April 25, 2024

మనసుతీరాన్ని తాకిన అక్షరాన్వేషణ

రచన: సి. ఉమాదేవి

మనిషిని వారి మనసులోతును గ్రహించగల వ్యక్తి రేణుక అయోల. సామాజికస్పందనలకు ఆమె కవితారూపాన స్పందించేతీరు అపురూపం. తన మనసు కదలికల్ని రికార్డు చేయగల నైపుణ్యం, నిజాయితీకి సహజత్వాన్ని మేళవించి కవితలను రచించగల నేర్పరితనం రేణుక అయోలగారిది అంటారు రచయిత సౌభాగ్య. జీవితపు నాటకాల స్టేజి మీద ఈ కృత్రిమవేషాన్ని ఈ కృత్రిమ నాటకాన్ని నేను అభినయించలేను నాకు తెలిసిందల్లా నిజాల జాడల్ని వెతుక్కుంటూ వెళ్లడమే అంటారు రేణుక అయోల. తన అంతరంగాన్ని అర్థం చేసుకునే సహృదయుల కోసం ఆమె ఆరాటపడతారు. అక్షరరూపం పొందని మాటలు కలతపెడతాయంటారు. ‘అల్లంతదూరాన తెల్లని తెరచాపతో మనోహర చిత్రంలా ఊగుతూ నడుస్తున్న నావ. . . . అది ఓ ప్రశాంత ఉదయం, అది ఓ ప్రశాంత తపోధనం. ’కళాత్మక కవితానైపుణ్యం ఈ కవితలో ప్రతిఫలిస్తుంది అంటారు రచయిత. జీవితాన్ని నిశితంగా పరిశీలించిన వారికి వ్యక్తులపట్ల, దృశ్యాలపట్ల ఒక ఆత్మీయతాభావం ఏర్పడుతుంది.

‘చీకటి బెదరి, చెదరి కొండ వెనక్కు జారి దొంగలా దాక్కునే వేళ తొలిపొద్దు రేకులు విప్పిన కమలంలా విచ్చుకునే వేళ’ అంటూ ఉదయపు సౌందర్యాన్ని కవిత్వీకరించడంలో వారి కవితార్తి తేటతెల్లమవుతుంది. ‘అడవి పచ్చదనంతో, రంగులు మార్చుకుని నవ్వుకుంటుంది, గాలితో కలిసి అలల నాట్యం చేస్తుంది’ అనడంలో ప్రకృతిని తమలోకి ఆవాహన చేసుకోవడం కవులకే సాధ్యమంటారు సౌభాగ్యగారు. వారి అక్షరాలలో ఆర్ద్రత, ఆత్మీయత మేళవించిన అనంత ప్రేమ కనబడుతుందంటారు. రేణుక అయోల గారికి ఆనందం, దుఃఖం రెండింటిపైన అవగాహనుంది. ‘ నిరాశ నిస్పృహ మనిషిని అడవిలో దావానలంలా క్షణంలో చుట్టుకుంటుంది, ఆకలిగొన్న సింహంలా మనిషిని నమిలి మింగేస్తుంది. ’ఆనందాన్ని కవితలలో ప్రవహింపచేసినట్లు దుఃఖాన్ని కూడా ఆమె పరిపూర్ణంగా వ్యక్తీకరిస్తారు. ఆమె కవితలు జీవితాన్ని, అనంత విశ్వాన్ని ప్రశ్నిస్తాయి. అలతి అలతి పదాలలో అమృతగుళికల్లాంటి భావాలతో కవితలను గుబాళింపచేస్తారు. అబద్ధంలాంటి కల నిజంలాంటి చేదుకన్నా వెయ్యిరెట్లు నయం అని చెప్పడంలో కలలపై ఆమె స్పష్టత అర్థమవుతుంది. జీవితాన్ని, అనంత విశ్వాన్ని ప్రశ్నించే నైజం ఆమె స్వంతం. కవితలలో ప్రతి పదం తాత్విక ధోరణిని ప్రదర్శిస్తుందంటారు రచయిత.

‘దీపం బాగుంటుంది, మిణుకుమిణుకుమంటూ, ఎంత దూరంనించైనా, కనిపించే ఆ చిన్న వెలుగు, కొండంత ధైర్యాన్ని కనిపించని తోడుని ఇస్తుంది. ’దీపంలేని జీవితాన్ని వూహిస్తే అంతా అంధకారమే కదా అంటారు. రేణుక అయోలగారు నిశ్శబ్దంపై ఒక కవిత రాసారు. నిశ్శబ్దం నిజంగా గొప్పది, అద్భుతమైంది, మనోహరమైంది, మధురమైంది. కానీ ఆధునిక ప్రపంచంలో అది అంత సులభంగా దొరికేది కాదు అని రేణుకగారు రచించిన నిశ్శబ్దం కవితను విశ్లేషిస్తారు రచయిత. కవిలోకం గురించి రాసిన కవిత కవుల మానసికస్థితిని చూపిన వాస్తవదర్పణమే. ‘కవులు ఎప్పుడూ ఏదో లోకంలో విహరిస్తుంటారు, లోకం చుట్టూ దారాలల్లుకుంటాం. సాలెగూటిలో ఈగల్లా చిక్కుకుపోతుంటారు, కవిత్వ దాహంతో అలమటిస్తూ పుస్తకాల దొంతర్లలో మగ్గిపోతుంటారు’ అంటారు రచయిత్రి. రేణుకగారి కవితారచనలో పదచిత్రాల ఆడంబరంకాక పదాల సమన్వయం కనిపిస్తుందంటారు. తాజ్ మహల్ కవితను అక్షరీకరించిన తీరును చూస్తే రచయిత భావం అక్షరసత్యమనిపిస్తుంది. ‘జారుతున్న మంచు దుప్పటిలో, ఉదయించే సూర్యకిరణాల వెచ్చదనంతో, ధ్యానంలో నిమగ్నమైన యోగిలా ’ అంటారు. వచన కవిత్వానికి కూడా శిల్పముంటుందంటారు రచయిత. అందమైన వాక్యాలతో చక్కటి కవితలకు అందించే శిల్పం రేణుకగారి సొంతం అని చెప్తారు. ఇక హిజ్రాల వేదనలను, ఆవేదనలను ప్రతిఫలించిన కవితాసంపుటి మూడో మనిషి. అనుబంధంగా ప్రచురింపబడ్డ విశ్లేషణలలో ఎందరో కవులు , రచయితలు మూడో మనిషి కవితాసంపుటిని సమగ్రంగా విశ్లేషించారు. రేణుక అయోలగారి కవితలపై చక్కటి విష్లేషణాత్మక భావపరంపరను మనకందించిన సౌభాగ్యగారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *