March 29, 2024

అమ్మ మనసు

రచన: కె. మీరాబాయి ( తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం )

శస్త్ర చికిత్స జరిగే గదిలో బల్ల మీద పడుకుని ఉన్నాడు చక్రపాణి.
“ చక్రపాణీ! సిద్ధంగా ఉన్నారు కదా? మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా విశ్రాంతిగా ఉండండి. నిజంగా నా జీవితంలో ఈ రోజు ఒక గొప్ప అద్భుతాన్ని చూసాను చక్రపాణీ! ఈ కాలంలో తాము జీవితంలో పైకి వచ్చి, నిలదొక్కుకున్నాక, తమకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం వాళ్ళ బ్రతుకులను ధారపోసిన తలిదండ్రులను పాత సామాను వదిలించుకున్నట్టు ఆశ్రమాలలో వదిలేస్తున్న పిల్లల గురించి వింటున్నాము. తల్లి ప్రాణం కాపాడుకొవడం కోసం పది వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి, మీ మూత్రపిండం అమ్మకు దానం చేసి రక్షించు కోవడానికి సిద్ధ పడిన మీ వంటి కొడుకును కన్న మీ అమ్మ ధన్యురాలు చక్రపాణీ !” చక్రపాణి తలవైపు నిలబడిన వైద్యురాలు సరోజ మెత్తగా పలికింది.
మూసుకున్న కళ్ళు తెరిచి ఆమె వైపు చూసాడు. పండి పోయిన తెల్లని వెంట్రుకలు జారు ముడి వేసి, చిన్న గులాబి పూవులున్న తెల్లని చీరలో శాంతి దూతలా ఉన్న సరోజ పెదవుల మీద మందహాసం.
చిరునవ్వుతో ఆమె వైపు చూసాడు చక్రపాణి. “శస్త్రచికిత్స మొదలయ్యే ముందు ఒకసారి అమ్మను చూడవచ్చునా?“ నెమ్మదిగా అడిగాడు.
“కొన్ని గంటలలో ఆమెను పూర్తి ఆరోగ్యవంతురాలుగా చూస్తారు చక్రపాణీ. ఇప్పుడు మీకు మత్తు మందు ఇస్తారు”అని చెప్పి బయటకు నడిచింది ఆమె.
అతన్ని సిద్ధం చేయడానికి ఇద్దరు లోపలికి వచ్చారు.
చక్రపాణి కళ్ళు మూసుకున్నాడు.
కడుపులో పడిన నలుసును వదిలించుకోవడానికి ఈయన అమ్మ ముప్ఫై ఏళ్ళ క్రితం ఇదే వైద్యశాలకు గర్భ విచ్చిత్తి కోసం వచ్చింది. ఇప్పుడు ఈయన ఆ తల్లి ప్రాణం కాపాడుతున్నాడు. “రహస్యంగా పలికింది ఒక సహాయకురాలు.
“ నీకెలా తెలుసు ?” మగ గొంతు పలికింది.
“ ఆమె స్వయంగా కొడుకుకు చెప్తుంటే విన్నాను. ఆమెను సిద్ధం చేయడానికి ఆమె వున్న గది తలుపు దగ్గరకు వెళ్ళాక మాటలు వినబడ్డాయి. అంతలో ఎవరో పిలవడంతో వెళ్ళి పోయాను.“ అంది మొదటి గొంతు.
చక్రపాణి కళ్ళు తెరిచాడు.
అతని సహస్రారంలో ఒక పెద్ద విస్ఫోటన !
అంతవరకు మాట్లాడిన వాళ్ళు అక్కడ లేరు.
అప్పుడే లోపలికి వచ్చిన వైద్యుడు “మీకు మత్తు మందు ఇస్తున్నాను”అంటూ అతని చేతి నరంలోకి లోకి సూది గుచ్చాడు.
చక్రపాణి కళ్ళు మూతలు పడ్డాయి.
— — —
చక్రపాణి సాన్ ఫ్రాన్సిస్కోలో తను పని చేస్తున్న కార్యాలయంలో పదహారో అంతస్థులో ముఖ్యమైన చర్చలో వుండగా వచ్చింది ఇంటినుండి ఆ వార్త.
“అమ్మకు రెండు మూత్రపిండాలు చెడిపోయాయట. వైద్యశాలలో అత్యవసర విభాగంలో వుంది. వెంటనే ఆరోగ్యవంతుడి మూత్రపిండం తీసి అమర్చితే గానీ ఆమె బ్రతకదట. ఇప్పుడు ఆమె పేరు మూత్రపిండం కావలసిన వారి జాబితా లోకి ఎక్కిస్తే ఒక సంవత్సరం తరువాత ఆమె వంతు వస్తుందట. అంతవరకు ఆమె బ్రతకటం కష్టమే అంటున్నారు” చక్రపాణికి వరుసకు మామయ్య అయ్యే శంకరం క్లుప్తంగా విషయం చెప్పాడు.
మాటలురాని స్తబ్ధతతో, అభావంగా చూస్తూ నిలబడిన చక్రపాణి ని చూసి ఎదో గంభీరమైన విషయం అని గ్రహించిన సహోద్యోగులు చర్చను ఆపి, నిశ్శబ్ధంగా నిష్క్రమించారు.
విషయం ఇంట్లో వున్న భార్యకు చెప్తూ “ అమ్మ రక్తం నా రక్తం ఒకే సమూహం. నా ప్రాణమైనా ఇచ్చి అమ్మను కాపాడుకుంటాను “ అని నేరుగా విమానాశ్రయానికి బయలుదేరాడు.
“చక్రీ ! నా మాట విను. నాకు, నీ రెండేళ్ళ కొడుకుకు నువ్వే ఆధారం. తొందరపడి నిర్ణయం తీసుకోకు. ఎంత డబ్బు ఖర్చైనా ఫరవాలేదు. ఎవరో ఒకరు ముందుకు రాకపోరు. “అతని ఆలోచన గ్రహించిన అర్థాంగి మీనా అతను విమానం ఎక్కే ముందు వరకు చెబుతూనే వుంది.
ప్రయాణం చేసిన ఇరవై నాలుగు గంటలు అతడు తల్లి గురించి ఆలోచనలతోనే గడిపాడు.
చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా ధైర్యంగా ఏటికి ఎదురీదింది అతని తల్లి పావని. పూవులమ్మిన చోటే కట్టెలు అమ్మినట్టు , నాన్న వున్నతమైన వుద్యోగం చేసిన కార్యాలయంలోనే నాలుగవ తరగతి వుద్యోగినిగా చేరింది. పెళ్ళినాటికి ఆమె పదవ తరగతిలో వుందిట.. వివాహమైన వెంటనే చదువు మానిపించేసారుట.
చక్రపాణి ఆరవ తరగతిలో వున్నప్పుడు ఒక రోజు బడి నుండి ఇంటికి రాగానే తల్లి దగ్గర ఏడుపు మొదలు పెట్టాడు “నువ్వు వుద్యోగం మానేయమ్మా! ఆక్కడ పని మనిషి లాగా నువ్వు అందరికీ మంచినీళ్ళు, ఫలహారాలు అందించి, అ పళ్ళేలు, గ్లాసులు కడుగుతావట.. మా బడి పిల్లలు నన్ను ఎగతాళి చేస్తున్నారు.”ఆంటూ.
“పని మనిషి చేసే పని అవమానకరమైనదనీ, ఒక పెద్ద అధికారి చేసే పని గొప్పది అని అనుకోవడం తప్పు నాన్నా! కష్టపడి, నిజాయితీగా పనిచేసినంత వరకు ఏ పని అయినా గౌరవించ తగినదే. దొంగతనం చేసి, మోసం చేసి, తప్పు పనులు చేసి సంపాదించడం తప్పు గానీ, శ్రమకోర్చి చేసే కూలి పని అయినా అందులో సిగ్గు పడవలసినదేమీ లేదు. సరే నీ సంతోషం కోసం నేను మళ్ళీ చదువు మొదలు పెడతాను. పెద్ద వుద్యోగం తెచ్చుకుంటాను. సరేనా? అని చక్రిని ఓదార్చింది.
మరునాడే పుస్తకాలు తెచ్చుకుని పట్టుదలతో చదువు కొనసాగించింది.మంచంలో వున్న తండ్రినీ, మోకాళ్ళ నొప్పులతో నడవ లేని తల్లినీ, చక్రినీ చూసుకుంటూ, తను చేస్తున్న వుద్యోగం మానకుండానే పరీక్షలకు తయారయింది.
పదో తరగతిలో వుతీర్ణురాలై దూరవిద్యలో చదివి, రాజ నీతి శాస్త్రంలో పట్టా పుచ్చుకుంది.గుమాస్తాగా పదోన్నతి పొంది మరో కార్యాలయానికి మారింది.
అమ్మను చూసి స్ఫూర్తి పొందిన చక్రి చదువులో రాణిస్తూ, సాంకేతిక విద్య కళాశాలలో ప్రవేశానికి అర్హత పొందాడు.
ఆ సమయంలో చక్రికి అమ్మ మీద మరింత గౌరవం పెరిగే సంఘటన ఒకటి జరిగింది.
కొడుకు పోగానే కోడలిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లొ[నుండి పంపించేసిన పావని అత్తా మామలు చక్రిని తమ దగ్గర పెట్టుకుని చదివిస్తామని ముందుకు వచ్చారు.
అప్పటికి వాళ్ళు కూతురు దగ్గర నుండి వేరుగా వచ్చేసారు. ఆస్థి తన పేరిట రాస్తేనే వాళ్ళను తన దగ్గర పెట్టుకుంటానని కూతురు గొడవ చేయడంతో వాళ్ళకు చెట్టంత ఎదిగిన మనవడిని చేరదీయాలనే ఆలోచన వచ్చింది.
కబురూ, కాకరకాయా లేకుండా వున్నదున్నట్టు బయలుదేరి కోడలి ఇంటికి వచ్చారు. మనవడిని కౌగలించుకుని ఆనంద భాష్పాలు రాల్చారు.
చిన్నప్పటి నుండి నాన్నమ్మ తాతల ఇంట్లో అడుగు పెట్టి ఎరుగని చక్రికి వున్నట్టుండి వారు చూపే ఆప్యాయత మ్రింగుడు పడలేదు.
అత్త, మామలను మర్యాదగా చూసిన పావని వారి కోరికను నిక్కచ్చిగా తిరస్కరించింది.
“నా కష్టార్జితంతో నా కొడుకును ఇంతవరకు పెంచుకున్నాను. ఇక మీదట కూడా వాడిని చదివించగలను. ఉద్యోగంలో చేరాక మీ మనవడు మిమ్మల్ని తన దగ్గర పెట్టుకుంటాను అంటే అంది వాడి ఇష్టం. నేను కాదనను. చక్రి చదువు పూర్తి అయ్యేవరకు ఎక్కడికీ పంపను. “అంది. వాళ్ళు చక్రి వైపు చూసారు. చక్రి అమ్మ చేయి ముద్దు పెట్టుకుని అక్కడినుండి లేచి లోపలికి వెళ్ళిపోయాడు.
చక్రి ఆఖరి సంవత్సరం చదువుతుండగా నాన్నమ్మ, తాత కంచికి వెళ్ళి వస్తూ ప్రమాదంలో చనిపోయారు. అమ్మ కోరిక మీద చక్రి వారికి ఉత్తర కర్మలు జరిపాడు. ఆ సంద్బర్భంలోనే “మీ తాత ఆస్థి మీద నీకు ఆశ లేదని మీ అత్తకు గట్టిగా చెప్పు. కావాలంటే అలా సంతకం పెడతానని మాట ఇవ్వాలి. “అని చక్రికి చెప్పింది పావని.
అమ్మ మాటను పాటించిన చక్రిని దగ్గరగా తీసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది మేనత్త. ఈ సంఘటన కూడా చక్రి మనసులో అమ్మ పట్ల ఆరాధన పెంచింది.
చక్రపాణికి ఒక అంతర్జాతీయ సంస్థలో వుద్యోగం వచ్చింది. ఏడాది తిరిగేసరికి అతన్ని అమెరికాకు పంపించారు ఆ సంస్థ వాళ్ళు. అమ్మను వదిలి వెళ్ళడానికి చక్రపాణికి ఇష్టం లేక పోయినా, అతని భవిష్యత్తు కోసం నచ్చ జెప్పి ఒప్పించింది పావని.
కొడుకు పరాయి దేశంలో ఒంటరిగా అవస్థ పడకూడదని మరో రెండేళ్ళలో చక్రపాణికి పెళ్ళి చేసేసింది.
చక్రపాణి అమెరికాలో వున్న సమయంలో అతని అమ్మమ్మ, తాత కొద్ది రోజులతేడాలో కాలంలో చేసారు. అప్పుడు చక్రి భార్య మీనా కడుపుతో వుండడం వలన అతను రాలేకపోయాడు.
అమ్మ ఒంటరిగా భారత దేశంలోనూ తను దూరంగా అమెరికాలో వుండడం భరించలేని చక్రపాణి పావనిని ఐఛ్ఛిక పదవీవిరమణ తీసుకుని తన దగ్గరికి వచ్చేయమని బ్రతిమలాడాడు.
ఇంతలోనే అనుకోకుండా పావని జబ్బుపడడంతో చక్రి ఆఘమేఘాల మీద రావడం….
ముందు మూడు రోజులు చక్రపాణికి రకరకాల పరీక్షలు జరిగాయి.
అసలు కొడుకు అతని మూత్రపిండం తనకు ఇవ్వడమనే దానిని సుతరాము ఒప్పుకోలేదు పావని.
కొడుకు కళ్ళనీళ్ళతో బ్రతిమలాడాక, వైద్యులు చక్రపాణి ఆరోగ్యానికి ఏమీ ఫరవాలేదని నచ్చజెప్పడంతో అయిష్టం గానే ఒప్పుకుంది.
——– ——- ——
చక్రీ! చక్రపాణీ ! చక్రీ ! కళ్ళు తెరు. చూడు నేను వచ్చాను. మన మధు నాన్న అంటున్నాడు చూడు….
ఎక్కడో దూరం నుండి మాటలు వినబడుతున్నాయి చక్రపాణికి. భార్య మీనా గొంతు, మామ శంకరం గొంతు గుర్తు పట్టాడు.. కంటి రెప్పలు బరువుగా వుండి కళ్ళు తెరవడానికి రావడం లేదు.
“చక్రపాణి! కళ్ళు తెరవండి. “వైద్యురాలు సరోజ మెత్తని స్వరం.
ఎంతో ప్రయత్నం చేసి కనురెప్పలు విప్పాడు చక్రపాణి.
ఎదురుగా మీనా ! ఆమె చేతిలో చిన్నారి మధు.
రెండేళ్ళ ఆ పసివాడిని చూడగానే చక్రపాణి పెదవులు విచ్చుకున్నాయి
తనవైపు చూస్తున్న సరోజ గారిని చూసి “అమ్మ? “అన్నాడు అస్పష్టంగా.
ఆ మాట అంటుండగానే చర్నాకోలాతో కొట్టినట్టు ఒక జ్ఞాపకం …మనసులో చేదు రుచి..
“అమ్మ బావుంది. రేపు ఉదయానే చూడవచ్చు. “ సరోజ బదులిచ్చింది .
అతని చూపులు ఆందోళనగా చూస్తున్న మీనాను, పసివాడి ముద్దు ముఖాన్ని తడిమాయి.
మళ్ళీ మగతలోకి జారుకున్నాడు.
మర్నాడు చక్రాల కుర్చీలో పావని దగ్గరకు తీసుకు వెళ్ళారు చక్రపాణిని.
మంచం మీద పువ్వొత్తిలా అమ్మ.
సజల నేత్రాలలో కొడుకు రూపాన్ని నింపుకుంటు..
ఆ కన్నీరు అతని గుండెను తడిపింది.
“ఇంత ప్రేమనిచ్చిన నువ్వు నన్నెందుకు వద్దనుకున్నావమ్మా?” చక్రపాణి గుండె లయలో ప్రశ్న.
తండ్రి పోయాక తను పుట్టానని చక్రపాణికి తెలుసు. “అపురూపమైన నాన్న జ్ఞాపకంగా నన్ను పొదువుకోవాల్సిన దానివి ఎందుకమ్మా కడుపులోనే చిదిమేయాలనుకున్నావు ? “చక్రపాణి అడగలేని ప్రశ్న అతని మనసులో సుళ్ళు తిరుగుతోంది.
అయిదవ రోజు వైద్యశాల నుండి ఇంటికి పంపారు. మరొక పదిహేను రోజుల వరకు ప్రయాణం చేయవద్దని చక్రపాణికి చెప్పారు.
శంకరం మామ, అతని భార్య మీనా ముగ్గురూ పావనిని, చక్రపాణిని చంటిబిడ్డలలా చూసుకుంటున్నారు. మనవడి ఆటపాటలు, కేరింతలు పావనిని మురిపిస్తున్నాయి.
వాళ్ళిద్దరూ కాస్త కోలుకుని, మామూలుగా ఇంట్లో తిరగడం మొదలు పెట్టాక ప్రయాణ సన్నాహం మొదలయింది.
తనకు మందులు ఇస్తున్నా, , కాళ్ళమీద దుప్పటి కప్పుతున్నా, ముఖం మీద పడిన వెంట్రుకలు వెనక్కి తోస్తున్నా కొడుకు స్పర్శలో ఏదో తెలియని అస్థిమితత్వం పావనికి తెలుస్తోంది. నేరుగా తన కళ్ళలోకి చూస్తూ మాట్లాడక పోవడం గమనించింది.
“ఏమయింది నాన్నా? నువ్వూ వెళ్ళిపోయాక ఒంటరిగా నేనెలా వుంటానని బెంగ పడుతున్నావా? “పక్కన కూర్చున్న కొడుకు భుజాన్ని లాలనగా నిమురుతూ అడిగింది పావని.
భరించలేని భావోద్వేగ మొకటి చక్రపాణిని ముంచెత్తింది.
“ఎందుకమ్మా నన్ను వదిలించుకోవాలనుకున్నావు? నీ కడుపులోనుండి నన్ను నెట్టెయాలని ప్రయత్నించిన దానివి ఇన్నేళ్ళు గుండెలమీద ఎందుకు మోసావు? “బయటకు రాని మాటలు అతని కంటినీరుగా వర్షించింది.
ఆ కన్నీరు చూసి చలించిపోయింది పావని.
“దిగులు పడకు నాన్నా. నువ్వు చెప్పినట్టుగానే నేను కొద్ది రోజుల్లో వుద్యోగం మానేసి నీ దగ్గరకు వచ్చేస్తాలే. “ కొడుకు తల నిమురుతూ అంది పావని.
మౌనంగా లేచి వెళ్ళిపోయాడు చక్రి.
కడుపులో లేనిది కావులించుకుంటే వస్తుందా అన్నట్టు చక్రి మేనత్త చుట్టం చూపుగా వచ్చి పలుకరించి పోయింది.
శంకరం మామను, అత్తను మరికొన్నాళ్ళు అమ్మ దగరే వుండమని బ్రతిమాలాడు చక్రి.
ప్రయాణం ముందు రోజు రాత్రి చక్రికి నిద్ర పట్టలేదు. పోటుమీద ఉన్న సముద్రంలా అలోచనలు అల్లకల్లోలంగా లేస్తూ వున్నాయి అతని మనసులో.
“వెళ్ళేంతలో అమ్మను అడిగేయాలి. లేకపోతే మనసుకు శాంతి వుండదు.”అనుకుంటూ పక్కన వున్న మీనాకు మెలుకువ రాకుండా మెల్లిగా లేచాడు. అడుగు ముందుకు వేసేంతలో బలమైన అలలా ముందుకు దూసుకు వచ్చింది ఒక జ్ఞాపకం.
“అమెనే కొడుకుకు చెప్తుంటే విన్నాను. “శస్త్ర చికిత్స జరిగే గదిలో విన్న మాటలు చెవిలో మోగాయి.
“నేను దగ్గర లేనఫ్ఫుడు నాతో ఎలా మాట్లాడింది? ” మెరుపులా తోచింది. శస్త్ర చికిత్స తరువాత తను కళ్ళు తెరుస్తానో లేదో అన్న అనుమానంతో నాకు చరవాణిలో సందేశం పంపి వుంటుందా ?
గది బయటకు వచ్చి, తలుపు దగ్గర గా వేసి, చరవాణిలో సందేశాలు చూసాడు.
అతని వూహ సరైనదే. పావని నుండి సందేశం వుంది.
నిలువనీయకుండా తనకు వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం ఏమయి వుంటుంది?
మీట నొక్క బోతున్న అతని చేతులు వణికాయి. ఇందులో దాగిన నిప్పు లాటి నిజం తనను దహించేస్తుందా?
మండుతున్న అతని మనసు మీద పన్నీటి జల్లు లాగా పావని మాటలు వినబడ్డాయి.
“నాన్నా! ఇన్నాళ్ళు నీ దగ్గర దాచిన ఒక నిజం ఒకవేళ నేను పోతే తరువాత నీకు తెలిస్తే నన్ను అపార్థం చేసుకో కూడదని చెప్తున్నా.. ఛక్రీ ! ముప్ఫై ఏళ్ళ క్రితం నువ్వు నా కడుపులో పడినప్పుడు ఆ గర్భం తీయించేసుకోవాలని ఇదే వైద్యశాలకు వచ్చాను. ఇది విని నన్ను అసహ్యించుకోకు నాన్నా. అప్పటి నా పరిస్థితి నువ్వు వూహించలేవు.
చక్రీ! నాన్న పోయాక తెలిసింది నాకు నువ్వు నా కడుపులో ప్రాణం పోసుకున్నావని. సంతోషించడానికి మీ నాన్న లేరు. చెప్పుకోవాలంటే సిగ్గు. ఎవరేమంటారో అని భయం. లోకులు పలు కాకులు కదా! ! ఇంట్లో వాళ్ళ మాట అటుంచి రేపు బయట ఎవరైనా నీ పుట్టుక గురించి హేళన చేస్తే? ఎవరికి కన్న బిడ్డనో అని గేలి చేస్తే? నా కన్నా! ఈ భయం నన్ను వెంటాడింది. భరించలేక ఒక బలహీన క్షణంలో నువ్వు పుట్టి అవమానాల పాలు కావడం కన్నా నీకు పుట్టుకే లేకుండా చేయాలనుకున్నాను.
తీరా వైద్యశాలకు వెళ్ళాక నా కడుపు తీపి నన్ను రక్షించింది. నా పుణ్యఫలం నిన్ను వదులుకోలేనని వెనక్కి వచ్చాను.
చక్రీ! నువ్వు తోడు లేకపోతే నేను ఇన్నాళ్ళు బ్రతికి వుండేదాని కాదు. నువ్వే నా ప్రాణం నాన్నా! నిన్ను కొడుకుగా పొందిన నా జన్మ ధన్యం. నా కోసం ఇంత త్యాగానికి ఒడిగట్టిన నువ్వు నా ఆయుష్షు కూడా పోసుకు బ్రతుకు.”
చక్రి కళ్ళలోనుండి కన్నీరు జారుతోంది.”అప్పుడూ, ఇప్పుడు, ఎప్పుడూ నా గురించే ఆలోచించావు అమ్మా. నా మీది నీ ప్రేమను శంకించినందుకు నన్ను క్షమించు. ధర్మరాజు పలికిన “అశ్వత్థామ హతహ కుంజరహ.” ఆన్న అర్థ సత్యం ద్రోణాచార్యులను చంపినట్టు నీ గురించిన అర్థసత్యం నిన్నే శంకించేట్టు చేసి నన్ను అతలాకుతలం చేసింది. ”
కళ్ళు తుడుచుకుని పావని పడుకున్న గదిలోకి వెళ్ళి అమ్మ కాళ్ళు సున్నితంగా తాకి కళ్ళకు అద్దుకున్నాడు చక్రపాణి.
————– ———— ———–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *