​రచన: శారదాప్రసాద్

అంతరంగాన్ని మధిస్తే అద్భుతమైన కావ్యాలు పుట్టుకు వస్తాయి. మనం ఒక గంటసేపు ఆలోచించిన సంఘటలన్నిటినీ, వ్రాస్తే, కొన్ని​వందల పుటల గ్రంధమౌతుంది. 20 వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ నూతన సాహిత్య ప్రక్రియకు ఆద్యుడైనవాడు జేమ్స్ జోయిస్. ఆ ప్రక్రియే​ ​stream of consciousness. ఈ​ ​ప్రక్రియలో ఆయన స్పూర్తితో తెలుగులో కూడా చక్కని నవలలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి గోపీచంద్ గారి అసమర్ధుని జీవయాత్ర, బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, వినుకొండ నాగరాజు గారి ఊబిలో దున్న, వడ్డెర చండీదాస్ గారి హిమజ్వాల, శ్రీమతి పరిమళా సోమేశ్వర్ గారి అంతరంగతరంగాలు,  రావిశాస్త్రి గారి ‘అల్పజీవి’, నవీన్ గారి ‘అంపశయ్య’ ముఖ్యమైనవి. చైతన్యస్రవంతి అనేది ఒక విలక్షణ శైలి.  ఈ శైలిలో వచ్చిన అత్యద్భుతమైన నవల అయిన ‘అంపశయ్య’ను వ్రాసి నవీన్ గారు ప్రఖ్యాతి గాంచారు.  ఆఖరికి ‘అంపశయ్య’ అనేది నవీన్ గారి ఇంటిపేరుగా మారింది.

‘అంపశయ్య’  వెయ్యేళ్ల  తెలుగు సాహిత్య చరిత్రలో (1000 నుంచి 1999 మధ్య కాలంలో) వచ్చిన వంద గొప్ప గ్రంధాల్లో ఒకటని చాలామంది విశ్లేషకులు అంటారు. ఈ నవలలను మనోవైజ్ఞానిక నవలలని చెప్పవచ్చు. ఈ నవలలలో పాత్రల మనస్తత్వ చిత్రీకరణ విభిన్నమైన శైలిలో ఉంటుంది.  వాటిలోని  పాత్రలు ఏం చేస్తాయో, అవి ఎదుర్కునే సమస్యలే కధనాన్నిఆసక్తికరంగా నడిపిస్తాయి .  తమ మనస్తత్వం మేరకే పాత్రలు తమకు ఎదురుపడిన  సమస్యల్ని ఎదుర్కొంటాయి.  శ్రీ శ్రీ గారి రేడియో నాటిక ‘విదూషకుడి ఆత్మహత్య’ కూడా కుడిఎడమగా ఇదే ధోరణిలో వ్రాసినదే! గమ్మత్తు ఏమిటంటే, ఇందులో విదూషకుడు ఉండడు, ఆత్మహత్య ఉండదు. ‘ఒసే తువ్వాలందుకో !’అనే శ్రీ శ్రీ గారి కథ కూడా ఈ ప్రక్రియలోనే వ్రాయబడిం​దే . ఈ ప్రక్రియవల్ల గొప్ప ప్రయోజనం ఏమిటంటే, పాఠకుడు​ ​తనే స్వయంగా కథ లేక నవలలోని పాత్రలతో మమేకమవ్వటం , తనకు తానుగా పాత్రలను ప్రత్యేకమైన ఫోటోలుగా చిత్రీకరించుకోవటం! ఇంకా వివరంగా చెప్పాలంటే–నాకోసం ఒక మిత్రుడు సాయంత్రం అయిదు గంటలకు నా ఇంటికి వచ్చి, కాలింగ్ బెల్ నొక్కితే , వచ్చిన నా శ్రీమతి అతని మధ్య సంభాషణ ఇలా కొనసాగుతుంది.

“అమ్మా!శాస్త్రి గారు ఉన్నారా?”

“లేరండీ! అత్యవసరమైన పని ఉండి బయటకు వెళ్ళారు. ”

“నాకొక చిన్న సహాయం చేస్తానని, అయిదు గంటలకు రమ్మన్నారు, మీకేమైనా వివరాలు చెప్పారమ్మా!”

“ఏదీ ఎవ్వరికీ చెప్పరు! ఆయనకు అన్నీ అత్యవసరమైనవే!క్షణం తీరిక ఉండదు, దమ్మిడీ ఆదా ఉండదు”

“ఏదో నాలాంటి మరో మిత్రుని పనిమీదనే బయటకిపోయి ఉంటారు”

“అయివుండ వచ్చునేమో!కూర్చోండి! వస్తారు. ఈ కాఫీ తీసుకోండి!”

“సెల్ ఫోన్ లో మాట్లాడాను, వస్తున్నారట!”

“మరీ మంచిది. విశ్రాంతిగా కూర్చోండి. ”

ఈ సంభాషణలో ముఖ్యమైన పాత్ర(వ్యక్తి) ‘శాస్త్రి గారు’, అయితే(ఆ పాత్ర) ఆయన మనకు కనపడడు. పై ఇద్దరి పాత్రల సంభాషణలను బట్టి ‘శాస్త్రి గారి’ పాత్రను,  ఎవరికి కావలసిన కోణంలో వారు ఫోటోగా తీసుకొనవచ్చును. ఒక పాత్రను గురించి​ ​పాఠకుడే స్వయంగా ఊహించుకొని తన మస్తిష్కంలో తానే ఒక ఫోటోను చిత్రీకరించుకోవటం​ ​అనేది ఒక అద్భుతమైన ప్రక్రియే కాకుండా, పాఠకుడి మెదడుకు మంచి పదును పెట్టే  ప్రక్రియ కూడా!ఇక​ ​ఒక విధంగా ఈ ప్రక్రియయకు ఆద్యుడనతగిన జేమ్స్ జోయిస్ ను గురించి,  ఆ సాహిత్య ప్రక్రియను గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఐరిష్ రాజధాని డబ్లిన్ నగరవాసి అయిన​ ​జేమ్స్ జోయిస్​ ​అష్ట కష్టాల మధ్య జీవించాడు, అతి నికృష్టమైన పరిస్థితులలో మరణించాడు. ప్రపంచానికి అతడు అమూల్యమైన గ్రంధాలను కానుకగా ఇస్తే , ప్రపంచం అతనికి నిరసన, హేళన ప్రసాదించింది. 1914 -18 మధ్య యావత్ ప్రపంచమూ ఒక మహా యుద్ధంలో నిమగ్నమై ఉంటే, జేమ్స్ జోయిస్ ఒక కావ్య రచనలో మునిగిపోయాడు. ఆ యుద్ధానికి ఫలితంగా రష్యాలో వచ్చిన సామ్యవాద విప్లవానికెంత ప్రాముఖ్యముందో, సాహిత్య ప్రపంచంలో ‘యులిసెస్’ నవలకంత ప్రాబల్యం ​ఉంది.

‘యులిసెస్’ షుమారు 900 పుటల ఉద్గ్రంధం. 1914 వ సంవత్సరం జూన్ నెలలో ఒక రోజున జరిగిన కథ అది. లియోపాల్డు బ్లూం అనే మనిషి తెల్లవారుఝామున లేచి పగలంతా తన మామూలు పనులు చూసుకొని రాత్రి నిద్రపోతాడు. ఇంతే కథ!ఒక సగటు మనిషి, ఒక సామాన్య నగరంలో, ఒక సామాన్య దినాన్ని గడిపిన సామాన్య జీవితం. కానీ అతడే యులిసెస్. ఎడతెగని నౌకాయానం చేస్తూ ఎన్నో అద్భుతానుభవాలు గడించిన యులిసెస్ చరిత్రను Homer రాస్తే అవే యాత్రలూ అవే అనుభవాలు మన లియోపాల్డు బ్లూం కి కూడా తన  ఊరులోనే సంభవించాయని జోయిస్ వ్రాసాడు. Homer కావ్యంలో18 పర్వాలు,  జోయిస్ నవలలో 18 గంటలు. అయితే పురాణ కాలపు యులిసెస్ అనేక సముద్రాలు దాటి, అనేక ద్వీపాలలో రాక్షసులనూ, మాంత్రికులనూ, దేవకాంతలనూ చూస్తాడు. బ్లూం ది మానసిక నౌకాయానం మాత్రమే!ఇతనూ పైన చెప్పిన లాంటి మాంత్రికులూ వగైరా వారందరినీ కలుసుకుంటాడు. అయితే వీరు నిత్య జీవితంలో ఉన్నవాళ్ళే!ప్రపంచ సంఘటనల చిత్రీకరణతో ఊరుకోకుండా, తన పాత్రల మానసిక స్వభావాలను కూడా అద్భుతంగా వర్ణించాడు.

ఇందుకు గాను అతను,  ఇదివరకెవ్వరూ ఎన్నుకొనని సాహిత్య ప్రక్రియే ‘Stream Of Consciousness’, అదే ‘చైతన్య స్రవంతి’, నిత్యం ప్రవహించే మానసిక స్వాభావ స్థితి. క్లుప్తంగా చెప్పాలంటే,  ఇది ఎలా ఉంటుందంటే—ఒక మనిషిని Focusలో చూపించి, దాని వెనుకనే అంతకన్నా తక్కువ Focusలో అతని మానసిక సంచారాన్ని చూపించి, ఇంకా దాని వెనుక అతని సుప్త చైతన్యం లోని స్మృతి పరంపరలను చూపడం లాంటిది. ఒకేసారి ఇన్ని Focus లలో Photos తీసే Cameras లేవు. రచనా శిల్పం ద్వారా దీన్ని జోయిస్ సాధించాడు. సలక్షణంగా ఒక్క photograph తీయటమే చాలా కష్టం. ఒకే చిత్రంలో ఒకదాని వెనుక ఒకటిగాఎన్నోదృశ్యాలను ఏకకాలంలో చూపించగలిగాడు జేమ్స్ జోయిస్. తక్కువ జాతికి చెందిన వారని సంఘం భావించే మనుషుల మనసులను,  వారు​ ​మాట్లాడే భాషను, వారి భావాలను, అద్భుతంగా చిత్రించటం –సామ్రాజ్యవాద దేశమైన అమెరికా వారికి నచ్చలేదు. ఆనాడు అమెరికాదేశంలో ఒక పత్రికలో ఇది సీరియల్ గా ప్రచురితం అయ్యింది. దానిని మధ్యలోనే ఆపేసి, ఆ పత్రికా నిర్వాహకులను అమెరికా ప్రభుత్వం వారు arrest చేశారు. వారి చట్టం అనుమతించని మాటలను తొలగించి, ఆ గొప్ప గ్రంధాన్నిఒక అతుకులబొంతగా తయారు చేసి ఇష్టమొచ్చినట్లు అమ్ముకున్న ఘనమైన వారు ఆదేశంలో కూడా ఉన్నారు. రచయితకు దమ్మిడీ కూడా ఇవ్వలేదు. మహాకావ్య రచన ఒక గొప్ప భవనం నిర్మించటం లాంటిదాని జోయిస్ ఉద్దేశ్యం. శిల్పి మనసులో ముందుగానే తన కృతి యొక్క సంపూర్ణ చిత్రం సాక్షాత్కరించాలి. తరువాత వివరాలలోకి వెళ్లి ఒకొక్క ఇటుకనే శ్రద్ధగా పేర్చుకుంటూ భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలి. జేమ్స్ జోయిస్ తన నవలలన్నీ ఈ పద్ధతిలోనే వ్రాసాడు. సరదాగా చదువుకునే ఒక Detective నవలకు, గురజాడవారి కన్యాశుల్కం నాటక కథకు ఎంత తేడా ఉంటుందో ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను.

Detective నవల చదువుతున్నంతసేపూ ఉత్సాహంగా, ఉబలాటంగా ​ఉంటుంది. చదవటం పూర్తి అయిన తర్వాత, హంతకుడెవరో తెలుసుకున్న తర్వాత –ఆ ఉత్సాహం అంతా చల్లబడిపోతుంది. మళ్ళీ మనకు,  ఆ నవల చదవాలనిపించదు. కన్యాశుల్కం నాటక కథ అలా కాదు–కథ మనకు చదవటానికి ముందే తెలుసు.  గిరీశం,  మధురవాణి మొదలైన వారి ప్రవర్తన కూడా మనకు తెలుసు. అయినా మళ్ళీ కన్యాశుల్కం నాటక కథ మనల్ని ఆకర్షిస్తుంది. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లూ ఒక కొత్త విశేషం తెలుస్తూనే ఉంటుంది.

ఏదైతే అనుక్షణం నవీనమైన ఆనందం మనకు కలిగిస్తుందో అదే సౌందర్యం. జోయిస్ రచనలలో ఆ సౌందర్యం మనకి పుష్కలంగా లభిస్తుంది. అందుచేతనే, జోయిస్ ‘మహాకవి’! తెలుగులో జేమ్స్ జోయిస్ ని అద్భుతంగా ఆవిష్కరించిన మహాకవి శ్రీశ్రీ కి స్మృత్యంజలితో!

​(మహాకవి శ్రీ శ్రీ గారి రచనకు అనుసరణ) ​

 

By Editor

9 thoughts on “చైతన్య స్రవంతి (Stream of consciousness)-జేమ్స్ జోయిస్-యులిసెస్”
 1. జేమ్స్ జోయిస్ ను గురించి తెలుగువారికి మళ్ళీ గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు!

 2. మిత్రమా,
  నీ రచన “చైతన్య స్రవంతి” చాలా బాగుంది. ఇలాంటి పరిచయ విశ్లేషణ రచనలు చదువరులకు చాలా ఉపకరిస్తాయి. నీవు ఇలాంటి మంచిరచనలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను.
  అభినందనలతో..
  మిత్రుడు,
  వి.యస్.కె.హెచ్.బాబురావు.

 3. Very interesting article.It has covered
  James Joyece and his actions and compared with telugu writers with good timing
  Good to read and know

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వర్గాలు
భోషాణం
ఇటీవలి వ్యాఖ్యలు