April 23, 2024

|| భక్తి మాలిక తిరుప్పావై ||

రచన: శ్రీ సత్య గౌతమి

కడలిలో మహానదులు కలిసిపోయేట్లు విష్ణుభక్తి అనే కడలిలో నిరంతరంగా సాగే అలే “గోదా”. విష్ణుభక్తిని చిత్తము నందు ధరించిన భట్టనాధుడికి ఆ భక్తే తులసీవనాన ఒక పాపగా దర్శనమయ్యింది. ఆ పాపే, విష్ణుచిత్తుడు బిడ్డగా పొందిన “కోదై (తులసి మాల)”. ఆమె యే ఈ “గోదా”. నిరంతర విష్ణుభక్తి కలబోసిన వాతావరణం లో పెరిగిన గోదా, కృష్ణతత్వాన్ని శోధిస్తూ ప్రణయతత్వం అనే నావలో ప్రయాణం మొదలుపెట్టి అచంచలమైన ఆరాధనా, భక్తి, విశ్వాసాలతో శ్రీరంగనాధుడిని వశపరుచుకున్నది. ఆ శ్రీరంగనాధుడినే పెండ్లాడి అతనిలో ఐక్యమయి మోక్ష్యానికి ప్రణయారాధన ఒక సాధనమని లోకానికి చాటి చెప్పినది గోదాదేవి. అంతేకాదు ధనుర్మాస వ్రతాన్ని ఒక నోములా తాను చేపట్టి తన చెలికాండ్రతో కూడా చేయించినది. ఆ విధానాన్నంతా ముప్ఫై పాశురాలుగా ప్రబంధ కావ్యాన్ని రచించి మనకు అందించినది. భోగి పండుగ రోజున రంగనాధుని పెండ్లాడినది. ఆమె కళ్యాణము అయ్యాకే మనుజుల కళ్యాణాలు మొదలవుతాయి, అందుకే భోగి పండుగ భోగి మంటలకే కాదు, గోదా కళ్యాణానికీ ప్రసిద్ధి. తిరుపతిలో సైతం ధనుర్మాసం మొదలైన నాటినుండీ గోదాదేవి రచించిన ప్రబంధం ‘తిరుప్పావై’ (పాశురాలు) నే పాడుతూ స్వామివారిని సేవిస్తుంటారు.

పరమాత్మను చూడాలనుకొనే ఆత్మను కలిగివున్న వారికి ఒక వరంగా లభ్యమయ్యేదే ధనుర్మాస వ్రతదీక్ష. అట్టి వ్రతదీక్షను బూనినవాళ్ళెప్పుడూ ఆ గోదాదేవి ఆశీస్సులను పొందివుంటారు. గోదాదేవెలాగ తన చిత్తాన మహావిష్ణువును ధరించినదో అలా ఆ మహావిష్ణువును చిత్తాన ధరించిన ప్రతి ఒక్కరికీ పరమాత్మను చూడడం సులభసాధ్యమే అని తాను గోపీ వేషధారియై వ్రతమాచరించి, తన స్నేహితురాండ్ర చేత కూడా వ్రతమాచరింప జేసెను. తద్వారా ఆ వ్రత విధానాన్ని, నియమాలను లోకానికి 30 పాశురాలుగా తిరుప్పావై అనే పేరిట రచించి, అందించినది. భూమి మీద మనుజులందరూ తరియించాలనే సాక్ష్యాత్తు భూదేవే కోదై (గోదాదేవి) గా దక్షిణ తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తునకు పాపగా అవతరించినది.

శ్రీకృష్ణ తత్వాన్ని శోధించి సాధించుకున్న గోదాదేవి జ్ఞానము, భక్తి, వైరాగ్యములనే ఆభరణాలను ధరించి, స్నేహితురాండ్రకు కూడా బోధిస్తుంది. అంత:కరణ స్నానమాచరించమంటుంది. ఆ నారాయణుడు ఇహ లోక సంపదలను ఇచ్చువాడే కాకుండా, ఆధ్యాత్మిక సంపదలను కూడా ఇచ్చువాడు. భూమి మీద పుట్టినందులకు అవసరాల నిమిత్తమూ ఇహ లోక సంపదలు అవసరం. వాటి సముపార్జనలో నిరంతరము మునిగి ఆద్యాత్మిక సంపదను ఆర్జించడం విస్మరిస్తే మనుజుడు పరమాత్మను చూడలేడు. అందుకోసం మనుజుడు తన ఆత్మనే రేపల్లె జేసి, అందు శ్రీకృష్ణుని నిలిపినప్పుడు తాను తప్పకుండా పరమాత్ముని చూడగలడనీ, అందుకు అంత:కరణ శుద్ధి (అనగా ఇహ లోక సంపదలను వదలడం) అవసరమని బోధించినది గోదా. అంతేకాదు, “ఇది భగవంతుని పొందాలనే ఆర్తితో చెయ్యాలసిన వ్రతమే తప్పా…ఇది ఒక సాధన కాదు, తపమూ కాదు, నిరంతరం సాగే సముద్రం అనీ, దానిలో పుట్టే అలలవలే భగవంతుని అనుభూతులు కలుగుననీ” వ్రత ఫలితాన్ని కూడా ముందుగానే సూచించినది ఆ తల్లి.

చేస్తున్న ప్రతి పనిలోనూ శ్రీకృష్ణుని దర్శించమంటుంది గోదాదేవి, ఆ విధంగా మనుజుడు మంచి పనులకే పూనుకొంటాడు గానీ, చెడుకి పూనుకోడు. అలాగే దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా శ్రీహరికి అర్పిస్తున్నట్లు భావించమంటుంది ఎందుకంటే సర్వం విష్ణుమయం, ఆ మహావిష్ణువు అందరికీ ఇచ్చువాడు, ఆయనదే పైచెయ్యి. అట్టి మహావిష్ణువుకు అర్పించు చోట “నేను, నా వల్ల, నేను గాబట్టి” వంటి అహంకార, మమకారాలు మనుజునిలో పుట్టకుండా వుంటాయని వివరించినది గోదాదేవి. అంతే కాకుండా బాహ్య అలంకరణలకు (అనగా కంటికి కాటుక, తలలో పువ్వులు మొదలైనవి) దూరమవ్వమన్నది, ఆ పువ్వులను భగవంతునికే అర్పించమన్నది. దాని వలన, మాకేదీ వద్దు, నీవు తప్పా అనేటువంటి జ్ఞానంతో కూడిన భావన అలవరుతుందని బోధించినది. పెద్దలు చెప్పిన ఆచరణలను పాటించమనీ, ఇతరులపై చాడీలు చెప్పకూడదనీ, ఎప్పుడూ సత్యములనే పలుక వలెననీ, శక్తికి మించినదైనా అవసరమైనప్పుడు ఎదుటి వారికి సహాయము చెయ్యగల ప్రయత్నం చెయ్యవలెననీ పాశురములో నియమావళిగా చెప్పినది. దీనివలన అంతా నాదే అన్న భావన మనుజునిలో తొలగి, అంతా ఆ పై వాడిదే, నాదేమీ లేదన్న విషయాన్ని మనుజుడు గ్రహించగలడన్నది. నా ద్వారానే ఆ సర్వాంతర్యామి ఈ పనిని చేయిస్తున్నాడనే భావన కలుగును అని తన నియమావళి యొక్క ఆంతర్యాన్ని బోధించినది.

గోదాదేవి చెప్పిన మూడవ పాశురం ఆశీర్వచన పాశురం. ఆవిడ చేసిన శుభసంకల్పం. నెలకు మూడువానలు పడాలనీ, వరి చేలలోని చేపలు నిండుగా ఎగిరెగిరి పడుతుండాలనీ మరియు గోశాలలో పాలు సమృద్ధిగా వుండాలని. అంతే కాకుండా ఆద్యాత్మికంగా తానిచ్చిన గొప్ప సందేశమేమిటంటే ఆచార్యులు గోవుల్లాంటివారు. గోవులు పాలతో సమృద్ధిగా వున్నటుల, ఆచార్యులు జ్ఞానముతో సమృద్ధిగా వుందురు కావున వారిని అనుసరించి జ్ఞానాన్ని పొందమన్నది. బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల భూదానమడిగిన నెపముతో అతని నుండి అహంకారము, మమకారము, అవిద్య (అజ్ఞానము) ను తొలగించి పాతాళానికి నొక్కి, బలికి వాటినుండి మోక్షాన్ని ప్రసాదించాడు వామనుడు. అలాగే ఆ పరమాత్ముని సహాయంతో అహంకార, మమకార, అజ్ఞానాలను తొలగించు కోవడానికి ఆచార్యులను ఆశ్రయించమని మరొక నియమాన్ని బోధించినది.

ఈ వ్రతమాచరించుటకు మరొక ముఖ్యమైన నియమము “అనసూయ” గా వర్ధిల్లడం అనగా అసూయను రూపుమాపుకోవడం. ఇతరుల సౌఖ్యాలను చూసి ఓర్వ లేకపోవడమనే లక్షణాన్ని పూర్తిగా తొలగించుకోమంటుంది గోదాదేవి. అది ఈ వ్రతం ద్వారా ఎటుల అలవరుననిన, తాను వ్రతాన్ని అంత గొప్పగా చెయ్యలేక పోయినా తనతోటి వారెవరైనా ఈ వ్రతాన్ని సమృద్ధిగా చేయుచున్నప్పుడు అసూయ చెందకుండా, నిండు మనసుతో హర్షించడం గోదాదేవి నేర్వమంటుంది. అది ఎడారా, మెట్ట భూమా, నందనవనమా అనే తేడా లేకుండా ఆ మేఘుడు అంతటా ఎలా వర్షించునో మన మనస్సుకూడా తన, పర బేధాలు లేని… అంత నిశ్చలతను పొంది వుండాలనే నియమాన్ని పెట్టింది.

ఇలా స్నేహితురాండ్రకు మంచి విషయాలను బోధిస్తూ గోప వేషధారియైన గోదాదేవి మహావిష్ణువున్న దివ్యదేశాన పరమాత్మలో లీనమయ్యున్న పదిమంది ఆళ్వారులను గోపికలుగా భావిస్తూ వారందరినీ వ్రతము ఆచరించుటకు ప్రతిదినమూ పిలుచుచున్నది. స్నేహితురాలు “శుభ కర్మలను చేయు చున్నప్పుడు ఆటంకములు సహజము. అలా మనము వ్రతదీక్షలో చవి చూచెదమేమో” అనే ఆలోచనను వ్యక్తము చేసినది. అప్పుడు గోదాదేవి ఇటుల చెప్పదొడంగెను. “చేయు పనులలోనే కాదు, ఆలోచనలో కూడా కీడు శంకించ రాదు, అదే అవరోధము గా పనులకడ్డమగు”నన్నది. మొదటి గోప కిశోరము, కర్మలలో మూడు కర్మలుగా ఇమిడి వున్న సంచిత, ప్రస్తుత, ఆగామి కర్మలను వివరించి భగవంతుని అనుగ్రహం తో చెడు కర్మలు తొలుగునంటుంది అనగా చెడు ఖర్మలను తొలగించుకొనినా, ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని అర్ధము అని ఒక గోప కిశోరమంటే, పూర్వ జన్మలో ఏమి చేసినా, ఈ జన్మలో శుభకర్మలను చేయవలెనన్న జ్ఞానాన్ని తప్పకుండా కలిగి వుండాలి, అసత్యము లాడకుండా ధర్మాన్ని పాటించు తోడనే భగవంతుని అనుగ్రహము కలుగునని మరొక గోప కిశోరము చెప్పును. ఈ గోష్ఠి ద్వారా “మనసా, వాచా, కర్మేణా ఆ నారాయణునకు ఆత్మార్పణము గావించునప్పుడు, అన్ని చెడు ఖర్మలు తొలగుననీ, ఆ పరమాత్నుని వద్ద ఎల్లప్పుడూ చిన్మయానందమే వుండునని, ఇదియే శరణాగతి రహస్యమని” చెప్పినది గోదాదేవి.

జీవుడిని యోగ్యుడిని చేసి పరమాత్మునికి అందించే వాడు ఆచార్యుడు. అలా గోదాదేవి యే ఆచార్యునిగా కూడా వ్యవహరించి, గోపికలందరినీ లేపి తన గోష్ఠిలో కూర్చో బెట్టుకొని, వ్రతాన్ని ఆరంభిద్దామనుకొంటుంది. సూర్యోదయానికి ముందు పక్షుల కిల కిలా రావాలను వర్ణిస్తూ, ఆ సమయానే తెల్లటి విష్ణు శంఖము “విష్ణు సేవకు వేళయింది, రండి రండని ఆ పక్షులను పిలుచుచున్నది…అలానే మనలనూ పిలుచుచున్నది లెండు లెండని…” విష్ణుసేవకు గోపికలను పిలిచెడిది ఆ గోదాదేవి. “ప్రకృతి మనకిచ్చిన అహంకార, మమకారాలనే విష పదార్ధాలను, పూతన విషస్తన్యాలను పీల్చేసినట్లు ఆ శ్రీహరే హరించును. శకటాసురుని వంటిది మన దేహము, అది అహంకార, అజ్ఞానములనే చక్రములపై నడుచును. ఆ చక్రముల కీళ్ళను విరగ గొట్టగలవాడే ఆ మహావిష్ణువు, యోగ నిద్రలో వుండి ప్రపంచానంతా వీక్షించుచున్నాడు, అట్టి శ్రీహరిని, సేవింతము రండు రండనీ…” గోదాదేవి ఎలుగెత్తి గోపికలను పిలిచినది. శ్రీహరి గుణాలను శ్రవణము ద్వారా, కీర్తన ద్వారా వింటూ పాడుతుండేటప్పుడు లోపలి నుండి మార్పు సంభవిస్తుందనే సూత్రమును తెలిపినది గోదాదేవి. రేపల్లెలో గోపికలు నిరంతరమూ కృష్ణ తలంపుతో పట్టుదలగా చల్ల చిలుకుతూ అతని పై భక్తి విశ్వాసాలను సాధించి అమృతమైన వెన్న రూపములో శ్రీకృషునిని పొందారు, అటులనే మనమునూ శ్రవణముతో, ధ్యానముతో శ్రీకృష్ణుని పొందెదము రమ్మనెను గోపకిశోరాలను. మూడవ గోపిక, పిలిచిన వెంటనే రాదు. తన భక్తి విశ్వాసాలకు మెచ్చి ఆ కృష్ణుడే తన చెంతకు వచ్చుననే ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటుంది. అట్టి గోపిక తప్పకా తమతో వుండాలని కాంక్షిస్తూ వుంటారు గోదా మరియు ఆమె స్నేహితులు. కోరికలను పూర్తిగా వదిలేసి, ఎవరు ఆత్మలో పరమాత్మను పొందుతారో వారిని “స్థితప్రజ్ఞులు” అని అంటారు. అట్టి స్థితప్రజ్ఞతను కలిగి వుండి, ధ్యానంలో మునిగి పోయిన నాల్గవ గోపికను లెమ్మంటారు గోదా అమ్మవారు. ఆమె చుట్టూ దీపాలు, అగరువత్తులు వెలుగుతూ వుంటాయి, ఆమె ధ్యానంలో వుంటుంది. దీపము జ్ఞానానికీ, అగరొత్తుల సువాసన ఆ జ్ఞానం యొక్క అనుష్ఠానానికి నిదర్శనం. శ్రీకృష్ణ ధ్యానంలో పొందే జ్ఞానంతో స్థితప్రజ్ఞతను కలిగి భగవదనుభవ ఆనందాన్ని పొందేటప్పుడు, ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమవుతుందనీ, ఈ గోపిక ద్వారా ఆ తల్లి మనకు తెలియపరుస్తుంది. ఆ పై ఐదవ గోపిక వద్దకు పోయి “నోము నోచి భగవంతుని పొందిన ఆనందసాగరాన సుఖమును అనుభవిస్తున్న ఓ గోపికామణీ … తలుపును తెరువుము, తలుపు తెరవుకన్నా ఫర్వాలేదు, శ్రీసూక్తులను మాకు చెప్పుమ”ని ఆ ఆండాళ్ళు తల్లి కోరినది. “కుంభకర్ణుని వలె యోగ ధ్యానంలోనే వుండక, మా చెంతకొచ్చి నీ శ్రీసూక్తములతో మాకు జ్ఞానాన్ని ఒసగి వ్రతమును ఆచరింపజేయుమ”ని తల్లి కోరినది అనగా ధర్మశాస్త్రాలు తెలిసిన ఆచార్యుని వలెనే జ్ఞానము కలుగునని గోదాదేవి సూచించినది. శ్రీకృష్ణుని పై అనేక తిరునామములను పాడుతూ ధ్వని చేస్తూ లేపబోయినా, లేవకుండా కృష్ణ ధ్యానములో మునిగిపోయివున్న ఆరవ గోపిక మహా సౌందర్య లహరి. ఒక్క దోషమైననూ లేని గొప్ప వంశాన పుట్టి ఆ శ్రీకృష్ణ అనుభవ సౌందర్యాన్ని పుణికి పుచ్చుకొనుట వల్ల ఆమె మరింత సౌందర్యవంతురాలయినది. ఆ శ్రీకృష్ణ అనుభవ సౌందర్యాన్ని తమకు కూడా పంచి తమచే వ్రతాన్ని ఆచరింప జేయుమనీ, గోదా గోపికలు వేడుకున్నారు. అటు పిమ్మట ఏడవ గోపిక వద్దకు పోయి ఆమె మొద్దు నిద్దర (కృష్ణ ధ్యానము) చూచి, గోవుల పాల పొదుగుల నుండి ప్రవాహంలా స్రవిస్తున్న పాలలా సాగి పోతున్న ఆమె కృష్ణ మంత్ర ధ్యానమును స్నేహితురాండ్రకు జూపి, కృష్ణ మంత్రమును విరామం లేకుండా జపించమనీ, అదియే జన్మకు సార్ధకతని వివరిస్తూ, ఆ గోపీ భక్తురాలి వాకిట నిలబడి “నీ కృష్ణభక్తి క్షీర సాగరాన మేమునూ తడిచి ముద్దయితిమి, ఇప్పటికైననూ ధ్యానము నుండి లేచి మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని పూర్తి చేయుటకు సాయపడమని” కోరుతూ, శ్రీరాముని సుగుణాలను కీర్తించినది గోదా. ఆ పై రావణుని పది తలలను మట్టు పెట్టిన శ్రీరామ శౌర్యమును, బకాసురుని నోటిని రెండుగా చీల్చిన చిన్ని కృష్ణుని లీలామృతాన్ని కొనియాడుతూ ఎనిమిదవ గోపికాలలామను లేపిరి. ఆమె కనులు తెరిచి అంతలోనే శ్రీకృష్ణుని యెడబాటునోపలేక కృష్ణుని వెతుకుతుండగా ఆమె కన్నులు తామర పూవులపై అలసి వాలిన తుమ్మెదలయినవి. అందులకు గోదా తమతో కలిసి జలకాలాడి కృష్ణగోష్ఠితో సేదతీర రమ్మని పదే పదే వేడుకొన్నది.

యోగులనూ, మునులనూ, ప్రకృతి కాంతను సైతము భగవదారాధన కొరకు నడిపించగల తొమ్మిదవ గోపిక ఉష:కాల సూచనలను పూర్తిగా మరిచి తన యింట దిగుడు బావిలో విచ్చుకున్న తామర్లలో, కమలాలలో ఆ కమలనాధుడిని దర్శించుకుంటూ మైమరిచింది. గోదాదేవి ఆమెను మేలుకొలిపి “ఆ కమలనాధుడిని మధురమైన స్వరాన మేమూ నీతో కలిసి కీర్తించెదము, మా ఈ వ్రతం ఫలించగలదు, రావమ్మా…రా..” అని కొసరి కొసరి పిలుచుకొన్నది గోదాదేవి. అచ్చటి నుండి ఈ పూబోణులందరూ శ్రీకృష్ణ మురళీనాదంలో రవమై పోయిన పదవ గోపికా రమణి వద్ద ఆగి, గొల్లుమని నవ్వారు. ఆ శబ్దాలకు తృళ్ళి పడి బాహ్య ప్రపంచాని కొచ్చిన గోపికామణి, తలుపులకు గట్టిగా గడియలు పెట్టినట్లు ధ్వని చెయ్యవద్దని వారిస్తూ మరలా గోదా మరియూ ఆమె స్నేహితురాండ్రతో కలిసి శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలను వింటూ వారి వ్రతాన్ని శుభప్రదం గావించ జేరినదిట. ఇలా భగవదానుభవాన్ని ఏకాంతంగా ఒక్కరే అనుభవించకుండా పదుగురితో కలిసి పంచుకోవాలనే విషయాన్ని ఈ వ్రతంలో వివరిస్తూ, శ్రవణ, మనన, ధ్యానాల ద్వారా భక్తి యోగాన్ని ఎలా అనుసరించాలో గోపికలను తట్టి లేపుతూ మన కోసం పాశురాలను లిఖించినది ఆ తల్లి గోదాదేవి. ఈ వ్రతం ద్వారా సాక్ష్యాత్తు ఆ భగవంతుడినే పెండ్లాడి అతనిలో ఐక్యమయింది. గోదాదేవి అణువణువూ శ్రీకృష్ణుని భక్తి సాగరాన తేలియాడినది. అతని పై ఆరాధనా, భక్తి, విశ్వాసాలనే దారంతో పూల మాలలను అల్లి భగవంతుని మెడలో చేర్చినది. అతనిని చేరే మార్గాన్ని కూడా తిరుప్పావై కావ్య రూపాన రచించి తానే ఒక భక్తి మాలిక అయిన సుందర చైతన్య మూర్తి, మోక్ష ప్రదాయిని గోదాదేవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *