March 29, 2024

మనసుకు హాయినిచ్చే హాస్యానందం

సమీక్ష: సి.ఉమాదేవి

హాస్యరసం మనసుకు సేదతీర్చే జీవామృతం.మనసెపుడు ఆనందంతో ఉరకలు వేస్తుందో అప్పుడు మన ప్రమేయం లేకుండానే ఏ పని చేయాలన్నా ఉత్సాహం కలుగుతుంది.తన బ్లాగులద్వారా సాహిత్యాంశాలకు మెరుగులు దిద్దుకున్న కౌండిన్య కాలక్రమేణా కథాప్రపంచంలోకి అడుగిడి మనల్ని తను పరిచిన హాస్యపుబాటలోకి నడిపించారు.
పదిహేనుకథలుగల సంపుటిలో ప్రతి అంశం విభిన్నతతో అలరిస్తుంది. ప్రతిసంఘటన హాస్యస్ఫోరకమై మనలో నవ్వులు పూయిస్తుంది.పంజాబీ డ్రెస్సులు అమ్మే అమ్మాయి దగ్గర పంజాబీ డ్రెస్సు కొని తన ఆహార్యాన్ని మార్చుకుని,పైగా లిప్ స్టిక్,మేకప్ తో పెళ్లికి వెళ్లిన బామ్మగారు పండించిన హాస్యం ఆకట్టుకుంటుంది. ఇక కోమలి కొసరివడ్డన కథలో నిద్రలో చప్పుడవడం విని దొంగతనానికి వచ్చినవాడనుకుని గరిటెతో నాలుగు వడ్డిస్తుంది కోమలి.తన ధైర్యాన్ని ఉదయాన్నే అందరితో పంచుకోవాలని చూస్తుండగా ఆమె మామయ్య కట్టుకట్టుకుని రావడం చూసి కారణమడిగితే ఎవరింటికో వెళ్తే రాత్రి గరిటతో వాయించారట అని చెప్పినపుడు కోమలికి మరిక మాటలేరావు.భర్త శరత్ కు ఆ సంఘటన వివరించి ఎవరికీ చెప్పవద్దని ప్రాధేయపడుతుంది.
విందుభోజనం తయార్ మరో చక్కని కథ.రాజుగా తన నివాసం రాజభవనమైనా అత్తగారింటిలో తనకై పెట్టెలోనుండి వెండిపళ్లెం తీసాక పెట్టె మూత మరచి దుప్పట్లతో నింపిన పెట్టెపై కూర్చుని పెట్టెలో పడిపోతున్నపుడు నోటిలోని కొబ్బరి ఉండ ఎగిరిపడటం అయ్యో అనిపిస్తూనే పెదవులు నవ్వులతో విచ్చుకుంటాయి.ఇక బామ్మలు అందించే హాస్యం ఆనందింపచేసే కొసమెరుపులే.కాఫీజనా సుఖినోభవంతు మరో చక్కని హాస్యకథ.కాఫీని ఫినాయిల్ లా చూసే బాస్ తాను కాఫీ తాగడం మానేసి కాఫీ తాగేవారికి కాఫీపై వైరాగ్యం కలిగే సంఘటనలు చెప్పి కాఫీపై విరక్తి కలిగిస్తుంటాడు.అతడి తండ్రి పాటించిన నిరాహార దీక్ష విరమణలోబత్తాయిరసం ఇస్తే నేలకేసికొట్టి కాఫీ తెప్పించుకుని దీక్షవిరమించడం చూసిన ఇల్లాలికి కాఫీ అలవాటును తన కొడుకుకు రాకుండా జాగ్రత్తపడుతుంది.
-2-
అయితే అనుకోకుండా అరకులోయ దగ్గరున్న అనంతగిరికి బదిలీ కావడం రావుగారిని నిస్పృహకు గురిచేస్తుంది.తల్లిదండ్రులిరువురు అనంతగిరికి చేరుకుని కొడుకు కాఫీ అంటే మక్కువ చూసి ఆశ్చర్యపడతారు.అంతేకాదు తన పాత ఆఫీసు వాళ్లందరిని పిలిచి తన తోటలో కాఫీ విందు ఏర్పాటు చేయడం చూస్తే కాఫీ తాగుతూ సమీక్ష వ్రాస్తే ఎంత బాగుంటుంది అనిపించకమానదు.
స్టేటస్ అప్ డేట్ నేటి తరంలో ఫోను వాడుతున్న వారెవరికైనా తెలిసిన విషయమే.గోళి అని పిలవబడే వ్యక్తికి ఫోను రింగ్ టోన్ సోడాబుడ్డి కొట్టిన శబ్దం చేస్తుంది అనడంతో కథ మొదలై కథాక్రమంలో ఫోను సాంబారులో పడటంతో కథ మలుపు తిరుగుతుంది.ఇక సాహసం చేయరా డింభకా కథలో అమెరికాకు వెళ్లాక పదిహేను సంవత్సరాల తరువాత తమ గ్రామం ప్రగడవరం వచ్చినపుడు కొడుకు,తండ్రి పండించిన హాస్యం చదవాల్సిందే. యమ కన్సల్టెన్సీ,గమ్యం మార్చిన గంగు,ఇదేం హోటల్ పరిగెడదాం రా వంటి కథలు చక్కని హాస్యంతో పాఠకులకు వినోదాన్నందిస్తాయి.చక్కని కథలతో తన సాహితీ బాటలో హాస్య చినుకులు కురిపించిన రమేష్ కలవల కౌండిన్యకు శుభాభినందనలు.

2 thoughts on “మనసుకు హాయినిచ్చే హాస్యానందం

  1. అనేక ధన్యవాదాలండి ఉమాదేవి గారు. కృతజ్ఞతలతో.

    కౌండిన్య (రమేష్ కలవల)

Leave a Reply to మాలిక పత్రిక డిసెంబర్ 2019 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *