May 25, 2024

*అమ్మ తత్వం*

రచన: లక్ష్మీ రాజశేఖరుని

అమ్మ గొంతులో ఉందో, పాటలో ఉందో ఆ మధురిమ, లీనమై పోతుంటాను విన్న ప్రతిసారి ఆ లాలి పాటలో. ఎప్పుడు నిద్రలోకి జారుకునే వాడనో తెలియదు. అదే లాలి పాట మళ్లీ ఇప్పుడు నా కొడుకు కోసం అమ్మ పాడుతోంది. నాకంటే వాడే అదృష్టవంతుడు అనిపించిందో క్షణం. ఆ జ్ఞాపకాలు ఒకటొకటిగా బాల్యపు తలుపులు తడుతుంటే అప్రయత్నంగానే చిన్నతనంలోకి పరిగెడుతోంది మనసు.

ప్రతి కొడుక్కి అమ్మ దేవతలా కనిపిస్తుంది. కానీ మా అమ్మ నాకు ఎప్పటికీ దేవత. అమ్మ పాట వింటేనే నిద్ర పోయే వాడిని. పాట కోసమే నిద్ర పోయే వాడిని. ఒక్కోసారి నేను నిద్రపోక ముందే అమ్మ పాట ఆగిపోయేది. అంటే నాన్న ఇంటికి వచ్చాడని అర్థం. నాన్నకు పాటలంటే ఇష్టం ఉండదు. అమ్మ పాడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నాన్న రాకముందే నిద్రపుచ్చేది నన్ను. అలా నిద్ర పోనప్పుడు అమ్మ గాజుల శబ్దమేలాలి పాటలా వినిపించేది. అమ్మ పాటలోని తన బాధ,ఆనందం అన్ని వినపడేవి. అమ్మ కళ్ళలో నీళ్ళు చూసినప్పుడల్లా చాలా కోపం వచ్చేది నాన్న మీద. నానమ్మ కూడా ఎప్పుడూ అమ్మను ఏదో ఒకటి అంటూ ఉండేది. అమ్మ తిరిగి పల్లెత్తు మాట అనేది కాదు.

మంచిచెడులను మాత్రమే కాదు, కోపాన్ని జయించడం కూడా అమ్మ నుంచే నేర్చుకున్నాను. నేను ఏదైనా అంటే పెద్ద వాళ్ళు ఒక మాట అంటే పడకూడదా నాన్న, రేపు నువ్వు నన్ను అలాగే అంటావా అని నవ్వుతూ ప్రశ్నించేది. అమ్మతో వాదించిన ఎప్పుడు నేను గెలవలేదు. అమ్మ నాకు ఎప్పుడూ చెప్పేది, ఎదుటి వాళ్ళని గెలవాలంటే మాటలతో మాత్రమే కాదు, కొన్నిసార్లు మౌనంతో కూడా గెలవచ్చు అని. అమ్మ ఒక నడిచే గ్రంథాలయంలా అనిపించేది నాకు. నిజమే తన సహనం తోటే అందరి మనసు గెలిచింది. ఎవరిని మెచ్చుకోని నాన్నమ్మ కూడా అమ్మని పొగడడం విన్నాను. మూర్ఖంగా ఉండే నాన్న కూడా అమ్మ నొచ్చుకోకుండా మాట్లాడ్డం చూశాను. ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. తను ఎన్ని కన్నీళ్లను మోసిందో, ఎంత బాధ దిగమింగినదో, గాయపడ్డ ప్రతిసారి మూగబోయిన లాలిపాటలో నేను విన్నాను. సహనం తనకు ఆయుధం. మౌనం తనకు వరం. అలాంటి అమ్మ కూడా నన్ను,చెల్లిని పెంచడంలో ఎంతో కచ్చితంగా ఉండేది.

మేము తనకెంత అపురూపమో అంతే నిక్కచ్చిగా ఉండేది. మా చిన్నప్పుడు మాకు సంబంధించిన అన్ని నిర్ణయాలు అమ్మే తీసుకునేది. ఒక వయసు వచ్చిన తర్వాత సలహాలు మాత్రమే ఇచ్చేది. అదైనా అడిగితే. అమ్మకు సంస్కారం తెలుసు, తన హద్దులు తెలుసు. అందుకే అమ్మ ఎప్పటికీ నాకు అద్భుతమే.

నా పెళ్లి తర్వాత చాలా భయపడ్డాను. అమ్మ చాలా సున్నిత మనస్కురాలు. నా భార్య వల్ల నొచ్చుకున్నా ఎవరితో చెప్పదు. తనే బాధపడుతుంది. నా భార్య గడుసుగా ప్రవర్తించిన సందర్భాలు లేకపోలేదు. అమ్మ ఔన్నత్యం, సహనం తనని కూడా మార్చేశాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు. మంచితనంతో అమ్మ ఎవరినైనా గెలవగలదు. నాకు లాలి పాట పాడుతుంటే విసుక్కున్న నాన్న ఇప్పుడు అమ్మ పాటని ఆస్వాదిస్తూ పడక్కుర్చీలో పడుకుని నిద్ర పోతున్నారు. నా కొడుకు అమ్మ గొంతులోని మాధుర్యం లాలిపాటలా ఆస్వాదిస్తున్నాడు. అమ్మ గొంతు ఇంకా మధురంగా వినిపిస్తోంది.

సంతోషాన్ని కూడా తట్టుకోలేకపోయిందేమో అమ్మ గుండె, అమ్మ కుప్పకూలిపోయింది. పాట ఆగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే, అమ్మ గొంతు అనంత లీనమైపోయింది. అప్పుడు చూశాను బేలగా ఉన్న నాన్న ముఖంలో అమ్మపై కొండంత ప్రేమని. ఇప్పుడు అమ్మే గెలిచింది. అమ్మ మరణం నన్ను నాన్నని బాగా కుంగదీసింది. నాన్న ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి తీసుకు వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఇంట్లోంచి వినపడుతోంది లాలి పాట అదే పాట అమ్మ పాట.

ఇద్దరం పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాం. నా భార్య బాబుని నిద్రపుచ్చుతూ పాట పాడుతోంది. మా కళ్ళల్లో ఆనందం చూసి తను ఆశ్చర్య పోయింది. మీకు అత్తయ్యగారు గుర్తొచ్చి బాధపడతారని ఇన్ని రోజులు చిన్నగా పాట పాడి నిద్రపుచ్చుతున్నాను. బాబు ఈ పాట పాడందే నిద్ర పోవడం లేదని చెప్పింది. బాబు ని గట్టిగా గుండెలకు హత్తుకున్నాను. పాటలో మా అమ్మని బతికించినందుకు. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను లాలి పాడి నిద్రపుచ్చే ప్రతి అమ్మలో మా అమ్మని బ్రతికించినందుకు. ఆ మరుసటి రోజు అమ్మ పాటనీ నాన్న గొంతులో విన్నాను మా బాబుకి జోలపాడుతూ. అమ్మ మళ్లీ గెలిచింది.

7 thoughts on “*అమ్మ తత్వం*

 1. చాలా బాగా వ్రాసారు అమ్మ గురించి. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

 2. మీ కథ ద్వారా తల్లీబిడ్డల అనుబంధాన్ని చాలా హృద్యంగా వర్ణించారు .

 3. అమ్మ గొప్పతనానికి ఎన్ని మాటల్లో వర్ణించినా సరిపోదు…
  మీరు ఈ చిన్న కథలో నా కళ్ళలో నీళ్లు తెప్పించారు.
  చాలా బావుంది మీ కథ!
  ఎప్పటికైనా అమ్మే గెలుస్తుంది ఏ బిడ్డకైనా

 4. అమ్మ మాట పాటగా పలికించి
  మీ కలంలో కథలో జీవం పోసుకుంది.
  చాలా బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *