April 19, 2024

ఆపద్ధర్మం

రచన: డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం

రావి చెట్టు నీడన చప్టా మీద కూర్చున్న సుందరం చుట్టూ చూసాడు. ఉదయం పదకొండు గంటల సమయంలో గుడి నిర్మానుష్యంగా వుంది. గర్భ గుడి తలుపులు తెరిచి వున్నప్పుడే అర కొరగా వుంటారు భక్త జనం. ఇక గుడి తలుపులకు తాళం పడ్డాక పిట్ట, పురుగు కూడా కనబడదు ఆవరణలో.
ఒక అరటి పండు చేతిలో పెట్టకపోతాడా పూజారి అన్న ఆశతో వచ్చిన సుందరానికి ఆ రోజున తొందరగా పూజ ముగించి, సైకిలు ఎక్కుతూ ఎదురుపడ్డాడు ఆయన. ఆ పూజారికి మిగిలేదీ నాలుగు కొబ్బరి చిప్పలు, అరటి పళ్ళే. హారతి పళ్ళెం లోకి భక్తులు వేసే దక్షిణ ఎక్కడ దాచుకుంటాడో అని పూజారిమీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాడు ఆలయం కమిటీ సభ్యుడు.. మంత్రయుక్తంగా పూజాదికాలు నిర్వహించినందుకు ఆయనకు వాళ్ళు ఇచ్చే జీతం నాలుగు వేలు. చదువుకున్న వేదం పొట్ట నింపక పోయినా మరో దారి లేక అదే వ్రుత్తితో బ్రతుకు బండి లాగుతున్నాడు ఆయన.
నీరసంగా చెట్టు క్రింద చతికిల పడి కళ్ళు మూసుకున్నాడు సుందరం.
అతని కడుపు వీపు కు అంటుకు పోయి వుంది. లోపలి నుండి పేగులు అరుస్తున్నాయి. ఏకాదశి ఉపవాసం చేసి కలిగిన ఆకలి, నీరసం కావవి. ఇంట్లో పట్టెడు బియ్యం గింజలు కూడా లేని ఏరోజు అయినా ఏకాదశే వాళ్ళకి. అటువంటి ఏకాదశులు నెలకు చాలా సార్లు వస్తాయి సుందరానికి. కానీ ఇప్పుడు మాత్రం రెండు రోజులు జ్వరంతో పడుకుని, తిండి లేక పోవడం వలన కలిగిన నీరసం అది.
” అడుక్కు తినేవాడు కూడా ముష్టెత్తి పెళ్ళానికి తిండి పెడతాడు. బ్రాహ్మణ పుట్టుక పుట్టిన దానికి అటు చదువూ లేదు ఇటూ నోట్లో నాలుగు మంత్రాలు రావు. తాదూర సందు లేదు మెడకొక డోలు అన్నట్టు నా మెడలో పలుపు తాడు ఎందుకు కట్టినట్టు? ఈ పస్తులతో రోజూ చచ్చే కన్న ఇంత విషం తాగి ఒకసారి చావడం మేలు. ” లేచినప్పటి నుండీ గొణుగుతూనే వుంది శాంత.
నిజానికి శాంత పేరుకు తగినట్టు శాంతము, సహనము గల మనిషే. భర్త చేతకానితనం, ఇంట్లో నిత్య దరిద్రం ఆమె లోని శాంతాన్ని, సహనాన్ని చంపేసాయి. రెండు రోజులు జ్వరంతో పడుకుని లేచిన మొగుడికి ఇంత గంజి కాచి ఇవ్వడానికి ఇంట్లో నూకలు కూడా లేని దరిద్రం ఆమె అసహనానికి, కోపానికి కారణం.
అసలు సుందరానికి పెళ్ళి అంటూ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే వరుస గా మూడేళ్ళలో ముగ్గురు కొడుకులను కన్నాక, , ఎముకల గూడైన అతని తల్లి విసిగి పోయి కడుపు పోవడానికి ఎదో నాటు మందు మింగిందట. కడుపు పోలేదు గానీ, బిడ్డ అవకరాలతో పుట్టాడు.
తండ్రి గుళ్ళో అర్చకుడైనా సుందరానికి మాత్రం అటు మంత్రాలు ఒంటబట్టలేదు, ఇటూ చదువూ అబ్బ లేదు. పుట్టినప్పుడే అర్భకంగా వున్నాడేమో ఎదిగాక కూడా గడ కర్రకు బట్టలు తొడిగినట్టు కనబడతాడు.
అతనికి ఆ పేరు ఎందుకు పెట్టారు విచిత్రం గా అంటే నిజానికి అతనికి నామకరణం అంటూ జరగ లేదు. పుట్టిన పిల్లవాడికి బాలారిష్టాలు వున్నాయనీ అయిదో ఏడు నిండేదాకా జాతక చక్రం వేయడం, నామకరణం వొద్దని చెప్పారు. పిల్లవాడి ఆకారాన్ని వెక్కిరిస్తూ అందరూ సుందరం అంటూ ఎగతాళిగా పిలవగా ఆ పేరే స్థిర పడిపోయింది. అతని ముగ్గురు అన్నలలో ఒకడు వంట బ్రామ్మడిగా, మరొకడు పక్క వూళ్ళో అర్చకుడిగాను బ్రతుకు బండి లాక్కొస్తున్నారు. మూడో అన్న చిన్నప్పుడే ఇంటినుండి పారిపోయాడు.
పూజారిగా ఉన్న సుందరం తండ్రి నలుగురితో బాటు నారాయణ అన్నట్టు శంకర మఠంలో సామూహిక ఉపనయనాలలో సుందరం మెడలో జందెం వేసేసారు అతడికి గాయత్రీ మంత్రం రాకపోయినా. గంతకు తగిన బొంత వంటి శాంతను అతనికి కట్టబెట్టి పైకి వెళ్ళిపోయారు అతని కన్న వాళ్ళు.
శాంత కుటుంబం పేదరికానికి చిరునామాగా నిలిచేదే. దానికి తోడు ఆ పిల్లకి గ్రహణం మొర్రి వుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ పిల్ల పై పెదవికి కుట్లు వేసారు గానీ అది ఆ అందవికారాన్ని దాచడం లేదు. వయసు మీరినా పెళ్ళి కాకుండా మిగిలిపోయింది
శాంత తండ్రి నల్లని మేనిచాయ వాడు. మామూలుగా తండ్రి పోలిక కూతురికి, తల్లి పోలిక కొడుకుకు వస్తే అద్రుష్టం అంటారు. శాంతకు నాన్న పోలిక రావడం దురద్రుష్టమే అయ్యింది. ఎర్ర తోలు ఏడు వంకరలను కప్పి పెడుతుందంటారు కదా! తెల్ల దొరలకు వూడిగం చేసిన మన జాతికి ఆ తెలుపంటే వల్లమాలిన ప్రేమ. నలుపు నారాయణుడు మెచ్చు అంటూనే నల్లని చాయ అందవికారమని తీర్మానించేసారు. ఆ పార్వతీ దేవి కూడా నాధుడు వెక్కిరించాడని తపస్సు చేసి మరీ గౌరమ్మా అని పిలిపించుకున్నది మరి. దరిద్రానికి తోడు కురూపితనం కూడా కలిస్తే శాంత వంటి ఆడపిల్ల గతి చెప్పేది ఏముంది? ? మగవాడంటూ ఒకడు కూతురిని మనువాడితే చాలునని రాముడి గుడిలో పిల్లను కన్యా ధార పోసి పాలతో చేతులు కడుక్కుని ఆ రోజు గుడిలో ఎవరిదో సంతర్పణ జరుగుతుంటే అందులో వియ్యాల వారికి బంతి భోజనం పెట్టేసారు శాంత తలిదండ్రులు. కన్నె గానే బ్రతుకంతా గడిచి పోతుందని అనుకున్న శాంత ఎవడో ఒకడు అంటూ సుందరంతో తాళి కట్టించుకుంది.
అలా శాంత సుందరం ఇల్లాలు అయ్యింది.
జ్వరం వచ్చి తగిన నీరసంతో బాటు రెండు రోజులుగా మాడుతున్న ఆకలి పేగుల మంటకు శాంత గొణుగుడు ఆజ్యం పోసినట్టు కాగా ఇంట్లోనుండి బయట పడి దగ్గరే వున్న గుళ్ళొకి వచ్చి కూర్చున్నాడు సుందరం.
సుందరానికి ఆకలితో, నీరసంతో శోష వచ్చినట్టుగా వుంది. ఆకలి, నీరసంతో బాటు అతన్ని నిలవనీయకుండ తొలిచేస్తున్నది మరొకటి వుంది. అది బాలస్వామికి తాను ఇచ్చిన మాట. బాలస్వామి ఆ శివాలయంలో కాపలాదారుగా పనిచేసే వీరాస్వామి కొడుకు. పెళ్ళయి పదిహేను సంవత్సరాలు అయినా పిల్లలు లేని సుందరానికి ఆ కుర్రాడంటే ఎందుకో అభిమానం. ఒత్తైన జుత్తు, విశాలమైన కళ్ళు, అందమయిన నవ్వు చక్కని ముఖంతో బాల క్రిష్ణుడిలా వుంటాడు వాడు. వాడిని చూసినప్పుడల్లా వాడిలాటి కొడుకు తనకు వుంటే ఎంత బావుండేది అనిపిస్తుంది సుందరానికి. ఆ వూహతోనే వాడు సుందరానికి ఆత్మజుడై పోయాడు.. బాలస్వామి అయిదు నుండి ఆరవ తరగతి కి వచ్చాడు. పన్నెండేళ్ళ ఆ పసివాడిని గుళ్ళోనే పనికి పెట్టాలని వాళ్ళ నాన్న ఆలోచన. వాడేమో చదువుకుంటానని ఏడుపు. రోజూ గుడికి వచ్చే సుందరం కి చేరిక అయిన బాల స్వామి ” “మానాన్నకు చెప్పండి సారూ నన్ను బడికి పంపమని “అంటూ సుందరం కాళ్ళ మీద పడ్డాడు.
“పసివాడిని చదువుకోని వీరాస్వామీ ” ఆన్న సుందరం మాటలకి వీరాస్వామి కళ్ళలో నీళ్ళు నిండాయి.
” నాకు మాత్రం వాడు గొప్పోడు అయితే చూడాలని వుండదా అయ్యా. తిండి గడిచేది కష్టమైపోయె. బడికి ఎక్కడినుండి డబ్బు తెచ్చేది?”
“ప్రభుత్వ బడిలో నైనా చేర్పించు వీరాస్వామీ ” బాలస్వామి తల నిమురుతూ అన్నాడు సుందరం.
“అయ్యా అక్కడ కూడా ఎంతోకొంత కట్టాల్సిందే కదా. వీడి వెనకాల ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ గుళ్ళో పని కాకుండా, బండిలో ఇసుక తోలుతాను. ఎంత కష్టపడినా ఇంట్ళో అయిదు కడుపులు నిండడం లేదు. ఆందుకే వీడిని పనిలో పెడితే ఇంకో పూట తింటామని..” అనేసి కొడుకుని నెట్టుకుంటూ ముందుకు అడుగు వేసాడు వీరాస్వామి.
“నువ్వు చెప్పూ సారూ మా నాయనకు ” గుడ్ల నీళ్ళు కుక్కుకుంటూ సుందరం చేయి పట్టుకున్నాడు బాలస్వామి.
” ఆగు వీరాస్వామీ నేనూ కొంత సద్దుతాలే. వాడిని బడికి పోనీ. ” అనాలోచితంగా అనేసాడు.
ఆ మాట విన్నాక బాలస్వామి ముఖంలోకి గప్ఫున వచ్చిన వెలుగు సుందరాన్ని వెంటాడుతోంది.
ఏదో ఒకటి చేసి వాడిని బడిలో చేర్పించడానికి డబ్బు సద్దుబాటు చేయాలి అనే ఆలోచన సుందరాన్ని నిలువనీయడం లేదు.
చప్టా మీదినుండి దిగి అడుగు ముందుకు వేయ బోతే ముందుకు తూలాడు.
అలాగే తడబడే అడుగులతో గుడి దాటి వీధి లోకి వచ్చాడు. ఎవరో కలిమి గలిగిన మాలక్ష్మి కారు దిగి జామ పళ్ళు బేరం చేస్తోంది. ఆ ముగ్గిన జామ పళ్ళ తీయని వాసనకు సుందరం కడుపులో ఆకలి బుసకొట్టి పైకి లేచింది. చేయి జాపి అడగడానికి బాపన అభిజాత్యం అడ్డుపడింది.
నిజానికి భవతి భిక్షాందేహి అనడం అతని కులానికి కొత్తేమీ కాదు. పొద్దున్నే వాడలోని ఒక్కో ఇంటిముందు నిలబడి సీతారామాభ్యాన్నమహ అని తిధి , వార, నక్షత్రము, రాహుకాలం, యోగకాలం చెప్తే రాగి చెంబు లోకి దోసెడు బియ్యం గౌరవంగా పోసేవారు. యాయ వార బ్రాహ్మడు అనిపించుకోవడం మరీ అంత హీనమైన విషయం గా చూసే వారు కాదు. కానీ పదో తరగతి వరకూ చదువు కుని, ఒక దంత వైద్యుడి దగ్గర పరికరాలు అందించే పనిచేసిన సుందరానికి ఆకలి కి ఆగలేక ఒకరి ముందు చేయి జాపడానికి మనస్కరించలేదు. ఆ వైద్యుడు దంత వైద్యంలో ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం విదేశానికి వెళ్ళడం వలన సుందరానికి ఆ వచ్చే రాబడి కూడా లేకుండా పోయింది.
సుందరం నిలబడలేక కారుకు ఆనుకున్నాడు. ఆమె కంపరంగా చూడడంతో కారు మీద నుండి చేయి తీసివేసి, పక్కన వున్న చెట్టుకు చేరగిల బడ్డాడు.
మొగుడిని కోపంతో ఇంట్లో నుండి తరిమేసిన శాంత, కాస్త మనసు శాంతించాక, నాలుగు చెంబులు చన్నీళ్ళు ఒంటి మీద పోసుకుని, వుతికిన పాత చీర కట్టుకుని, ముఖాన కాసంత కుంకుమ పెట్టుకుని వీధి తలుపు తీసి బయటకు వచ్చింది. వాళ్ళు అద్దెకుండేది రేకులు కప్పిన కారు షెడ్డు ..ఇంటివాళ్ళు విదేశంలో వున్న కూతురు దగ్గరకు పోతూ ఇల్లు చూసుకుంటూ వుంటారని సుందరం దంపతులకు ఉచితంగా తల దాచుకోను చోటు ఇచ్చాడు.
“శుక్రవారం లక్ష్మి పూజ చేసుకున్నాను. వచ్చి చాటల వాయినం తీసుకుపో శాంతమ్మా ” అంటూ పిలిచింది ఆ పక్క ఇంట్లో వుంటున్న అలివేలమ్మ.
ఆ పిలుపుతో శాంతకు ప్రాణం లేచి వచ్చి నట్టయ్యింది. “భగవంతుడా ఈ పూట గడిచేందుకు దారి చూపించావా “అనుకుంటూ, ఆలస్యం చేస్తే ఆ అవకాశం కాస్తా ఎవరు తన్నుకు పోతారో ఆన్న భయంతో, వెంటనే తలుపు ముందుకు చేరవేసి అలివేలమ్మ ఇంటికి నడిచింది.
ముఖాన బొట్టు పెట్టి, కాళ్ళకు పసుపు రాచి,, భుజాల మీదుగా కప్పి ముందుకు జాపిన పమిట కొంగులో చిన్న చాట మీద మరొక చాట కప్పి ఉన్న వాయనాన్ని ” ఇస్తినమ్మ వాయినం ” అంటూ అందిస్తే, ఆనందం గా “పుచ్చుకుంటి వాయినం “అని అందుకుంది శాంత.
ఇంటికి వచ్చాక, పైన కప్పిన చాట మూత తీసి చూసిన శాంత ఆనందమంతా ఆవిరయి పోయింది. ఒక సోలెడు బియ్యం, రెండు పసుపు కొమ్ములు, రెండు చిన్న బెల్లం వుండలు, ఎండిపోయిన తమలపాకులు, ఒక వక్క చీటీ, ఎన్ని చేతులు మారిందో చెప్పేట్టు మడతల దగ్గర రంగు మాసిన రవిక గుడ్డ, అయిదు రూపాయల బిళ్ళ వున్నాయి. ఒకప్పుడు చాటల వాయినం అంటే పెద్ద చాట లో కనీసం అయిదు సోలల బియ్యం పోసి ఇచ్చేవారు. “అనుకుంటూ, ఆ బియ్యం వెసట్లో పొయ్యడానికి లేచింది శాంత.
” పొట్ట చేత బట్టుకుని ఈ బ్రాహ్మణుడు ఎక్కడ తిరుగుతున్నాడొ పాపం రెండు రోజులుగా పస్తులున్నాడు తొందరగా ఇంటికి వస్తే నాలుగు మెతుకులు తింటాడు ” అనుకుంటూ గుమ్మం లోకి వచ్చి తొంగి చూసింది శాంత.
— — —-
అంతలో గుడి పక్కన సందులో నుండి అటు నడుచుకుంటూ వచ్చిన ఇద్దరు తద్దినం బ్రామ్మలు చెట్టుకింద నిలబడిన సుందరాని చూడగానే గబ గబ అతని దగ్గరకు వచ్చారు.
“ఏమిటోయ్ సుందరం భోజనం అయిపోయిందా? “. అని అడిగాడు ఒక ఆయన.
సమాధానం చెప్పే ఓపిక కూడా లేని సుందరం తల అడ్దంగా తిప్పాడు.
“అయితే పద. క్రిష్ణానందం గారి ఇంట్లో ఆబ్ధికం వుంది. ఒక భోక్త తక్కువ పడ్డాడు. దక్షిణ కూడా బాగానే ఇస్తారు.” రెండొ అతను అన్నాడు.
ఆకలి, నీరసంతో వాలిపోతున్న సుందరం కళ్ళ లోకి వెలుగు వచ్చి అంతలోనె దైన్యం చోటు చేసుకుంది.
“నాకు మంత్రాలు రావు. మీకు తెలుసు కదా ” అన్నాడు కాస్త సిగ్గుపడుతూ.
“మంత్రాలు సంగతి మేము చూసుకుంటాము. నువ్వు వూరికే నాలుగో భోక్తగ వస్తే చాలు. ” ఇద్దరూ ముక్తకంఠంతో చెప్పారు.
సుందరం ఇదివరకు ఎప్పుడూ ఇటువంటి కర్మలకు వెళ్ళింది లేదు. కడుపులోని ఆకలి కన్న ఎక్కువగా బాలస్వామి ముద్దు ముఖంలోని దైన్యం అతన్ని ముందుకు తోసింది., బాలస్వామి ఆశగా చూసిన చూపు అతని సంశయాన్ని జయించింది.
అందబోయే దక్షిణ తెగింపునిచ్చింది. చిన్నగా వాళ్ళ వెంట నడిచాడు.
మామూలుగా అయితే అపరాహ్ణం వేళ మొదలు కావలసిన తంతు ఆ రోజు కర్త అయిన క్రిష్ణానందం తొందరగా కార్యాలయానికి వెళ్ళ వలసి వుండడం వలన తొందరగా మొదలు పెట్టి పన్నెండు కల్లా ముగించాల్సి వచ్చింది అంతవరకు ఎలాగో ఓపిక పట్టి కూర్చున్నాడు సుందరం.
పిండ ప్రదానం తంతు ముగియగానే బ్రాహ్మణులకు విస్తర్లు వేసారు.
బ్రాహ్మలు నలుగురూ ఆకుల ముందు కూర్చున్నారు. ఆకులో వడ్డించిన పదార్థాలు చూస్తుంటేనే సుందరం నోట్లో నీళ్ళు వూరుతున్నాయి.
“కానివ్వండి స్వామి. మా నాయన గారికి ఇష్టమని అరిసెలు చేయించాను. మినప గారెలంటే కూడా ఆయనకు ప్రాణం. కావలసింది అడిగి పెట్టించుకుని త్రుప్తిగా తినండి. “చెప్పాడు కర్త అయిన క్రిష్ణానందం.
జ్వరం పడి లేచాక పథ్యం గా తేలికైన ఆహారం తినవలసిన వాడు ఆ ఆలోచనే లేకుండా అరచేయి అంత వున్న వడను నువ్వుల గొజ్జులో అద్దుకుని తినేసాడు.నలభై ఎనిమిది గంటల ఉపవాసం తరువాత నాలుకకు తిండి రుచి తగిలే సరికి కడుపులో సంకటం పెట్టి తిప్పి నట్టు అయ్యింది అతడికి. గుక్కెడు నీళ్ళు తాగి, తేనెరంగులో వుండి నువ్వులు అద్ది వూరిస్తున్న అరిసె అందుకున్నాడు.
ఆబగా తినడం మొదలు పెట్టిన సుందరానికి ఆవ పెట్టిన పులిహోర ముగించేసరికి పొట్ట నిండిపోయింది. అక్కడికీ మళ్ళీ నీళ్ళు తాగకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంక చాలు అనిపిస్తున్నా, మళ్ళీ ఇటువంటి భోజనం దొరికేది ఎప్పుడో అనే ఆలోచనతో మరో రెండు వడలు, పాయసము వేయించుకుని, బలవంతంగ కడుపులోపలికి పంపించాడు.. ఎక్కి తొక్కి తినడం వలన గొంతులోకి వెళ్ళుకొస్తున్నట్టు వుంది అతడికి.
అయిదు వందలు దక్షిణ అందుకుని, భుక్తాయాసం తో బయటకు నడిచాడు. నాలుగు అడుగులు వేయక ముందే అతని కడుపులో వికారం పెట్టడం, వెంటనే తిన్న దంతా వమనం కావడం జరిగింది. అప్పటికే కూడా వున్న ముగ్గురు వాళ్ళ ఇంటి దారి పట్టడంతో ఒక్కడూ కాళ్ళు ఈడ్చుకుంటూ కాస్త దూరం నడిచి, మరి నడవ లేక చెట్టు క్రింద వున్న రాయి మీద కూర్చుండి పోయాడు.
కొద్దిగా ఓపిక తెచ్చుకుని లేచి ఆ పక్కన వున్న కొళాయి దగ్గర ముఖం కుడుక్కుని గుక్కెడు నీళ్ళు తాగి ముందుకు నడిచాడు. జేబులోని అయిదు వందలు మనసుకు బలాన్ని ఇస్తున్నా నీరసం వలన అడుగులు తడబడుతుంటే మెల్లిగ నడుచుకుంటూ ముందుకు సాగాడు. నెమ్మదిగా నడిచి, రైలు పట్టాలకు ముందు వున్న ఆంజనేయ స్వామి గుడి ముందు చెట్టు నీడన కూర్చున్నాడు.
ఇంతలో రైలు గేటు మూసి వున్నా , స్కూటరు మీద వచ్చిన ఇద్దరు తంటాలు పడి బండిని ఇటు తీసుకు వచ్చారు.
ఎవరి కోసమో చూస్తున్నట్టు అటూ ఇటూ చూసారు. గుడి ముందు చెట్టు క్రింద కూర్చున్న సుందరాన్ని చూడగానే అతని దగ్గరకు వచ్చారు.
నీరసంగా తల వంచుకుని కూర్చున్న సుందరం వులికిపడి తలెత్తి చూసాడు.
“వెంకటరమణ కాలనీలో ఒక ఆబ్ధికం వుంది. ముగ్గురు వున్నాము.. వస్తాను అని ఒప్పుకున్నా, నాలుగో మనిషి రాలేకపోయాడు. మీరువస్తే ఆ కార్యక్రమం గట్టెక్కించిన వారు అవుతారు. దక్షిణ కూడా బాగానే ఇస్తారు. ” అన్నాడు ఒక ఆయన.
“నాలుగో భోక్తగా వస్తే చాలు. మంత్రంచెప్పే పని లేదు. “ఇంకో ఆయన అన్నాడు.
గొంతులోనుండి తోసుకు వస్తున్న నిజాన్ని లోపలికి నొక్కేసాడు సుందరం.
“తిన్న దంతా ఒక్క మెతుకు మిగలకుండా వాంతి అయిపోయింది. కడుపు కాళీగా వుంది. వెడితే తప్పేంటి? ” దక్షిణ బాగా ఇస్తారు అన్న మాట సుందరంలో ఆశను రేకెత్తించింది. తన చేయి గట్టిగా పట్టుకున్న బాలస్వామి కోమలమైన స్పర్శ తప్పు లేదు అని మనసుకు నచ్చ చెబుతోంది.
అయిదు వందలు జేబులో వున్నాయి. మరో అయిదు వందలుంటే బాలస్వామి రేపు బడికి వెడతాడు. తప్పులేదు. విశ్వామిత్రుడంతటి వాడు వాడు ఆకలితో ప్రాణం పోతుందేమో అన్న సమయంలో కుక్క మాంసం తిన్నాడని కథ చెబుతారు. డబ్బు సహాయం చేస్తానని బాలస్వామికికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రాణం పోయినట్టే. రేపు డబ్బు కట్టకపోతే వాడి చదువు ఆగిపోతుంది. ఆ డబ్బు సర్దడానికి తనకు మరో మార్గం లేదు. దోషం అంటదు. ఒక మంచి పనికోసం చేస్తున్నాడు కనుక ఆ ఆత్మ శపించదు. తనకు తాను నచ్చ చెప్పుకున్నాడు సుందరం..
” వస్తాను పదండి. అంటూ వారి వెనకాల స్కూటరు ఎక్కాడు. రెండు గంటలకి ఆబ్ధికం ముగిసింది. వడ్డన మొదలు అయ్యింది. ఆకు నిండా వడలు, పాయసం, కూరలు, రవ లడ్డులు కనబడుతున్నాయి. కడుపు కాళీగానే వుంది గానీ తినబుద్ది కావడం లేదు.
“కావలసినవి అడిగి వేయించుకుని త్రుప్తిగా తినండి స్వామీ ” చెప్పాడు కర్మ చేయించిన ఆయన.
” తినండి ” పక్కన కూర్చున్న బ్రాహ్మణుడు హెచ్చరించాడు.
ఎదురుతిరుగుతున్న మనసును అదిలించి, తినడం మొదలుపెట్టాడు సుందరం.
వద్దంటున్నా వడ్డిస్తుంటె తప్పనిసరిగా ఎక్కువే తిన్నాడు.
ఈ సారి దక్షిణ మరికాస్త ఎక్కువ ముట్టింది. ఎనిమిది వందలు చేతిలో పడే సరికి తప్పు చేసానన్న భావన కాస్త పక్కకు తప్పు కుంది. పిల్లవాడిని బడిలో చేర్పించమని వీరాస్వామికి ఆ డబ్బు ఇస్తే బాలస్వామి ముఖంలో కనిపించే వెలుగు కళ్ళకు తోచి సుందరం గుండెలో సంతోషం నిండింది.
పదండి . మిమ్మల్ని శివాలయం దగ్గర వదిలి పెడతాము. అని బండి ఎక్కించుకున్నారు కూడా పిల్చుకు వచ్చిన వాళ్ళు.
శాంత మొగుడికోసం చూస్తోంది. వెసరు వుడుకు పట్టి అప్పుడే అన్నం కమ్మని వాసన వస్తోంది. ఆకలి కడుపులో పేగులు అరుస్తున్నాయి. అన్నం లోకి చింతపండు చారు పెట్టింది. పథ్యం భోజనానికి ఇది చాలు అనుకుంది. తన గొణుగుడు భరించ లేక బయటకు పోయాడు పాపం. ఎక్కడైనా కళ్ళు తిరిగి కింద పడలేదు కదా? .
ఎక్కడ తిరుగుతున్నాడో ఈ బ్రామ్మడు? ఎలాగూ వుత్తచేతులు వూపుకుంటూ రావడమే కదా! ఆ దంత వైద్యుడు విదేశంలో శిక్షణ ముగించుకుని రావడానికి ఇంకో నెల పడుతుంది.అంతదాకా తమ గతి ఇంతే.
ఇంకోసారి బయటకు వచ్చి తొంగి చూసింది.
పీట వాల్చి కంచం పెట్టింది. మళ్ళీ వీధి లోకి వచ్చి తొంగిచూసింది
— — —
గుడి ముందు బండి దిగి న సుందరం మెల్లిగా లోపలికి నడిచాడు.
అతనికోసమే ఎదురుచూస్తున్నట్టు చెట్టుకింద కనబడ్డాడు చిన్ని క్రిష్ణుడి వంటి బాలస్వామి.
ఆ పక్కన గుడి ఆవరణ వూడుస్తున్నాడు వీరాస్వామి.
” ఈ డబ్బుకట్టి బాలస్వామిని బడిలో చేర్పించు ” అంటూ పిల్లవాడి చేతికి రెండు ఆయిదు వందల కాగితాలు అందించాడు. వీరాస్వామి పరుగున వచ్చి జోడించి నమస్కారం చేసాడు.
సుందరానికి కడుపులో తిప్పుతున్నట్టు వుంది. ముందుకు వంగి మరోసారి భళ్ళున వాంతి చేసుకున్నాడు.
దగ్గరకు వచ్చిన బాల స్వామి చేతిలో మూడు వంద రూపాయల కాగితాలు పెట్టి ” ఇవి ఇంట్లో శాంతమ్మ గారికి ఇవ్వు. ” అని చెట్టుకు జారగిలబడ్డి కళ్ళు మూసుకున్నాడు. బాల స్వామి సుందరం ఇంటికి పరిగెత్తాడు.
కంచం ముందు అన్నం గిన్నె దించిపెట్టి మళ్ళీ ఒకసారి వీధిలోకి తొంగి చూసింది శాంత.
“అమ్మా! అయ్య. అయ్య … గుళ్ళో అంటూ డబ్బు పట్టుకున్న చేతిని ముందుకు జాపి వగరుస్తున్నాడు బాల స్వామి.
ఇంతలో లోపలి నుండి గిన్నె కింద పడిన చప్పుడు వినబడి లోపలికి పరిగెత్తింది శాంత .
బాలస్వామి వెనక్కి తిరిగి గుడివైపు పరిగెత్తాడు.
సుందరం చెట్టు క్రింద వున్న గట్టు మీద పడుకుని వున్నాడు. ఆతని కళ్ళు మూతలు పడుతున్నాయి. దాహంతో గొంతు తడి ఆరిపోయిందేమో నీళ్ళ కోసం సైగ చేస్తున్నాడు. ఎదురుగా నిలబడి వున్న వీరాస్వామి ఏమి చేయాలో తోచనట్టు చేతులు నలుపుకుంటున్నాడు.
బాలస్వామి పరిగెత్తి వెళ్ళి తొట్టిలోని నీళ్ళు సత్తు గ్లాసుతో ముంచుకు వచ్చాడు.
” బాపనోళ్ళురా.. మన చేతి నీళ్ళు ఎట్లా పోస్తాం? ” అంటున్న నాయన మాటలు చెవిన పడనట్లే ముందుకు వంగి సుందరం నోట్లో నీళ్ళు పోసాడు బాలస్వామి.
బాలస్వామి వెనకనే పరుగున వచ్చిన శాంత అలా చూస్తూ నిలబడిపోయింది.
రెండు గుక్కలు నీళ్ళు తాగి కళ్ళు తెరిచాడు సుందరం.
“అయ్యా ! చమించండి. ఆపదలో వున్నారని పిల్లోడు సాహసం చేసాడు.” వీరాస్వామి చేతులు జోడించాడు..
“నేను చేసిందీ ఆపద్ధర్మమే. దేవుడు క్షమిస్తాడు. ” గొణిగాడు సుందరం.
శాంత ఒక అడుగు ముందుకు వేసి బాలస్వామి తల నిమిరింది.
—— —— —– ——

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *