February 23, 2024

చీకటి మూసిన ఏకాంతం – 9

రచన: మన్నెం శారద

రెండ్రోజుల తర్వాత సాగర్ నుండి ఫోనొచ్చింది.
“నిశాంతా నీ రిపోర్టులు వచ్చేయి. నీకేం లోపం లేదు. ఒకసారి హితేంద్రని కూడ పంపు! అతన్ని కూడ ఎగ్జామిన్ చేస్తే..‌.”
“అలాగే. థాంక్స్” అంది నిశాంత.
“ఎలా వున్నావు?”
“బాగానే వున్నాను.” ఫోను క్రెడిల్ చేస్తుండగా లోపలికొచ్చేడు హితేంద్ర.
అతనింటికొచ్చి రెండ్రోజులు దాటింది ‌
అతని వంక తేరిపార చూసింది నిశాంత.
అతని మొహం సీరియస్ గా వుంది.
“ఎవరితో మాట్లాడుతున్నావ్ ఫోన్లో!” అనడిగేడు సోఫాలో కూర్చుంటూ.
“సాగర్. నా రిపోర్టులు పాజిటివ్ గా వచ్చేయట. మిమ్మల్ని కూడ ఒకసారి వస్తే టెస్ట్ చేస్తాడట!”
“అంటే… నన్ను అతని దృష్టిలో వెధవని చెయ్యాలనా?” అన్నాడు కోపంతో ఊగిపోతూ.
అతని కోపాన్ని చూసి బిత్తరపోయింది నిశాంత.
“ఏం జరిగిందని అంతావేశపడుతున్నారు?”
“ఇంకా ఏం జరగాలి! ఈ ఊళ్ళో హాస్పిటల్స్ లేనట్లుగా వాడి ఆస్పత్రికే వెళ్ళడంలో నీ ఉద్దేశ్యం! స్నేహానికి స్నేహం, వైద్యానికి వైద్యం జరిగిపోతుందనా!”
“ఏంటి మీరు మాట్లాడేది?”
“తెలీనట్లు నంగనాచి వేషాలెయ్యకు. పెళ్ళికి ముందు మీ ఇద్దరి మధ్యా జరిగిన కధలేవీ నాకు తెలియవనుకోకు.” అన్నాడు ఎగిరిపడుతూ.
నిశాంత భర్త స్వరూపం చూసి షాక్ తింది.
“మీరేం మాట్లాడుతున్నారో మీకర్ధమవుతుందా? అలా అనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు?” అంది ఆవేశంగా.
అప్పటికే ఆమె కళ్ళు చెరువులయ్యాయి.
అది చూసి ఇంకా లోకువగా తీసుకున్నాడు హితేంద్ర.
“పెళ్ళయ్యేకనన్నా బుధ్ధిగా వుంటావని. ఇది చాలక నాలోనే లోపముందని ప్రచారం చెయ్యాలని చూస్తున్నారా మీరిద్దరూ కలిసి! ఇంత పన్నాగముండే ఆ కుంటిదాన్ని వాడి మెడకు కట్టేవు!”
“ఆపండి!” పులిలా ఘర్జించింది నిశాంత.
హితేంద్ర ఒక్క క్షణం ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు.
“మీరు రోజులకి రోజులు ఇంటికి రాకపోయినా నేనపార్ధం చేసుకోలేదు. అంతా మీ వృత్తకే అంకితమయ్యేరని భావించేను‌ కాని… మొన్న ఆ చెట్టియార్ ని పంపించి…”
“చెట్టియార్ ని నేను పంపించేనా?”
“అనే వాడు చెప్పేడు!”
“నాకేం తెలియదు.”
“అబద్ధాలాడకండి. మీ కెరీర్ కోసం భార్యనే తార్చే నీచుడని మిమ్మల్నెప్పుడూ అనుకోలేదు.”
అంతే.
వెంటనే ఆమె చెంప ఛెళ్ళుమంది.
నిశాంత నిర్ఘాంతపోయింది.
“యూ బ్లడీ బిచ్! అతనెంత కోటీశ్వరుడో తెలుసా? వాడు కనుసైగ చేస్తే కోటికి పడగలెత్తుతారు. అతన్ని కొట్టబోతావా! అయిపోయింది. నువ్వీ ఇంటికి శనిదేవతవి! ఛీ! నీ మొహం చూడకూడదు.” అన్నాడు హితేంద్ర ‌
నిశాంత నవ్వింది‌.
వెర్రిగా నవ్వింది‌.
“అవును శనిదేవతనే! మీరు ఏరు దాటేరు. నా అవసరం లేదిక. ఈ మాట అత్తయ్యే చెప్పింది. కాని… నేనే నమ్మలేదు. భార్యని కాబట్టి ఆడదాన్ని కాబట్టి ఏమైనా అనొచ్చని భావిస్తున్నారు. కాని… రెండ్రోజులు మీరు వీణ ఇంట్లో వున్నారని తెలిసి కూడ నేను… అడగలేదు.” అంది నిశాంత.
హితేంద్ర ఆమె వైపు హేళనగా చూశాడు.
“నువ్వడగక్కర్లేదు. నీదో దరిద్రపు మొహం! నీ మొహం చూడాలంటేనే అసహ్యం! గొడ్రాలివి! అందుకే నేను వీణ దగ్గరకెళ్తున్నాను‌ ఇప్పుడు కూడ వెళ్తాను. ఏం చేస్తావు!” అంటూ హితేంద్ర మళ్ళీ చెప్పులు తొడుక్కుని బయటకెళ్ళిపోయేడు.
కాసేపటికి కారు గేటు దాటిన శబ్దం వినిపించింది.
నిశాంత నిస్సత్తువగా అలానే నేల మీద కూలబడిపోయింది. ఏడవటానిక్కూడ శక్తి లేనట్లుగా.

************
వారం రోజులు గడిచిపోయేయి – నిశాంత జీవితంలో మొదటిసారి అతి నిస్సారంగా, నిస్తేజంగా!
హితేంద్ర వారమూ ఇంటికి రాలేదు.
నిశాంతకీ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు.
కావాలని కోరి చేసుకున్న పెళ్ళి!
ఎగతాళి చేయించుకోవడమిష్టం లేదు.
ఆ రోజు తబల ప్రవీణ్ ఇంటికొచ్చి “సార్ లేరా అక్కయ్యా?” అనడిగేడు.
“ఊరెళ్ళేరు” అంది నిశాంత.
అతనదోలా చూసి “అలా చెప్పేరా, నిన్న రికార్డింగుకొచ్చేరుగా! ఇదంతా దాని పని. ఏం చెబుతాం, పెద్దాయన!” అన్నాడు.
“ఎవరది?”
“వీణని కోరస్ లో పాడేది. ఈమధ్య తరచూ అక్కడికే వెళ్తున్నారని అందరూ చెప్పుకుంటారు.” అన్నాడు ప్రవీణ్ బాధగా.
“ఈ రంగంలో ఇతరుల గురించి చెడ్డగా చెప్పుకోగలంత ఉత్తముల కూడ వున్నారా ప్రవీణ్! అడిగింది నిశాంత పేలవంగా నవ్వుతూ.
ప్రవీణ్ తప్పు చేసినట్లు తలదించుకొని “అది కాదక్కా! అందరూ అందరితోనూ తిరుగుతున్నారు. ఈ రంగంలోకొచ్చిన ఆడదాన్ని అందరూ ఎక్స్ప్లయిట్ చేసి వుపయోగించుకుంటారు. కాని ఒక్కరితో ముడి పెట్టుకుంటే… మాత్రం చాల తప్పు చేసినట్లు చెవులు కొరుక్కుంటారు. అంటే ఇక్కడ మెంటల్ రిలేషన్ పెట్టుకోవడం మహా తప్పు!” అన్నాడు.
“అంటే మీ సార్ ది మెంటల్ రిలేషనా?”
“అని… కాదు. ఇదివరకు అందరితోనూ తిరిగేవాడు. కాని ఈ వీణ మాత్రం సార్ ని పట్టేసింది. దానికి తోడు చెట్టియార్ సార్ ని తన పిక్చర్స్ లో పాడ్డానికి వీల్లేదని చెప్పేసేడట. ఇక సార్ మరీ రెచ్చిపోతున్నాడు.”
“ఆ వీణ యిల్లెక్కడ?”
“ఏం, నువ్వెళ్తావా, వద్దక్కా! నువ్వు లోకువయిపోతావు!”
“లోకువయ్యేట్లు నేను ప్రవర్తించను. నాతో రా ఒకసారి!”
“మీ ఇష్టం” అన్నాడు ప్రవీణ్.
నిశాంత బట్టలు మార్చుకొని కారు బయటికి తీసింది.
ఇద్దరూ అయిదు నిముషాల్లో వడపళని చేరుకున్నారు. వీణ ఒక అపార్టుమెంటులో వుంటున్నది.
నిశాంతని చూసి ఆమె వెలతెలాబోయింది.
“రండి, రండి నమస్కారం, కూర్చోండి” అంది గాభరాగా.
నిశాంత కూర్చుంది. ప్రవీణ్ బయటే నిలబడ్డాడు.
“అమ్మా, హితేంద్ర భార్యగారొచ్చేరే!” అంటూ లోపలికి కేకేసి “ఏం తీసుకుంటారు! కాఫీనా, టీయా…?” అనడిగింది.
“ఏం వద్దు” అంది లోపలి గదిలో హేంగర్ ని వేళ్ళాడుతున్న హితేంద్ర బట్టలు చూస్తూ.
“ఆయన లోపల వున్నారా?”
నిశాంత ప్రశ్న అర్ధమయినా కానట్లుగా “ఎవరు?” అంది అమాయకంగా మొహం పెట్టి.
“ఎవరంటే హితేంద్ర గారు! ఆయన ఇక్కడ వుంటున్నారని తెలుసు. అందుకు దెబ్బలాడాలని రాలేదు. ఏ అధికారమూ లేకుండా ఆయనతో వుంటే… తర్వాత నీ జీవితం ఏం కావాలి? కట్టుకున్న భార్యనే వదిలేసిన ఆయన నిన్ను వదిలేయరా?”
నిశాంత సూటి ప్రశ్నకి వీణకి కన్నీళ్ళొచ్చేయి.
వీణ తల్లి కల్గజేసుకుని “ఏం చేయమంటావు తల్లీ! పాలకొల్లు దగ్గర మాదీ బాగా బతికిన కుటుంబమే. దీనికి పాటల పిచ్చి. తండ్రి పోయి ఆస్తి పోయి అక్కడ నల్గురిలో హీనంగా బతకలేక ఇక్కడకొచ్చేసేం. ఏదో నాలుగు సినిమాల్లో కోరస్సయినా పాడుకుని బతకొచ్చని. మీ ఆయనగారు ఒప్పుకోందే ఎవర్నీ పాడనివ్వరు. ఆ ఒప్పుకోడానికి ఆయన పెట్టే షరతిదే. గతిలేక లొంగిపోడం కాని… మాకూ అప్రదిష్టే. ఏడుస్తూ నవ్వుతున్నాం.” అంది నిజంగానే ఏడుస్తూ.
నిశాంత భర్త సంగతి విని అవాక్కయింది.
ఒకప్పుడు తన సహాయమర్ధించి, తను వస్తే లేచి నిలబడి, తన దగ్గర చెయ్యిజాచి తన దయాధర్మాల మీద బ్రతికి – తనని ప్రేమించేనని, తను లేకపొతే బ్రతకలేనని ఏడ్చిన వ్యక్తేనా ఇతను!
అందుకే పెద్దలు పాముకు కోరల్లోనే గాని, మనిషికి నిలువెల్ల విషమేనన్నది!
“నేను మిమ్మల్ని నిలవెయ్యాలని రాలేదమ్మా. విషయం తెలుసుకుందామని వచ్చేను. అతను వీణని పెళ్లి చేసుకుంటారేమో కనుక్కోండి. నేను విడాకులిస్తాను.”
నిశాంత మాటలకి తల్లీ కూతుళ్ళిద్దరూ నివ్వెరపోయేరు.
“వద్దమ్మా, నీ కాపురం కూలగొట్టేంత పాపాత్ములం కాదు” అంది వీణ తల్లి బాధగా .
నిశాంత నిర్లిప్తంగా నవ్వింది.
“మీరు కూలగొడితే కూలిపోయిందనే సంకుచిత మనస్తత్వం కాదు నాది. లోపం నాదీ ఉండొచ్చు. కట్టుకున్న భార్యను కాబట్టి నా భర్త చాల నీతిమంతుడని, గొప్పవాడని – అతను నాశనం చేసిన ఆడవాళ్ళ మీదే తప్పు తోసేసి అతనితో కలిసి బతకగల చౌకబారు మనస్తత్వం కాదు నాది. నా భర్త ఎంతమంది జీవితాలతో ఆటలాడుతున్నాడో తెలిసేక కూడ అతన్నొక దేవుడుగా భావించి అతనితో వుండలేను. వెంటనే మీ వీణని పెళ్ళి చేసుకోమనండి. నేను సంవత్సరం కాగానే విడాకులు పంపిస్తాను” అంటూ గుమ్మం దాక నడిచి “ఒక్కమాట!” అంది.
ఏంటన్నట్లుగా చూశారు వాళ్ళు.
“నన్ను గొడ్రాలిననే నిందతో దూరం చేస్తున్నాడు. ఆ సంగతాలోచించుకోండి” అంటూ నిశాంత క్రిందకొచ్చి కారెక్కింది.
“అక్కా, నువ్వు తొందరపడుతున్నావేమో!” అన్నాడు ప్రవీణ్ బాధగా.
“లేదు. అతని అంతరంగిక స్వరూపం నాకు తెలిసినంత నీకు తెలీదు ప్రవీణ్! అద్సరే నాకో చిన్న ఇల్లు చూడు!” అంది నిశాంత.
ప్రవీణ్ తలూపేడు.

***********
సాగర్ హితేంద్ర ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి నిరుత్తరుడయ్యేడు.
జర్నలిస్టు అడిగిన ఒక వ్యక్తిగత ప్రశ్నకి హితేంద్ర “ఏం చేయను! నా భార్య వలన నాకు సుఖం లేదు. ఆమె గయ్యాళితనంతో అనుమానపు స్వభావంతో నాకు నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా చేసింది. నా గొంతు విని నన్ను ప్రేమించేనని వెంటపడి పెళ్ళి చేసుకుంది. నా కోసింగర్ వీణని అనుమానించి ఆమెనెళ్ళి కొట్టింది. అల్లరిపాలయిన వీణని రక్షించాలంటే ఆమెని నేను పెళ్ళి చేసుకొని తీరాలి. లేకపోతే ఆమె చచ్చిపోతుంది. పైగా నా భార్యకి గర్భవతయ్యే అవకాశాలు లేవు. ఆమె గొడ్రాలు!” అని చెప్పేడు.
అతను గబగబా నిశాంతకి ఫోను చేసేడు. రెస్పాన్సు లేదు.
సరిగ్గా అప్పుడే నవనీతరావు సాగర్ కి ఫోను చేసి “ఏంటిదంతా! నీకేమన్నా తెలుసా! అసలిప్పుడు నా చిట్టితల్లెక్కడుంది?” అనడిగేడు ఏడుస్తూ.
“నాకూ తెలియడంలేదు. మీరు కంగారు పడకండి. నేను, లత వెదికి పట్టుకుంటాం” అన్నాడు.
నిజానికతనికే కాళ్ళూ చేతులాడటం లేదు.
లతకి ఫోను చేసేడు. లత, శేషయ్య వెంటనే పరిగెత్తుకొచ్చేరు. ఇద్దరూ కూర్చుని ముందు వీణకి ఫోను చేసేరు. ‌హితేంద్ర ఫోనెత్తేడు.
“నిశాతెక్కడుంది?”
“నాకేం తెలుసు! ఎవడితో లేచిపోయిందో!”
“మాటలు జాగ్రత్తగా రానివ్వండి.”
“ఓహో! మాజీ ప్రియుడికి కోపం బాగానే వుంది. అది నా పరువుతీసి లేచెళ్ళిపోయింది. ఎక్కడుందో నాకేం తెలుస్తుంది!” అంటూ రిసీవర్ పెట్టేసేడు హితేంద్ర.
లత, సాగర్ ఆ సాయంత్రానికి వాహిని దగ్గర ప్రవీణ్ ని పట్టుకున్నారు.
“నిశాంత ఎక్కడుంది?”
అతను వాళ్ళని అనుమానంగా చూస్తూ “ఎవరు మీరు?” అనడిగేడు.
“ఆమెకు బాగా కావల్సిన వాళ్ళం. ఈరోజు హితేంద్రిచ్చిన స్టేట్మెంటు చదివే వరకు నిశాంత అతనితోనే వుంటుందనుకున్నాం” అన్నాడు సాగర్.
“పాపం అక్కకి చాలా అన్యాయం జరిగింది. రండి చూపిస్తాను” అంటూ వడపళనిలోని ధనలక్ష్మీ కాలనీకి తీసుకెళ్ళేడు.
మేడమీద ఒక గదిలో వుంటోంది నిశాంత.
వాళ్ళు వెళ్ళేసరికి చాప పరచి నల్గురు చిన్న పిల్లలకు ట్యూషన్ చెబుతోంది! వాళ్ళని చూసి మొదట నివ్వెరపోయి “రండి, రండి. మీరు ఈ చాపల మీదనే కూర్చోవాలి!” అంది సర్దుకుంటూ.
“ఏంటిది, ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదు?” అనడిగేడు సాగర్.
“చెప్పడానికేం శుభవార్తని. చెప్పి అందరి సానుభూతీ పొందడం యిష్టంలేక చెప్పలేదు.”
అయితే మేం బయటివాళ్ళమా? పోనీ అలా అనుకుంటే కన్నవాళ్ళని కూడ కాదనుకున్నావా అక్కా!” అంది లత.
నిశాంత వాళ్ళని అదోలా చూసి “నాకెవరి మీదా కోపం లేదు. యిలాంటి స్థితిలో దైన్యంగా వెళ్ళాలనిపించే మనస్తత్వం కాదు నాది. అందుకే కొన్నాళ్ళిలా అజ్ఞాతవాసం చేయాలనిపించింది.” అంది.
“వాడేం స్టేట్మెంటిచ్చాడో తెలుసా?” అనడిగేడు సాగర్ ఉక్రోషంగా.
నిశాంత నిర్లిప్తంగా నవ్వింది. తమ తప్పుందని గిల్టీగా ఫీలయ్యేవాళ్ళేమైనా అంటారు. మనకెందుకు బాధ!” అంది.
సాగర్ అసహనంగా చూసి “అలా వూరుకుంటే పెట్రేగిపోతాడు. ఎంతమంది చదువుతారీ వార్త!”
“ఎంతమంది చదివి ఏమనకున్నా నీలాంటి హితులు ఛస్తే అతను చెప్పింది నమ్మరు. అది చాలు నాకు!”
“సరే! జరిగిందేదో జరిగింది. మా ఇంటికెళ్దాం రా!” అంది లత.
“ఎవరూ నన్ను బలవంతం చేయకండి. కొన్నాళ్ళు నాకీ ఒంటరితనమే కావాలి! మా ఇంటిక్కూడ నేనిప్పుడు వెళ్ళను. దయచేసి నన్నపార్ధం చేసుకోవద్దు.” అంది నిశాంత చేతులు జోడించి.
“కనీసం నా హాస్పిటల్లోనన్నా పని చెయ్యి. జీతం తీసుకుని. ఈ ట్యూషన్లు చెప్పుకునే ఖర్మేంటి?” అనడిగేడు సాగర్.
“అవునక్కా. ఆయన మాట విను. నువ్విక్కడీ స్థితిలో వుంటే మాకన్నం సహిస్తుందా?” అనడిగింది లత ఏడుస్తూ.
“మా మాట విను తల్లీ!” అన్నాడు శేషయ్య.
నిశాంత అంగీకారంగా తలూపింది.

************
రోజులు ఆనందంగా వున్నవారికి వేగంగానూ, బాధల్లో వున్నవారికి నిదానంగానూ సాగిపోతున్నాయి.
చూస్తుండగానే సంవత్సరం గడవడం – హితేంద్రకి – నిశాంతకి విడాకులు మంజూరు కావడం జరిగింది.
నిశాంత హాస్పిటల్లో యాంత్రికంగా పని చేసుకుంటూ పోతున్నది‌.
నిశాంత వచ్చేక హాస్పిటల్ ఆదాయం బాగా పెరిగింది. ఆమె హస్తవాసి మంచిదనే పేరొచ్చింది. సాగర్ లో ఉత్సాహం పుంజుకుంది.
నవనీతరావు రోజూ హాస్పిటల్కొస్తాడు బి.పి. చెక్ చేయించుకునే వంకతో. కాస్సేపు కూతుర్ని ఆర్తగా చూసుకుంటాడు.
నిశాంతే అతనికి టెస్టులు చేసి జాగ్రత్తలు చెబుతుంది. అప్పుడప్పుడూ వసుంధర కూడ వచ్చి ఇంటికి రమ్మని ఏడుస్తుంది.
నిశాంత నవ్వుతూనే తిరస్కరిస్తుంది.
ఆరోజు సాగర్ గబగబా వచ్చి “ఈ వార్త విన్నావా?” అనడిగేడు ‌
“ఏంటది?”
హితేంద్రకి కూతురు పుట్టిందట. పెద్ద ఫంక్షన్ చేసేడట. ప్రవీణ్ కనిపించి చెప్పేడు” అన్నాడు.
నిశాంత కంగు తిన్నట్లుగా చూసింది.
ఆ తర్వాత సర్దుకుని “అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు సాగర్! ఇంకెప్పుడూ ఏ విషయమూ చెప్పకు” అంది.
“సారీ!” అన్నాడు సాగర్.
నిశాంత పైకి గాంభీర్యం వహించినా లోలోపల కుమిలిపోసాగింది. తలనొప్పిగా వుందని తొందరగా ఇంటికెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ దారిలో రెండు సినీ వారపత్రికలు కొంది.
ఎంత వద్దని మనసు వారించినా పేజీలు తిప్పింది.
‘హితేంద్ర తండ్రయ్యేడు’ అనే శీర్షికలో అతనిది – వీణది – పుట్టిన బిడ్డది కలిసి కూర్చున్న ఫోటో వేసేరు. తనని తండ్రిని చేసిన వీణకి కృతజ్ఞతలు చెబుతూ తన కోరిక తీరినందుకు సంతోషం వెలిబుచ్చేడు హితేంద్ర.
ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు.
మనసొక కొలిమిలా మండసాగింది.
“ఇదెలా సాధ్యం!” అనుకుంది చాలాసార్లు.
ఆ ఆలోచనల్ని భరించలేక మొదటిసారి వాలియం టాబ్లెట్లనాశ్రయించింది నిశాంత.

************
“అయితే ఈవిడలోనే లోపముందంటారా?” అనడిగింది లత సందేహంగా.
“నోర్ముయ్!” అన్నాడు సాగర్ కోపంగా.
లత అతనివైపు అంతకంటే కోపంగా చూసి “ఆవిణ్ణేవన్నా అంటే ఒంటి కాలి మీదొస్తారెందుకు? నాకన్నీ తెలుస్తూనే వున్నాయిలే! ఆవిడొచ్చేక మీ మొహం పెట్రొమాక్స్సు లైట్లా వెలిగిపోతోంది. నాకు నర్సు అన్నీ చెబుతూనే వుందిలే. మీరిద్దరూ కలిసి నా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తున్నారు” అంది.
సాగర్ కోపంగా చెయ్యెత్తేడు.
“ఏంటి కొడ్తారా! దాన్ని చూసుకుని అంతదాక వచ్చేరన్నమాట! చూడు నాన్నా ఈయన నిర్వాకం!” అంటూ అరిచింది లత ఏడుస్తూ.
వెంటనే శేషయ్య గుమ్మంలోకి వచ్చేడు.
సాగర్ చెయ్యి అతన్ని చూసి దిగిపోయింది.
వెంటనే తన గదిలోకెళ్ళిపోయేడు.
శేషయ్య చిన్నగా ఆ గదిలోకొచ్చి “దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. దాని బుద్ధి పరిమాణమంతే. కేకలేసి ప్రయోజనం లేదు. నిశాంతని మాట పడకుండా చూడు” అని చెప్పి వెళ్ళిపోయేడు.
సాగర్ కి మామగారి మాటలర్ధమ్మయ్యేయి.
ఎలా నిశాంతకీ సంగతి చెప్పాలో అర్ధంకాక సతమతమవుతూ కూర్చున్నాడు.

************
గుమ్మంలో అత్తగారిని చూసి ఆశ్చర్యపోయింది నిశాంత.
“నీ కొడుక్కి నాకు ఇప్పుడే సంబంధమూ లేదు. నీతో కూడ నాకే బంధమూ లేదని చెబితే వచ్చిన దారినే వెళ్ళిపోతాను. లేదూ… నేను నీక్కావాల్సిన మనిషిననుకుంటే లోపలికి రానివ్వు!” అంది సుభద్రమ్మ గడపలోనే నిలబడి.
“రండి రండి. ఇన్నాళ్ళూ ఎక్కడున్నారు?” అనడిగింది నిశాంత సూట్ కేసు అందుకుంటూ.
సుభద్రమ్మ లోపలికొచ్చి “మధ్యలో వచ్చేను. జరిగింది తెలిసి వాణ్ణి నాలుగూ తిట్టి వెళ్ళిపోయి నూజివీడు జమీందారింట్లో వంటలు చేస్తూ బతికేను. అక్కడ వాళ్ళు విదేశాలు వెళ్లిపోవడంతో తిరిగి నీ దగ్గరికి రాక తప్పలేదు.” అంది ఏడుస్తూ.
“ఆయన దగ్గరకెళ్తారా?”
“ఛస్తే వెళ్ళను. వాడెంత తెలివైన వాడైనా – మనిషికుండాల్సిన లక్షణాలు లోపించినపుడు వాడు కొడుకైనా వాడి మొహం చూడకూడదు. నువ్వు చేసినదంతా మరచిపోయేడు నీచుడు! ఇంతకింతా అనుభవిస్తాడు” అంది రుధ్ధమైన కంఠస్వరంతో.
“జరిగిపోయింది మరిచిపోండి. నాతోనే వుండండి” అంది నిశాంత.
సుభద్రమ్మ కోడల్ని కౌగలించుకుంది కన్నీళ్ళతో.
సరిగ్గా అప్పుడే శేషయ్య వచ్చి “అమ్మా, నిశాంతా!” అని పిలిచేడు.
నిశాంత అతన్ని చూసి ” రండి, ఏంటంతర్జంటుగా వచ్చేరు?” అనడిగింది నవ్వుతూ.
“నీతో మాట్లాడాలని!”
“రండి! కూర్చోండి!”
అతన్ని చూసి లోపలికెళ్ళింది సుభద్రమ్మ.
“నాకెలా మొదలెట్టి చెప్పాలో తెలియడం లేదు” అన్నాడతను ఉపోద్ఘాతంగా.
నిశాంత అతనివైపర్ధం కానట్లుగా చూసి “మా డేడీ… మమ్మీకి…”
“ఛ! ఛ! అదేం కాదు. ఇది మా స్వవిషయం. సాగర్ నిన్ను మరో ఆస్పత్రిలో పని చేసుకోమని చెప్పలేకపోతున్నాడు!” అన్నాడు మధ్యలోనే అందుకొని.
నిశాంత మ్రాన్పడినట్లుగా చూసి “ఏం జరిగింది?” అనడిగింది.
“ఏం జరగలేదు. జరగదు కూడ! కాని నా కూతురు బుర్రలో అంతర్యుద్ధం జరుగుతోంది అనుమానాలతో. మీ ఇద్దరూ కలిసి తనకన్యాయం చేస్తున్నట్లూహించుకొని గందరగోళం చేస్తోంది. సాగర్ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తోంది. అది వీధిన పడి ఏదో ఒకరోజు ఆస్పత్రికొచ్చి నిన్నల్లరి చెయ్యకముందే…”
“అర్ధమయింది. నేను ఇప్పుడే మీ చేతికి రిజిగ్నేషన్ రాసిస్తాను. పట్టుకెళ్ళి మీ అల్లుడికివ్వండి.”
“ఇదంతా… ఎవరు చేస్తున్నారో తెలుసా? హితేంద్ర!”
శేషయ్య మాటలు విని విరక్తిగా నవ్వి “ఎవరు చేస్తేనేం… నాది దురదృష్టం. లతంటే నాకు చాలా యిష్టం. లతకే అన్యాయం చేసే దుర్భుధ్ధి నాకు లేదని చెప్పండి” అంటూ రిజిగ్నేషన్ లెటర్ అతనికందించింది నిశాంత.
శేషయ్య లేచి నిలబడి “నన్ను క్షమించు తల్లీ! నువ్వు రోడ్డునపడి అల్లరి కాకూడదనే ఇలా వచ్చేను. అద్సరే. నువ్వు వేరే ప్రాక్టీసు పెట్టుకుంటానంటే… నేను డబ్బు సహాయం చేస్తాను” అన్నాడు.
“అక్కర్లేదు” అంది సుభద్రమ్మ బయటకొచ్చి.
శేషయ్య ఆమె వైపు ఆశ్చర్యపోయి చూసేడు.
“ఆమాత్రం డబ్బు మా దగ్గరుంది. మీరెళ్ళిరండి!” అంది సుభద్రమ్మ. ‌
శేషయ్య వెళ్ళిపోగానే “అత్తయ్యా!” అంది నిశాంత కన్నీళ్ళతో.
“ఏడవకమ్మా. అన్నం పెట్టిన నీమీద ఎందుకో వాడికంత కక్ష! అంతకంతా అనుభవిస్తాడొక రోజు. అద్సరే! నా దగ్గర రెండు లక్షలున్నాయి. దాంతో నీ నర్సింగ్ హోం నువ్వే పెట్టుకో! ఈ నిందలొద్దు!” అంది.
“ఎక్కడిదంత డబ్బు!” అంది.
“ఎప్పుడో మా ఆయన కట్టిన పాలసీ. అదుందని మాకు తెలీనే తెలీదు. నాకేం చెప్పేరు కనుక. నా పెట్టెలోనే పడుండేది. అదేంటో కూడ నేనెప్పుడూ తెరచి చూడలేదు. నూజివీడులో నేను తీసి పారేస్తుంటే వాళ్ళ డ్రైవరు చూసి చెప్పేడు. వాళ్ళే అన్ని ప్రయత్నాలూ చేసి నాకీ డబ్బిప్పించేరు. ఇందులో హితేంద్రదొక్క పైసా లేదు.” అంది.
నిశాంత కృతజ్ఞతగా అత్తగారి చేతులు పట్టుకుంది.
“నేనేం ఘనకార్యం చేసేనని. అలాంటి దుర్మార్గుణ్ణి కనకపోతే నీ జీవితము బాగుండేదేమో!” అంది బాధగా.
“అలా అనకండి.” అంది నిశాంత.
“అయినా వాడు నీ నగలన్నీ కాజేసేడు. సిగ్గుంటే అవి నీకు తిరిగివ్వాలిగా. ఒకరోజు నేనే వెళ్ళి దులిపేసొస్తాను” అంది సుభద్రమ్మ ఆవేశంగా.
“వద్దండీ! ఆ తొందరపాటు పని చెయ్యొద్దు” అంది నిశాంత ఆమె చేతులు పట్టుకొని.

************

1 thought on “చీకటి మూసిన ఏకాంతం – 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *