April 22, 2024

చిన్ని ఆశ

రచన: నాగజ్యోతి రావిపాటి

పక్షిగా నా పయనం ఎటువైపో తెలియదు..కాని నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నా.. ఆ దూర తీరాలు కనిపించి కవ్విస్తున్నా.. అలుపెరగక ముందుకు సాగుతున్నా.. నా ఈ ఒంటరి పయనంలో ఒక చోట నాలాగే మరిన్ని ఆశా జీవులు కనిపించాయి..మాట మాట కలిసి మనోభావాలు తెలిపి ఈ సారి గుంపుగా తరలి వెళుతుంటే..ఎన్నో సూర్యోదయాలు పలకరించి పారవశ్యం కలిగించాయి. ఆ మేరు పర్వతాలు గర్వంగా నిల్చుని తమ శోభను చూపుతున్నాయి. హిమాని నదుల అందం వర్ణింప తరమా..పచ్చని పైరులు గాలికి ఊగుతూ మరింత ఆనందాన్ని పంచుతున్నాయి…అంతం లేని ఈ ప్రయాణంలో అలసట లేకుండా చేసే అద్భుతాలు ఎన్నో.ఆకలి కడుపు నింపమని కోరుతుంటే ఆగిన ప్రతిసారి కాళ్లు పరుగులు తీయిస్తూనే ఉన్నాయి.
కనులకు నిదుర ఆవరించి కొమ్మలపై వాలి సోలి పోతుంటే చుక్కల చీరలో ఆ అంబరం సంబరంగా చూసింది.చక్కని చందమామ రేయికి రాజై కన్నుగీటి
చల్లగా చెంత చేరిన భావన.. మరో ఉషోదయం వెచ్చగా మేను తాకుతుంటే మరింత ఉత్సాహంతో మళ్ళీ పయనం మొదలు..
స్వేచ్ఛగా విహారిస్తూ ప్రకృతి అందాలతో మమేకమై తరలిపోతూ ఆగిన ప్రతిచోటా కొత్త అనుభూతి పొందుతూనే ఉన్నా ఏమిటి ఈ జన్మకు అర్ధం అని అంతర్గత ప్రశ్న తొలిచి వేస్తూనే ఉంది. కనిపించే అందాలకు ఆనందించాలా ఉన్న జీవితానికి అర్ధం కల్పించుకోవాలా అయితే ఎలా ముందుకు వెళ్ళాలి అనే స్పష్టత కోసం తపనతో సుదూర తీరాలకు ఎగురుతూనే అన్వేషణ కొనసాగుతుంది.
ఒకచోట బందీగా ఉండలేని మా జీవితం ..కాలాన్ని లెక్కలు వేసుకుంటూ బ్రతకలేక అలా అని ముగింపు ఎప్పుడో కూడా తెలియక తిరుగాడుతుంటే మళ్ళీ కొత్త ఆశలు చిగురించి చిందులు వేస్తూ అల్లరి చేస్తుంటే అదే వినే వారికి వీనుల విందు అవుతుందేమో, ఏమిటి ఆ కువ కువ అని పరికించే వేల కళ్ళను గమనిస్తూనే చేజిక్కితే ప్రమాదం అని రెక్కలతో మరో ప్రక్కకు గంతులు వేస్తూ ఊపిరి నిలుపుకుంటూ ఎగిరి పోతాం సుమా..!
అలా రెక్కలను సవరించి వెళుతుంటే దూరాన కనిపించి పిలిచినట్లు ఉన్న అందాల విరులు వయ్యారంగా చిరు కొమ్మన ఊయల ఊగుతుంటే తేనెలు జుర్రు కుందామని దగ్గరకు చేరగానే సిగ్గుల మొగ్గలుగా మారి ముడుచుకున్నాయి. ముందు నేనంటే నేనని మా గువ్వల సమూహం దరి చేరి సవ్వడి చేస్తుంటే పక పక నవ్వుతూ మురిసి పోతున్నాయి. ఆ సరగాలు శ్రావ్యంగా ఉన్నయేమో కనులు మూసుకుని ఓలలాడుతున్నాయ్ సున్నితమైన ఆ కుసుమ కుమారీలు..
ఎవరికి వారు తమ వంతు పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటే..ఆగు పక్షి రాజమా మమ్ము వదిలి పోవద్దు అని ముద్దుగా అడిగి వెడలనియలేదు ఆ జంట సుమాలు.. ఏమిటి వాటి మాట అని అడగక ముందే..ఈ రోజుతో ముగుస్తుంది మా జీవితం..నీతో మమ్ములను తీసుకెళ్లి ఆ శ్రీహరి చెంత చేర్చి విముక్తి నీయమని కోరిన ఆ చిన్ని ఆశ తీర్చుట ధన్యమనుకుని నా వెంట తీసికెళ్ళుటకు సిద్ధం అయ్యాను మరు పయనానికి

6 thoughts on “చిన్ని ఆశ

  1. చాలా అద్భుతంగా రాశారు నగజ్యోతి గారు!!
    మీరు రాసిన శైలి వయ్యారంగా అందంగా ఉంది.

  2. ఒక మనిషి జీవితం, కనుల ముందు హాయిగా ఎగిరే పక్షులు లతో పోల్చి చాలా చక్కగా వర్ణించారు జ్యోతి గారు. మా హృదయపూర్వక అభినందనలు.

    1. మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు విజిత గారు

  3. చాలా ఆహ్లాదకరమైన అభివ్యక్తి….. చదువుతున్నంతసేపూ హాయిగా ఎగిరినట్టుంది భావాల నింగిలో….అభినందనలు మేడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *