April 22, 2024

అనుకున్నదొక్కటీ. అయినది ఒక్కటీ…

రచన: మణి గోవిందరాజుల.

కాంతం మనసు చాలా తృప్తిగా ఉంది ఆ రోజు. ముందు రోజు రాత్రి వెళ్ళి డెప్యుటేషన్ మీద వచ్చే పనమ్మాయి కూతురికి కొడుకు పుడితే ఆ బుడ్డోడికి మంచి బాబా సూట్ కోటీలో కాకుండా పెద్ద షాప్ కి వెళ్ళి కొనుక్కొచ్చింది. దానికి కారణం ఈ మధ్య వైరల్ అయిన ఒక మెసేజ్… మామూలుగా కూడా కాంతం దగ్గర చేస్తున్న పనమ్మాయి అయిదేళ్ళ నుండి వీళ్ళను వదలకుండా వీళ్ళు ఆమెని వదలకుండా చేస్తోంది. చాలా మంచమ్మాయి. తాళం చేతులు కూడా ఇచ్చి ఎక్కడికైనా హాయిగా వెళ్లేంత భరోసా…
అసలు హిస్టరీ చూస్తే కాంతానికీ పని వాళ్ళకీ మంచి రిలేషన్ షిప్ మెయింటెయిన్ అవుతూ రావడం గమనించవచ్చు. అల్లప్పుడెప్పుడో పదేళ్ళక్రితం పదేళ్ళేంటి 2000 సంవత్సరంలో ఇల్లు మారినందువల్ల ఒక పనమ్మాయిని పెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె పనంతా చాలా బాగా చేసేది. అవసరమయితే చక్కగా వళ్ళంతా మసాజ్ చేసి స్నానాలు కూడా చేయించేది. లంబాడీ అమ్మాయి, శాంతి దాని పేరు. ఒకసారి ఒళ్ళు పట్టి స్నానం చేయించిందంటే రెండురోజులు అలా తినడం పడుకోవడమే. ఇంటికొచ్చిన వారంతా చక్కగా ఆమెతో మసాజ్ చేయించుకుని పదో పరకో ఇచ్చి వెళ్తుండే వారు. అలా రెండేళ్ళు గడిచాయి.
ఆ తర్వాత దాని కూతురు సుజాత కొద్దిగా పెద్దదయ్యాక ఎప్పుడన్నా శాంతి తాను రాలేకపోతే కూతుర్ని పంపేది. ఆ పిల్లకు కాస్త చేయి వాటం ఎక్కువే అన్న సంగతి చిన్న చిన్నగా వస్తువులు, డబ్బు మాయమవుతున్నాక గమనించగలిగింది కాంతం. మన భాష కాని ఊరు. ఆ ధై ర్యం ఎలా వచ్చిందో మరి శాంతిని (శాంతి తెలుగమ్మాయే) నిలదీసి అడిగితే ఆ పిల్లని లాక్కొచ్చి ఒప్పించి పోయిన వాటి తాలూకు డబ్బంతా జీతంలో కట్టేసింది.
అలా చాలాసార్లు అయ్యాక కనకం చెప్పాడు. ”దానికి అవసరం పడ్డప్పుడల్లా బ్యాంకులోనుండి తీసుకున్నట్లు డబ్బు తీసుకోవడం, తల్లేమో జీతంలో కట్టుకోవడం ఈ గోలంతా ఎందుకు? వేరే అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా” అని. కాని కాంతానికి మనసొప్పలేదు. ఒక్క పిల్ల వస్తే తప్ప అయిదేళ్లనుండి పని చక్కగా హాయిగా చేస్తుంది. మానిపిస్తే మళ్ళీ అలా చేసేవాళ్ళు దొరకాలి కదా అని. అయితే ఆ తర్వాత అది చెప్తేనే తెలిసింది. శాంతి పెద్ద దాదాగిరి చేయదం మొదలు పెట్టిందని, తగాదాలేమన్నా వస్తే పోలీసుల చుట్టూ తిరిగి ఎదిరించటం, ప్రేమించిన వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయటానికి పెళ్ళి కొడుకుని ఎత్తుకొచ్చి పెళ్ళి చేయించటం, పూనాలో వాళ్ళ కులం వాళ్ళకు నాయకురాలిగా వ్యవహరించడం ఇత్యాది ఘనకార్యాలన్నీ చేస్తున్నానని వైన వైనాలుగా వర్ణించి చెప్పేది. కాని ఒక్కటి బయట ఎలా అన్నా చేయనీ ఇంట్లో చాలా మర్యాదగా ఉండేది. అయినా కూడా అప్పుడు భయం పట్టుకుంది కాంతానికి. మానేయ్ అని చెప్తే పిల్లలు చిన్నవాళ్ళు ఏమి చేస్తుందో వాళ్ళని… పోనీ చేయించుకుందామంటే విషయం తెలిసాక దాన్ని చూస్తుంటే భయంగా ఉంది. శాంతి మటుకు ఎప్పటిలాగే వచ్చి పని చేసుకు పోతున్నది. ఆ తర్వాత ఒకసారి తప్పని సరై కూతురు వచ్చిన నాలుగు రోజుల్లో వెండి చంచా ఒకటి పోయింది. శాంతి కి చెప్తే తెచ్చిచ్చింది. అయినా కూడా కాంతం మునపటిలాగా ఉండలేక పోతున్నది.
ఇక ఒకరోజు తట్టుకోలేక “శాంతీ! ఏమనుకోకు ఇలా ప్రతిసారి ఏదో ఒకటి పోవడం. నువు డబ్బులివ్వడం, లేక తెచ్చివ్వడం. . ఏమి పోతుందో అని నేను టెన్షన్ పడడం నా వల్ల కావడం లేదు. నేను వేరే వాళ్ళను చూసుకుంటాను” అని చెప్పింది.
శాంతి ఒక్క నిముషము మాట్లాడలేదు. ఆ తర్వాత గట్టిగా నవ్వి కాంతం కాళ్ళకు దండం పెట్టి “ ఇక చాల్లే. గట్టిగా కూర్చొని అరగంట పని చేసుకోలేవు. కొత్తామె మంచిగా చేస్తుందా నా కంటే? కొత్తామె దొరకనీ మొదలు. అయినా ఇక పై నా కూతుర్ని పంపనే పంపను. నువు కూడా ఇల్లు మారి కొనుక్కున్న ఇంటికి వెళ్ళిపోతుంటివి. ఈ కొన్నాళ్ళూ చేయించుకో. నువు మొత్తం పని చేసుకోలేవు. నీ కసలే చాత కాదు. టాటా బై బై రేపొస్తా” అని చెప్పి అలానే వెళ్ళిపోయింది. . కాంతం మనసంతా భారంగా అయింది. చాలా రోజులు గిల్టీగా ఫీల్ అయింది. అలా అడిగినందుకు. ఆ తర్వాత కొన్నాళ్ళు చేసి ఇల్లు మారాక దూరమైనందున మానేసింది. చెప్పొచ్చేదేమిటంటే అలా ఉన్నా కూడా పనమ్మాయితో గొడవలు పడలేదు. సొంత ఇంటికి మారాక పూనాలో ఉన్నన్నాళ్లూ ఆ తర్వాత పదేళ్ళు, మొత్తం పని ఇద్దరు పనివాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. సాధారణంగా ఇద్దరుంటే పని వాళ్ళకు పడదు. కాని ఇద్దరికీ పడకపోవడం అన్నది లేదు. చక్కగా ఒకళ్ళు మానేస్తే ఒకళ్ళు చేసేవాళ్ళు. అలా హాయిగా గడిచిపోయింది అక్కడ.
అయినా దొంగతనం అంటే గుర్తుకొచ్చింది. పూనా వెళ్ళక ముందు హైదరాబాదులో గాంధీ నగర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి చేసేది. తర్వాత విజయవాడ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళి రెండేళ్ళ తర్వాత వచ్చాక మళ్ళీ అదే ఇల్లు అద్దెకు దొరికింది లక్కీగా. పని కూడా అదే అమ్మాయిని చేయమంటే తాను చేయలేనని వేరే అమ్మాయిని పెట్టింది. ఆ అమ్మాయి చేరిన వారానికి పదిహేను వందల రూపాయలు పోయాయి.
ఆ సంగతి రెండు రోజుల తర్వాత కనకం “ప్యాంటులో డబ్బులు తీసి వేసావా ఉతకటానికి? ” అని అడిగినప్పుడు తెలిసింది. ఇల్లంతా వెతికింది. ఎక్కడా దొరకలేదు. ఇస్త్రీ వాళ్లను అడిగింది “మీరేమన్నా చూసారా” అని. ఉంటే ఇస్తాం మాకెందుకమ్మా” అన్నారు వాళ్ళు. ఒకటా రెండా పదిహేను వందలు. నెల సరుకులు వస్తాయి. చాలా దిగులు పడింది. కనకం పోతే పోయాయిలే. ఇక వదిలెయ్యి అన్నా మనసూరుకోలేదు.
ఇంకో రెండు రోజులు ఆలోచించుకుని చిన్నగా ఆ అమ్మాయిని పిలిచి చాలా సౌమ్యంగా అడిగింది “నువేమన్నా తీసావా” అని. “అయ్యో అమ్మా నాకు తెలీదు. అనవసరంగా నా మీద అనుమానం వచ్చింది మీకు” అన్నది.
“సరేలే తియ్యకపోతే పర్లేదు. తీస్తే మటుకు చెప్పు. నిన్నేమనను. నా డబ్బులు నాకివ్వు. మా చుట్టాల్లో పెద్ద పోలీసు ఆఫీసరు ఉన్నారు” అన్నది భయపెట్టటానికి. అయినా కూడా అది ఒప్పుకోలేదు. “తీయలేదమ్మా!” అన్నది. “సరేలే పని చూసుకో పో” అని పంపేసింది. రెండు రోజులు గడిచాయి. మామూలుగా పనికి వస్తున్నది. మళ్లీ ఏమీ అడగలేదు కాంతం. ముడో రోజు పనికి వస్తూనే “అమ్మా! ఒక్కసారి ఇటురా” అని పిలిచింది సందులో నుండి.
“యేంటే” అని దగ్గరకెళ్ళింది. రెండు చేతులూ వెనక్కి పెట్టుకుని నిలుచుంది. “ఏంటే? ” మళ్లీ అడిగింది కాంతం. నసుగుతూ నేల చూపులు చూస్తూ నించుంది.
“ఏంటే? !” మళ్లీ రెట్టించింది.
తల వంచుకుని రెండు చేతులూ ముందుకు పెట్టి దోసిలి పట్టింది. నలిగిన అయిదు వందల కాయితాలు కనపడ్డాయి. ఒక్కసారిగా సంతోషం వేసింది. అయినా తెలీనట్లు “ఏంటే? ఎందుకే ఆ డబ్బులు? ” అని అడిగింది
“అమ్మా! నాల్రోజుల క్రితం సర్ఫ్ లో బట్టలు ఉతకటానికి నానబెట్టారు కదా? ఉతికేప్పుడు ప్యాంటు జోబులో కనపడ్దాయి. బాగా తడిసిపోయాయి. మీరంతా హాల్లో టీవీ చూస్తున్నారు. ఇక్కడే గోడ మీద ఆరబెట్టుకున్నాను. ఎవ్వరూ చూడలేదు. తీస్కెళ్ళి ఇంకో ఇంట్లో అమ్మకి దాచిపెట్టమని ఇచ్చాను. అంతకు ముందు అందరిళ్ళల్లో లంగాలూ. జాకీట్లు, చీరలూ ఎత్తుకెళ్ళేదాన్ని. పదీ పరకా తీసేదాన్ని. కాని మొదటిసారి ఇంత డబ్బు తీసాను. భయమేసిందమ్మా! అందుకే మీ డబ్బు మీకు ఇద్దామని తెచ్చానమ్మా” అన్నది నేనేమంటానో అని భయం భయంగా. హమ్మయ్య డబ్బులు దొరికాయన్న సంతోషంతో పాటు కోపం వచ్చింది తీసినందుకు. కాని వెంటనే బుద్ది “ఇప్పుడు దాన్నేమన్నా అంటే పని మానేసి వెళ్ళిందంటే చేసుకోలేక చస్తావు” అన్న హెచ్చరిక కాస్త గట్టిగా చేయడంతో ఒక్క క్షణం ఆగి “సరే! వెళ్ళి పని చేసుకో. మళ్ళీ ఇలా చేయకు. అక్కడ టిఫిన్ పెట్టాను. తినేసి పని చూసుకో” అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత రేండేళ్ళకు దాని పెళ్ళి కుదిరిన దాకా ఆ అమ్మాయే చేసింది. ఈ మధ్యలో కాంతం కొడుకు రెండేళ్ళ వాడికి బాగా సుస్తీ చేసి ఏడాది ఇబ్బంది పడ్డాడు. తిన్నది తిన్నట్లు వాంతి చేసుకునేవాడు. రోజుకు ఒక పది దుప్పట్లు మార్చాల్సి వచ్చేది. అప్పుడు ఆ అమ్మాయి చేసిన సహాయం ఎంత ఇచ్చినా రుణం తీరదు అనుకుంటుంది కాంతం.
పెళ్ళి చెసుకుని వెళ్ళిపోతూ అత్తగారింటికి వెళ్తున్న ఆడపిల్లలా ఎంత ఏడుపో కాళ్ళకు దండం పెట్టి. ‘అమ్మగారూ! చిన్నతనం నుండీ తిండికీ గుడ్డకూ బాగా ఇబ్బంది పడ్దాను. పల్లెటూరు నుండి మొదలు ఇక్కడికొచ్చినప్పుడు నాకు సరైన బట్టలు లేక ఎవరింట్లో నయినా కనపడితే వాళ్ళు చూడకుండా తీసుకునేదాన్ని. కాని వాళ్లంతా నన్ను కొట్టి పని మానిపించేవారు. నువొక్కదానివే నన్ను ఏమనలేదు. నీ దగ్గర చేరాక నాకు సరైన బట్టా, కడుపుకి తగినంత తిండీ దొరికింది. ఇప్పుడు చేయమన్నా నేను దొంగతనం చేయలేను” అని అంటుంటే తన స్వార్ధం కోసం కదా ఆ రోజు దాన్ని ఏమీ అనలేదు అప్పుడూ అని తెగ ఫీలై పోయింది.
రిటైర్ అయ్యాక హైదరాబాదు వచ్చాక ఒకే అమ్మాయి చేస్తున్నది… కాని ఈ మధ్య ఆమె మానేస్తున్నప్పుడు వేరే అమ్మాయిని పెట్టుకోవాల్సి వస్తున్నది. అప్పుడు ఎదురింట్లొ పని చేస్తున్న ఆమెని అడిగితే వచ్చి చేసింది. కొద్దిగా ఎక్కువ అడిగింది కాని పని అవుతుంది కదా అని పట్టించుకోలేదు. ఎందుకంటే కాంతం పట్టుమని పది గిన్నెలు కూడా కడగలేదు. ఇల్లు ఊడ్చడం అసలే చాతకాదు. పూర్తిగా పనివాళ్ల మీద డిపెండెంట్. అందుకే వాళ్ళతో మంచిగా ఉంటూ కాలం గడుపుతుంది.
ఇంతకూ వైరల్ అయిన కథేంటంటే బాగా ఉన్నవాళ్లల్లా కనిపిస్తున్న ఒకావిడ బట్టల షాప్ కి వెళ్ళి చాలా చీరలు చూసి బాగా చవకగా ఉన్న ఒక చీర తీస్తుంది. ఎందుకంటే పనమ్మాయికి తమ ఇంట్లో పెళ్ళి సందర్భంగా పెట్టడానికి ఆ చీర కొంటుంది అన్నమాట. షాపతను అడిగితే అదే చెప్తుంది. సరే కొద్ది సేపయ్యాక అదే పనమ్మాయి అదే షాప్ కి వచ్చి “మా అమ్మగారింట్లో పెళ్ళి. ఆ అమ్మకి పెట్టడానికి కావాలి
తన స్థోమతకు ఎక్కువే అయినా మంచి చీరలు చూపించంది” అని అడుగుతుంది. అందులో నుండి మంచి చీర తీసుకుంటుంది. ఇందులో నుండి ఎవరు గొప్ప అన్న ఒక ప్రశ్న వదిలి ఆ కథ ఆగిపోతుంది. అది చదివిన దగ్గరనుండి కాంతానికి ఆ కథ చాలా గొప్పగా అనిపిస్తుంది. నిజమే కదా? పనివాళ్ళు అనేసరికి ఎందుకు తక్కువగా చూడాలి అని బాధపడుతుంది. తాను పనమ్మాయిని ఇంట్లో వాళ్ళతో సమానంగా చూసుకుంటున్న సంగతి మర్చిపోతుంది.
“మరీ ఎక్కువగా ఆలోచించకు. నువు బాగా ఉండబట్టే కదా? నీ దగ్గర బాగా చేస్తున్నారు?” అన్న కనకం మాటలను కూడా పట్టించుకోలేదు.
సరే ఒకరోజు రోజూ చేసే అమ్మాయి మానేస్తే మళ్ళీ ఎదురింటి వాళ్ల పనమ్మాయిని పిలిచింది. ఆ అమ్మాయి పాపం రాను అనకుండా వెంటనే వచ్చింది. కాంతానికి ఒక అలవాటు ఉంది. సాధారణంగా పని వాళ్ళు మానేస్తే ఆడవాళ్ళకు బాగా కోపం వస్తుంది. అదేంటో మరి కాంతానికి వాళ్ళమీద జాలి ఎక్కువవుతుంది. రాని రోజు చేసుకునేసరికి తాతలు దిగొచ్చి అయ్యో పాపం రోజూ వాళ్ళు ఇంతపని అందరిళ్ళల్లో చేయాలి కదా ఎక్కడ చస్తారు? పోనీలే పాపం ఒక రోజు రెస్ట్ టీసుకుంటారు అనుకుంటుంది.
సరే ఇంతకూ ఆ వచ్చిన అమ్మాయి మాటల్లో “అమ్మా రెండిళ్లల్లో పని పోయింది. చీటీలు కట్టుకుంటున్నాను. ఎనిమిదివేల పని పోయింది. అదే మా చెడ్డ దిగులయిందమ్మా” అని వాపోయింది. కాంతానికి తెగ జాలేసింది. వెంటనే ముందురోజు పక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా బాగా చేసే పని వాళ్ళుంటే చెప్పండి అన్న సంగతి గుర్తొచ్చింది. “ఒసే! నీ అదృష్టం బాగుంది. పక్క వాళ్ళు అడుగుతున్నారు. ఒకసారి వెళ్ళి కలువు. అవునూ నీ బిడ్డ పురిటికి ఉందన్నావుగా? కాన్పయిందా? ” అని అడిగింది.
అది సంతోషంగా “నా కూతురు డెలివరీ అయి మనవడు పుట్టాడమ్మా… నాకు ఇద్దరూ కూతుళ్ళే. ఒక కూతురికి ఇద్దరు ఆడపిల్లలు, ఇంకో కూతురికి ఒక ఆడపిల్ల. ఇప్పుడు రెండో కాన్పులో మగపిల్లాడు” అని సంతోషంగా చెప్పింది. “అమ్మా! మీ మనవడి పాత బట్టలుంటే తెమ్మని మీ అమ్మాయికి చెప్పండమ్మా” అని కూడా చెప్పింది.
వెంటనే “అయ్యో! పాపం (పాపం అనే మాట ఊతపదం. తప్పుగా అర్థం చేసుకోవద్దు అని మనవి. అమ్మమ్మ దగ్గరనుండి వచ్చింది) మగపిల్లాడు పుట్టాడా? చాలా సంతోషం. కంగ్రాచ్యులేషన్స్. పోనీలే నీ కోరిక తీరింది. ఇదిగో అవసరమవుతాయి ఉంచుకో” అంటూ ఇంట్లో ఉన్న పాత చీరలు ఇచ్చింది.
అదిగో అప్పుడొక ఆలోచన వచ్చింది. “పాపం! ఎప్పుడు పిలిచినా రాను అనకుండా వస్తున్నది. అసలే మనవడు పుట్టాడన్న సంతోషంలో ఉన్నది. ఆ మనవడికి కొత్త డ్రస్ కొనిస్తే ఇంకా సంతోష పడుతుంది కదా? అసలే ఈ మధ్య రోజూ చేసే అమ్మాయి కూతురికి పెళ్ళయ్యి వియ్యాలవారొచ్చారనో, అల్లుడొచ్చాడనో మానేస్తున్నది. ఈమె అవసరం బాగా పడుతుంది. వాళ్లని సంతోష పెడితే వాళ్ళు మనను మంచిగా చూసుకుంటారు. అని ఒక రేంజిలో ఊహించుకుంది. తర్వాత వారానికి ఇదిగో ఇలా డ్రస్ తెచ్చి సంతోషపడిపోతున్నది.
ప్రస్తుతానికి వస్తే మర్నాడు ఫోన్ చేసి ఆమెని పిలిచి డ్రస్ ఇచ్చింది. ఆ డ్రస్ చూసి చాలా సంబరపడింది ఆమె. “పని కూడా కుదిరిందమ్మా. . ఆ రోజు మీరు చెప్పిన వాళ్ళింటిలోనే” అని చెప్పింది.
కాంతానికి కూడా చాలా తృప్తిగా అనిపించింది. ”పోనీలే పాపం. నీకు కొంత ఇబ్బంది తగ్గింది. ” అన్నది. ఇంకో కుళ్ళు ఆలోచన కూడా వచ్చింది. ఇప్పుడు ఇల్లు కూడా కుదిరించింది కాబట్టి ఇక అవసరమైతే పిలిస్తే తప్పకుండా వస్తుంది. అని సెక్యూర్ ఫీల్ అయింది. పనిమనిషి రాకపోవడం అనేది కాంతం వరకు ప్రాణాపాయ సమస్య మరి.
ఆ తర్వాత ఒక నాలుగు రోజులకు అనుకున్నట్లుగానే రోజూ వచ్చే అమ్మాయి “మా అల్లుడొస్తున్నాడమ్మ. నేను రెండు రోజులు రాను” అని చెప్పింది. కాంతం ఏమి కంగారు పడలేదు ఇప్పుడు. “బాగా మర్యాద చేసుకో నీ అల్లుడికి. రెండు రోజులు కాకపోతే ఇంకో రెండు రోజులు తీసుకో…” అని చాలా కులాసాగా చెప్పింది.
ఆ రోజు సాయంత్రం రాను అనే అవకాశం లేదు అన్నంత ధీమాగా ఫోన్ అందుకుని నీలమ్మ నంబరు నొక్కింది” నీలమ్మా! మా మంగ రెండు రోజులు రాదట. రేపటినుండి పొద్దున్నే రా” అని చెప్పింది.
“అయ్యో! నాకెట్టా కుదురిద్దమ్మా? మొన్న కొత్తగా పట్టుకున్న రెండు ఇళ్ళ వాళ్ళకూ పొద్దున్నే ఎళ్ళాల. ఆళ్ళూరుకోరమ్మా ఆలస్యంగా ఎళ్తే. కావాలంటే అందరిళ్లూ చేసాక వస్తానమ్మా… కాని అప్పుడు నువుండవు కదా? మరెట్టాగమ్మా? ” అని ఎదురు ప్రశ్నించింది.
కుదరదు అన్న మాట వింటూనే చేతిలోని ఫోన్ జారిపోయింది కాంతానికి. అప్పుడే టీవీ లో “అనుకున్నదొక్కటీ!. . అయినది ఒక్కటీ. . బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా” అన్న పాట వస్తోంది. టీవీ వాళ్లది భలే టైమింగ్ మరి….
.

1 thought on “అనుకున్నదొక్కటీ. అయినది ఒక్కటీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *