June 19, 2024

చీకటి మూసిన ఏకాంతం – 7

రచన: మన్నెం శారద

నవనీతరావు కారేసుకొని సాగర్ ఇంటికొచ్చేడు.
సాగర్ ఆయన్ని చూసి “రండి రండి. కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణిగా!” అన్నాడు ఆదరంగా ఆహ్వానిస్తూ.
“అంత పనేం లేదులే. ఊరికే చూసి పోదామని వచ్చేను‌. ఎలా వున్నావు?” అనడిగేడాయన కూర్చుంటూ.
“బాగానే వున్నాను సర్! ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మొన్న మదర్ అండ్ ఛెయిల్డ్ ఆస్పత్రిలో ఇంటర్వ్యూ వస్తే వెళ్ళొచ్చేను.”
“నిశాంత జాబ్ చేయడం లేదా?”
“తెలీదు. నే వెళ్ళలేదు. ఈమధ్య మా ఇంటికోసారి వచ్చి వెళ్ళిందట. నేను కలవలేదు.” అన్నాడు సాగర్.
“అతను బాగా పైకొస్తున్నాడుగా. భార్య పని చేయడం చిన్నతనమన్నాడేమో!”
సాగర్ జవాబు చెప్పలేదు.
“మీ ఇంటికన్నా వచ్చింది. కన్న తల్లిదండ్రుల్ని చూడాలని లేదు కాబోలు!” అన్నాడాయన నిర్లిప్తంగా.
“అదేముండదు లెండి. మీరేమంటారోనని సందేహంతో వచ్చుండదు.”
“దాని సంగతి నాకు చెప్పకు. దానికి పౌరుషమెక్కువ. నేను వచ్చి పిలవాలని…”
“మరి పిలవకూడదూ!”
“ఎలా పిలుస్తాను! దాని తండ్రిని నేనయ్యా! నాకెంత పట్టుదల వుండాలి!”
సాగర్ నవ్వి “పాముని కొట్టకూడదు, చావాలి అంటారు మీరు” అన్నాడు.
“ఏదో పెద్దవాళ్ళ చాదస్తం. వస్తా. నిన్ను చూస్తే తనని చూసినట్లుంటుందని వచ్చేను.” అంటూ లేచి నిలబడ్డాడాయన.
సాగర్ కూడ అతన్ననుసరించేడు.గుమ్మం దాటేక “ఒక పని చేస్తే…?” అనడిగేడాయాన సాగర్ మొహంలోకి సందేహంగా చూస్తూ‌.
“చెప్పండి.”
“మాట్లాడాలని ఒకసారి బీచ్ కి పిలవ్వయ్యా సాయంత్రం! నేను దూరం నుండి చూస్తాను.”
“బాగుంటుందా?” సందేహంగా చూసేడు సాగర్.
“ఏం, ఇదివరకెన్ని సార్లు మీరు బీచ్‌లో ముచ్చట్లాడుకోలేదూ?”
నిష్ఠూరం ధ్వనించిందాయన గొంతులో.
“అది కాదండీ. ఆవిడిప్పుడు మరొకరి భార్య! అందుకని” అన్నాడు సాగర్.
“ఏం ఫర్వాలేదు. ఇతరులతో మాట్లాడకూడదన్నంత కొనేసాడా నా కూతుర్ని! ఒక్కసారి పిలు. దానికిష్టమైతే వస్తుంది. ఇదంతా నాకోసం కాదు. వాళ్ళమ్మ బాగా బెంగ పడింది. ఒకసారి దూరం నుండే చూస్తుందట” అన్నారాయన బింకంగా.
“ప్రయత్నిస్తాను” అన్నాడు సాగర్.
“ప్రయత్నం కాదు. సాయంత్రం ఆరు గంటలకి మేం బీచ్‌లో కారులో కూర్చునుంటాం. అక్కడికి దగ్గర్లోనే కూర్చోండి. చూసెళ్ళిపోతాం” అంటూ వెళ్ళిపోయేరాయన.
సాగర్ స్తబ్దంగా నిలబడిపోయేడు చాలాసేపు.
“ఏవంటాడు బావా ముసలాయన!” అంటూ మెల్లిగా వచ్చడిగింది లత.
“కూతుర్ని చూడాలనుందట.”
“అంత ప్రేమున్నవాడు – పెళ్ళి దగ్గరుండి చేయించొచ్చు కదా! అప్పుడు పెద్ద భేషజాలు! ఇప్పుడు ప్రాకులాటలు” అంది లత కోపంగా.
ఆ మాట విన్నాడు శేషయ్య.
“ఈ మాట నీకో కూతురు పుట్టి దాని పెళ్ళది చేసుకుంటుంటే అప్పుడు చెప్పు. ఇప్పుడు కాదు.” అన్నాడు కోపంగా.
“నేను మీలా ప్రవర్తించను” అంది లత అంతకంటే ఆవేశంగా.
“మధ్యలో మీరెందుకు దెబ్బలాడుకుంటారు! ఇది మీ సమస్య కాదు గదా!” అంటూ బయటికి నడిచేడు సాగర్.
మనసంతా కలచేసినట్లు చిరాగ్గా తయారయింది.
నిశాంత పెళ్ళి సమయంలో ఎంత హుందాగా ప్రవర్తించినా మనసు చాల శూన్యంగా మారింది. దాన్ని దేంతో నింపుకోవాలో తెలియడం లేదతనికి. ఎన్నో సంవత్సరాలుగా రోజురోజుకి చిగురించి మహావృక్షంలా తయారైన తనలోని ప్రేమని ఒక్కసారి పెకిలించడం అతని తరం కావడం లేదు. అందుకే నిశాంతని సాధ్యమైనంత వరకు కలవకూడదని నిర్ణయించుకున్నాడు. కాని, నవనీతరావుగారి మాట తీసేయలేక బయటకెళ్ళి ఫోను చేసేడు.
‌నిశాంతే రిసీవరెత్తింది.
“నేను సాగర్ ని. బాగున్నావా?”
“ఇన్నాళ్ళకడుగుతున్నావా నా బాగోగులు! నేను మీ ఇంటికొచ్చేను తెలుసా?” అంది నిశాంత నిష్టూరంగా.
“లత చెప్పింది. ఈ రోజొకసారి గాంధీ బీచ్ కి వస్తావా? నీతో మాట్లాడాలి.” అన్నాడు.
“ఏం, ఇంటికే రాకూడదూ!”
“అది కాదు. నీతో పర్సనల్ గా మాట్లాడాలి.”
“సరే. ఆరింటికి వుండక్కడ!”
“థాంక్యూ” అంటూ రిసీవర్ క్రెడిల్ చేసేడు సాగర్.

*************

నిశాంత కారు దిగుతుంటే అక్కడే నిలబడ్డాడు సాగర్.
ఆమెకు నవ్వుతూ ఎదురెళ్ళి “కొత్త కారా?” అన్నాడు.
“అవును. తను మారుతీ థౌజండ్ కొనుక్కున్నారు. నాకీ చిన్న మారుతీ కొనిచ్చేరు.” అంది నిశాంత.
నిశాంత కారు దిగి సాగర్ తో నడవడం నాలుగు కళ్ళు ఎంతో ఆర్తిగా గమనిస్తున్న సంగతి నిశాంతకేమాత్రం తెలీదు.
సాగర్ మాత్రం ఆమె తమ కారునెక్కడ గుర్తు పడుతుందోనని అటు దృష్టి పడకుండా ఆమెని నడిపిస్తూ కారుకి కొంత దూరంలో – “కూర్చుందామా?” అనడిగేడు.
నిశాంత తలూపి “ఏంటి చెప్పంతర్జంటు పనేమొచ్చింది నాతో!” అనడిగింది.
సాగర్ చిన్నగా నవ్వి “పనేం లేదు. చూడాలనిపించిందంతే!” అన్నాడు.
నిశాంత అతనివైపు పరిశీలనగా చూసి “నేను మాత్రం నీతో చాల మాట్లాడాలనే వచ్చేను.” అంది.
“ఏంటది?”
“నామీదొక అభాండం వేసింది లత!”
సాగర్ తెల్లబోతూ “అభాండమా! ఏమంది?” అన్నాడు కంగారుగా.
“కొంప మునిగేదేమీ కాదనుకో. కాని తొందరపాటుతో తననవసరంగా కాళ్ళిరగ్గొట్టుకుంది.”
సాగర్ అర్ధం కానట్లుగా చూశాడామెవైపు.
“ఏం లేదు. మనిద్దరం చాల స్నేహంగా వుండటం మీ మామయ్యకి తెలుసు కదా! ఆయన మన గురించి అపార్థం చేసుకున్నాడు.”
“అంటే?”
“ఏముంది. మనిద్దరం ప్రేమించుకున్నామని. ఆ మాటే లతతో చెప్పాడట. లత ఆవేశంతో మేడ మీద నుండి దూకింది.”
“మనం ప్రేమించుకుంటే లత దూకడమెందుకు?” అన్నాడు కొంత చిరాగ్గా.
“నీ బుర్ర ట్యూబులైటయిపోయిందీ మధ్య! లత నిన్ను ప్రేమించింది కాబట్టి!”
ఆ జవాబు విని అదిరిపడ్డాడు సాగర్.
“లత నన్ను ప్రేమించడమేంటి మీనింగ్ లెస్! మామయ్య నాతో వేరుగా చెబితే?”
“కావాలనే అలా చెప్పేడు సాగర్! లత నాకంతా చెప్పింది. ఆ అమ్మాయి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నా పెళ్ళి వేరే జరిగిపోవడంతో తనకి మనం ప్రేమించుకోలేదని అర్థమయింది. అందుకే అంత ఉత్సాహంగా శక్తి కూడదీసుకుని నడుస్తోంది. దయచేసి లతని పెళ్ళి చేసుకొని ఆమె జీవితాన్ని బాగు చెయ్యి!”
ఆమె చివరి మాటకి ఉలిక్కిపడ్డాడు సాగర్.
“సారీ! అది కుదరదు ‌”
“ఎందుకని?” నిశాంత కంఠం తీవ్రంగా ధ్వనించింది.
“నేనామెనా దృష్టితో చూడలేదు.”
“పోనీ… ఇప్పుడు చూడు. లత కూడ పోస్టుగ్రాడ్యుయేషన్ చేసింది. మనం ప్రేమించిన వాళ్ళ కన్నా‌‌‌… మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకోవడంలో సుఖముంది.”
సాగర్ జవాబు చెప్పలేదు. ‌‌సముద్రం కేసి చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు.
“మీ మామయ్య నిన్ను చదివించేడు. ఆ రుణం తీర్చుకోడానికన్నా… లతని చేసుకో సాగర్!” అంది అనునయంగా.
సాగర్ ఆమె వైపు చూపు తిప్పి” రుణాల కోసం చేసుకున్న పెళ్ళిళ్ళు సవ్యంగా వుండవు నిశాంతా!” అన్నాడు.
“పోనీ… ఎవర్నయినా ప్రేమించేవా, అది చెప్పు!”
నిశాంత ప్రశ్నకి తెల్లబోతూ “అదేం లేదు! అదేం లేదు!” అన్నాడు.
“అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా?”
సాగర్ ఏమిటన్నట్లుగా చూశాడు.
“నువ్వు నన్ను ప్రేమించి భగ్న ప్రేమికుడై తిరుగుతున్నావట. సరిగ్గా నిద్ర పోవట. అన్నం తినవట. ఇది పుకారుగా పరిణమించిందంటే లేనిపోని అనర్ధాలు జరుగుతాయి.”
“ఎవరన్నారలా?” సీరియస్ గా అడిగేడు సాగర్.
“ఈ రోజు లత. రేపు ఇంకా చాలమందనచ్చు.”
“ఛీ! ఛీ! అంత చదువుకొనలా మాట్లాడిందా? నే కోప్పడతాను.” అన్నాడు సాగర్.
“నే చెబుతున్నది లతని కోప్పడమని కాదు. నల్గురికి మరోలా అనుకునే అవకాశం యివ్వడం దేనికి? నువ్వెందుకేదో పోగొట్టుకున్నట్లుండటం!”
సాగర్ ఆమె ప్రశ్నకి వెంటనే జవాబు చెప్పలేనట్లుగా చూశాడు.
“మాట్లాడవేం?”
“నిశాంతా, చదువుకొని నువ్వు కూడ ఇంగితం లేనట్లు మాట్లాడుతున్నావు. నీతో ఇన్ని సంవత్సరాలు కలిసి తిరిగేను‌. ఒక్కసారే నీ స్నేహం దూరం కాగానే నేను ఒంటరినయినట్లుగా ఫీలయిన మాట వాస్తవమే. నీకేం – నీకు హితేంద్ర తోడున్నాడు. నీది కొత్త సంసారం. మా గురించి ఆలోచించే తీరిక, అవసరముండదు” అన్నాడు ఉక్రోషంగా.
నిశాంత అతని బాధనర్ధం చేసుకుంది.
చిన్నగా నవ్వడానికి ప్రయత్నించి “మన జీవితాలు రైలు ప్రయాణాల్లాంటివి. ఎవరి గమ్యమొస్తే వాళ్ళం దిగిపోతాం. అందుకే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి దిగులు దేనికి, లతని పెళ్ళి చేసుకొని నువ్వూ నీ లోకంలో పడమని చెబుతున్నాను.” అంది.
సాగర్ జవాబు చెప్పలేదు.
నిశాంత వాచి చూసుకొని “వస్తాను. ఆయనిప్పుడొకసారి నాకు ఫోను చేస్తారు. ఈసారి మనం కలుసుకుంటే – అది నిన్ను లతతో జంటగానే. ఇందులో శాసింపు లేదు.” అంటూ లేచి నిలబడింది.
సాగర్ కూడ ఆమె వెంట నడిచేడు.
ఆమె కారెక్కి “రా డ్రాప్ చేస్తాను” అంది‌.
“వద్దులే నాకు శాంథోమ్ రోడ్డులో చిన్న పనుంది.” అన్నాడు.
నిశాంత చెయ్యి వూపి వెళ్ళిపోయింది.
నిశాంత కారు మరుగు కాగానే సాగర్ నవనీతరావున్న కారు దగ్గరగా వచ్చాడు. అప్పటికే వసుంధర నిశ్శబ్దంగా ఏడుస్తూంది.
సాగర్ గాభరాగా ఆమె వైపు చూశాడు.
“ఏం లేదులే. ఆడవాళ్ళకో అదృష్టముంది. వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు కన్నీటి రూపంలో కక్కుకుంటారు.”
“ఏం కాదు. నేను దాంతో మాట్లాడతానంటే వీల్లేదన్నారు ఈయన!”
“అవునయ్యా! కేవలం దూరం నుండి దాన్ని చూస్తాననొచ్చింది. ఇప్పుడెళ్ళి కౌగిలించుకుంటుందట. మాట తప్పితే నాకు మహా చిరాకు.” అన్నాడు నవనీతరావు సీరియస్ గా సిగరెట్టు కాలుస్తూ.
సాగర్ ఆయన వైపు విభ్రాంతిగా చూస్తూ “మీరు సిగరెట్ కాలుస్తున్నారా?” అన్నాడు.
“మగవాళ్ళకొక అవకాశముంది – వాళ్ళ బాధల్ని సిగరెట్లు, మందు తాగి మరచిపోవాలని చూస్తారు ” అంది వసుంధర ఆవేశంగా.
“దెబ్బకి దెబ్బ కొట్టేనని మురిసిపోతున్నావా?”
“లేదు. వున్న మాట చెప్పేనని సంతోషపడుతున్నాను. లేకపోతే చూడయ్యా సాగరూ! దాని పెళ్ళయ్యేక ఈయన కట్టలు కట్టలు సిగరెట్లూ, సీసాలు సీసాలు మందూ తాగుతున్నారు!” అంది వసుంధర బాధగా.
“సర్! మీరిలా చేయడం.‌‌..”
“భావ్యం కాదంటావు. డాక్టరువి కదా! అంతకన్నా ఏం చెబుతావు. ఊరు పొమ్మంటున్నది – కాడు రమ్మంటున్నది‌. ఇప్పుడిక ఈ జాగ్రత్తలన్నీ దేనికి? ఇంతకీ అసలది మా గురించి ఒక్క మాటన్నా అడిగిందా?” అనడిగేడు నవనీతరావు సాగర్ మొహంలోకి నిశితంగా చూస్తూ.
‘లేదు’ అనలేకపోయేడు సాగర్.
“ఎందుకడగదండీ! మీ మీద తనకి మాత్రం ప్రేముండదా?” అన్నాడు సాగర్ నవ్వడానికి ప్రయత్నిస్తూ.
“నీ నాన్చడంలోనే తెలుస్తోందది మా గురించసలు మాట్లాడలేదని. సరే! కారెక్కు. నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను.” అంటూ డోర్ తెరిచేడు నవనీతరావు.
సాగర్ కారెక్కేడు.
“చాల సేపు మాట్లాడింది. వాళ్ళాయన గొప్పలు చెప్పిందా?” కారు మెయిన్ రోడ్డెక్కిస్తూ అడిగేడు.
“అబ్బే అదేం లేదు. నా పెళ్ళి గురించడిగింది‌”
“అబ్బో, పెద్ద ఆరిందా అయిపోయిందన్న మాట!”
అతని మాటలకి జవాబు చెప్పలేదు సాగర్.
“ఇంతకీ ఏవన్నా విశేషమా?” అని మెల్లిగా అడిగింది వసుంధర.
“అంటే?” సాగర్ అర్థం కానట్లుగా అడిగేడు.
“ఛ! అతన్ని పట్టుకొని వెధవ ప్రశ్నలేస్తావు!
నిజానికి పిల్లల్ని కనడం ఖర్మగాని – విశేషం కాదు!” అన్నాడు నవనీతరావు కోపంగా.
అప్పుడర్ధమయింది సాగర్ కి వసుంధర దేని గురించి మాట్లాడుతుందో.
వాళ్ళ ప్రేమ, వ్యధ అర్ధమయి జాలి పడ్డాడు వాళ్ళపై..
కారు అతనింటి ముందాగింది.
సాగర్ కారు దిగి ‘నమస్కారం’ అన్నాడు.
“థాంక్సయ్యా! నా మాటకి గౌరవమిచ్చేవు. అది దర్జాగానే ఉందిగా. మేం కూడ అలానే ఉంటాం. వస్తాం!” అంటూ నవనీతరావు ఎక్సిలేటర్ ని బలంగా తొక్కేడు.
కారు ముందుకి దూకినట్లు పరిగెత్తింది.

*************

నువ్వీ మధ్య సాగర్ ని కలిసేవా?”
భర్త ప్రశ్నకి “అవును. ఏం?” అనడిగింది నిశాంత.
వాణ్ణి బీచ్‌లో కలుసుకొని మాట్లాడాలసిన పనేమొచ్చింది నీకు!”
మొదటి సారి భర్త మీద ఒకలాంటి నిమ్న భావమేర్పడింది నిశాంతకి.
“సాగర్ ని అంత నీచంగా మాట్లాడుతున్నారు దేనికి?” అంది నిదానంగా.
“ఓహో! వాణ్ణి ఘనంగా గౌరవించాలన్న మాట!”
“ఘనంగా అక్కర్లేదు. ‘అతను’ అనొచ్చుగా!”
“ఏమో వాణ్ణి చూస్తే నాకలా గౌరవించాలనిపించదు. అసలింతకీ బీచ్‌లో మంతనాల సంగతి చెప్పనే లేదు?”
“మంతనాలేం లేవు. అతను నా గుడ్ ఓల్డ్ ఫ్రెండ్. మాట్లాడాలనిపించి వెళ్ళేను. స్నేహితుల యోగక్షేమాలు కనుక్కోవడం తప్పా?”
“అబ్బే, తప్పేం లేదు. యోగక్షేమాలు సముద్రపుటొడ్డునే తెలుసుకోవాలా!” అన్నాడు హితేంద్ర వెటకారంగా.
“వెటకారాలెందుకు. మీరేం అనదలచుకున్నారో అది చెప్పండి చాలు!” అంది నిశాంత దెబ్బ తిన్న అహంతో.
“నేనేం అనడం లేదు. నల్గురూ అన్నది నా చెవి దాక వచ్చి అడుగుతున్నాను.”
“నల్గురా?”
“అవును. తబలా ప్రవీణ్ మీ ఇద్దర్నీ బీచ్‌లో చూశాడట. చిత్రరంగం జర్నలిస్టు శ్రీకాంత్ కూడ మీ గురించి చెప్పేడు ‌”
“ఏముందని చెప్పడానికి! అది వందలాది మంది కూర్చుని మాట్లాడుకునే స్థలమేగా!” అంది నిశాంత కోపంగా.
“ఇప్పుడు నువ్వేదో తప్పు చేసేవనడం లేదు డియర్! నల్గురికి నువ్వేదో చేసేవని అనుకునే పరిస్థితులు కల్పించడం దేనికి?” అన్నాడు హితేంద్ర కొంచెం మెత్తబడినట్లుగా నవ్వి.
నిశాంత మాత్రం నవ్వలేదు.
భర్త మాటలు ఆమె గుండెలో గుచ్చుకున్నాయి.
“మీరీ మధ్య చాల మారిపోయేరు. సినిమా గాలి వంటబట్టినట్లుంది. సాగర్ మీ ప్రోగ్రాం గురించి ఎంత కష్టపడ్డాడో అప్పుడే మరచిపోయినట్లున్నారు. అతని బాగోగులు తెలుసుకోవడం తప్పని నేననుకోలేదు. ఈ మాత్రానికే నేరస్థురాలిలా నన్ను నిలేస్తారని అసలనుకోలేదు.” అంది ఉబుకుతున్న కన్నీళ్ళతో.
పరిస్థితి విషమిస్తోందని అతను గ్రహించేడు.
ఆమె భుజాల మీద చేతులేసి దగ్గరకి లాక్కుంటూ ” పిచ్చీ నీ మీద విపరీతమైన ప్రేమే నా చేతిలా మాట్లాడించింది. సారీ! కాని… ఆ సాగర్ నన్ను చూసి ప్రోగ్రాం కోసం కష్టపడలేదు. అదంతా నీ మీద ప్రేమ చేత. నువ్వు చెయ్యి జారిపోయేవని ఏడుస్తున్నాడు. నీకవేం తెలియవు.” అన్నాడు నవ్వుతూ.
నిశాంత అతని చేతుల్ని తోసేసింది.
“మీకెలా తెలుసు!”
“కాస్టరాయిల్లా – వాడి మొహం చూస్తే తెలియడం లేదూ! ఏదో పోగొట్టుకున్న ఫోజు పెట్టి తిరుగుతున్నాడు.”
నిశాంత చిరాగ్గా చూసింది భర్తవైపు.
“ఫేస్ రీడింగు నాకు రాదు లెండి” అంది కోపంగా.
“సరే – వాడి సంగతి వదిలెయ్! ఈసారి నీతో మాట్లాడాలని వుంటే ఇంటికి రమ్మను. ఎవరు కాదన్నారు! ఈ నాలుగ్గోడల మధ్య ఏం జరిగినా అది బయటకి పోదు.నేను పబ్లిక్ ఫిగర్ ని. ఆ విషయం గుర్తుంచుకో!”
భర్త మాటలామెకు కొరుకుడు పడలేదు.
ఎక్కువగా అర్థం చేసుకుంటే అందులో ఏదో‌ అనర్ధమే వున్నట్లనిపించిందామెకు.
అందుకే లేచి వెళ్ళింది – వంట గదిలో అత్తగారికి సాయపడేందుకు.

*************

ఫోను అదే పనిగా రింగవుతుంటే హితేంద్ర రిసీవరందుకొని “హితేంద్రా స్పీకింగ్!” అన్నాడు.
ఆ పక్కనే కూర్చుని చీరకి ఫాల్ కుట్టుకుంటున్న నిశాంత ఈ మధ్య అతని గొంతులో వచ్చిన ధీమాని గమనిస్తోంది.
“హలో హితేంద్రా! మీరింట్లోనే వున్నారా?” అన్నాడు సాగర్.
“ఏం, వుండననుకొని చేసేరా! మీ ఫ్రెండ్ ని పిలవమంటారా?”
“అబ్బే, మీరు చాల బిజీ అయినట్లు పేపర్లో చూస్తున్నాను. మీరు మాత్రం నా ఫ్రెండ్ కాదా! రేపు రాజేశ్వరి కళ్యాణ మంటపంలో నా పెళ్ళి. మీరిద్దరూ తప్పకుండా రావాలి!”
“వెరీ సర్ప్రయిజింగ్ న్యూస్! మీరప్పుడే పెళ్ళి చేసుకుంటారనుకోలేదు.” అన్నాడు హితేంద్ర వెటకారంగా నవ్వుతూ.
నిశాంతకి అటునుండి మాట్లాడుతున్నదెవరో అర్ధం కాలేదు.
ఆసక్తిగా వింటోంది హితేంద్ర మాటల్ని.
“నాక్కూడ జాబ్ దొరికే వరకు పెళ్ళి చేసుకోవడం యిష్టం లేదు. కాని… మా మామయ్య తొందరపడుతున్నాడు. పెళ్ళికూతురు నా మరదలే! లత!”
“అయిసీ! ఉద్యోగమొచ్చినా మేం ఒకరోజు పాడి సంపాదించినంతుండదనుకుంటాను మీ నెల సేలరీ!”
నిశాంతకి అతని మాటల పధ్ధతి నచ్చడం లేదు.
“ఎవరితో మీరు మాట్లాడుతున్నది?” అంటూ అడ్డం పడింది.
“సరే! ఇప్పుడే బెస్ట్ విషెస్ చెబుతున్నాను. మీ ఫ్రెండ్ మాట్లాడుతుందట. నాకు రికార్డింగ్ టైమయింది” అన్నాడు రిసీవర్ నిశాంత చేతికిస్తూ.
“హలో, నిశాంతా! నీ కోరిక తీరుస్తున్నాను. రేపే లతతో నా పెళ్ళి ‌ మనల్ని ప్రేమించిన వాళ్ళని కట్టుకుంటే చాల సుఖముందని శెలవిచ్చేవుగా. అనుభవమున్న దానివి చెప్పేక వినాలిగా. పెళ్ళికి తప్పక వస్తువుగా!” అన్నాడు సాగర్.
నిశాంత మొహంలో సంతోషం చోటు చేసుకుంది.
“తప్పకుండా వస్తాను. ఎన్నింటికి?”
“ముహూర్తం రాత్రికనుకో. కాని… ‌ నువ్వు ప్రొద్దుటే రావాలని చెప్పమంది లత!”
“అలాగే… కాని.‌‌.. మా డేడీ వాళ్ళొస్తున్నారా?” అనడిగింది నిశాంత మెల్లిగా.
హితేంద్ర డ్రెస్ మార్చుకుంటున్నట్లుగా ఆమె మాటల్ని వింటున్నాడు ఒక చెవి పడేసి.
“పిలుస్తున్నాను. వస్తే ఏం, వాళ్ళు నీ తల్లిదండ్రులు కాదా! నీకేం అపకారం చేసేరని! ఈ విధంగా కలిస్తే సంతోషమేగా!”
“సరే!” అంటూ రిసీవర్ క్రెడిల్ చేసింది నిశాంత.
“ఏంటి – మీ వాళ్ళొస్తున్నారటా?”
“తెలీదు. పిలుస్తున్నాడట!”
“వాళ్ళొస్తే నువ్వెళ్ళకు!”
“అదేంటి?” ఆశ్చర్యపోతూ అడిగింది.
“వెళ్తే వాళ్ళు నీతో మాట్లాడుతారు. అది నాకిష్టం లేదు.”
“ఎందుకని?” అంది సుభద్రమ్మ లోనికొచ్చి కోపంగా.
హితేంద్ర తల్లి వైపు కోపంగా చూసి “నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా భార్యతో మాట్లాడుతున్నాను.” అన్నాడు విసురుగా.
“మాట్లాడటం లేదు. శాసిస్తున్నావు. అప్పుడే నీ కళ్ళు నెత్తకెక్కేయి. ఆ దేవత వలనే నువ్వీ స్థితిలో వున్నావు. అప్పుడే అది మరచి క్షణ క్షణానికి కండిషన్లు పెడుతున్నావు!”
“అత్తయ్యా!” అంది నిశాంత బాధగా.
సుభద్రమ్మ కోడలివైపు బాధగా చూసింది.
“మాటిమాటికి నావలనే ఆయనంత వారయ్యేరని ఆయన మనసు నొప్పించకండి. దాని వలన మేం మరింత దూరమవడమే గాని ప్రయోజనముండదు.” అంది వేదనగా.
“అబ్బ! సూపర్ గా వుంది నటన! నాకిష్టం లేని పనులు చెయ్యడం, నామీద ప్రేమ ఒలకపోయడం.” అంటూ సర్రున బయటికెళ్ళి కారెక్కేడు హితేంద్ర.
కారు సాగిపోయింది.
“వాడొక మృగంలా మాట్లాడుతున్నాడు. వాడి మాటలకేం గాని నువ్వెళ్ళు” అంది సుభద్రమ్మ కోడలి భుజమ్మీద చెయ్యేసి అనునయంగా.
“వద్దులెండి. ఆయనకిష్టం లేని పనులు నేను మాత్రమెందుకు చేయడం!” అంటూ తన గదిలోకెళ్ళిపోయింది నిశాంత.
మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది బాధగా.
ఇప్పుడు భర్త రూపం మరో కోణంలోంచి విభిన్నంగా కనబడుతోంది ‌ రోజు రోజుకి అతనిలో అహం వరద మట్టంలా పెరుగుతూ కనిపిస్తోంది.
ఇందులో తన తప్పులు కూడ ఏమైనా వున్నాయా?
మగవాళ్ళు సహజంగా భార్య విషయంలో చాల సంకుచితంగా వుంటారు. ఇతర స్త్రీల పట్ల చూపించే విశాల భావాల్ని తమ భార్యలకి వర్తించనివ్వరు. హితేంద్ర కూడ సాగర్ విషయంలో అలానే బాధపడుతున్నాడు. తనకి తన సంసారం ముఖ్యం. తనని ప్రేమించే భర్త కోసం సాగర్ కి దూరంగా వుంటే తప్పేంటి?
భార్యాభర్తలు ఒకరి మనసొకరు తెలుసుకుని ప్రవర్తిస్తే సమస్యలెందుకొస్తాయి!
ఇలా అనుకోగానే నిశాంత మనసు చల్లబడింది.
వెంటనే లేచి టేబుల్ మీద అత్తగారికి – తనకి భోజనం వడ్డించి ”రండి, భోంచేద్దాం” అంది.
సుభద్రమ్మ ఆశ్చర్యపోతూ “వాడన్న మాటలకి కోపం రాలేదా!” అనడిగింది.
నిశాంత మెత్తగా నవ్వి “కోపాల వలన ప్రయోజనమేముంటుంది! సమస్యల్ని పరిష్కరించుకోవాలి గాని” అంది భోజనానికుపక్రమిస్తూ.
“అంటే… ఏం నిర్ణయించుకున్నావు?”
“ఏముంది, ఆయనకిష్డం లేని పని చేయడం మానేస్తే ఏ గొడవలూ వుండవుగా!”
“అంటే నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటావన్న మాట!”
“వ్యక్తిత్వాలని ప్రతి దానికి పంతానికి పోతే… ఏ సంసారాలూ సాగవు. భోం చేయండి.”
సుభద్రమ్మకి నిశాంత మనసు అంతు బట్టలేదు. ‘అల్లారు ముద్దుగా పెరిగి ఈ పిల్ల ఇంతగా సర్దుకుపోతున్నదేంటి?’ అనుకుంది మనసులోనే.

*************

లత సాగర్ ల పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది. నిశాంత రాకపోవడం అక్కడందర్నీ నిరుత్సాహానికి గురి చేసింది.
ఒక్క సాగర్ మాత్రం కొంతలో కొంత పరిస్థితినాకళింపు చేసుకున్నాడు. అయిన ఆ సంగతెవరితోనూ అనలేదు.
కూతుర్ని చూడాలని – వస్తే మాట్లాడాలని కొండంత ఆశతో వచ్చిన వసుంధర కన్నీటి పర్యంతమైంది.
నవనీతరావు బయటపడటం లేదు గాని అతని పరిస్థితి అలానే ఉంది. తనలోని నిస్పృహని కోపంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడాయన.
“దానికిప్పుడు కళ్ళెక్కడ కన్పిస్తాయి. తన పెళ్ళికి సాక్షి సంతకం చేసిన మనిషిని కూడ మరచిపోయింది. అదిప్పుడొక గొప్ప సింగరు పెళ్ళాం. దానికెక్కడేడ్చింది వ్యక్తిత్వం!” అన్నాడు కోపంగా.
“అలా అనకండి. ఆ అమ్మాయిలో గర్వం మచ్చుకైనా లేదు. ఏదో రాకూడని పరిస్థితి ఏర్పడుంటుంది!” అన్నాడు శేషయ్య.
“ఏది ఏమైనా మేమిద్దరం వెళ్ళి నిశాంతకి కనిపించొస్తాం. అక్కయ్యే ఈ పెళ్ళి కావడానికి కారణం” అంది లత.
లత, సాగర్ రాత్రికి రాత్రే మంటపం నుండి కారులో నిశాంత ఇంటికి బయల్దేరి వెళ్ళేరు.
కాలింగ్ బెల్ మోగగానే భర్తనుకొని తలుపు తీసింది నిశాంత.
కళ్యాణపు బొట్టులతో – పూలదండలతో గుమ్మంలో నిలబడి వున్నారు లత, సాగర్.
నిశాంత కొన్ని క్షణాలు విభ్రమానికి గురయింది.
“మీరా?”
అవునన్నట్లుగా తలూపేడు సాగర్.
“మంటపం నుండి తిన్నగా వస్తున్నారా?”
“అవును” అంది లత.
నిశాంత గబగబా లోనికెళ్ళి కర్పూరం పళ్ళెంలో వెలిగించుకునొచ్చి దిష్టి తీసిందిద్దరికీ.
ఇద్దరూ లోనికొస్తూ “నువ్వు పెళ్ళికి రాలేదు. ఎందుకని రాలేదో మాకు తెలీదు. కాని లత నీ ఆశీర్వాదం లేందే ఇంటికి రానని పట్టుబట్టింది. అందుకే వెంటనే వచ్చాం!” అన్నాడు.
సరిగ్గా అప్పుడే సుభద్రమ్మ కుంటుతూ వచ్చి “రావాలనే బయల్దేరింది. ఇంతలో నేను కాలుజారి పడ్డాను. ఎముక విరగలేదు కాని బెణికింది. నన్నొదిలేసి రాలేక… పాపం ఆగిపోయింది.” అది.
అత్తగారాడుతున్న అబధ్ధానికి ముందు తెల్లబోయింది నిశాంత. కాని వెంటనే సర్దుకొని “కూర్చోండి” అంది.
“నేను చెప్పలేదు బావా, అక్క మన పెళ్ళికి రానంత గర్వస్తురాలయిపోయిందని అందరూ అనవసరంగా ఆడిపోసుకున్నారు.
నాకు మాత్రం తెలుసు మా అక్క మంచితనం” అంది లత గర్వంగా సాగర్ వైపు చూస్తూ.
నిశాంత లోనికెళ్ళి తన దగ్గర కొత్తగా కొన్న బనారస్ పట్టుచీర, జాకెట్టు గుడ్డ, తన నగల్లోని ఒక కెంపు రంగు నెక్లేస్ తెచ్చి బొట్టు పెట్టి లత చేతిలో పెట్టింది.
“ఇవన్నీ వద్దక్కా. నీ ఆశీర్వాదముంటే చాలు!” అంటూ లత వంగి నిశాంత కాళ్ళకి దణ్డం పెట్టబోయింది.
“అసలే ఈమధ్య ఆపరేషనయినదానివి” అంది నిశాంత మధ్యలోనే అడ్డుకుంటూ.
“ఇంకా ఎక్కడాపరేషనక్కా! నాకెప్పుడో తగ్గిపోయింది” అంది లత ఆనందంగా.
“సంతోషంలో పడి హెల్త్ ని కేర్ లెస్ చేయకు” అంది నిశాంత.
సాగర్ మాత్రం ఏం మాట్లాడలేదు.
“వస్తాం” అంటూ వాళ్ళిద్దరూ వెనుతిరిగి వెళ్తుంటే కనిపించినంతసేపూ ఆనందంగా చూసి వెనుతిరిగింది.
వెంటనే అత్తగారాడిన అబధ్ధం గుర్తొచ్చి “అలా చెప్పేరెందుకత్తయ్యా?” అనడిగింది.
“ఏం చెప్పను. వాడి సంగతి బయటపెడితే వాణ్ణసహ్యించుకుంటారు. దాన్ని దాస్తే నీకు గర్వమొచ్చిందనుకుంటారు. అందుకే ఇద్దరికీ చెడ్డపేరు రాకూడదనలా చేసేను” అంది సుభద్రమ్మ.
నిశాంత దీర్ఘంగా నిశ్వసించి తన గదిలోకెళ్ళింది భారంగా.

*************

హితేంద్ర ఆరోజు చాల సంతోషంగా వున్నాడు. మాటి మాటికి నిశాంతని పిలుస్తున్నాడు.
సుభద్రమ్మ, నిశాంత కూడ అతని ప్రవర్తనకాశ్చర్యపోతూన్నారు.
“ఆ భగవంతుడు నా మొర విని వాడి బుధ్ధి మార్చేడేమో!” అంది సుభద్రమ్మ.
“ఏంటి చిన్నపిల్లలు లేని లోటు తీర్చాలనా – అలా గొడవ చేస్తున్నారు?” అంది నిశాంత అతని పక్కన కూర్చుని నవ్వుతూ.
హితేంద్ర తన తల ఆవిడ వడిలో పెట్టి పడుకొని “ఆ సంగతే అడుగుదామని! మన పెళ్ళయి ఎన్నాళ్ళయింది?” అనడిగేడు.
“పదకొండు నెలల ఇరవై మూడు రోజులు.”
“అబ్బా! ఎంత కరెక్టుగా చెప్పేవ్? మన మేరేజ్ ఏనివర్సరీ దగ్గరకొచ్చేస్తుందన్న మాట! నీకేం గిఫ్ట్ కావాలి!” అనడిగేడు సంతోషంగా.
“నాకన్నీ వున్నాయి. ఆరోజు ప్రత్యేకంగా తీసుకోవాల్సినవేం లేవు. మీకు వీలయితే గుడికెళ్ళొద్దాం.” అంది నిశాంత.
“నాకు మాత్రం ఒక గిఫ్ట్ కావాలి!”
“ఏంటది?”
“ఓ బాబునో… పాపనో…!” అంటూ భార్య వైపు ఓరగా చూసేడు.
నిశాంత సిగ్గుగా చూపులు దించుకుంది.
“ఏంటి అంత సిగ్గా?”
“ఛ! ఏం మాటలు – అంతా నా చేతిలో ఉన్నట్లు?” అంది మెల్లగా.
“అంటే నేను కనాలా?”
“నాకలా మాట్లాడితే కోపం వస్తోంది!”
“మరేంటింతాలస్యం! నువ్వు డాక్టరివి కదా – ఏదైనా చేసి కనడం లేదేమోనని నా భయం!”
“నాకంత ఖర్మేంటి? పిల్లలంటే నాకిష్టం లేదా? పైగా పొద్దున్న వెళ్ళి ఏ అర్ధరాత్రో వస్తారు మీరు! నాకు కాలక్షేపం కూడ కావడం లేదు.” అంది నిశాంత.
హితేంద్ర ఆమెని నిశితంగా గమనిస్తూ “అయితే… ఒకసారి డాక్టరుకి చూపించుకోరాదూ!” అన్నాడు.
నిశాంత తలూపింది.
“నీకో మంచి సంగతి చెబుతున్నాను. టి.నగర్ లో హబీబుల్లా రోడ్డులో ఒక ఇల్లమ్మకంలో వుంది. ఒక ప్రముఖ తమిళ నటుడిల్లది. అక్కడ నడిగరసంగం దగ్గరే పూర్వం ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు లాంటి మహానటులుండేవారు. ఆ ఏరియాలో ఇల్లు కొనడం మాటలు కాదు. అది కొందామనుకుంటున్నాను.” అన్నాడు హితేంద్ర.
“మన ముగ్గురికీ ఈ యిల్లు చాలదా?” అంది నిశాంత.
హితేంద్ర ఆమెని పిచ్చిదాన్లా చూసి “ఇక్కడ చాలకపోవడం సమస్య కాదు. నా స్టేటస్ పెరిగింది. దానికి తగినట్లే ఇల్లుండాలి!” అన్నాడు.
“మీ యిష్టం!”
“అలా అన్నావ్ బాగుంది. భార్య భర్తతో సహకరించాలి. ఆ యిల్లు చాల ఖరీదు చెబుతున్నాడు. నా దగ్గర కొంత తగ్గేట్లుంది. అదే ఆలోచిస్తున్నాను.” అన్నాడు హితేంద్ర.
“పోనీ… అంత డబ్బున్నప్పుడే కొందాం.” అంది నిశాంత.
“అంతవరకా యిల్లుంటుందా? ఆ యిల్లు చూస్తే మూర్ఛపోతావ్. అంత బాగా కట్టేరు. స్విమ్మింగ్ పూల్ కూడ వుంది.”
“మరేం చేద్దామంటారు?”
“ఓ పని చేస్తే?”
“చెప్పండి.”
“మీ అమ్మగారిచ్చిన నగలు తాకట్టు పెడితే? నువ్వెలానూ పెట్టుకోవుగా!”
“అదా?”
“ఏం, నీకిష్టం లేదా?”
“వాళ్ళ సొమ్ములెందుకు మనం వాడుకోవడమని!”
“బాగుంది. నీకిచ్చేక వాళ్ళదెలా అవుతాయ్!”
“సరే! వాటిని తాకట్టొద్దు. అమ్మేయండి. మళ్ళీ వడ్డీల బాధ దేనికి?” అంది నిశాంత.
హితేంద్ర ఆమె భుజాలు పట్టుకొని “థాంక్యూ డార్లింగ్! నువ్వు సహకరిస్తావని తెలుసు నాకు” అన్నాడు.
నిశాంత నగల పెట్టె తెచ్చిచ్చింది.
“సంవత్సరం తిరిగేలోపున దీని బాబులాంటి నగలు చేయిస్తాను నీకు. డోంట్ వర్రీ!” అంటూ వాటిని అతను హుషారుగా తీసుకెళ్తుంటే నిమిత్తమాత్రురాలిలా చూసింది నిశాంత.

************

ఇంకా వుంది…

1 thought on “చీకటి మూసిన ఏకాంతం – 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *