March 28, 2024

కౌండిన్య కథలు – పిండిమర

రచన: రమేశ్ కలవల

 

“ఏవండి.. ఇక్కడో పిండిమర ఉండాలి?” అని దారిలో పోతున్న మనిషిని ఆపి మరీ అడిగాడు.

“ఏ కాలంలో ఉన్నారు మాస్టారు? పిండిమర మూసేసి చాలా ఏళ్ళయ్యింది..” అంటూ వెళ్ళబోయాడు  అతను.

“దగ్గరలో ఇంకెక్కడైనా ఉందా?” అని అడిగాడు.

“పాత బజార్లో ఉందేమో వెతకండి! అక్కడే గానుగతో చేసే నూనె కూడా బహుసా దొరకవచ్చు” అంటూ నవ్వాడు.

ఆ అన్న మాటలు, వెలికినవ్వులో ఉన్న అంతరార్థం తనకు తెలియకపోలేదు. నీలకంఠం ఇదంతా ముందే ఊహించాడు, ఛాదస్తం కాకపోతే ఈ కాలంలో ఇలా డబ్బాలు పట్టుకొని పిండిమరకు వెళ్ళే ఏకైక వ్యక్తి, భర్త ఈ తరంలో తనే అయ్యింటాను అనుకొంటున్నాడు మనసులో.  ఇది ఆలోచిస్తుంటే నీర్సం వచ్చింది.

ఇందాక ఆ డబ్బాలు ఎక్కిస్తుంటే ఆటో వాడు ఎగాదిగా చూసాడు పైగా మూడు చోట్ల పిండిమర కోసం ఆపి అడిగితే విసుక్కోని చివరగా ఈ వీధిలో ఆపి డబ్బులు విసురుగా లాక్కొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో ఆటో వాడిని పాతబజారు కు తీసుకు వెళ్ళి ఎన్ని అవమానాలు పడాల అని ఆలోచిస్తూ దగ్గరే ఓ బడ్డీ కొట్టుంటే టీ కోసం అక్కడికి వెళ్ళాడు.

ఇంతలో ఓ రిక్షా అతను కూడా ఆ ప్రక్కనే బండి పెట్టి, తలకు కట్టిన గుడ్డ విప్పి మొహం తుడుచుకొని ఓ టీ అడిగాడు.

ఆ టీ త్రాగుతూ నీలకంఠం బడ్డీ కొట్టు యజమానితో మాట కలుపుతూ “మీ కొట్టు చాలా ఏళ్ళబడి ఉన్నట్లుంది” అన్నాడు. “అవునవును”

అని సమాధానం ఇచ్చాడు.

“అయితే ఇక్కడ ఇది వరకూ ఉండే పిండిమర గురించి తెలిసే ఉంటుందే? ఎపుడో తీసేసి ఉండుంటారులెండి” అన్నాడు.

“ఈ కాలంలో పిండిమరకు వెళ్ళే సన్నాసులు ఎవరుంటారులెండి? తీసేసి ఓ పదేళ్ళయ్యింది” అన్నాడు చటుక్కున.

మనసు చివుక్కుమనిపించి ఉక్రోషంతో “మీకు తెలీదులేండి, నాలాంటివారు ఇంకా ఉన్నారు” అన్నాడు.

అతను నోరు జారినందుకు “టీ కి డబ్బులు ఇవ్వక్కర్లేదులెండి” అన్నాడు పశ్చాత్తాపంతో.

“పాత బజారు లో ఎక్కడుందో తెలుసు బాబు” అన్నాడు ఆ పక్కన టీ త్రాగుతున్న రిక్షా అతను.

ఇతనెవరో దేవుడు పంపించిన వాడు అయ్యుంటాడు అని ఇద్దరి టీ డబ్బులు కలిపి ఇచ్చాడు. తనకు టీ ఇప్పించిన కృతజ్ఞతగా అతను డబ్బాలను రిక్షాలో ఎక్కించగా నీలకంఠం ఎక్కి ఎవరైనా చూస్తారేమోనన్న నామోషీతో టాప్ వేయమని చెప్పి బయలుదేరారు.

“అవునూ నువ్వు ఎంత తీసుకుంటావో అడగనే లేదు. ఎంత దూరం ఉంటుందేం?” అని అడిగాడు రిక్షా అతడ్ని.

“ఎంతోకొంత ఇద్దురులే బాబు” అన్నాడు.

అతను మళ్ళీ “కానీ బాబు గారు చాలా సంవత్సరాల తరువాత పిండిమరకు వెళ్ళే వాళ్ళని మిమ్మల్నే చూసాను” అన్నాడు.

నీలకంఠం మనసులో నువ్వూ మొదలెట్టావూ? అనుకుంటూ తన బాధ వీడితోనైనా పంచుకుంటే సగం తగ్గుతుందని “నీకు అసలు మా ఆవిడ సంగతి తెలీదయ్యా!” అన్నాడు. ఆ డబ్బాలలో ఓ డబ్బా తీసి తన ప్రక్క సీటులో పెట్టి కాలు వీశాలంగా జాపుకొని అసలు ఇది ఎలా మొదలయ్యిందో చెప్పడం ప్రారంభించాడు.

“మా అమ్మాయికి అనుకోకుండా ఓ ఐదేళ్ళ క్రితం అమెరికా సంబంధం కుదిరిందయ్య! మా అల్లుడు గారు హడావుడి గా పెళ్ళి చేసుకొని అమ్మాయిని తీసుకెడిపోయాడు, భలే చిత్రంగా జరిగిపోయింది” బయటకు తొంగి చూసాడు ఎక్కడ వరకూ వచ్చామా అని.

“ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారుట, ఇంక కాపురం ఏం చేస్తారో? ఇంతవరకూ మళ్ళీ ఇండియా రావడానికి తీరికబడలేదు. ఐదేళ్ళు కదలకుండా ఉంటేగానీ గ్రీన్ కార్డ్ రాదుట” అన్నాడు.

“అమెరికా కి పిండిమరకు ఏం సంబంధం అని నువు అడిగేలోగా నేనే చెబుతాను” అంటూ చెప్పతూ పోతున్నాడు నీలకంఠం. ఆ రిక్షాతను తాడు లాగి బెల్లు కొట్టాడు, ఎంతకీ జరగక పోతే ఎదురుగా రోడ్డు మీద ఉన్న అచ్చేసిన ఆంబోతు ఒక చిరుదెబ్బ వేసాడు. అది కదులుతూ తోకను జాడించడంలో నీలకంఠం మొహానికి తగలడం తృటిలో తప్పింది.

“దీపావళి ఇంకో రెండు వారాలలో పడింది కదూ రెండు రోజుల క్రితం అమ్మాయి ఫోను చేసి పండక్కి అల్లుడి గారుతో వస్తున్నారని … ఆయనకు పిండివంటలంటే ప్రాణమని చెప్పడంతో మా ఆవిడకు కాళ్ళల్లో చక్రాలు వేసుకు కూర్చుంది.“ అన్నాడు

రిక్షా అతను మెరక రావడంతో దిగి నెట్టడం మొదలు పెట్టాడు. “దిగమంటావా?” అని అడిగాడు నీలకంఠం. “అక్కర్లేదు బాబుగారు” అన్నాడు. సగం బాధ వెళ్ళకక్కాను కదా బరువు కూడా తగ్గుంటానులే అనుకొన్నాడు. మిగతా సగం చెప్పేస్తే పోతుందని మళ్ళీ మొదలుపెట్టాడు.

“అయినా అత్తగార్లకు అల్లుళ్ళు వస్తున్నారంటే ఇంత సంతోషం ఎందుకో నాకెపుడు అర్థం కాని విషయమే” అన్నాడు.  “అవును! మా అత్తగారు పండగల కెల్తే చానా బాగా చూసుకుంటారు బాబుగారు” అన్నాడు రిక్షా అతను.

“అదే ఎందుకు? అని అడుగుతున్నాను. మా అల్లుడి ఇష్టాలేంటో తెలియవు, అలవాట్లు ఎరుగము, వస్తే ఏ కోరికలు కోరతాడో అసలే తెలీదు!, పైగా పండక్కి అమ్మాయి వస్తోందంటే నలుగురు చుట్టాలు ఊడి పడతారు. ఇవన్నీ ఖర్చుతో కూడిన విషయాలు, ఈ ఆడవాళ్ళకు ఏమీ పట్టవు” అన్నాడు. “ఒక్క పండుగ కోసం పదహారు రకాల పిండివంటలు చేసుకొని తినేకంటే అదే సంవత్సరమంతా కావలసినవి ఒక్కోటి చేసుకుంటే అరగక పోవడం అన్న బాధ ఉండదు” అన్నాడు నీలకంఠం.

“పండగ పూటే ఓ నాలుగు పిండివంటలు చేత్తారు బాబు” అన్నాడు. వీడెవడో పూర్వజన్మలో మా ఆవిడకు తమ్ముడు అయ్యుండాలి అనుకుంటున్నాడు మనసులో, తనతో ఏకీభవించనందుకు “త్వరగా పోనీయనయ్యా! ఈ లెక్కన సాయంత్రం చేరేలాగా ఉన్నాము” అన్నాడు విసుగుతో. “మెరక అయిపోయింది బాబు ఇంత సాఫీగా ఉంటది” అని బెల్ కొడుతూ స్పీడు పెంచాడు.

“షాపులలో దొరికే పిండితో చేస్తే ఏం బావుంటాయి? పిండిమరలో అప్పటికప్పుడు కొట్టించి చేసికొని తింటే వాటి రుచే వేరు” అంటూ మా అత్తగారు సాగదీయడం వెంటనే వాళ్ళు మూట ముల్లు సర్దుకొని ఉన్నపళంగా రావటానికి సిద్దమయ్యారుట “ఉన్నట్లుండి డబ్బులు ఎక్కడినుండివస్తాయి?”  “పైగా వాళ్ళ పినత్త గారు వస్తే భలే సందడిట, ఇంకా ఖాళీగా ఉన్నవార్నందరినీ పిలిస్తేసరిపోదు?” అన్నాడు నీలకంఠం.

“పండక్కి చుట్టాలు వస్తే సందడే కద బా..” అనేలోగా “నువ్వుండవయ్యా! ఆవిడకు వత్తాసు పలుకుతున్నావు. ఇంకెంత సేపు ?” అన్నాడు. ఆ రిక్షాని కిర్రు కర్రు శబ్ధాలు చేస్తూ ఆ పిండిమర ముందు ఆపాడు.

నీలకంఠం దిగి తలుపు తోసి లొపలకు ఓ రెండు డబ్బాలతో బయలుదేరాడు, వెనుకు మిగిలిన మూడు డబ్బాలతో ఆ రిక్షాతను నడిచాడు.

“ఎంత ఇవ్వమంటావు?” అని అడిగాడు ఆ రిక్షా అతన్ని. ఆ మర మోతలో ఏం వినపడుతుంది? ఓసారి గట్టిగా చెబుదామని గట్టిగా “ఎంత ఇవ్వమంటావు?” అని కేకపెట్టేలోగా కరెంట్ పోవడంతో ఆ వీధి చివర వరకూ ఆ కేక వినపడింది. అతను సౌమ్యంగా “ఎంతోకంత ఇప్పించండి” అంటూ మళ్ళీ “తిరిగి ఇంటికి వెళ్ళాలి కదా బాబు, ఇక్కడే ఉంటాలేండి” అంటూ బయటకు నడిచాడు.

నీలకంఠం కేక విని లోపలనుండి మరమనిషి బయటకు వచ్చాడు. తెల్లరంగు పూసుకున్న వాడిలా సైగలతో వచ్చిన సంగతి అడిగాడు. అంత పెద్దగా కేక పెట్టినందుకు మొహం చిన్నబోయి కంగారులో “అరిసెలకు శనగపిండి పట్టించుకురమ్మంది మా ఆవిడ” అన్నాడు.

“శనగపిండితో అరిసెలా? సరిగా విన్నారా మీ చెప్పినవి?” అని అడిగాడు “వచ్చేముందు రెండు సార్లు ఆవిడకు అప్పచెప్పానంటూ… అరిసెలకు, ఆట్లకు బియ్యప్పిండి, పకోడీలు, బజ్జీలకు శనగపిండి, పూరీ, చపాతీలకు గోధుమపిండి.. “ అంటూ మళ్ళీ ముచ్చటగా మూడో సారి అప్పచెప్పాడు. ఇంతలో కరెంటు రావడంతో మళ్ళీ మరలు మొదలవడంతో  ఓ డబ్బా చేతికందించాడు.

“ఎంత?” అని అడిగాడు. “అరకిలో” అన్నాడు నీలకంఠం. “అంతకంటే ఎక్కువ బరువుగా ఉందే” అంటూ మూత తీసి బరక గా కావాలా లేక మెత్తగానా అన్నాడు. మళ్ళీ గుర్తు చేసుకొని ఏ రకం కావాలో మర శబ్థాలలో గొంతు చించుకొని అరిచాడు. అన్ని రకాల పిండి లు పట్టించుకొని ఓ గంటలో బయటపడ్డాడు, రిక్షాలో ఇంటికి బయలుదేరాడు.

“ఇదే షాపులో తెచ్చుకుంటే పది నిమిషాలలో అయ్యేది, ఓ పూట పట్టింది” అన్నాడు దిగుతూ నసిగాడు.

“పిండిమరలో పట్టిన పిండితో చేసిన వంటల రుచి వేరేగా ఉంటది బాబు” అన్నాడు రిక్షా అతను ఆ రిక్షాలో రెండు డబ్బాలు తీసుకొని అతను లోపలికి నడిచాడు.

ఖచ్చితంగా మా ఆవిడకు ఏ తోబుట్టువు అయ్యిండాలి అని మనసులో అనుకొని రిక్షా కిందకి దిగాడు. నీలకంఠం అవతారం చూసి ఆ పక్కనే ఉన్న కుక్క గట్టిగా మొరిగింది. ఆ రిక్షా అతను సమయానికి కర్మక పోతే ఆ డబ్బా కిందపడేసి పరుగులంకించే వాడే.

లోపలికి నడిచాడో లేదో “ఎవరండి మీరు?” అంది ఆ తెల్ల రంగు పూసిన అవతారం చూసి. ఒళ్ళుమండి “అయ్యగారు పిండి ఇచ్చి రమ్మన్నారండి” అన్నాడు. “ఆ లోపల పెట్టు బాబు” అంది ఎక్కడో విన్న గొంతులాగా ఉంది అనుకుంటూ.

“పెడతాను.. ఎందుకు పెట్టనూ.. సొంత మొగుణ్ణి కూడా గుర్తుపట్టలేనంత పిండి ఒంటికి అంటిందనమాట” అన్నాడు.

“సర్కస్ లో బఫూన్ లాగా ఏమిటి ఈ అవతారం, కొంపదీసి మీతో పని చేయించాడా ఆ మరలో” అంది

“మీరు అటు వెళ్ళాక అమ్మాయి ఫోను చేసిందండి!” అంది.

“ఏంటిట? అల్లుగారికి పానుపు మంచం మీద పడుకోవాలి ఏమైనా కోరిక కలిగిందా? లేక ఉయ్యాలలో ఊగాలని ఉందిట?” “వెంటనే వెళ్ళి ఏ వడ్రంగి మేస్త్రీ నో తీసుకువస్తాను” అన్నాడు చిందులేస్తూ.

ఆ ప్రక్కన నుంచున్న రిక్షా అతనితో “ఎంత ఇవ్వమంటావు?” అని అడిగాడు.

“మీకు తోచింది..” అంటుండగా “ఈ పండగ అల్లుడు వస్తున్నాడు అన్న దగ్గర నుండి ఏమీ తోచడం లేదయ్యా ఈ పిండి బుర్రలో.. “ అన్నాడు

“మీ వేళాకోళం ఆపండి. అదే చెప్పబోతున్నా అల్లుడు, అమ్మాయి రాకూడదని మీరు కోరుకుంటున్నారుగా ఏ తథాస్తు దేవతలో విని ఉంటారు.. గ్రీన్ కార్డు రాకుండానే అల్లుడు గారి ఉద్యోగం అర్జెంటుగా మారాల్సి వచ్చిందిట ఇంకో ఐదేళ్ళ వరకూ మళ్ళీ ఇండియా రావడం కుదరదుట. బహుసా మనల్నే వచ్చే ఏడాది తీసుకెడతామని చెప్పింది” అంటూ విసుగుతో లోపలకు నడిచింది.

“ఏంటి? ఇంతా కష్టపడిందంతా వృధాయేనా? అయితే?” అన్నాడు. ఎంతైనా నీలకంఠానికి లోపల ప్రేమ లేకపోలేదు. మళ్ళీ అమ్మాయి, అల్లుడు రావడం లేదన్న వార్తతో లోపల గుబులు మొదలయ్యింది. అటు రిక్షా అతన్ని చూసాడు. అతను ఇదంతా గమనిస్తూ అక్కడే వేచి ఉన్నాడు.

“మీ ఇంటి పండక్కి ఎవరైనా వస్తున్నారా?” అని రిక్షా అతడిని అడిగాడు. “ప్రతీ పండక్కి మా అబ్బాయి కోడలు రావాల్సిందే బాబుగారు, నాలుగు రకాల వంటలు చేసుకోవాల్సిందే” అన్నాడు

తన జేబులో నుండి ఐదు వందలు తీసి సంతోషంగా ఆ రిక్షా అతనికి ఇస్తూ “మీరైనా అందరూ కలిసి చేసుకుంటున్నారు కదా! ఇది ఉంచు.. దీపావళి పండగ ఓ వారం ముందు వచ్చి కనపడు..మీ అక్కయ్య గారు చేసే బోలెడు పిండివంటలు కొరియర్ లో అమెరికా పంపాల్సి వస్తుంది. ఈ కాలంలో తరువాత రోజే చేరే కొరియర్లు ఉండే ఉంటాయి” అంటూ రిక్షా అతడ్ని సాగనంపాడు నీలకంఠం.

 

శుభం భూయాత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *