April 23, 2024

రాజీపడిన బంధం – 1

 

రచన: కోసూరి ఉమాభారతి

“వెండితెర – సినీ సర్క్యూట్ వారి – తాజావార్త ” – పేపర్ చదువుతూ, ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తున్న శైలిలో చేయి పైకెత్తి స్వరం పెంచిందామె.
“ ‘మొరటోడు’ సినిమా చిత్రీకరణ సమయంలో- ‘రొమాంటిక్ సీక్వెన్స్ కోసం వెరైటీగా బాక్సింగ్, ఫుట్బాల్ క్రీడల్లో పాల్గొన్నందుకు నటి రాణి గాయాలకి లోనై అస్వస్థతకి గురవడంతో వారంపాటు షూటింగ్ నిలిపి వేసినట్టు దర్శకుడు కరుణాకరం అందించిన వార్త. వరుణ్ హీరోగా నిర్మాణంలో ఉన్న ఈ రొమాంటిక్ చిత్రాన్ని ఎలాగైనా దీపావళి కానుకగా అందిస్తామంటున్నారు నిర్మాతలు..’
అరుగు మధ్యలో చెట్టునానుకుని కూర్చుని, సినీపత్రికలోని ఆ వార్తని ఓ ప్రకటనలా చాటి చెప్తున్నది ఎవరో కాదు. మా డియర్ ఫ్రెండ్, రమణి.
హైదరాబాద్ విమెన్స్ కాలేజీ ఆవరణలో, ఆ చెట్టుక్రింద అరుగు మాకెంతో ఇష్టమైన విశ్రాంతి స్థలం. కెమిస్ట్రీ క్లాసుకి ఇంకా గంట సమయం ఉంది. కాసేపు బాతాఖానీ వేసి, కెమిస్ట్రీ పరీక్షకి రీవ్యూ చేద్దామని, ముగ్గురం అక్కడ చేరాము ….
“ఏయ్ నీలా, చిత్రా, ఈ న్యూస్ వింటున్నారా లేదా?” అంటూ మా వైపు తిరిగింది రమణి.
“అయినా, సినిమాల్లో రొమాన్స్ ఇంత అసాధారణంగా చూపెడతారెందుకో?”, “రొమాన్స్ లో కొట్టుకోడాలు, ఫుట్బాల్ గేమ్స్ ఏమిటి? చాలా స్టుపిడ్” పెద్దగా నవ్వుతూ రమణి.
అక్కడ చేరిన జూనియర్ స్టూడెంట్స్ తో పాటు అంతా నవ్వుకున్నాము. “పైగా టారిడ్ రొమాన్స్ అంటూ హారిడ్ కలర్ ఫోటోలు కూడా” అని వ్యాఖ్యానిస్తూ రమణి అందర్నీ ఆహ్లాద పరుస్తుంటే, కెమిస్ట్రీ బుక్స్ మూసేసి దాని మాటలు వినసాగాము.
సినిమా పత్రికల్లోని తాజా వార్తలని ఇలా మాకు ఎప్పటికప్పుడు అందిస్తుంది రమణి.
అక్కడే ఉన్న మా జూనియర్ వందన, వెనుతిరిగి మా వైపు చూసింది. “హలో ‘తీన్ దేవియా’! సినిమాల్లో రొమాన్స్ చిత్రీకరణ గురించే అంతలా వాపోతే ఎలా? మినర్వా థియేటర్లో నడుస్తున్న ‘పునర్జన్మ’ అనే డబ్బింగ్ సినిమా చూసారా? ప్రేమ, పెళ్ళి, జీవితం అంటే భయమేసేలా ఉంది.
‘శాడిస్ట్’ మొగుడుతో ఆ సినిమాలో అమ్మాయి పడే నరకం చూడాలి. హౌజ్-ఫుల్ గా నడుస్తుంది సినిమా. టికెట్లు దొరకవు. మీకు కావాలంటే నాకు చెప్పండి.. ఒక్క రోజు ముందు చెప్పండి. తెప్పించగలను” అన్నది నవ్వుతూ.
“జూనియర్ అన్న మాటే గాని.. ఆడపులి రకం ఈ పిల్ల” అంది చిత్ర నెమ్మదిగా. దాని మాటలకి నవ్వుతూనే, కెమిస్ట్రీ పరీక్ష గుర్తొచ్చి పుస్తకం తెరవబోయాను.
“నీలా, ఆమధ్య పెళ్లి చేసుకొన్న మా కజిన్ శాలిని గురించి చెప్పాను. గుర్తుందా?” అడిగింది చిత్ర ఉన్నట్టుండి..
గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తలెత్తాను..
“అదేనోయ్, మొగుడు ‘మొరటోడు’ అని కాపురానికి వెళ్ళకుండా ఎనిమిది నెలలగా పుట్టింట్లోనే ఉందని చెప్పానే! గుర్తొచ్చిందా?” అంటూ మా వంక చూసింది చిత్ర.
“అవునవును గుర్తే. ఏమయింది ఆ తరువాత? విరహం ఓపలేక ఆ అమ్మాయి భర్త వద్దకు చెక్కేసిందా? చెప్పు చెప్పు” అంటూ అరుగు దిగి మా మధ్యకొచ్చి కూర్చుంది రమణి.
“కానే కాదు. ‘భర్త ఆమడ దూరంగా ఉన్నా సహించలేను’ అంటూ సీరియస్ గానే కోర్ట్ లో విడాకులకి పెట్టుకొందట” అని చిత్ర చెపుతుంటే విని నేను, రమణి కూడా ఆశ్చర్య పోయాము.
జీవితాల్లో ఇలాంటి సమస్యలు, సున్నితత్వాలు ఉంటాయన్నమాట అనుకొన్నాను.
“అయినా ఆ పెళ్ళి పెటాకులవడానికి, ఆమె విడాకుల నిర్ణయం తీసుకోడానికి కారణం ఏమై ఉంటుందంటావు? అసలా పిల్లని అతను ఏం చేసుంటాడంటావు?” ఆరా తీసింది రమణి.
కాసేపు నిశబ్ధం ….
“సరే, కబుర్లు మాని కనీసం ఓ అరగంట మౌనంగా కెమిస్ట్రీ పరీక్షకి రీవ్యూ చేద్దాము,” అని మళ్ళీ పుస్తకం తెరిచాను.
చూపు పుస్తకంలో ఉన్నా మనస్సు మాత్రం పరివిధాల ఆలోచిస్తుంది. మా ముగ్గురి స్నేహం, మా అభిరుచుల వైపుగా సాగింది.
కాలేజీలో ముగ్గురం ఎప్పుడూ కలిసే ఉంటామని మమ్మల్ని అందరు ‘తీన్ దేవియా“ అంటారు. రెండు నెలల్లో మా డిగ్రీ చదువు ముగిసిపోతుంది.
మా పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయని లెక్చరర్లు వ్యాఖ్యానిస్తారు. అటెండెన్స్ తీసుకునే ప్రతిసారి నీలవేణి అని నా పేరు, చంద్రమణి అని రమణి అని పేరు, చిత్రలేఖ అని చిత్ర పేరు వత్తి పలికి, భలే పేర్లు అని వారు వ్యాఖ్యానించని తడవే ఉండదు.
రమణికి బి.ఎస్.సి అవుతూనే వాళ్ళ బావతో పెళ్లని నిశ్చయమైంది. నేను స్కూలు, కాలేజీలో ప్రధమ శ్రేణిలో నిలుస్తూ, స్కాలర్షిప్పుతో చదువుతున్నాను. పై చదువులకి కూడా ‘గ్రాంట్’ అందుకోవచ్చని విద్యాలయ కమిషన్ తెలియజేసింది. మరోప్రక్క నాకు మావాళ్ళు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.
చిత్ర మాత్రం మెడిసిన్ చదివి, సైకియాట్రిస్ట్ గా మానసిక రుగ్మత ఉన్నవారికి సహాయపడాలన్న ఆశయం తీరాకే పెళ్లి అంటుంది.. స్త్రీకి పెళ్ళి-పిల్లలు ముఖ్యమే. ఐనా, జీవితానికి ఒక ధ్యేయం, ఉండాలనేది చిత్ర నిర్దిష్టమైన అభిప్రాయం.
’ఏకత్వంలో భిన్నత్వం’ అనేది మా ముగ్గురు స్నేహితురాళ్ళ విషయంలో సరిగ్గా వర్తిస్తుంది. మేము చదివే పుస్తకాలనుండి మా దృక్పధాల వరకు, మా స్థితిగతులనుండి మా జీవన విధానాల వరకు అన్నిటా తేడాలున్నా, మాది ఘాడమైన స్నేహమే. ముగ్గురం ఐదవ తరగతి నుండి క్లాస్మేట్స్.
నాటి నవలల నుండి నేటి ఇంగ్లీష్, తెలుగు బెస్ట్-సెల్లర్స్ వరకు, నే చదువుతాను. రమణి వరసబెట్టి సినిమా పత్రికలు చదివితే, చిత్ర మాత్రం సైన్స్ సంబంధిత సమీక్షలు, ప్రపంచ వార్తలు చదివి మాతో పంచుకుంటుంది.. మా ముగ్గురిలో చిత్రకి మాత్రమే వంట చేయడమన్నా, కంప్యూటర్ వాడటం అన్నా ఇష్టం. కంప్యూటర్ కోర్స్ ల్లో నేను క్లాస్ ఫస్ట్. అయినా కంప్యూటర్ వాడకం పడదు.
నేను కాటన్ చీరల్లో, సింపుల్ గా తయారవుతాను. చిత్ర స్కర్ట్ బ్లౌజ్, చుడిదార్-కుర్తాలతో పాటు లిప్స్టిక్ వేస్తుంది. ఇకపోతే, జార్జెట చీరలతో పాటు గాజులు, పర్ఫ్యూమ్ రమణి స్టైల్.
మాది మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో పని చేస్తారు. చిన్నతనంలోనే తల్లితండ్రులని కోల్పోయి బాబాయి ప్రాపకంలో ఉన్న చిత్ర ఆగర్భ శ్రీమంతురాలైతే, తరాలుగా రమణి వాళ్ళది వ్యవసాయం. సంపన్నులే. ఇన్నిట్లో వ్యత్యాసాలున్నా, మరెన్నో విషయాల్లో మేము ఎకీభవిస్తాం కూడా.
కాబోయే భర్త, సంసారం, వృత్తి-ప్రవృత్తి, భావిజీవితం గురించిన మా ఊహలు, ఆశలు, ఆలోచనలు కూడా ఒకరితో ఒకరం పంచుకొంటాము. ‘భర్త అనే వాడికి మంచి రూపం, ఉన్నతవిద్యలే కాదు, సున్నితమైన మనస్సు కూడా ఉండాలి. రొమాంటిక్ గా ఉండాలే కానీ మనిషిలో మొరటుదనం అస్సలు ఉండకూడదు’ అన్నది మా ముగ్గురి అభిప్రాయం.
ఇక పిల్లల విషయానికొస్తే, పిల్లలు ఇష్టమే అయినా పిల్లల పెంపకం భయమని రమణి అంటే, దగ్గరుండి పెంచుకోవాలంటాను నేను. ‘అమ్మతనం అద్బుతవరం’ అంటుంది చిత్ర.
నా ఆలోచనా శ్రవంతికి బ్రేక్ వేస్తూ బెల్ మ్రోగింది. “రెండు వారాల్లో పరీక్షలని మర్చిపోవద్దు. అప్పటివరకు మాగజిన్స్, నావల్స్ పక్కకి పెట్టేయాలి మనం” అన్నాను పైకి లేస్తూ.
“అవునవును అది కరక్టే. పోతే మన చదువులు కూడా అయిపోతాయి కాబట్టి, పరీక్షలవ్వగానే ఎక్కడికైనా దూరంగా కలిసి ట్రిప్ వేద్దామని ఆలోచన వచ్చింది. ఆ సంగతి తరువాత మాట్లాడుదాములే” అన్నది రమణి మాతో పాటు వడివడిగా లెక్చర్ హాల్లోకి నడుస్తూ.
***********
“పరీక్ష రాసిన తరువాత ఎన్.ఎస్.ఎస్ గ్రూప్ వాళ్ళందరూ వచ్చి నన్ను కలవండి. ఈ ఏడాదికి ఆఖరి ఫీల్డ్-ట్రిప్ టూర్ గురించి సమాచారం ఇస్తాను”, “దానిగ్గాను ఎల్లుండి పొద్దున్నే కాలేజీ నుండి బయలుదేరాలి మనం” అంది కెమిస్ట్రీ మేడమ్. ఆవిడే మా ‘నేషనల్ సర్వీస్ స్కీం’ గ్రూప్ కి ఇంచార్జ్ కూడా.
ఆఖరి ఫీల్డ్-ట్రిప్ – ‘స్త్రీ సంక్షేమ పధం’ దిశగా అని…క్లాస్ అయ్యాక.. సమాచారం అందించారు మాణిక్యాంబ మేడమ్.
***********
ఎన్.ఎస్.ఎస్ వారి ‘సంక్షేమ పధం’ అమలులో ఉండేది ఊరి శివారుల్లోని గ్రామాల్లో. అక్కడ నివసించే బడుగు వర్గాల స్త్రీలని కలిసి, వారి జీవనవిధానం, వారి ఆరోగ్య సంక్షేమాల గురించి వాకబు చేసి నివేదికలు సమర్పించాలి. అవసరమయిన కాగితాలు తీసుకుని నేను, రమణి, చిత్ర ఓ జట్టుగా రంగంలోకి దిగాము.
మా మొదటి కేసు: భర్త అనాదరణకి గురైన ఓ అభాగ్యురాలు. పేరు రాణి. తనకి సపర్యలు చేయకుండా పసిబిడ్డతోనే ఉంటుందని, మళ్ళీ పెళ్ళి చేసుకొని కొత్తపెళ్ళాన్ని ఇంటికి తెచ్చాడుట ఆ యువతి భర్త. అంతేకాక, పసిబిడ్డతో సహా ఆ బాలింతని ఇంటినుండి వెళ్ళగొట్టాడట ఆ మూర్ఖుడు.
రెండవ కేసు: రెండో తడవ కూడా ఆడపిల్లనే కన్నదని, పసిబిడ్డ తల్లిని .. పాక నుండి తరిమేశారుట ఓ భర్త, అత్త. వేరే దారి లేక అత్తని బతిమాలితే, ఇంటి చూరక్రింద ఉండమందట. పసివాళ్ళని అలా చూర క్రింద ఉంచి, వెళ్లి పాచిపని చేసుకొన్న డబ్బుతో వాళ్ళ కడుపులు నింపుతుందట ఆ యువతి..
“నమ్మశక్యం కాని నరరూప రాక్షసులే కొందరు మగాళ్ళు! ఆడదంటే ఒక ఆటవస్తువు వాళ్ళకి,” అంటూ తిడుతూనే ఉంది రమణి. ఆడవాళ్లంటే ఇంతటి అలసత్వం ఏమిటి? ప్రేమించవల్సిన భార్యని, భర్తే హింసించడం ఏమిటి? అన్న ఆలోచనలతో స్తబ్దుగా ఉండిపోయాను నేను.
చిత్ర ఒక్కతే ఎటువంటి వ్యాఖ్యానం చేయకుండా ఆ యువతులని సముదాయించి, ఆ పూటకి వాళ్ళకి కావలసినవన్నీ చేకూర్చింది. మా ఇద్దరి చేత వారి పేర్లు, సమాచారం, నమోదు చేయించింది. వారికి దగ్గరలోనే ఉన్న వయోవిద్యాకేంద్రం, ఉచిత స్త్రీ-శిశు-ఆరోగ్య సౌకర్యం గురించి వివరించి, వారికి సులభంగా లభ్యమయ్యే స్వయం-ఉపాధి స్కీం గురించి సమాచారాన్ని అందించాము.
మేము అక్కడ ఉండగా, రెండో యువతి అత్తగారు తన మనమరాళ్ళ వంటిమీదున్న బట్టలు సవరించి మాకు దగ్గరగా వచ్చి కూర్చుంది. నేనే ఆమెతో మాట కలిపాను. నేనడిగిన విషయాలకి మాత్రం జవాబిచ్చింది.
“ఏం సెప్పేది బిడ్డా? మా మగాళ్ళు మృగాలనుకో. ఆడదంటే, బువ్వొండి, సాకిరీ చేసి, పిల్లల్ని కనే యంత్రం లెక్క. నా మొగుడు అట్టాగే, నా కొడుకు అట్టాగే. నా మాటేమన్నా ఇంటాడా? తాగేసినప్పుడు నన్ను కూడా కొడతాడు. పిల్లల్ని, కోడల్ని మంచిగా సూసుకోమని నా కొడుక్కి ఎంతగానో సెప్పినా. ఇనలే. ఇగ ఇప్పుడు పంచాయతి పెట్టి నలుగురితో సెప్పిస్తుండాలే” అంది ఆ అవ్వ.
ఆమె మాటలు విన్న మేము కాస్త ఆశ్చర్యపోయాము. ‘అయితే, ఈ విషయాల్లో ఇన్ని కోణాలున్నాయా? బాధించే భర్త, ప్రేమించే అత్త, ఇదెలా సాధ్యం?’ అనుకున్నాము.
*****
“డిగ్రీ పూర్తయిన సందర్భంగా, మీకు ‘అరకువేలీ ట్రిప్’ మా తరఫున బహుమానం,” అంటూ చిత్ర వాళ్ళ బాబాయి అన్ని ఏర్పాట్లు చేసారు. మా ట్రిప్ ఖర్చు కూడా ఆయన భరించబోవడం నాకు, రమణికి మొహమాటంగా అనిపించింది. కాని చిత్ర ఊరుకోలేదు. మమ్మల్ని ఒప్పించి, మా పెద్దవాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని బయలుదేర దీసింది.
మా తమ్ముడు వినోద్ ని సైతం ప్రత్యేకంగా ఆహ్వానించింది చిత్ర.
*****
అరకులో మేమున్న బీచ్ రిసార్ట్ లోనే ఆర్కేడ్ గేమ్స్ నుండి ఆధ్యాత్మక యోగా వరకు ఎన్నో వసతులున్నాయి. అరకు లోని అందాలని ఆస్వాదిస్తూ కాలం ఎలా గడిచిపోతుందో కూడా తెలియనంత ఎంజాయ్ చేస్తున్నాము. చిన్నపిల్లల్లా రమణి, వినోద్ చెయ్యని అల్లరి లేదు. రోజంతా షాపింగులు, రిసార్ట్ ట్రాక్ మీద పరుగు పందాలు, రాత్రంతా ఆర్కేడ్ గేమ్స్….
తిరిగివెళ్ళే ముందురోజు బీచ్ ఫెస్టివల్ ఉందంటే, సాయంత్రం బీచ్ కి బయలుదేరాము. విపరీతమైన జన కోలాహలం. వాటర్ గేమ్స్ అంటూ మరో వైపుకి వెళ్లాడు వినోద్.
మేము మాత్రం భీమునిపట్నం బీచ్ మీద చాలా దూరం నడిచి తెల్లని, చల్లని ఇసుక మీద సముద్రానికి ఎడంగా కూర్చున్నాము.
మమ్మల్ని చూసి ఓ పదిహేనేళ్ళ కుర్రాడు మా వద్దకు పరుగున వచ్చాడు. సన్నజాజుల మాలలు, వేరుసెనగలు, కొబ్బరి స్వీట్స్ అమ్మజూపాడు.
చిత్ర అందరికీ అన్నీ కొని ఓ పది రూపాయలు ఎక్కువే ఇచ్చింది ఆ కుర్రాడికి.
“ఈ సన్నజాజులు, మల్లెపూవుల గుభాళింపుల చుట్టూ ఎంత రొమాంటిక్ పాటలు రాస్తారో జనాలు. అంతా ఓ పెద్ద హైప్. రొమాన్స్ మనస్సులోంచి, పక్కనున్న మనిషి నుంచి రావాలి. రోమాన్స్ అనేది ప్రేమికుడి చూపులో, చిరునవ్వులో ఉంటుంది. ప్రియురాలి భావాల్లో, భావనల్లో ఉంటుంది కాని పాలల్లో, పువ్వుల్లో, మిఠాయిల్లో కాదు,” అంటూ కిలకిలా నవ్వింది రమణి.
“సరేనమ్మా తల్లీ! నీవు దేన్నైనా, ఆఖరికి పువ్వుల్ని కూడా డిబేటింగ్ మేటర్ లోకి మార్చేస్తావుగా. నువ్వు పక్కనుంటే అస్సలు విసుగే ఉండదు.. మీ బావ లక్కీమాన్. కాకపోతే నీలా ఆలోచించడం నేర్వాలి” అంది నవ్వుతూ చిత్ర….
నేనూ నవ్వేసాను.
“లక్కీ అంటే గుర్తొచ్చిందోయ్. వచ్చే ఆదివారం మన జూనియర్, అదే ఆ ‘ఫైర్ బ్రాండ్’ వందన పెళ్ళి. అందరినీ పేరుపేరునా పిలిచిందిగా! అమెరికా పెళ్ళి కొడుకంట. సర్జన్ అంట. మంచి సంబంధం, చాలా లక్కీ గర్ల్ అంటున్నారు అందరూ. షామీర్పేట్ అలంకృతా క్లబ్ లో పెళ్ళి, రిసెప్షన్ కూడా. మనం కలిసే వెళదాము” గుర్తు చేసింది రమణి.
“ఓకే అలాగే వెళదాము. ఈ సెలవల్లో వీలయినంత కలుద్దాము” అంది చిత్ర.
“నేనూ ఓకే, వందన మా ఇంటికి వచ్చి మరీ ఇన్విటేషన్ ఇచ్చింది” అన్నాను.
“పోతే మన సంగతికి వద్దాం. మరో యేడాదిలో నేను ఇక్కడే మెడిసిన్ చేస్తుంటాను. రమణి సరే, రెండు నెలల్లో శ్రీమతి అవుతుంది. మరి నీల ఫ్యూచర్ ఏమిటో?” అంది నా వంక చూస్తూ. విని మౌనంగా ఉన్నాను…
“నాకు తెలుసు..కుదిరితే పెళ్ళి, లేదా బయాలజీ మాస్టర్స్ చేసి లెక్చరర్ అవుతుంది” నిర్ధారించింది రమణి…
“ఏమైనా, మన ఈ స్నేహం ఇలా కొనసాగడానికి మనం ముగ్గురం కట్టుబడి ఉండాలి. సంతోషాలని పంచుకోకున్నా పర్వాలేదు కాని ఏదైనా కష్టం కలిగినప్పుడు తప్పక ఒకరికొకరు సహాయపడదాము” అంది గంభీరంగా చిత్ర. నేను, రమణి కూడా చిత్ర చేయందుకున్నాము ‘ఔననట్టుగా’..
“లెట్ అస్ గో నౌ, పొద్దున్నే తిరుగు ప్రయాణం” చిత్ర మా చేతుల్ని పట్టుకొనే పైకి లేచింది.
“వాట్ అ మార్వలస్ ట్రిప్!” అంది రమణి నడుస్తూ…
“అరకులోయ అందాలు, ఈ ట్రిప్పు కూడా మరువలేని జ్ఞాపకాలే” అన్నాను.
చేతిలో కెమెరాతో పరుగున వచ్చి కలిసాడు వినోద్. “అక్కా, మన ట్రిప్పువి మొత్తం 999 పిక్చర్స్ తీసాము” అంటూ నా చేతిలోని పొట్లాం అందుకున్నాడు.

సశేషం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *