March 29, 2024

కనువిప్పు

రచన: చిత్రపు లక్ష్మీ పద్మజ

ఉదయం ఏడున్నరయింది. సుశీల ఈలోపు ఆరుసార్లు వాకిట్లోకి తొంగి చూసింది. పనమ్మాయి రత్నమ్మ కోసం. గేటు ఇప్పుడు చప్పుడవటంతో మరోసారి చూసింది. రత్నమ్మ.
”ఏమే ఇవాళ ఇంత ఆలస్యం అయ్యింది” అంది సుశీల.
”ఏం చెప్పను అమ్మా వస్తూనే వున్నా, రాత్రంతా మా మరిది తాగేసి వచ్చి పెళ్లాన్ని చితక బాదాడు. గొడవంతా సద్దాుమణిగి పడుకునే సరికి ఆలస్యమైంది. కాస్త ఆలస్యంగా లేచాను. ఇదిగో ఎంత సేపు అంతా చక్కబెట్టేస్తాను”. అంటూ చీపురు తీస్కుని వాకిట్లోకి వెళ్లింది.
”నీ మరిది ఆగడలు ఎక్కువై పోతున్నయ్యే” అంది సుశీల రత్నమ్మని అనుసరిస్తూ, ”అంతా మా తలరాత అమ్మా” ఏం చేస్తాం. మా తోడికోడలు బాధలు చూడలేక
పోతున్నా.
మా మామ ఇచ్చిన 100 గజాల స్థలం తాకట్టు పెట్టేశాడు మాతో చెప్పకుండ. చెరో పెంకుటిల్లు అయినా వేస్కుందాం అనుకున్నా . అది లేకుండ చేశాడు. . . చెయ్యిజారిపోయింది. ఉద్యోగం లేదు, దమ్మిడీ సంపాదన లేదు. ఆ పిల్ల కష్టపడింది
కూడ తాగేస్తున్నాడు. ఏం మనుషులో ఏమో” అంది రత్నమ్మ.
”సరే కానీవే, ఆయనకి ఆఫీసు టైం అవుతోంది, భోజనం బాక్స్‌ కట్టాలి” అంటూ వంటింట్లోకి వెళ్ళింది సుశీల.
*****
ఇద్దరు అన్నదమ్ములున్న ఇంటిలోకి పెద్దాకోడలిగా వెళ్ళింది సుశీల. పెళ్లయి పదేళ్లయినా సంతానం కలగలేదు. నాలుగేళ్ల క్రితమే ట్రాన్స్‌ఫర్‌ మీదా విజయవాడ వచ్చారు సుశీల – రామారావు దంపతులు. రామారావు తమ్ముడు విజయవాడ దాగ్గర్లోనే చిన్నపల్లెలో వ్యవసాయం చేసేవాడు. రెండేళ్ల క్రితం పాముకరిచి చచ్చిపోయాడు. కొడుకుని పెంచుకుంటూ ఆ పల్లెలోనే వుండిపోయింది తోడికోడలు. కూరగాయలు పండించుకుంటూ పాలు అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్నారు తల్లీ కొడుకులు. అత్తామామలు ఏనాడో కాలం చేశారు.
*****
మళ్లీ తెల్లారింది. సుశీల నిద్ర లేచి డికాషన్‌ వేసి కాఫీ కలిపి భర్తకిచ్చి తనుకూడ తెచ్చుకున్నది. ఆరోజు రత్నమ్మ రాలేదు ఎనిమిది అయినా, . తిట్టుకుంటూ అన్ని పనులు మొదలుపెట్టింది సుశీల. ముందుగా వాకిట్లో ముగ్గేసి, ఇల్లు ఊడ్చి వంటచేసి ఆపైన అంట్లు తోముకుని తర్వాత భర్తకు భోజనం వడ్డించింది.
”పనమ్మాయి రాలేదా” అడిగాడు రామారావు.
”దాని బొందా, రాలేదు, దానివేకాక దాని మరిది సమస్యలు కూడ నెత్తినేస్కుంటుంది. మూడు మూణ్ణాళ్ళకు ఎగ్గొడుతోంది చికాకు పడింది సుశీల. మాట్లాడ లేదు రామారావు. మరో వారం రోజులు గడిచాయి. రత్నమ్మ జాడలేదు. పని మానేసిందేమో అనుకుంది సుశీల. ఇంకో మనిషిని వెత్కుక్కోవాలి గాబోలు అనుకుంటూ. ర, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.
*****
తెల్లారింది.
పొద్దున్నే గేటు చప్పుడవటంతో మెళుకువ వచ్చింది సుశీలకి. లేచి చూసే సరికి ”రత్నమ్మ” లోపలికి వస్తొంది.
”ఏమైపోయావే, ఏంటి రావట్లేదు” అంది సుశీల.
”మా మరిది పోయాడమ్మా” అంది రత్నమ్మ.
అయ్యో, ఎలా జరిగింది అంది సుశీల.
”తాగుబోతు కదా అడ్డదిడ్డంగా నడుస్తుంటే లారీ గుద్దేశింది” అని చెప్పింది రత్నమ్మ.
”అన్నీ పూర్తి చేసి, ఉన్న ఇల్లు ఖాళీ చేసి అక్కడే ఇంకో ఇంట్లోకి మారాము అమ్మా. ఇప్పుడు మా తోడికోడలు, పిల్ల కూడ ఉండాలి కదా అందుకనే 3 గదులున్న ఇల్లు తీసుకున్నాం. మాకు తప్పదుగా” అంది రత్నమ్మ.
ఒళ్లు మండి పోయింది. సుశీలకి, ”ఏంటి తప్పదు. . . . వాళ్లని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమేంటి? వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతుకలేరా. . . అయినా ఏనాడైనా నీ మరిది
మనశ్శాంతిగా బ్రతకనిచ్చాడా? , వున్న స్థలం కూడ పోగ్టొట్టాడు. అయినా నీ తోడి కోడలు పని చేస్కుంటూ బ్రతక లేదా, అలవాటేగా వాళ్ళ బాధ్యత అంతా మీరెందుకు నెత్తినేస్కున్నారు” అంది సుశీల ఆవేశంగా.
”అదేంటమ్మా అలా అంటారు” అంది రత్నమ్మ.
”పుట్టెడు కష్టాల్లో వున్న నాతోడి కోడలికి నేను కాకపోతే ఎవరు ఆదుకుంటారు”? ఈ బంధాలన్నీ దేవుడు పెట్టినవి అమ్మా, అదే మనకు కష్టమొస్తే ఎవరన్నా
సాయం చేస్తారేమో అని చూడమా ?
మన ఇంటివాళ్ళని మనం కాకపోతే ఇంకెవరు ఆదారిస్తారు? దాని పని అదే చేస్కుంటుంది, దాని పిల్లని పోషించుకుంటుంది. కాకపోతే అందరం ఒక చోటే వుంటాం. కష్టసుఖాలు పంచుకుంటాం. ఆపైన దేవుడి దాయ” అంది రత్నమ్మ.
చెంప చెళ్లుమన్పించి నట్లైంది సుశీలకి. రత్నమ్మ కొత్తగా కనపడింది ”పోతున్నానమ్మా” అరిచింది రత్నమ్మ.
ఈ లోకంలోకి వచ్చింది సుశీల. ”ఊ” అంది.
మరో రెండు రోజులు గడిచాయి.
*****
”ఏమండి” పిలిచింది సుశీల. రామారావుని.
”ఏంటి సుశీలా ఎమైంది. ఒంట్లో బాలేదా లేక మనస్సు బాలేదా అడిగాడు” సుశీలని.
”ఇప్పుడే అన్నీ బాగున్నట్లు న్నాయండి” అంది సుశీల. ”మీరు మన పల్లె వెళ్ళి మీ తమ్ముడి భార్యని, కొడుకుని తీస్కురండి. వ్యవసాయం కౌలుకి ఇచ్చేయ్యండి. పిల్లాన్ని స్కూల్లో ఇక్కడే చేర్పిద్దాం. ఆ అమ్మాయి మనతో పాటే వుంటుంది. ఎన్నాళ్ళని అక్కడ వుంటుంది పాపం ఒంటరిగా” అంది సుశీల.
రామారావు ఎంతో సంతోషించాడు. ”అలాగే సుశీలా మంచి నిర్ణయం” భుజం తట్టాడు, ”ఇదిగో ఇప్పుడే బయల్దేర్దాం” ”మన బిడ్డల్ని తెచ్చుకుందాం” అంటున్న భర్త ఉత్సాహం చూసి ఎంతో ఆశ్చర్య పోయింది సుశీల.

*****

5 thoughts on “కనువిప్పు

  1. పొందికైన పదజాలంతో చక్కగా ఉంది ఈ కధ…!!

  2. Chala baga rasaru lakshmi padmaja gaaru. Bhandutvalu nilipi kovatam kosam chaganti varu cheppina sookthulu goirthuki vochhayee. Nijamgaa meeru all rounder madam. Keep it up.

  3. Very nice …simple. The concept and the way it is presented touches the heart anyway…. Congratulations to Lakshmi padmaja gaaru for adding one more nice script to viewers gallery

  4. ‌స్ఫూర్తి ఎవరినుంచైనా లభించవచ్చు, మనసుని సానుకూలంగా ‌‌‌ఉంచుకోగలిగితే. ఆర్థికమైన వెసులుబాటు కీ మానవత్వపు విలువలు కలిగి ఉండడానికి పెద్దగా సంబంధం లేదేమో అనిపిస్తుంది ఇలాంటి సందర్భాల్లో. బావుంది కథ!

Leave a Reply to soma surya Sekhar Cancel reply

Your email address will not be published. Required fields are marked *