April 16, 2024

అమ్మమ్మ – 9

రచన: గిరిజ పీసపాటి

తెనాలి తాతయ్య నాగ చదువుకోవడం కోసం చందమామ, బాలమిత్ర పుస్తకాలు ప్రతినెలా తెప్పించేవారు. నాగ స్కూల్ నుండి వచ్చేలోపు చిన్న బావ వాటిని నాగకు అందకుండా దాచేసేవాడు.
అతను రెండు పుస్తకాలు పూర్తిగా చదివిన తరువాత కానీ తిరిగి నాగకు ఇచ్చేవాడు కాదు. ఈలోపు మళ్ళీ నెల తిరిగి వచ్చేసేది. దానితో కొత్తగా వచ్చిన వెంటనే పుస్తకాలు చదివే అలవాటున్న నాగ ఆ పుస్తకాల కోసం ఏడ్చేది. వెంటనే పెద్ద బావ నాగను తీసుకెళ్లి మరో రెండు పుస్తకాలు నాగకు కొనిచ్చేవాడు.
ఒకసారి నాగకు కుడి కాలి మడమపై ఒక బొబ్బలాగా (మడమ శూల) వచ్చింది. దానితో కాలు మోపలేక నొప్పి, సులుపు, విపరీతమైన జ్వరంతో నాగ చాలా బాధ పడసాగింది. అప్పుడు తాతయ్య ఊరిలో లేని కారణంగా ఏం చెయ్యాలో అర్థం కాని అమ్మమ్మ పిండి కట్టు, పారాణి కట్టు ఇలా తనకు తెలిసిన చిట్కా వైద్యం చెయ్యసాగింది.
వాటితో తగ్గక పోగా చీము పట్టి ఇంకా ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్న నాగని పెద్ద బావ, పెద్దన్నయ్య ఎత్తుకుని తిప్పేవారు. ఊరి నుండి తాతయ్య వచ్చి నాగ పరిస్థితి చూసి వెంటనే డాక్టర్ నమశ్శివయ్య గారి దగ్గరకు తీసుకెళ్ళారు. వెంట పెద్దన్నయ్య, పెద్ద‌బావ కూడా వెళ్ళారు.
డాక్టర్ గారు కాలిని పరీక్షించి వెంటనే ఆపరేషన్ చెయ్యాలని, లేకపోతే సెప్టిక్ అవుతుందని చెప్పి ఆపరేషన్ చేసి, కట్టు కట్టి ఇంటికి పంపించారు. దగ్గరుండి మందులు ఇవ్వడం, డ్రెస్సింగ్ చేయించడం అంతా పెద్దన్నయ్య, పెద్దబావ చూసుకున్నారు.
నాగకు తొమ్మిదో ఏడు నిండి పదవ ఏడు రాగానే పీసపాటి తాతయ్య “బావా! నాగను మా ఇంటి కోడలిని చేసుకోవాలని అనుకుంటున్నాను. నా స్థితిగతులు మీకు తెలుసు. నా ఇద్దరి కొడుకుల్లో మీరు ఎవరికి ఇచ్చి చేసినా నాకు సమ్మతమే. పిల్ల మా ఇంటి కోడలయితే చాలు! మీ అంగీకారం కోసం ఎదురుచూస్తూ ఉంటాం” అంటూ తన మనసులో మాటను బయటపెట్టి ఆరాత్రే బొబ్బిలి వెళ్ళిపోయారు.
అమ్మమ్మ మాత్రం ఈ సంబంధం వద్దంది. “అది ఇంకా చిన్న పిల్ల. ఈ వయసులో దానికి పెళ్ళేంటి? ఒక్కగానొక్క పిల్లను‌ అంత దూరాన ఇస్తే మనం సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళి చూసుకోలేం. ఈ చుట్టుపక్కల సంబంధం అయితే మంచిది. అదీ దానికి కొంత వయసొచ్చాక, కనీసం పదవ తరగతి వరకు చదివాక చేద్దాం” అంది.
తాతయ్య మాత్రం అమ్మమ్మ మాటలతో ఏకీభవించలేదు. “నిజమే మనకు ఒక్కగానొక్క పిల్ల కనుకనే పెద్ద కుటుంబంలో ఇద్దాం అంటున్నది. ఇక్కడ అది ఒంటిగా పెరుగుతోంది. దానికి అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు ఎవరూ లేరు. మనకా వయసయిపోయాక పుట్టింది”
“వాళ్ళది పెద్ద కుటుంబం. తిన కుడవ లోటు లేదు. తొందరగా పెళ్ళి చేసి అటువంటి ఉమ్మడి‌ కుటుంబంలోకి పిల్లనిస్తే రేపు మన తదనంతరం వాళ్ళే దాని కష్ట సుఖాలకు తోడుగా ఉంటారు. అర్థం చేసుకో” అన్నారు.
ఇద్దరూ ఎవరికి వారు తన అభిప్రాయమే సరైనదని భావించడంలో సమస్య ఒక కొలిక్కి రాలేదు సరికదా ఇద్దరూ మాట్లాడుకోవడం కూడా మానేసారు. కానీ… చివరికి తాతయ్య మాటకు తలొగ్గక తప్పలేదు అమ్మమ్మ. తప్పనిసరిగా ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది.
వెంటనే తాతయ్య నాగను పిలిచి “నాగేంద్రుడూ! నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాం. పెద్ద బావని చేసుకుంటావా లేక చిన్న బావనా” అని అడిగారు.
పెళ్ళంటే కొత్త బట్టలు, పిండివంటలు, బాగా తయారవడం అనుకున్న నాగ “నేను పెద్ద బావనే చేసుకుంటాను నాన్నా! చిన్నబావ నన్ను కొడతాడు, కోప్పడతాడు. నా వస్తువులు, పుస్తకాలు తను లాక్కుంటాడు. మంచోడు కాదు. అదే పెద్ద బావైతే నన్ను ఎత్తుకు తిప్పుతాడు. పుస్తకాలు కొంటాడు. సినిమాకు తీసుకెళ్తాడు. అందుకే నాకు పెద్దబావంటేనే ఇష్టం” అని చెప్పింది.
నాగ సమాధానం విన్న అమ్మమ్మ “మొగుడంటే ఎత్తుకుని తిప్పేవాడు అనుకుంటోంది. ఇంత పసిపిల్లకు పెళ్ళా?” అంటూ ఏడ్చింది. తెనాలి తాతయ్య మాత్రం ఒకరోజు ఇంటికి వచ్చిన పీసపాటి తాతయ్యతో “మీ పెద్దబ్బాయికి మా నాగను ఇచ్చి చేద్దామనుకుంటున్నాం” అనే శుభవార్త చెప్పారు.
పీసపాటి తాతయ్య “సరే. మీరెలాగంటే అలాగే. పెళ్ళి అమ్మాయి సెకెండ్ ఫారమ్ (7th class) అయాక చేద్దాం” అంటూ చెప్పడంతో మరో రెండు సంవత్సరాలు సమయం ఉన్నందున కొద్దిగా ఊపిరి పీల్చుకుంది అమ్మమ్మ.
ఆ సంవత్సరం వేసవి సెలవులలో పీసపాటి తాతయ్య నాగను తీసుకుని వారి స్వగ్రామమైన రాముడువలస అగ్రహారం (బొబ్బిలి దగ్గర) వెళ్ళారు. పీసపాటి తాతయ్య, పెద్ద తాతయ్య (పీసపాటి తాతయ్య అన్నగారు) ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉండేవారు.
ఇంట్లో చిన్నా, పెద్దా కలిపి ముప్పై మంది జనాభా. పీసపాటి తాతయ్య సంపాదనతో పెద్ద తాతయ్య వ్యవసాయ భూములు, తోటలు కొని, స్వయంగా వ్యవసాయం చేసేవారు. ఆయన ఆయుర్వేద వైద్యులు కూడా. వైద్యానికి డబ్బు తీసుకునేవారు కాదు.

పెద్ద ఇల్లు, పాడి – పంటకు లోటు లేని కుటుంబం. పట్నంలోనే పుట్టి పెరిగిన నాగకు ఆ పల్లె వాతావరణం చాలా నచ్చింది. పెద్ద తాతయ్య గారి అమ్మాయి నాగని అందరికీ ‘మా పెద్ద తమ్ముడికి కాబోయే భార్య’ అంటూ పరిచయం చేసింది.
పీసపాటి వారి కాబోయే పెద్ద కోడలు వచ్చిందని ఊరంతా వచ్చి చూసి వెళ్ళారు. మామ్మ గారితో కొందరు పెద్దలు‌”ఏంటి పాపమ్మా! కొడుక్కి ఇంకా పెళ్ళి చెయ్యక ముందే కోడలిని ఇంటికి తీసుకొచ్చేసావే!” అంటూ విగటాలు మొదలుపెట్టారు.
పెద్ద తాతయ్య గారబ్బాయి మరియు పెద్ద మామ్మ గారి అబ్బాయి ఇద్దరూ నాగ వయసు వారే కావడంతో వారితో కలిసి చక్కగా ఆడుకోసాగింది. నాగను రాముడువలస తీసుకెళ్ళిన పీసపాటి తాతయ్య ఒప్పుకున్న నాటకాలు ఉండడంతో మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు.
పది రోజుల పాటు అక్కడ బాగానే ఉన్న నాగ పదకొండవ రోజున ‘నాకిక్కడ అంతా బాగుంది, అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు, పెద్దన్నయ్య, పెద్ద వదిన, బాబిగాడు (పెద్దన్నయ్య కొడుకు) లేరు. నాకు మిమ్మల్నందర్నీ చూడాలని ఉంది. నన్ను వెంటనే మనూరు తీసుకెళ్ళిపొండి. నేను వచ్చేస్తాను’ అంటూ అమ్మమ్మ, తాతయ్యలకు ఉత్తరం రాసింది.
ఆ ఉత్తరం చూసిన అమ్మమ్మ తాతయ్యతో “నాకూ పిల్లని చూడాలనే ఉంది. ఎప్పటినుండో పిల్లని వాళ్ళ ఊరు తీసుకెళ్తామని వాళ్ళు అడగగా అడగగా ఇన్నాళ్ళకు పంపించాము. వెళ్ళిన పిల్లని వెంటనే తిరిగి పంపించమంటే వాళ్ళేమనుకుంటారోనని ఆగాను. వెంటనే పిల్లను తీసుకువచ్చేయండీ” అని కన్నీళ్ళతో బతిమాలుతూ‌ చెప్పింది.
దానితో తాతయ్య వెంటనే బయలుదేరి రాముడువలస వెళ్ళి పెద్ద తాతయ్యతో చెప్పి నాగను తిరిగి తెనాలి తీసుకొచ్చేసారు. పది రోజుల తరువాత వచ్చిన నాగకు కావలసినవన్నీ వండి పెట్టి తన తల్లి ప్రేమను రంగరించి వడ్డించింది అమ్మమ్మ. పెద్ద బావ, చిన్న బావ సెలవులు అయిపోయాక తిరిగి తెనాలి వచ్చారు.

******* సశేషం *******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *