March 29, 2024

కాశీ లోని పాతాళ వారాహి అమ్మవారి దేవాలయము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు…

వారాహి అమ్మవారి దేవాలయము కాశీలో విశ్వనాధమందిరానికి దగ్గరలో త్రిపుర భైరవి ఘాట్ వద్ద ఉన్నది. ఈ దేవాలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. వారాహి అమ్మవారు సప్తమాతలలో ఒకరు.  శ్రీ మహావిష్ణువు హిరాణ్యాక్షుడిని చంపి భూమిని కాపాడటానికి వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ అమ్మవారు శక్తిని ఇచ్చింది.

ఈ దేవాలయము ఉదయము ఐదు గంటలనుండి ఎనిమిది గంటలవరకే భక్తుల సందర్శనార్ధము తెరచి ఉంచుతారు అమ్మవారికి జరిపే పూజలు సూర్యోదయానికి ముందే  తలుపులు మూసి జరుపుతారు. ఈ దేవాలయములో అమ్మవారి విగ్రహము భూమి లోపల ఉంటుంది. అందుకే పాతాళ  వారాహి అమ్మవారు అని పిలుస్తారు.

ఈ విగ్రహము తల వరాహ రూపములో నాలుగు చేతులను కలిగి ఉంటుంది పైన ఉన్న ఎడమ చేతిలో హల (నాగలి) పైన కుడిచేతిలో ముసలం క్రింది కుడి చేయి అభయ ముద్రలోను, క్రింది ఎడమచేయి వరద ముద్రలోను ఉంటాయి. ఈ విగ్రహము దగ్గరకు ఆ ఆలయ పూజారి మాత్రమే నియమిత సమయాల్లో వెళ్లి అలంకరణ చేసి వస్తారు. భక్తులు అమ్మవారిని ప్రత్యక్షంగా ఎదురుగా చూడటానికి అవకాశము లేదు అక్కడ ఉన్న రంధ్రము ద్వారా

భూమిలోపల ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు అక్కడ ఉన్న రెండు రంధ్రాలలో ఒక రంధ్రము ద్వారా అమ్మవారి పాదాలను, రెండవ రంధ్రము ద్వారా అమ్మవారి ముఖాన్ని ప్రక్క నుంచి చూస్తారు ఎందుకంటే అమ్మవారు చాలా శక్తిమంతురాలు కాబట్టి ప్రత్యక్షంగా ఎదురుగా చూడకూడదు.

పూజారి ఒకసారి మంత్రోచ్చారణ తప్పుగా చేసినప్పుడు అమ్మవారు ఆగ్రహించి అతనిని మింగివేసింది అని చెపుతారు. వారాహి ఆమ్మవారు రాత్రిపూట కాశీ క్షేత్రాన్ని కాపలా కాస్తూ ఉదయాన్నేగుడిలోకి ప్రవేశిస్తారు అని చెపుతారు. అందువల్లే పూజారులు ఉదయాన్నేఏడు గంటలకు పూజలు ముగించి ఆలయద్వారాలు మూసి వేస్తారు.  అమ్మవారు పగటి పూట విశ్రాంతి తీసుకుంటారు. కాలభైరవుడు పగటిపూట  కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఆ విధముగానే రాత్రి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలు వారాహి అమ్మవారు.

వారాహి అమ్మవారిని శైవులు వైష్ణవులు పూజిస్తారు. వారాహి అమ్మవారు రాత్రిపూట  సంచరించే దేవత కాబట్టి “ధృమ వారాహి లేదా ధృమవతి” అని కూడా పిలుస్తారు. తాంత్రిక పూజలు చేసేవారు అమ్మవారిని సూర్యాస్తమయము అంటే రాత్రులందు మాత్రమే పూజిస్తారు. పరుశ రామ కల్ప సూత్ర ప్రకారము అమ్మవారిని అర్ధరాత్రి పూజించాలి. అమ్మవారి ఆశీస్సులు వారాహి అనుగ్రహాష్టకమును, వారాహి నిగ్రహఃష్టకమును శత్రువులను జయించటానికి పఠిస్తారు.  వారాహి అమ్మవారి అనుగ్రహము ఉన్నవారు ఎటువంటి పరిస్థితులలో

అపజయము చెందరు.  అందుకనే తమిళములో ఒక నానుడి ఉన్నది అది ఏమిటి అంటే వారాహి అమ్మవారి కృపకు పాత్రులైన వారితో వాదించకూడదు. పోట్లాడ కూడదు. అందుచేతనే తమిళనాట పూర్వము రాజులు యుద్ధాలకు ముందు వారాహి అమ్మవారిని పూజించి యుద్ధాలకు వెళ్లేవారట ఇందుకు నిదర్శనం తంజావూరు బృహదీశ్వరాలయములో రాజరాజ చోళుడు కట్ఠంచిన నిర్మాణాలే. రాజా రాజా చోళుడు ఏ యుద్దములో ఓడిపోలేదు. ఆ వంశస్తులందరు వారాహి అమ్మవారి భక్తులే.

తమిళనాట వారాహి అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. వారాహి అమ్మవారి భయము గొల్పే రూపాన్నిఅది శంకరాచార్యుల వారు భయాన్ని తగ్గించటానికి శ్రీ చక్ర మంత్రోపాసన చేసిన రెండు కర్ణాభరణాలను రెండు చెవులకు తగిలించారు. అప్పటి నుండి వారాహి అమ్మవారి తీవ్రత తగ్గినట్లుగా చెప్తారు.

అది శంకరాచార్యలవారు అమ్మవారిని శాంతింపజేయటానికి ప్రసన్న గణపతిని విగ్రహానికి కుడివైపున ప్రతిష్టించారు. కాబట్టి సాధారణ గుడి తెరిచే వేళలలో అమ్మవారు అఖిలాండేశ్వరి గా ఉంటుంది గుడి మూసిన వేళలో వారాహి రూపములోకి వెళ్ళిపోతుంది.

ఇవండీ పాతాళ వారాహి దేవాలయము యెక్క విశేషాలు.

ఒక్క కాశీలోనే కాకుండా తమిళనాట కూడా వారాహి అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. కాశీ  కాకుండా మిగిలిన ప్రాంతాలలోని ప్రజలు ముఖ్యముగా తాంత్రిక విద్యలను నేర్చుకునేవారు వారాహి అమ్మవారిని పూజించుకుంటారు

1 thought on “కాశీ లోని పాతాళ వారాహి అమ్మవారి దేవాలయము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *