April 23, 2024

‘ధ్యానం’ అంటే ఏమిటి?

రచన: శారదా ప్రసాద్

ఈ మధ్య కొంతమంది మిత్రులు ‘నేను ఫలానా విధంగా ద్యానం చేస్తున్నాను, అది మంచిదేనా అనో లేకపోతే అటువంటి ధ్యానాన్ని ఏమంటారని ‘ఇలాగా చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు ‘ధ్యానం’ అంటే ఏమిటో తెలుసు కోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఈ మధ్య, చాలా ఊళ్ళల్లో, పెద్ద పెద్ద బానర్లు కట్టి, ‘ మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం, మీ వ్యాపారాభివృద్ధి కోసం నేర్చుకోండి సిద్ధ సమాధి యోగా! ‘అనే ప్రకటనలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. అదేదో వ్యాపార ప్రకటనలాగా నాకు అనిపించింది. నాకు తెలిసినంతవరకూ ‘యోగం’ అనేది ఒకరు నేర్పేది కాదు, అది మనంతట మనమే పొందవలసిన అనుభూతి. సరే, నాకున్న సందేహాలు తీర్చుకుంటానికి ఆ యోగాచార్యుల వారి వద్దకు వెళ్లి, ‘ స్వామీ ! అసలు ‘సమాధి’ అంటే ఏమిటి?’ అని ప్రశ్నిస్తే, అందుకు వారు, సమాధి అంటే, Blankness అని చాలా సింపుల్ గా చెప్పారు. కొద్దిగా వివరించమని అడిగితే, వారు మనకు ఏమి తెలియని స్థితిలోకి వెళ్ళటమే! అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయి, దానివల్ల ఏమిటి ఉపయోగం?మళ్ళీ మనం యధాస్థితిలోకి వచ్చిన తర్వాత ‘తెలియని స్థితిలో’మనం పొందిన అనుభూతులను ఇతరులకు ఎలా చెప్పగలం?’ అనే నా ప్రశ్నకు యోగాచార్యులతో పాటుగా వారి శిష్య బృందం చికాకుపడి, ‘ దయచేసి మీరు వెళ్ళిపొండి, నేర్చుకునేవారికి ఇబ్బంది కలిగిస్తున్నారు!’ అని చెప్పి నన్ను మర్యాదగా బయటకు పంపారు. వారు చెప్పిన Blankness లోకి ఇంతవరకూ ఎవరైనా వెళ్ళారా?అని కొద్దిగా ఆలోచిస్తే, అదిపూర్తి అసంబద్ధం మరియు ఆస్థితిని పొందటమంటే మరణించటంమే!అసలు ‘సమాధి’ అంటే ఏమిటో గీతాచార్యులైన శ్రీ కృష్ణ పరమాత్మ తన ‘గీత’ లో ఎప్పుడో ప్రవచించారు. నాకు అర్ధం అయింది వివరిస్తాను. సమః:+ధీ=సమాధి. ధీ అంటే బుద్ధి, సమః, అంటే సమానంగా ఉండటం. అంటే అన్ని సమయాలలో ఒకే రకంగా ప్రవర్తించటం. కష్టాలు వచ్చినపుడు క్రుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోగుండా సమస్థితిలో ఉండటమే , సమాధి స్థితి(Normal Temperament). ‘A man who is steady both in pains and pleasure is a man, who is going to achieve Serenity”(GEETHA). స్వర్గీయ ఘంటసాల గారి ‘భగవద్గీత’ లో చక్కటి తెలుగులో అట్టి వారిని ‘స్థిత ప్రజ్ఞులు’ అందురు అని అద్భుతంగా చెప్పారు. ఆ స్థితప్రజ్నత్వమే ‘సమాధి’ స్థితి అంటే!ఇక , అసలు విషయానికి వస్తే, ‘ధ్యానం’ అనే పదం మనకు వచ్చింది మొదట బుద్ధుని ద్వారా. అంతకు ముందు, యాగాలు, క్రతువులు లాంటివి చేసేవారు .

చాలా మంది ‘ఏకాగ్రతే'(Concentration) ధ్యానం అనుకుంటారు. ఏకాగ్రత అసలు, ధ్యానమే కాదు!ధ్యానము అంటే ఏమిటో చూద్దాము. ధీ:+యానం=ధ్యానం. ధీ: అంటే బుద్ధి లేక మనస్సు, యానం అంటే ప్రయాణం. ధ్యానం అంటే ‘travel of mind ‘ . The nature of mind is to travel. How can you stop it? ఎవరో, రామకృష్ణ పరమహంసస్వామి వారిని అడిగారుట, ‘స్వామీ. ధ్యానం చేయాలంటే, నాకు ఏకాగ్రత కుదరటం లేదు’అని. అందుకు శ్రీ స్వామి వారు, ‘చూడు నాయనా!ఎవరో, సముద్ర స్నానికి వెళ్లి, సముద్రంలో అలలు తగ్గిన తర్వాత స్నానం చెయ్యొచ్చునని ఎదురు చూస్తున్నాడట! సముద్రంలో అలలు తగ్గేదెప్పుడూ, వాడు స్నానం చేసేదెప్పుడూ?ఏకాగ్రత కుదిరిన తర్వాత ధ్యానం చేయటమూ అంతే!’ రామకృష్ణుల వారు చెప్పిన విషయం అర్ధమై, ధ్యానానికి ఏకాగ్రత ఎటువంటీ అడ్డంకి కాదు అని తెలుసుకొని, ధ్యానానికి ఉపక్రమించాడట. మొదట్లో నేను ధ్యానం చేసేటప్పుడు నాకు చాలా బూతు ఆలోచనలు కూడా వచ్చేవి. వాటిని నేను నిరోధించటానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. కేవలం ఆ ఆలోచనలను సాక్షిభూతుడిగా అప్రయత్నంగా చూస్తుండేవాడిని. కాలక్రమేణా అటువంటి ఆలోచనలు రావటం మానేశాయి. సాధన సాగుతున్న కొద్దీ మన శరీర తత్వానికి ఏమి అవసరమో ఆ ఆలోచనలే వస్తాయి. అనవసరమైన ఆలోచనలు వెళ్లిపోతాయి. ఆ ఆలోచనలలను మొదట్లో బహిష్కరించాలని చూస్తే , అవి మనకు చాలా ఇబ్బందులే పెడుతాయి!ఇక అసలు ధ్యానాన్నిగురించి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి తత్త్వంలో తెలుసుకుందాం.

అనుభవం చెందేవాడు స్థలకాలాలకూ, స్మృతులకూ, ఫలానాది అనే గుర్తింపుకూ కట్టుబడి ఉంటాడు. నిజమైన ధ్యానానికి పునాది అనాసక్తమైన ఎరుక. ఉద్దేశపూర్వకంగా పూనుకొని చేసే ప్రయత్నం నిబద్ధమైన మనసు పరిధిలోనే ఉండిపోతుంది. ఇందులో స్వేఛ్చ ఉండదు. ధ్యానం ఒక చికిత్స. ఒక శస్త్ర చికిత్స. మత్తు ఇచ్చేవాడూ, వైద్యుడూ, సహాయకులూ ఎవరూ లేరు. చికిత్స జరిగి పోతున్నది. కాన్సర్ వ్యాధి కణాలను వైద్యుడు కోసివేసి తొలగించినట్లుగా, కలుషితమైపోయిన ప్రతి భాగాన్ని కత్తిరించి వేయటం జరుగుతున్నది. లేకపోతే ఆ కాలుష్యం మళ్ళీ వృద్ధి చెంది విస్తరించే ప్రమాదం ఉన్నది. ఇది జరిగిపోతూ ఉన్నది. ధ్యానం చెయ్యాలి అని ప్రయత్నించడం అంటే ధ్యానాన్ని తిరస్కరించటమే అవుతుంది. ధ్యానానికి అంతమనేది లేదు, ఒక ఆరంభమూ లేదు. ధ్యానం ఒక గమ్యానికి చేర్చే సాధనం కాదు. ధ్యానమే మార్గం, ధ్యానమే గమ్యం. రెండూ అదే. ఎవరికి వారే తెలుసుకోవాలి తప్ప మరొకరి ద్వారా కాదు. మన మీద ఆచార్యుల, పరమ గురువుల ఆధిపత్యం ఉంటూ ఉండేది. మీకు నిజంగా ధ్యానం అంటే ఏమిటో కనిపెట్టాలని కనుక ఉంటే, అప్పుడు ఆధిపత్యాలను అన్నింటినీ పూర్తిగా సమస్తంగా పక్కకి త్రోసివేయాలి. దు:ఖం అంటే ఏమిటి, దు:ఖం ఎప్పటికైనా అంతమవుంతుందా అనేవి మనకు అర్ధం అయినప్పుడు– మనసుకు ఒక అసాధారణమైన ప్రశాంతత లభిస్తుంది. మనం దానికోసం వెతకనవసరంలేదు. మనం ఆరంభించవలసింది ప్రారంభంలోనే. మొదటి అడుగే, చివరి అడుగు. ఇదే ధ్యానం.

ధ్యానం ఒక గమ్యానికి చేర్చే సాధనం కాదు. గమ్యమూ లేదు, చేరడమూ లేదు. ధ్యానం అంటే ప్రార్ధన కానే కాదు. తన మీద తాను జాలిపడటంలో నుండి ప్రార్ధనా, అర్ధింపూ పుట్టుకొస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే , ‘నీవు’ ఏమీ చెయ్యకుండా ఉండటమే ధ్యానం. మొదట్లో ధ్యానం చేయడం, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యాన వస్తువు ఉంటాయి. కొంత ప్రగతి సాధించాక ‘ధ్యానం చేస్తున్నాను’ అనే భావన పోతుంది. ధ్యాన వస్తువు, ధ్యానం చేసే వ్యక్తి మాత్రమే మిగులుతారు. ధ్యానం తీవ్రమైన కొద్దీ ధ్యాన వస్తువు కూడా లయమైపోతుంది. ద్యానం చేసే వ్యక్తి మాత్రమే మిగులుతాడు. ‘నేను ధ్యానం చేస్తున్నాను ’ అనేది పోతే తప్ప సమాధిస్థితి ఉచ్ఛస్థితికి చేరదు. ‘నేను ‘ ను అంతం చెయ్యటమే ధ్యానం. ధ్యానం అంటే అనుసరించడమూ, అనుకరించడమూ కానే కాదు , విధేయత అసలూ కాదు, ధ్యానం అంటే ‘స్వేఛ్చ’. ధ్యానం అంటే, ఏకాగ్రత కాదు, ఏకాగ్రతలో బహిష్కరణ ఉంటుంది. ఏకాగ్రతతో ఉన్న మనసు ధ్యానం చేయలేదు. ఆలోచనల నుండి విముక్తి పొంది, సత్యం అనే తన్మయానందంలో ప్రవహించడమే ధ్యానం. ధ్యానం అంటే పూర్తి ‘ఎరుక ‘(Conscious) లోనే జరగాలి. ధ్యానమంటే ఏమిటో నాకు తెలిసిన విషయాలను మీకు చెప్పాను. ఇలానే ధ్యానం చెయ్యాలని కాదు. ఎందుకంటే, పైన చెప్పినట్లు, అనుకరణ, అనుసరణ . . . ధ్యానం కాదు. ధ్యానానికి , నిజంగా పద్ధతులు కూడా లేవు. ఎవరి అనుభూతులు, వారివే!మీరు ఇప్పుడు, ధ్యానం చేసి, అనిర్వచమైన ఆనందం పొందండి!

‘ధ్యానానికి మార్గమూ లేదు, గమ్యమూ లేదూ!’
ఏదో ఒక మార్గాన్ని లేక గమ్యాన్ని ఎంచుకొని చేసేదే ‘సాధన’ లేక ‘ధ్యానం’ అనుకుంటారు చాలా మంది. అలా మనం ఒకే మార్గంలో పయనించుతూ, అదే ‘ధ్యానం’ అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. ఎందుకంటే, ‘ధ్యానానికి మార్గమూ లేదు, గమ్యమూ లేదూ! మనం కనుక ఒకే మార్గంలో పయనిస్తూ వెళ్ళితే, మిగతా మార్గాలలోని, విషయాలు మనకు అనుభవంలోకి రావు. అటువంటప్పుడు, జీవితం పరిపూర్ణం కాదు. జీవితం పరిపూర్ణం కావాలంటే, అన్ని మార్గాలు అనుక్షణం అన్వేషిస్తూనే ఉండాలి. అనుక్షణం అనుభవించుతూ ఉండాలి. వర్తమానంలో జీవించాలి. అప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది. ఇంకా, వివరంగా చెప్పాలంటే, మనం రోజూ, ఒక నిర్ణీత సమయాన్ని ఎంచుకొని, నిర్ణీతమైన ప్రార్ధనను ఎంచుకొని సాధన చేస్తున్నామనుకోండి. ‘బుద్ధి'(మనసు) స్వేచ్ఛను కోల్పోయి, చెత్తకుప్పను చూసి ఆగే మున్సిపాలిటీ బండి ఎద్దు లాగా తయారవుతుంది. ఈ ప్రక్రియనే Auto Suggestions అని కూడా అనవచ్చును. మనం ఏ Brand Cigarette త్రాగటానికి అలవాటు పడితే , అదే Brand Cigarette త్రాగాలనిపిస్తుంది. అటువంటిదే, చాలామంది ‘ధ్యానం’ అనుకుంటూ చేస్తున్నది. అది ‘ధ్యానం’ మాత్రం కానే కాదు! అన్నిటికన్నా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ‘ధ్యానం’ ఒకరు నేర్పేది కాదు, ఎవరికి వారేనేర్చుకొని, ఆ అనుభూతులు పొందాలి.

ఏదైనా కొత్త విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే , ముందర ఆ విషయాన్ని గురించి మీకు తెలుసనుకున్న గతాన్ని పూర్తిగా మరచిపోవాలి!దీన్నే జిడ్డు కృష్ణమూర్తి గారు ‘గతం నుంచి విముక్తి’ (freedom from the Known)అన్నారు!భగవంతుడు ఒక మానవ రూపంలో, ఆకారంలో ఉన్నాడనే భావనతో మనం ఉంటాం!అలాంటి విగ్రహాలనే కొలుస్తాం!ఆ భావనల నుండి పూర్తిగా విముక్తి చెందితే కానీ ‘ఆత్మదర్శనం’ కాదు. ఎందుకంటే, భగవంతుడు ఆ రూపంలో ఉండడు కాబట్టి. ఇక , మీరు కోరుకునే పాజిటివ్ ఎనర్జీ గురించి. —ఏదో ఒక ఆదర్శాన్ని, గమ్యాన్ని ఎంచుకొని ఏ సాధన కూడా చేయకూడదు. ఎందుకంటే, మీరు ఎంచుకున్న మార్గం, గమ్యం సరైనవి కాకపోవచ్చు కూడా!అందుకనే, జీవితంలో అన్ని మార్గాలను అన్వేషిస్తూ, ప్రతి క్షణం అనుభవిస్తూ ఉండాలి. అంటే, గతం నుండి ఏ క్షణానికి ఆ క్షణం నుండి విముక్తి చెంది, వర్తమానంలో జీవించాలి! అప్పుడే మన జీవితాలు నదుల వలే నిత్యం ప్రవహిస్తుంటాయి!అలా కాకపోతే, పర్వాతాలు, చెట్లు మాదిరిగా చైతన్యం లేకుండా ఉంటాం!ముందు ధ్యానాన్ని ప్రారంభించండి. సాధన ముఖ్యం, గ్రంధ పఠన వలన ఉపయోగం తక్కువ. అ ధ్యానమే మీకు కావలసిన శక్తిని ప్రసాదిస్తుంది. ‘స్వేఛ్చగా ‘స్వేఛ్చ’కోసం చేసేదే ధ్యానం. సంకెళ్ళు తెంచుకొని, దాస్య విముక్తులం అవుదాము!! స్వేఛ్చగా చేద్దాం ‘ధ్యానం’. ఇది ఒక మతానికో, కులామికో, దేశానికో, కాలానికో సంబంధించిన విషయం కాదు. వీటన్నిటినీ అధికమించి ఆనందాన్ని ఇచ్చేది! ఇక ‘ధ్యానం’ చేసి నిరంతరానందం పొందుదాం .
(నాకు అర్ధమైన శ్రీ జిడ్డు కృష్ణ మూర్తి గారి తత్వం)

ధ్యానానికి పద్ధతులు లేనే లేవు

ధ్యానానికి పద్ధతులు లేనే లేవు. మన అంతట మనమే స్వయంగా, మన రీతిలో, ధ్యానం చేసి అనుభూతిని పొందాలి, అంతే కాని ఎవరి అనుభూతులో మనం గ్రహించి , ధ్యానం అంటే ఇలానే చెయ్యాలి అనటం సబబు కాదు. ఎవరికో వచ్చిన అనుభూతులు, వారు చెప్పినట్లే మనం కూడా చేస్తే, ఆ అనుభూతులు, మనం అలానే చేసినా రానేరావు. ఎవరి Constitution ను బట్టి వారికి వారి అనుభూతులు వస్తాయే గాని అందరికీ అవే అనుభూతుతులు రావు, రానేరావు. మళ్ళీ ఒక సారి గుర్తుచేస్తున్నాను, ధ్యానానికి మార్గమూ, గమ్యమూ ఒకటే! అసలు స్వేచ్చగా స్వేఛ్చ కోసం చేసేదే ధ్యానం. అటువంటప్పుడు, ఏ పద్దతులకో మనం అలవాటు పడితే , ఆ పద్ధతులకే బానిసలమై స్వేచ్ఛను పోగొట్టుకొని , ధ్యానం తప్ప మరేదో చేస్తాము. ‘మనసును ‘ నిలువరింపచేస్తే అది ధ్యానం ఎలా అవుతుంది? మనసును నిలువరింప చేసే ప్రయత్నం చేసి చూడండి!. ఆ ప్రయత్నంలో ఎంతవరకు కృతక్రుత్యులం అవుతామో మనకే తెలుస్తుంది!మనసు యొక్క స్వభావం స్వేచ్చగా ఉండటమే! దాన్ని నిలువరింప చేయ ప్రయత్నం చేసామో –మనం చేస్తున్నది ధ్యానం కానేరదు. అసలు మనం మనసును నిలువరింప చేయగలమా?ఒక చిన్న ఉదాహరణ, మనం తిరుపతిలో స్వామి వారి దర్శనం చేసుకునే సమయంలో, ఒక అందమైన అమ్మాయి, కనిపించిదనుకొండీ, మన మనసు కాసేపు ఆ అమ్మాయి సౌందర్యాన్ని పరిశీలిస్తుంది . మన మనసు సాక్షాత్తు స్వామి వారి సన్నిధిలోనే, మన ఆధీనంలో ఉండదు. అటువంటి మనసు మిగిలిన సమయంలో మన ఆధీనంలో ఉంటుందని ఎలా అనుకుంటారు? మనం అనుకున్నట్లు, మనసు(ధ్యాస) మనం చెప్పినట్లు నడుచుకోదు. అది మనసు యొక్క స్వభావినికే పూర్తి విరుద్ధం. మనసును మనం నిలువరింప ప్రయత్నం చేసామో , అప్పుడు మొదలయ్యేది ‘ఘర్షణ’. ఘర్షణ ధ్యానానికి ఆటంకమే కాకుండా, ధ్యానాన్ని బహిష్కరిస్తుంది.
ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ సంజీవ దేవ్ గారి అభిప్రాయం-ధ్యానం అంటే తెలియనిదాన్ని తెలుసుకునే కళ. చూడని
దాన్ని చూచే కళ. వినని దాన్ని వినే కళ. జీవించనిదాన్ని జీవించే కళ. క్లుప్తంగా చెప్పాలంటే ధ్యానం అనేది అశరీరానందాన్ని అందుకునే సాధన సిద్ధి కూడా. ఇంద్రియాల బాహ్య జగత్తునుంచి అది తప్పించుకొనే ఫలాయమానం కాకపోగా, ఇంద్రియాల అసమగ్ర జగత్తును సమగ్ర పరిచె ఒక విలక్షణ విధానమది. మామూలు జీవితానికంటే ఎంతో ఎక్కువ పూర్ణ జీవితమది. నిత్య జీవితాన్నుంచి వేరుపడి ఏ కొద్ది క్షణాలో అనుభవించేదిగా ఉండకూడదు. ధ్యానమనేది ఒక మూల కళ్ళు , చెవులు మూసుకొని కూర్చొనేదిగా ఉంటే అది కేవలం పరధ్యానం మాత్రమే అవుతుంది . నిత్యజీవితపు కార్యకలాపాలతొ అంతర్లీనమై ఉండాలి ధ్యానం. ఈ విధానం ప్రహ్లాదుని జీవితంలో సుందరంగా చిత్రించబడింది. తింటున్నప్పుడు, నిద్రిస్తున్నపుడు ఇంక ఏమేమి చేస్తున్నా సరే ప్రహ్లాదుడు అశరీర సత్తాలోనే జీవించేవాడట. ఇది నిజమైన ఆదర్శమైన ధ్యానం. కళ్ళుతెరచి పనిచేస్తున్న గడియల్లో కూడా ఆ అశరీర సత్తానుంచి వెలువడే ఆనంద స్పందనను అనుభూతి చెందాలి. పరిశీలన అంతర్వీక్షణంగా మారాలి. నిజంగా ప్రధమదశలో నవ సాధకులు తమ ధ్యానాన్ని ఏకాంతంలో మూసిన కళ్ళతోనే ప్రారంభించి, క్రమేణ దాన్ని నిత్య జీవితంతో ముడివేసి తెరచిన కళ్ళ ధ్యానంలోకి పరిణత పరిస్తే అది ఆదర్శమైన, పరిపూర్ణమైన ధ్యానం అవుతుంది.
(కొంతమంది సాధకులు , కళ్ళు మూసుకునే ఎందుకు ధ్యానం చేయాలి?అని నన్ను ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను నేను యోగ సిద్ధ పురుషుడు శ్రీ కొత్త రామకోటయ్య గారిని 25 ఏళ్ళ క్రితం అడిగాను!అప్పుడు ఆయన, “ధ్యానంలోనే మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి !”అని చెప్పిన మాటలోనే వాస్తవాన్ని తర్వాత కాలంలో తెలుసుకున్నాను)ఇక సంజీవదేవ్ గారు చెప్పింది దాదాపుగా జిడ్డు కృష్ణ మూర్తి గారు చెప్పిందే!ఆయన చెప్పిన , “Be like Prahlada!”అనేది సామాన్య విషయం కాదు. సృష్టి యావత్తు ప్రహ్లాదుడికి నారాయణ స్వరూపంగానే కనపడేది. అలాంటి స్థితికి చేరుకోబట్టే, ఆయన విషం కలిపిన పాలను తాగకలిగాడు. ఏనుగులు తొక్కినా ఏమీ కాలేదతనికి. ఇది మానసిక స్థితి. ఆ స్థితికి చేరుకోవటం చాలా కష్టమే!రామకృష్ణ పరమహంసకు కూడా మురికి కాలువలో నీరు గంగా జలంగా కనపడేదట !ఆ నీరే ఆయన తాగే వాడట! అద్వైత స్థితిలో పరాకాష్టకు చెందిన వారు మాత్రమే అలా ఉండగలరు!

అనుకరణలు, అనుసరణలు ఎందుకు?మన అంతట మనమే, మనకు వీలైన విధంగా ధ్యానం చేద్దాం.
When God has made us as originals why should we stooped to be as duplicates?

20 thoughts on “‘ధ్యానం’ అంటే ఏమిటి?

 1. ధ్యానాన్ని నేను కొత్తగా ఒక మత్తు పదార్థం అని గ్రహించాను. ఎందుకంటే అది ఉన్మత్త స్థితి ఆ స్థితిలో నువ్వు ఏకాగ్రత కోరడం వల్ల నువ్వు ఒకే పని మీద ధ్యాస పెడతావు.

  ఎందుకంటే ఇందులో విచక్షణ రాహిత్యం అనేది ఉంటుంది. ఎలా అనగా ఒక టెర్రరిస్టు ధ్యానం చేస్తే దానివల్ల ఏకాగ్రత కుదిరి 100 మందిని చంపాలనుకున్నవాడు లక్ష మందిని కూడా చంపగలడు.

  ఒక సంకల్పం అది మంచిదైనా కావచ్చు చెడ్డదైనా కావచ్చు. ఒకడు నాకు చాలా ధనం కావాలి అది నేను గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలకు వినియోగించాలి అని అనుకుంటాడు.

  ఇంకొకడు నాకు చాలా ధనం కావాలి అది నేను టెర్రరిస్ట్ కార్యక్రమాలకు వినియోగించాలి అని ధ్యానం చేస్తాడు.

  ఎవడి లక్ష్యం వాడిది. అతి సహజమైన లక్షణం ఏమిటంటే మనము సహజంగా ఉంటూనే ఎరుకతో ఉండాలి అది ప్రయోజనమా స్వప్రయోజనమా అప్రయోజనమ తెలుసుకొని ఈ సమాజానికి మేలు కలిగే విధంగా మనము నిత్యము ఆ ఎరుకతోనే ఉండాలి.

  నేను 2000 సంవత్సరంలో ధ్యానం మొదలుపెట్టాను. రోజు కాకపోయినా నాకు వీలు కుదిరినప్పుడు గంటలు గంటలు ధ్యానం చేసేవాడిని. ఒక 15 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత పూర్తిగా నా యొక్క మనసు ఏకాగ్రత స్థితికి చేరుకునేది. ఆ స్థితిలో నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఏమైనా అడిగితే నేను చాలా చికాకు పొంది వారిని వారి యొక్క మనసు గాయపడే విధంగా వ్యవహరించే వాడిని.

  ధ్యానం చేస్తే మనిషి యొక్క అంతరంగమును ఎదుటివారి యొక్క మనసు ఏమి కోరుకుంటుంది ఏమి ఆశిస్తుంది అని విచారించి వారికి అనుకూలంగా మనం సమాధానం ఇచ్చినప్పుడే నిజమైన సహజమైన ఎరుక స్థితి.

 2. ధ్యానం అన్నది స్వీయ ఐచ్ఛిక అనుభవం అని నా అభిప్రాయం. మనిషి తత్త్వం మీద ఆధారపడి ధ్యానపద్ధతులు ఏర్పడతాయేమో!! సైద్ధాంతికంగా ధ్యానం అంటే ఇది అని నిర్వచించలేము. మంచి వ్యాసం అందించారు.

 3. ధ్యానం గురించి బాగా అర్థమయ్యేలా వివరించారు. ధన్యవాదాలు

 4. అంతా బాగుంది. కానీ ధ్యానం మనంతట మనంచేసుకుంటే ఎటువంటి అనుభవం పొందలేము. ఒక గురువునుంచి పొందే ప్రాణాహుతి ప్రసారం సహాయంతో చేసినట్లయితే అనిర్వచనీయమైన అనుభూతులు అందుబాటులోకి వస్తాయి.ఏకాగ్రత ధ్యానం కాదు.ధ్యానం ఏకాగ్రతు దారితీస్తుంది.
  మీరు గుంటూరులో శ్రీరామచంద్రామిషన్, SVN coliny ఆశ్రమంలో సంప్రదించండి.

  1. గురువు అనే కాన్సెప్ట్ ఇందులో ఉండదు.ఎవరి తత్వాన్ని బట్టి వారికి అనుభూతులు వస్తాయి,అందరికీ ఒకే విధమైన అనుభూతులు రావు దీన్ని గురించి ఎవరినీ సంప్రదించనవసరం లేదు .నేనొక మార్గంలో వున్నాను

   1. సమః:+ధీ=సమాధి. ధీ అంటే బుద్ధి, సమః, అంటే సమానంగా ఉండటం. అంటే అన్ని సమయాలలో ఒకే రకంగా ప్రవర్తించటం.
    This is the first time I came across this meaning..hats off to the article .one should KNOW by praticising ..u r abapulutely right sir..a teacher may explain the rules of mediation but cant explain the exact feeling of doing meditation..thank u very much

    1. దీనికొక మార్గం లేదు,గమ్యం లేదు.మీరే కళ్ళు మూసుకొని ఎరుకలో సాధన చేయండి.వచ్చేవి,పోయేవి ఆలోచనలను ప్రతిఘటించవద్దు! అనుకరణలు, అనుసరణలు ఎందుకు?మన అంతట మనమే, మనకు వీలైన విధంగా ధ్యానం చేద్దాం.
     When God has made us as originals why should we stooped to be as duplicates?

 5. మీరు రాసింది చదివాను నాకేం పట్టనట్లుగానే అనిపించింది . విశ్లేషించి చెబుతాను . ధ్యానం , విషయం విచారము నన్నంటలేదు అన్నమాట . అంటే ఏ విషయాన్నీ నాకు అన్వయించుకోని స్థితి . అనగా భౌతిక అన్వయం లేని మనిషిని . విధి , కాలంతో జరిగిన పరిణామ ప్రక్రియ .
  మీరు కామెంట్ పెట్టామన్నారు కనుకనా స్థితితో అన్వయిన్చుకొని రాసాను .

  1. మీ భావం నాకు అర్ధం కాలేదు!క్లారిటీ లేదు

 6. ధ్యానం గురించి మీవ్యాసం చక్కగా వుంది. మనిషి డబ్బు కోసం బ్రతికే ఈరోజుల్లో ధ్యానం గురించి ఆలోచించేవాళ్ళు వుండకపోవచ్చునేమో???

 7. అయితే చాలామంది చేసింది పరధ్యానమన్న మాట!

 8. ధ్యానాన్ని గురించి ఇంతకూ ముందున్న అభిప్రాయాలను ,సందేహాలను పూర్తిగా తొలగించారు ,ధన్యవాదాలు

 9. శారదా ప్రసాద్ గారు చాలా చక్కగా ధ్యానం గురించి వివరించారు. వారికి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *