటేశ్వరా! నాది కుక్కబతుకైపోయింది. కొన్నాళ్ళు లౌకిక విషయాలు, మరికొన్నాళ్ళు సంసార భవ బంధాలు అంటూ అటూ ఇటూ వెంపర్లాడుతూ, కాట్లాడుతూనే ఉన్నాను. పసరం లాగా జీవించాను ఇంతకాలం. మంచి చెడుల విచక్షణ లేనివాడనయ్యాను. నన్ను గాచి రక్షించవలసినది నీవే. అంతా నీదే భారం అంటూ వృధాగా గడచిపోయిన వ్యర్ధకాలాన్ని నిందిస్తూ వాపోతున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో.

కీర్తన:

పల్లవి: అటు గొన్నాళ్లందాఁక యిటు గొన్నాళ్లిందాఁక

కటకటా శునకపుగతియాయఁ గావవే ॥పల్లవి॥

చ.1 పసిమిఁ బాపమనేటి బందెలు మేసితిని
కసరి దేహపు కట్టుగాడి నుంటిని
కొసరి కర్మపుమెడగుదియ మోఁచితిని
పసురమువంటివాఁడఁ బాలించవే ॥అటు॥

చ.2 పంచేంద్రియములనే బాడిగె మోఁచితిని
లంచపు సంసారమనే లాడిఁబడితి
పంచల నాసలచేత బందమ వెట్టించుకొంటి
ముంచినగుఱ్ఱమువంటి మూఢుఁడఁ గావవే ॥అటు॥

చ.3 మరిగి ‘యజ్ఞాన’మనేమద మెత్తి తిరిగితి
‘మరుఁ’ డనే మావటీని మాయఁ జిక్కితి
గరిమ శ్రీవేంకటేశ కరిఁ గాచితివిగాన
కరి నైతి నన్ను నీవు కరుణించవే ॥అటు॥
(రాగం: వరాళి, సం.4 సంకీ.227)

విశ్లేషణ:
పల్లవి: అటు గొన్నాళ్లందాఁక యిటు గొన్నాళ్లిందాఁక
కటకటా శునకపుగతియాయఁ గావవే
స్వామీ! శ్రీవేంకటేశ్వరా! నన్ను రక్షించు. నన్ను గాచి కైవల్యం ప్రసాదించు. నాది కుక్కబతుకైపోయింది. ఇన్నాళ్ళూ మంచి చెడు తేదా తెలియని ఒక పసరం లాగా జీవించాను. కొన్నాళ్ళు అరిషడ్వర్గాలకు చిక్కి బలయ్యాను. మరి కొన్నాళ్ళు అలౌకిక విషయాలు మరచి లౌకిక విషయ వాంఛలకు వెంపర్లాడాను. మరికొన్నాళ్ళు సంసార భవ బంధాలు అంటూ అటూ-ఇటూ వెంపర్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు జ్ఞానోదయమయింది. ఇక అంతా నీదే భారం అంటూ వృధాగా గడచిపోయిన వ్యర్ధకాలాన్ని నిందిస్తూ, స్వామి పాదాల చెంత వాలి వాపోతున్నాడు అన్నమయ్య.

చ.1 పసిమిఁ బాపమనేటి బందెలు మేసితిని
కసరి దేహపు కట్టుగాడి నుంటిని
కొసరి కర్మపుమెడగుదియ మోఁచితిని
పసురమువంటివాఁడఁ బాలించవే
పశువుల కొట్టములో పసరమువలె బందీలా నేను అరిషడ్వర్గాలకు బందీనయ్యాను. పచ్చి గడ్డి ఎండుగడ్డీ నానా చెత్త మేశాను. మోహంలో నానా చెత్తను భ్రమపడి అదే నిజమని ఆస్వాదించాను. చిత్త చాపల్యం వల్ల నా దేహం ఆశాపాశమనే స్థంభానికి కట్టివేయబడింది. చేసిన కర్మల ఫలితంగా నేను గుదిబండ మోయవలసి వచ్చింది. ఈ కట్టును విడిపించుకోలేక పోతున్నాను. నాది గడ్డితినే పసరం లాంటి జీవనమైంది. ఇప్పుడు అస్తమానమయ్యాక, అంతా ముగిసిపోయాక కనులు తెరిచాను. ప్రభూ! నన్ను గావవలసిన భారాన్ని నీపై ఉంచుతున్నాను. కరుణించు. కాపాడు ప్రభో! అని దీనంగా వేడుకుంటున్నాడు అన్నమయ్య.

చ.2 పంచేంద్రియములనే బాడిగె మోఁచితిని
లంచపు సంసారమనే లాడిఁబడితి
పంచల నాసలచేత బందమ వెట్టించుకొంటి
ముంచినగుఱ్ఱమువంటి మూఢుఁడఁ గావవే
స్వామీ! నాదేహాన్ని పంచేంద్రియాలు అద్దెకు తీసుకున్నాయి. ఈ అద్దెగృహపు బదుకు ఎప్పుడు తెల్లారుతుందో, ఎన్నడు బంధ విముక్త అవుతుందో తెలీదు. లంచాలు, ఇహభోగ సుఖాలకు అలవాటైన నా దేహం ఒక పుండుకు లోబడి బలైన విధంగా, ఆశాపాశాలతో బంధింప బడ్డాను. ఒక గుర్రం వివేక శూన్యయై యుద్ధంలో ఇతర సైనికులను త్రొక్కి చంపాలనే ఆశతో మనిషిని తన వీపుపై ఎక్కించుకొని మనిషికి బందీ అయిన విధంగా మూఢుడినై సకల ఇంద్రియాలకు, అరిషడ్వర్గాలకు లొంగి జీవించాను.
చ.3 మరిగి ‘యజ్ఞాన’మనేమద మెత్తి తిరిగితి
‘మరుఁ’ డనే మావటీని మాయఁ జిక్కితి
గరిమ శ్రీవేంకటేశ కరిఁ గాచితివిగాన
కరి నైతి నన్ను నీవు కరుణించవే
ఒక మదమెక్కిన ఏనుగును మావటీవాడు అంకుశంతో లొంగదీసుకున్నట్టుగా నన్ను మన్మధుడు అనే మావటీవాడు కామమనే ఆయుధంతో లొంగదీసుకున్నాడు. ఆ అంకుశానికి లోబడి చేయరాని పనులెన్నో చేశాను. స్వామీ! గజేంద్ర మోక్ష సన్నివేశంలో కరిని బ్రోచిన రీతిగా అనేక మాయలతో నిండిన నా దేహమనే గజాన్ని కూడా నీవే విడిపించి కైవల్యం ప్రసాదించవలసినదిగా కోరుకుంటున్నాను పరంధామా! అని మిక్కిలి ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు: కటకటా! = అయ్యయ్యో! అని బాధలను వెళ్ళగ్రక్కే మాట; పసిమి = ఆకుపౘ్చనైన గడ్డి; కసరు = చలించు, చాపల్యము, కోరికలు చెలరేగుట; కట్టుగాడి = పసువులను కట్టు స్థంభము; కొసరి = కోరుకొను; మెడ గుదియ = పశువులను గాట కట్టు మెడ బంధము, పలుపు; పసురము = గోమహిషజాతికి చెందిన, చిన్నదూడ; పంచేంద్రియము = కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనబడే ఐదు విషయాలు; లాడి = పెద్దవుండు, బలి; పంచల నాశలచేత = ఆరాటపెట్టే ఆశాపాశాలు; బంద = లేత పొట్టి తాటిమాను, పశువులను కట్టి ఉంచే కాడి లాంటి సాధనము; మరిగి = తెలియని తనముతో కొట్టుమిట్టాడు; మావటీ = ఏనుగులను అంకుశముతో లొంగదీసి నడిపించువాడు; గరిమ = ఘనుడైన వాడు; కరి = గజము, ఏనుగు.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *