May 26, 2024

అమ్మజోల

రచన: నాగజ్యోతి రావిపాటి

అద్ధరాత్రి 12 గం అవుతున్నా నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లాడిని విసుకుంటూ పక్కగదిలోకి వెళ్లి పడుకున్నాడు శేఖర్. అనితకు ఏమి చేయాలో పాలుపోక ఫోన్లో ఇంగ్లీష్ లల్లబై పెట్టింది. కొద్దిసేపటికి నెమ్మదించిన కొడుకుని చూసి హమ్మయ్య అనుకొని పడుకోబెట్టి . . పాటని అలవాటు చేసిన తల్లి జయంతిని విసుక్కుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు తీర్థయాత్రలకని వెళ్లిన తల్లి ఫోన్ చేయగానే పిల్లాడిని నిద్రపుచ్చడానికి తను పడిన అవస్థలు చెప్తూ ఇంకా రెండు రోజులకు కానీ తను తిరిగి రాదని తెలిసి మరింత అసహనానికి లోనయ్యింది.

జయంతి కూతురు అనితకు చిన్నప్పడు తెలుగు శ్లోకాలు, కథలు మరియు ఆ భాషలోని మాధుర్యం గురించి చెబుతూ ఉండేది. శాస్త్రీయ సంగీతం కూడా నేర్పించేది. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని కూతురు అనితకు ఎంత చెప్పినా వినేది కాదు. తల్లి బలవంతం మీద సంగీతం నేర్చుకోవటం తప్ప తనకు తానుగా ఇష్టపడిందిలేదు. పెరిగేకొద్దీ తల్లిది ఒట్టి చాదస్తం అని కొట్టిపారేస్తూ కాన్వెంట్ చదువుల వ్యామోహంలో తెలుగు మాట్లాడటమే మర్చిపోయింది. ఎప్పుడూ ఇంగ్లీష్ పాటలు వింటూ తనకు నచ్చిన వెస్టర్న్ డాన్స్ క్లాస్ కి వెళ్ళేది. ఎప్పుడూ మోడ్రన్ గా ఉండాలని తాపత్రయం ఉండేది అనితలో. ఈ కాలం పిల్లలు మాట వినే వారు కాదని కూతురు ఇష్టం కాదనలేక మిన్నకుండేది జయంతి.

పై చదువుల కోసం హాస్టల్ లో ఉండేది. ఇంక తన ఇష్టానికి అడ్డు చెప్పేవారే లేరు. అనితకు చదువు అయిన వెంటనే మంచి ఉద్యోగం రావటంతో ఎప్పుడూ వర్క్ లో బిజీగా ఉండటం. . ఖాళీ దొరికితే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళటం లేదంటే సినిమాలు చూడటం తప్పించి మళ్ళీ ఎప్పుడూ సంగీత సాధన చేసింది లేదు.

మంచి సంబంధం రావటంతో శేఖర్ తో పెళ్లి చేశారు. పెళ్ళైన 3 సంవత్సరాలకు పిల్లాడు పుట్టాడు అది కూడా తల్లి పదే పదే కెరీర్ కోసం పిల్లల్ని కనటం ఆలస్యం చేయవద్దని ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని పోరు పెట్టడంతో. అనితకి బాబు పుట్టి 6 నెలలు అవుతుంది. . ఇన్ని రోజులు తల్లి జయంతి దగ్గర ఉండి వాడి ఆలనాపాలనా చూసుకుంది. బంధువులు అంతా కలిసి వారం రోజుల తీర్థయాత్రలు ప్రోగ్రాం వేసుకుని జయంతిని కూడా తీసుకువెళ్లారు. అనితకు బాబుని చూసుకోకు తప్పలేదు.

అమ్మమ్మ మాటకు, ఆమె పాడే పాటకు అలవాటు పడిన పిల్లాడిని ఎలా సముదాయించాలా అనితకు అర్ధం కావటం లేదు పైగా శేఖర్ వాడిని చూసుకోవటం రాకపోతే ఎలా అని తనకే చెప్తున్నాడు. ఇంక తనకు తప్పదు అనుకుని తల్లి పాడే జో అచ్యుతానంద పాడుకుంటూ వాడు నిద్ర లేచే లోపు వంటింటి పని ముగించాలని అనుకుంది. అలా పని చేస్తూ తను చిన్నప్పుడు నేర్చుకున్న పాటలన్నీ పాడుకుంది. . తను నేర్చుకున్నవి ఏవి కూడా మర్చిపోలేదు కాస్త సాధన తగ్గింది అంతే అనుకుని మురిపెంగా కొడుకుని ఎత్తుకుంది. బుజ్జిగాడు చేసే అల్లరి, చిలిపి పనులు చూసి ఎంతో ఆనందంగా వాడిని చూసుకోవడం మొదలుపెట్టింది. తల్లి ఎంత చెప్పినా దగ్గరకు తీసుకునేది కాదు. ఇప్పుడు వాడు వేలు గట్టిగా పట్టుకుని అడుకుంటుంటే, తను చెప్పే మాటలు శ్రధ్ధ గా ఆలకిస్తూ ఉంగాలు చెబుతుంటే ఆశ్చర్యంగాను ఉంది ఆనందంగాను ఉంది అనితకు . ఒక్క క్షణం కూడా వాడిని వదిలిపెట్టడంలేదు.

శేఖర్ రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి అనిత ఒడిలో నవ్వుతూ ఆడుకుంటున్న కొడుకుని ఎత్తుకోబోయాడు.
ముందు స్నానం చేసి రండి అంటూ అతనిని పంపింది. భోజనాలు అంతా అయ్యాక వాడితో ఆటలు ఆడి నేను పడుకుంటా అని రూమ్ లోకి వెళ్ళాడు శేఖర్. అనిత పాట వింటూ ఏడుపు లేకుండా హాయిగా నిద్రపోయాడు బుజ్జిగాడు. వాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి శేఖర్ దగ్గరకు వెళ్ళింది మనసులో మాట చెప్పాలని. . తన కోసమే ఎదురుచూస్తున్నట్లు అన్నాడు శేఖర్. . నీ పాటతో మాయ చేశావ్ వాడిని . . నన్ను కూడా అంటూ హత్తుకోబోయాడు. ఆగు శేఖర్ నేను ఒక విషయం చెప్పాలి అంది. చెప్పండి శ్రీమతి గారు అని శేఖర్ అంటుంటే. . నేను ఇంట్లో ఉండి బాబుని చూసుకుంటాను శేఖర్. వర్క్ ఫ్రొమ్ హోమ్ ఆప్షన్ ఉండేలా చూసుకుంటాను. . . అని అనిత చెప్పిన మాటకు సంతోషంగా సరే అన్నాడు.

ఇంక 2 నెలలలో తన లీవ్ ముగుస్తుందని అనిత ప్రాజెక్ట్ లీడ్ తో మాట్లాడి అవసరం అయితే ఆఫీస్ కి వెళ్లేలా తన వర్క్ మార్చుకుంది. తల్లి జయంతి రాగానే కూతురు తీసుకున్న నిర్ణయానికి తల్లి అయిన తర్వాత తన కూతురు ఆలోచనలో వచ్చిన మార్పును చూసి తన పడిన శ్రమ వృధా పోలేదని సంబరపడింది జయంతి.

5 thoughts on “అమ్మజోల

  1. చాలా బాగుంది అమ్మ ప్రేమ, ఇప్పుడిప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది, ఇంట్లో ఉండి చక్క గా భర్తను, పిల్లలని చూస్కుంటే బాగుండని…

  2. అమ్మలోని మాధుర్యాన్ని, బిడ్డల గురించి తాను పడే కష్టాల గురించి చాలా సున్నితంగా వివరించడమే కాక నేటి సమాజం మర్చిపోతున్న, కోల్పోతున్న సాంప్రదాయాలు మరియు భారతీయ కళల గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణించారు…
    ఇలాంటి కథలు ఇంకా రాయాలని కోరుతున్నాను.

  3. తల్లి బిడ్డకు మధ్య వారధి పాట
    పాటలో.తల్లి మాటలనే వింటాడు
    అదే కథనంగా మలిచిన నాగజ్యోతి గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *