April 20, 2024

తేనెలొలుకు తెలుగు – పత్రికలు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

మాలిక పత్రిక నిర్వాహకురాలు జ్యోతి వలబోజుగారి ప్రోత్సాహ ప్రోద్బలాలతో గత రెండు సంవత్సరాలుగా తేనెలొలుకు తెలుగు పేరిట వ్యాసాలు రాస్తూ వచ్చాను. పత్రిక నిర్వహణ సంపాదకుల అభిరుచి మేరకు అలరారుతుంది. ఈ విషయంలో జ్యోతి వలబోజుగారిని అభినందించాలి. వారు పరిచయమైనప్పటి నుండి గమనిస్తున్నా ఒకటి ఆమె వ్యక్తిత్వం, రెండు ఆమె పనితీరు రెంటికి రెండు ఆదర్శప్రాయాలే. ముక్కుసూటితనం ఆమె విలక్షణత. చేపట్టిన పనిని సాకల్యంగా అవగాహన చేసుకుని, దానికై శ్రమించి పరిపూర్ణత సాధించటం ఆమె పనితీరు ప్రత్యేకత. సాధారణ గృహిణి నుండి అచిర కాలంలోనే సెలెబ్రిటీ స్థాయికెదిగిన ఆమె అంటే నాకు అమిత గౌరవం.
ఇదంతా చెప్పడం ఎందుకంటే జ్యోతివలబోజు నేడొక ప్రసిద్ధ పుస్తక ప్రచురణకర్త. ఒక రకంగా ఆ విషయంలో ఆమె సంచలనం సృష్టించిందనవచ్చు. నాకూ పుస్తక ప్రచురణ క్షేత్రంలో కొంత అనుభవం ఉంది గనుక ఆ సాధకబాధకాలు అనుభనైకవేద్యాలు. ఎంతో ఓర్పుతో చేయవలసిన పని. ఒక రకంగా మా ఇరువురి మైత్రీబంధానికి పుస్తక ప్రచురణే మూలకారణం అని చెప్పవచ్చు. ఆవిడ పలు వ్యాసాల్లో తన ప్రస్థానాన్ని తెలియబరుస్తూనే వస్తున్నది గనుక పాఠకులకు వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఆవిడ మాలిక అనే అంతర్జాల పత్రిక నిర్వహణ కూడా అంతే శ్రద్ధతో చేయడంలో ఆశ్చర్యం లేదు.
ఇంతవరకు తేనెలొలుకు తెలుగు శీర్షికన తెలుగు భాష తీయదనానికి కారణమైన అనేక అంశాలను స్థాలీ పులాక న్యాయంగా వివరిస్తూ రావడం జరిగింది. దాదాపుగా తెలుగులోని పద్యం, గద్యం, గేయం, నవల, నాటకం, సామెతలు, పర్యాయపదాలు, నానార్థాలు, హరికథ, బుర్రకథ, అవధానం గడీనుడి వంటివి స్పృశించబడ్డాయి. ఈ రోజు వ్యాసం పంపించమని వారి సందేశం రాగానే ఏం రాయాలా అని ఆలోచించ వలసిన పరిస్థితి ఏర్పడింది. స్పృశించని అంశం పత్రికలు అని తట్టింది. నిజానికిది చాలా పెద్ద అంశమే. పత్రికల పుట్టు పూర్వోత్తరాలలోనికి వెళితే చాలా పరిశోధించి చెప్పాలి. అలా కాకుండా నా అనుభవానికి దగ్గరలో ఉన్న కొన్ని విషయాలను పంచుకుంటాను.
ఒక రచయిత గాని, కవి గాని, తాను రాసిన విషయం ఎక్కువ మందికి చేరవేయాలనుకున్నప్పుడు
పత్రికల ప్రాధాన్యత తెలియవస్తుంది. కేవలం పుస్తక రూపంలో తీసుకు వస్తే సరిపోదు పుస్తకం అయితే గ్రంధాలయంలోనో, లేదా అడిగి తెచ్చుకునో, కాదంటే కొనుక్కునో చదవాలి సామాన్య పాఠకుడికి అది అంత సులభం కాదు ఏ వారపత్రికలోనో, మాసపత్రికలోనో లేదా దిన పత్రికలోనో రచన పడితే అది ఎక్కువ మందికి చేరుతుందనేది తెలియని విషయం కాదు
ఇంకో విషయం, కవి గాని రచయిత గాని ప్రసిద్ధుడు కావాలంటే పత్రికలో రచనలు రావడం అవసరం అంతే కాదు అనేక మంది కవులు రచయితలు కావడానికి కూడా పరోక్షంగా పత్రికలే కారణం
నా మట్టుకు నాకు నేనివాళ నాలుగు మాటలు రాసే స్థాయికి రావడానికి మాత్రం నేను చదివిన పత్రికలే కారణమని గట్టిగా చెప్పగలను. ఐదు దశాబ్దాల క్రితం ఇప్పటిలా ఇన్ని మాధ్యమాలు లేవు పత్రికలు సినిమాలు తప్ప. నా చిన్నతనంలో కరణంగారింటికి తెలుగు దిన వార మాసపత్రికలతో పాటు బాలల పత్రిక చందమామ కూడా వచ్చేది. చందమామ పత్రికంటే ఇప్పటికీ నాకు ఇష్టమే. అలా చందమామ, బాలమిత్రలతో మొదలై వారపత్రికలు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వారపత్రికలు యువ, జ్యోతి, సినిమారంగం వంటి మాసపత్రికలు తరువాతి కాలంలో వచ్చిన స్వాతి వారపత్రిక, మాసపత్రిక , విపుల, చతుర, విజయచిత్ర, అపరాధపరిశోధన, ఇలా చాలా పత్రికలు చదివే వాళ్లం ఇవి చదువుతున్నప్పుడే సాహిత్యానికి సంబంధించిన భారతి గురించి తెలిసింది ఆపైన స్రవంతి ఇలా ఒకప్పుడు పత్రికల ప్రభావం చాలా ఉండేది.
కొన్ని పత్రికలు దీపావళి ప్రత్యేక సంచికలు వేసేవి అవి ఎంతో ఆకర్షణీయంగా రూపొందించేవారు చాలా గొప్ప కథలు, ధారావాహికలు అప్పట్లో ఒక సంచలనాన్ని కలిగించాయనడంలో అతిశయోక్తి లేదు కార్టూన్లు, కవితలు, కథలు, సీరియళ్లు, ప్రహేళికలు ఒకప్పటి పాఠకులకు తెలుగు భాష మీద అమితమైన ప్రేమ కలిగేటట్టు చేసాయనడంలో సందేహం లేదు. ఇక భారతి వంటి సాహిత్య పత్రికలు ఆనాటి పండితులకు గీటురాళ్లు దినపత్రికలు తొలుత కేవలం వారితలకే పరిమితమై ఉండేవి కాని తరువాతి దశలో అవికూడా అనేక విషయాలను చేరవేస్తూ వచ్చాయి.
పేర్లు చెప్పడం కుదరకపోయినా నేటి ప్రసిద్ధ కవులు రచయితలు ఒకప్పటి పాఠకులుగా తరువాత రచయితలుగా రూపొందింది పత్రికల చలువ వల్లనే. గోలకొండ పత్రిక, కృష్ణాపత్రిక తెలుగు స్వతంత్ర, ఇండియా టు డే అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకున్న పత్రికలు. వీటికి తోడు ఒకప్పుడు డిటెక్టివ్ సాహిత్యం కూడా విరివిగా వచ్చేది. ఎంతగా అంటే డిటెక్టివ్ నవలలు అద్దెకు ఇచ్చి కుటుంబపోషణ చేసుకునే స్థాయిలో అంటే ఊహించండి. అప్పటి యువతరం ముచ్చట్లలో తప్పకుండా సినిమా కబుర్లతో పాటు పత్రికలముచ్చట్లు కూడా ఉండేవి. ఏది ఏమైనా తెలుగు భాష ప్రవర్ధిల్లటంలో పత్రికల పాత్ర గణనీయమైనది అని చెప్పవచ్చు.
అంతర్జాల పత్రికల గురించి తరువాత చెప్పుకుందాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *