April 23, 2024

నలదమయంతి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు .

మహాభారతములో ధర్మరాజు ,సోదరులు అరణ్యవాసములో అనేక కష్టాలు పడి ఒకసారి వృహదశ్వ అనే ఋషి పుంగవుడిని కలిసి అరణ్యవాసములో వారు అనుభ విస్తున్న కష్టాలను మహర్షికి వివరిస్తాడు ఆ మహర్షి వారి బాధలను తొలగించటానికి అంతకన్నా ఎక్కవ కష్టాలు పడ్డ నల -దమయంతుల కధ వివరిస్తాడు ఎందుకంటే ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోవటం నలుడు రాజ్యాన్ని కోల్పోవటం జూదము ఆడటంవల్లే. ముందు నలుడి గురించి తెలుసుకుందాము. అందగాడు పరాక్రమవంతుడు అయినా నలుడు నిషధ దేశాన్ని ప్రజారంజకముగా పాలిస్తున్నాడు. ప్రజలు కూడా రాజును అభిమానించేవారు అయన మంచి విలుకాడు అశ్వాల పట్ల మంచి జ్ఞానము ఉన్నవాడు.

దమయంతి విదర్భ రాజైన భీమ కుమార్తె ఆవిడ అందగత్తె,తెలివి అయినది ఆవిడ అందచందాలను గురించి ప్రజలు కధలు కధలుగాచెప్పుకొనేవారు నలుడు ఆవిడ అందచందాలను దమయంతి ,నలుని అందచందాలను పరస్పరము తెలుసుకొని ఒకరినొకరుచూసుకోక పోయినా ప్రేమించుకున్నారు.అందగాడైన తెలివి గలవాడైన నలుడిని భర్తగా చేసు కోవాలని అనుకుంటుంది

ఒక రోజు నలుడు ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు బంగారు రెక్కలు గల హంసను చూసి పట్టుకుంటాడు ఆ హంస మానవభాషలో “నీకు సహాయము చేస్తాను నన్నువిడిచిపెట్టు ” అని ప్రాధేయపడుతుంది నలుడు తన తరుఫున దమయంతి దగ్గరకు రాయబారిగా వెళ్లి తన ప్రేమను తెలియజేస్తానంటే వదులుతాను ,అని అంటాడు. సరే అని హంస” దమయంతి నిన్ను తప్ప మరెవ్వరిని పెళ్లిచేసుకోకుండా నీ గురించి గొప్పగా చెప్పి నీమీద ప్రేమను కలుగజేస్తాను “అని చెపుతుంది. అలాగే హంస తన పరివారముతో దమయంతి ఉద్యానవనములోకి వెళ్లి దమయంతితో నలుని అందచందాలను గుణ గణాలను వివరించి దమయంతి నలుని పట్ల ప్రేమ కలిగేటట్లు చేస్తుంది ఈలోపు దమయంతి తండ్రి దమయంతి కోసము స్వయంవరం ఏర్పాటు చేసి వివిధ దేశాల రాజులను
ఆహ్వానిస్తాడు. దమయంతి స్వయంవరం గురించి తెలుసుకున్నదేవతలు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు స్వయంవరానికి రావాలని నిర్ణయించుకొని వారు నలుడి దగ్గరకు వచ్చి వారి గుణగణాలను దమయంతికి వర్ణించి వారిలో ఎవరినో ఒకరిని దమయంతి పెళ్ళిచేసుకొనేటట్లు రాయబారము జరుపవలసినదిగా కోరుతారు.ఇది విన్న నలుడు “నేను కూడా దమయంతి పెళ్లాడాలని స్వయంవరానికి వెళుతున్నాను దమయంతి ఘాఢంగా ప్రేమించే నేను ఇతరులను పెళ్లిచేసుకోమని ఎలాచెప్పగలను?” అని తన నిస్సహాయతను దేవతలా ముందు వెలిబుచ్చుతాడు.

కానీ దేవతలు నలుడిని రాయబారిగా వెళ్లి తమ కార్యము జయప్రదంగా నిర్వహించుకొని రమ్మని ఆదేశిస్తారు దమయంతి మందిరంలోకి ఇతరులకంటబడకుండా లోపలి వెళ్లే వరము ఇచ్చి దేవతలు నలుడిని పంపుతారు. విధి లేని పరిస్తుతులలో నలుడు రాయబారిగా వెళతాడు.మందిరంలోకి ప్రవేశించిన నలుడు దమయంతి అందానికి ముగ్దుడవుతాడు కానీ తానూ వచ్చిన పని గుర్తుకు వచ్చి బాధపడతాడు దమయంతి నలుని గుర్తించి సంతోషపడింది. కానీ నలుడు తాను వచ్చిన పని చెప్పి తానూ సాధారణ మానవుడిని అని దేవతలతో శత్రుత్వము తెచ్చుకోలేనని దమయంతిని ఆ నలుగురు దేవతలలో ఎవరినో ఒకరిని వరించమని చెపుతాడు

దమయంతి ఒక్క క్షణము అలోచించి “మీరు దేవతలు చెప్పినట్లుగా మీ రాయభారాన్నిసక్రమముగా నిర్వహించారు. మీరు హంస రాయబారములో హంస చెప్పినదానికన్నా కూడా అందముగా ఉన్నారు. మీరు దేవతల దగ్గరకు వెళ్లి ,వారి సమక్షంలోనే మిమ్ములను స్వయంవరంలో ఎన్నుకుంటాను అని చెప్పండి మీరేమి దిగులు పడవద్దు” అని ధైర్యము చెపుతుంది.దమయంతి ఇచ్చిన ధైర్యముతో నలుడు దేవతల దగ్గరకు వచ్చిజరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు
మరునాడు స్వయంవరానికి నలుగురు దేవతలు నలుడు ఇతర రాజులు హాజరు అవుతారు. కానీ ఆశ్చర్యము ఏమిటి అంటే నలుడే కాకుండా ఇతర దేవతలు కూడా నలుని రూపములో వచ్చి నలుని ప్రక్కనే కూర్చుంటారు చూసేవారికి అసలు నలుడు ఎవరో అర్ధము కాదు. సభికులంతా ఉత్కంఠతతో ఏమి జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. వరమాలతో సభలోకి ప్రవేశించిన దమయంతి ఐదుగురు నలులను చూసి దేవతలు తన తెలివితేటలకు పరీక్ష పెడుతున్నారని అర్ధము చేసుకొని, మనసులో దేవతలను ప్రార్ధించి ప్రసన్నులను చేసుకుంటుంది. దేవతలు మానవులకు భిన్నముగా ఉంటారని తెలుసుకుంటుంది, సభలోని వారందరికీ ఎవరు నలుడు అన్న ఉత్కంఠతతో చెమటలు పడతాయి. కానీ దేవతలకు చెమట పట్టదు. అలాగే నరులు కనురెప్పలు ఆర్పుతూ ఉంటారు. దేవతలు కనురెప్పలు ఆర్పరు. దేవతల పాదాలు నేలను తాకవు కానీ నరుల పాదాలు నేలను తాకుతాయి. ఈవిధమైన లక్షణాలను బట్టి దమయంతి నలుని గుర్తించి నలుని మెడలో వరమాల వేసి తన భర్తగా ఎన్నుకుంటుంది.
సభికులు, దేవతలతో సహా దమయంతి తెలివితేటలకు నలుడిని గుర్తించినందుకు సంతోషపడతారు. దేవతలు వారి నిజరూపాలలోకి మారి నల దమయంతులను ఆశీర్వదిస్తారు. నలుడు” దేవతలను కూడా కాదని నన్ను స్వయంవరంలో ఎన్నుకున్నావు. నేను నీకు సర్వదా విధేయుడైన జీవిత భాగస్వామిగా ఉంటాను ఎన్నడూ నీ చేయి విడువను” అని దమయంతితో అంటాడు.

సంతోషించిన ఇంద్రుడు నలుని స్వర్గలోక ప్రాప్తిస్తుందని వరము ఇస్తాడు. అగ్ని వరుణుడు ,”నీకు అవసరము అయినప్పుడు మమ్మల్ని తలుచుకుంటే నీకు సహాయము చేయటానికి వస్తాము” అని వరము ఇస్తారు. అంతే కాకుండా నిప్పు నీరు వల్ల ఏమి హాని జరగదని హామీ ఇస్తారు. యముడు వంటలను అతి రుచికరంగా వండే వరము, అలాగే ఎన్నటికీ వాడని హారాన్ని బహుమతిగారిస్తాడు అందుచేతనే నలుడు మంచి పాక శాస్త్ర ప్రవీణుడిగా పేరు పొందాడు. అన్నిటికి మించి తానూ దమయంతి ప్రేమిస్తున్నప్పటికీ దేవతలా తరుఫున రాయబారిగా వెళ్లినందుకు దేవతలు అతనికి ఏ ద్వారాలు అడ్డుగా నిలవకుండా వరము ఇచ్చారు. కాబట్టి తలుపులు మూసినా నలుడు వెళ్లగలడు. దేవతలు ఇతర రాజుల సమక్షంలో నల దమయంతుల వివాహము జరిగింది.
నలుడు తన రాజ్యానికి వచ్చి దమయంతితో సుఖముగా జీవిస్తూ రాజ్యాన్నిఏలుతున్నాడు. దమయంతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. పన్నెండు ఏళ్ళు సుఖమైనా జీవితాన్ని గడిపినాక వారి జీవితాల్లో విధి వక్రించి కష్టాలు ప్రారంభమయినాయి. నలుడి దాయాది అయిన పుష్కరుడు నలుని జూదానికి ఆహ్వానిస్తాడు. ఆ జూదములో నలుడు సమస్తము కోల్పోయి కట్టుబట్టలతో అడవులపాలు అవుతాడు. ఈ సమయములో దమయంతి నలుడితో పాటు అడవులకు వెళ్ళటానికి నిశ్చయించుకుంటుంది. కానీ నలుడు సుకుమారి అయినా దమయంతి అడవులలో కష్టాలు పడుతుంది కాబట్టి వద్దని వారిస్తాడు. కానీ దమయంతి భర్త వెంబడి వెళ్ళటానికి ఇష్టపడుతుంది. నిరాయుధుడిగా అడవులలో ప్రవేశించిన నలుడు ఏ జంతువును వేటాడలేడు కాబట్టి తన పై పంచెతో పక్షులను పట్టుకొవాలని అనుకుంటాడు కానీ దురదృష్టవశాత్తు పక్షి ఆ పంచెను ఎత్తుకుపోతుంది. ఆ విధముగా అన్ని కోల్పోయినందుకు బాధపడుతున్న నలుడిని దమయంతి ఓదారుస్తుంది. దమయంతి తన చీరలో కొంతభాగమును చింపి నలునికి వస్త్రముగా ఇస్తుంది.

నిద్రిస్తున్న దమయంతి చూచిన నలుడికి తనవల్లే దమయంతి ఇన్ని కష్టాలు అని బాధపడుతూ అర్ధరాత్రి దమయంతి నిద్రలో ఉండగా విడిచి వెళ్ళిపోతాడు.దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్లి సుఖముగాఉంటుంది అని ఆలోచించాడు కానీ దమయంతి భర్త కోసము వెతుకుతూ కష్టపడి ఛేది రాజ్యానికి చేరుకుంటుంది. ఛేది మహారాణి వీధులలో పిచ్చిదానిలా తిరుగుతున్న దమయంతిని గమనించి తనతో తన భవంతికి తీసుకువచ్చి తన చెలికత్తెగా నియమించుకుంటుంది దమయంతి సైరంధ్రిగా పరిచయము చేసుకుంటుంది. శిరోజాల అలంకరణ సుగంధద్రవ్యాలు తయారీలో రాణీగారికి సహాయపడుతూ ఉంటుంది. కొన్నాళ్ళకు ఒక పురోహితుడు సైరంధ్రిగా ఉన్న దమయంతిని గుర్తించటం వలన దమయంతి తన తండ్రి వద్దకు చేరుతుంది. తన భర్తను వెతికే ప్రయత్నము మానదు. దమయంతి తండ్రి ఈ పనికి పమాద అనే పురోహితుని నియమిస్తాడు కానీ అతనికి నలుని ఎలా గుర్తించాలో తెలియదు కాబట్టి నలుని గుర్తించటానికి దమయంతి ఒక పాటను పాడి, ఆ పాటను పాడుతూ నలుని వెతకమని చెపుతుంది. ఈపాటలో నలుడు రాజ్యాన్నిభార్యను జూదము వల్ల కోల్పోవటము అడవిలో పంచెను కోల్పోవటము, తానూ భర్తకై ఎదురు చూస్తూ ఉండటము అన్ని వివరిస్తుంది. ఈ మా పాటకు ఎవరైతే స్పందిస్తారో వారే నలుడు అని ఆ పురోహితునికి చెప్పి పంపిస్తుంది. ఈ అన్వేషణలో పురోహితుడు రుతుపర్ణ రాజు పాలిస్తున్న అయోధ్యకు చేరినప్పుడు ఈ పాటకు మరుగుజ్జు రూపములో ఉన్న రాజుగారి వంటవాడు స్పందించటాన్ని పురోహితుడు గమనిస్తాడు.వెంటనే పురోహితుడు దమయంతి వద్దకు వచ్చి జరిగినది వివరిస్తాడు కానీ తన పాటకు స్పందించిన వ్యక్తి అనాకారి అయిన బాహుకుడు అనే వంటవాడు అని చెపుతాడు. కానీ దమయంతి ఆ వ్యక్తి తన భర్తే అని నమ్ముతుంది. తన భర్తను ఎలావెనక్కి పిలిపించుకోవాలా అని అలోచించి ఒక పధకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకొని తన స్వయంవరాన్నిచాలా తక్కువ వ్యవధిలో ప్రకటిస్తుంది.

సుదేవుడు అనే దూతను నలుడు ఉన్న అయోధ్య రాజ్యానికి పంపి అయోధ్య రాజుతో నలుడి జాడ తెలియదు కాబట్టి దమయంతి మళ్లా మరునాడే స్వయంవరం ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ స్వయంవరానికి అయోధ్య రాజును రమ్మని ఆహ్వానము పంపుతుంది. ఈ ఆహ్వానములో అంతరార్ధము ఏమిటి అంటే తక్కువ వ్యవధిలో నలుడు మాత్రమే అత్యంత వేగముగా రధాన్ని నడిపి అయోధ్య రాజును స్వయంవరానికి చేర్చగలడు అని తెలిసిన అయోధ్య రాజు తప్పనిసరి అయి మరుగుజ్జు రూపములో ఉన్న బాహుకుని సహాయము తీసుకుంటాడు. బాహుకుడు అయోధ్య రాజు తనకు జూదము ఆటలోని మెళుకువలు నేర్పాలి అని షరతు పెడతాడు రాజు ఒప్పుకుంటాడు.

బాహుకుడు రధాన్నిచాలా వేగముగా నడుపుతూ విదర్భ చేరి దమయంతి భవంతి ద్వారము దాటుతూ వుండగా ఇద్దరు పిల్లలు రథానికి అడ్డము రాగ బాహుకుడు క్రిందకు దిగి ఆ ఇద్దరు పిల్లలను గాఢముగా ఆలింగనము చేసుకుంటాడు ఇది చూసిన రాజు ఆశ్చర్యముతో ఎవరీ పిల్లలు అని అడుగుతాడు కానీ బాహుకుడు సమాధానము చెప్పడు. దూరము నుంచి ఇది గమనిస్తున్న దమయంతి మరుగుజ్జు రూపములో ఉన్నబాహుకుడే నలుడు అని నిర్ధారణకు వస్తుంది. దమయంతి గబగబా రధము దగ్గరకు వచ్చి నలుడిని ఆలింగనము చేసుకొని అతనే తన భర్త నలుదని ప్రకటిస్తుంది. అది విన్న అయోధ్యరాజు ఇతరులు ఆశ్చర్యపోతారు ఎందుకంటే వారికి తెలిసిన నలుడు చాలా అందగాడు. అప్పుడు నలుడు మౌనము వీడి తానె నలుడిని అని కర్కోటకుడు అనే విష సర్పము కాటు వేయటం వల్ల తన రూపము మారిందని కానీ ఆ విష సర్పము తనకు ఒక మాయ వస్త్రము ఇచ్చినది ఆని ఆ వస్త్రము వల్ల తానూ తన పూర్వ రూపాన్ని పొందగలనని సభికులకు చెపుతాడు. నలుడు ఆ వస్త్రము ధరించి తన మామూలు రూపాన్ని పొందుతాడు.
అయోధ్య రాజు నల దమయంతుల ప్రేమను మెచ్చుకొని తాను వాగ్దానము చేసిన విధముగా జూదములోని మెళుకువలు నేర్పుతాడు. కొన్ని రోజుల తరువాత తన దాయాదిని జూదానికి ఆహ్వానించి తానూ కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొంది మళ్ళా ప్రజారంజకంగా పరిపాలిస్తూ భార్య పిల్లలతో సుఖముగా ఉంటాడు. ఈ విధముగా నలుడు రాజ్యాన్ని భార్యను పిల్లలను చివరకు తన అందమైన రూపాన్నికోల్పోయి అడవులలో కాలము గడిపి ఇతర రాజుల కొలువులో వంటవాడిగా అశ్వచోదకుడిగా కష్టాలు పడి చివరకు దమయంతిని చేరుతాడు దమయంతి కూడా తన తేలితేటలతో తానూ కోరుకున్న నలుని వివాహమాడిన నలుని వ్యసనము వల్ల అడవుల పాలయి, చివరకు మరో రాణీ దగ్గర సైరంధ్రిగా ఉండి తన తేలితేటలు ఉపయోగించి భర్త జాడ తెలుసుకొని తన దగ్గరకు రప్పించుకొని నలుడిని పొందటంతో కధ సుఖాంతము అవుతుంది అలాగే మీరు కూడా ఇప్పుడు కష్టాలు పడ్డా చివరకు సుఖముగా ఉంటారని మహర్షి పాండవులకు హితవచనలు చెపుతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *