June 14, 2024

కౌండిన్య కథలు – బద్రి

రచన: కౌండిన్య (రమేష్ కలవల)

ఆ ఊరులో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ జరుపకోవడం ఓ ఆనవాయితి. ఆ ఇంటి ముందు ఎద్దులబండి ఆపి ఒకాయన లోపలకు వెళ్ళాడు. పెరట్లో మంగయ్య గారు ఒళ్ళంతా నూనె రాయించుకుంటూ, అటూ ఆయన రావడం చూసి, ఆ ధాన్యం బస్తాలను జాగ్రత్తగా లోపల పెట్టించమని కసురుతున్నారు. లోపల నుండి వచ్చిన ఇల్లాలు అది చూసి, “ఇదిగో ఈ సంవత్సరం కూడా పందాలతో వీటిని మట్టి కలిపావంటేనా చూడు మరి” అంటూ ఆ చీపురు చూపించి మరీ లోపలికి వెళ్ళింది. “ఓ సోస్.. మొత్తం మంట కలిపాను అంటారేంటిరా అమ్మగారు.. “అన్నాడు ఆ నూనె రాసేవాడితో. “సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పండగ, అపుడే కదా కోళ్ళ పందాలు.. సందడీనూ…. మరి పండగన్నాక ఆటలాడ కుండా ఉంటారేంటిరా … అసలే పరువుకు తగ్గ విషయం…” అంటూ ఉండగా ఆ నూనె రాసే వాడికి కూడా పందాలు గుర్తుకొచ్చి, ఆవేశం వచ్చి, గట్టిగా భుజాల మీద మర్థన చేయబోయి నొక్కడంతో, ఆ కూర్చున్న కుర్చీ కాస్తా విరిగి కింద పడ్డాడు.నవ్వుతూ లేచి మంగయ్య గారు, “దీని తస్సాదియ్యా.. సరిగ్గా సమయానికి విరిగింది, రేపు భోగి మంటలో పడేయడానికి పనికొస్తుంది …” అన్నాడు.
“ఇదిగో ..వేడి నీళ్ళు కాగాయా బాయిలర్లో ..” అని అరిచాడు. “ఆ కాగాయి …దయచేయండి అంది కోపంతో. సర్లేరా నువ్వు రేపు తొందరగా వచ్చేయ్..” అంటూ ఆ నూనె రాసే వాడిని పంపి, స్నానానికి వెళ్ళాబోతూ భార్యతో వాళ్ళ ఇల్లు ఆనుకొని ఉండే పక్కింట్లో శంకరం బాబుగారి కొడుకు గురించి వెటకారంగా ప్రస్తావన చేస్తూ …” వాళ్ళ అబ్బాయి .. ఈ సంవత్సరమైనా వస్తున్నాడా? వ్యవసాయం నేర్పించండి మీ అబ్బాయికి అంటే చదువులు నేర్పించాడు…. వాడేమో మళ్ళీ వీళ్ళకు మొహం కూడా చూపించలేదు… కళ్ళ ముందు పడి ఉండే వాడు కదా ..” అంటుంటే ఇంతలో ఆవిడ జోక్యం చేసుకొని, “వాళ్ళ సంగతి మనకెందుకు లేండి, మీరు స్నానం చేసి రండి “ అంటూ పంపింది భార్య. ఈ సంవత్సరమైనా మనం పండగ సరిగ్గా చేసుకుంటే అదే పదివేలు అంది.
“అయినా ఎందుకో వస్తాడని అనిపిస్తోంది” అనడంతో, “నాతో పందాలు కాయకు” అన్నాడు మంగయ్య. ”నేను పందెం కాయట్లేదు మీలాగా వస్తాడేమో అనిపిస్తోంది” అంది ఆవిడ. ఆయనకు పందాలు కాయడం అలవాటు కదా, ఆవిడతో “వాళ్ళ అబ్బాయే కనుక వస్తే నేను ఈ సంవత్సరం కోడి పందాలు కాయను సరేనా “అన్నారు. “ఏదో అన్నాను కానీ ఆ అబ్బాయి రావటం, మీరు పందాలు ఆపడం రెండు అయ్యేవి లాగా కన్పించటం లేదు గానీ మీరు స్నానానికి పదండి” అంది ఆవిడ.
పక్క ఇంటిలో ఆరు బయట గుమ్మంలో కూర్చున్న నిర్మలమ్మ తన పక్కన పడకకుర్చీలో కూర్చున్న శంకరంగారితో “ఏమండి.. ఈ ఏడాదైనా వస్తాడంటారా? “ అని అంటోంది.” ఎవరూ … బద్రీ నా?… సరేలే.. మనవాడు వెళ్ళి పదిహేనేళ్ళు అయ్యింది ఒక్కసారైనా మొహం చూపించాడా? అనవసర ప్రశ్నలూ నువ్వునూ.. “అన్నారు శంకరం గారు. “వాడి సంగతి పక్కన పెట్టు… ఇద్దరం పెద్దవాళ్ళం అవుతున్నాం… మనకు ఏదైనా అయితే చూసే నాధుడు లేడు..”అన్నారు భార్యతో. “అదీ కాదండి ఇంకో వారంలో భోగి, సంక్రాంతి వస్తున్నాయి కదా ఎందుకో భోగి అనగానే వాడు గుర్తుకు వచ్చాడు” అంది.
ఎన్నో ఏళ్ళుగా ప్రతి సంవత్సరం బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళడం ఓ ఆనవాయితి. ఆ స్వామి పేరే పెట్టారు ముద్దుల కొడుకుకి. వీళ్ళకు ఇంకా ముద్దుల కొడుకే కానీ రెక్కలు వచ్చీ రాగానే విదేశానికి ఎగిరి పోయిన పక్షేమో బద్రి. ఎన్నాళ్ళ నుండో ఇద్దరూ ఎదురు చూపులు చూస్తున్నారు ముఖ్యంగా తల్లి నిర్మలమ్మ. కొడుకు మీద మమకారం ఇంకా చంపుకోలేదు, ఎంతైన సొంత కొడుకు కదా, ఎక్కడో గుండె లోతులలో ఆవిడకు అనిపిస్తుంది ఏదో రోజు తిరిగి వస్తాడని. మనసులో నిరాశతో బతికే కంటే ఆశతో ఎదురుచూస్తూ, ఆ భగవంతుడు ఏదో రోజు తన మొర వినకపోతాడా అన్న ధృఢ విశ్వాసంతో ఉంది నిర్మలమ్మ.
ఇంతలో సన్నాయి శబ్ధం ఆ వీధి మొదలులో వినిపించడంతో హడావుడిగా లోపలికి వెళ్ళింది నిర్మలమ్మ. ఓ చీర, గిన్నెలో కొంచెం బియ్యం తీసుకొచ్చింది. ఆ చేతిలో చీర చూసి “అన్నీ అలా దానం చేయకు “ అన్నారు శంకరంగారు. “పాతదే లేండి … అంటూ ఆ గంగిరెద్దు దగ్గరకు రాగానే వెళ్ళి, ఓసారి దానికి మొక్కి, ఆ చీర మీద వేసి, దానితో “ఇదిగో … మా బద్రి ఈ సంవత్సరమైనా వస్తాడంటావా” అని అడిగింది. గంగిరెద్దు యజమాని సన్నాయి ఊదాడు, దానితో సంభాషణ మొదలు పెట్టి, “ధర్మదేవత తల్లి ఏమంటందో చెప్పు “అని దానిని అడిగి ఢమరుకం వాయించాడు. ఆ గంగిరెద్దు తన కాలి డెక్కలు నేల మీద కొడుతూ, కాళ్ళకు కట్టిన గజ్జెల శబ్థం చేస్తూ, ఆ తల పైకి కిందకి ఊపింది, దానికి ఆ కొమ్ముల మీద కట్టిన సిరిమువ్వలు, మెడలో గంటలు చేసే గలగల శబ్థం చేస్తుంటే, ఆ యజమాని నిర్మలమ్మ వైపుకు చూసి “ధర్మదేవత నీ కొడుకు తప్పక వస్తాడు అంటోంది తల్లి” అన్నాడు. వెంటనే నిర్మలమ్మ శంకరం గారి వైపుకు తిరిగి “చూసారా… మనవాడు తప్పక వస్తాడుట” అంది నిర్మలమ్మ ఆ బియ్యం ఆయన సంచిలో పోస్తూ. శంకరంగారు పెద్దగా పట్టించి కోలేదు. బద్రీ ఆలోచనతో సంతోషంగా వీధి చివర వరకూ ఆ గంగిరెద్దును చూస్తూనే ఉంది. మనసులో ఆ భద్రీనాధుడైన విష్ణుమూర్తిని తలుచుకుంది.
తరువాత రోజు తయారై శంకరం గారు బయటకు బయలు దేరుతుంటే మంగయ్య గారు కనపడి “ఊర్లోకేనా వెళ్ళేది పదండి నేను అటే వెడుతున్నా “ అన్నారు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. దారిలో బద్రి ప్రస్తావన రావటంతో శంకరం గారు ఇంకా ఎలాగూ వచ్చేలాగా లేడు కాబట్టి తనకున్న పొలం ఖాళీ గా ఉండేకంటే విక్రయానికి పెడదాం అనుకుంటునట్లు చెప్పారు మంగయ్యతో. పండగ అవ్వగానే దాని సంగతి చూద్దాం అన్నారాయన. వారి సంభాషణలతో నడుచుకుంటూ ఊరిలోకి వెడుతండగా ఓ విదేశీ వనిత, ఒక బాబు దిగి ఫలానా వాళ్ళ ఇల్లు గురించి వాకబు చేయడంతో మంగయ్య గారు ఆ బాబు ను చూసి “వీడేంటి అచ్ఛం మీ బద్రి లానే ఉన్నాడు” అన్నాడు. ఇంతలో ఆ బాబు తల్లి చెవుల దగ్గర ఏదో అనడంతో, ఆ బాబు శంకరం గారి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. అప్పుడు తట్టింది ఆయనకు, అటూ ఇటూ చూసాడు ఎక్కడైనా ఆ బాబు తండ్రి బద్రి కనిపిస్తాడేమోనని, అది గమనించిన ఆవిడ ఏదో చెప్పడంతో తను రాలేదన్న సంగతి అర్థమయ్యింది. సైగలతో సంభాషణలు తప్ప ఇరువురికి భాష రాకపోవడం తో శంకరం గారు, మంగయ్య గారు వారిని వెంటపెట్టు కొని ఇంటికి బయలు దేరారు.
అక్కడకు చేరి నిర్మలమ్మ గారిని పిలవడంతో ఆవిడ బయటకు వచ్చి కొంత సేపటి వరకూ తేరుకోలేదు. కొంత సేపటికి తేరుకొని బాబును ముద్దాడి ఇద్దరిని లోపలకు తీసుకొని వెళ్ళింది. బద్రి ఏడి అన్నట్లు సైగలు చేసింది ఆ తల్లితో ఆవిడి ఆ పిల్లవాడిని చూపించింది. కాతీ అని తనను తాను పరిచయం చేసుకుంది.
తరువాత రోజు నుండి పండగ వచ్చే వరకు రోజూ పిండి వంటలు, చలి మంటలు, గాలి పటాల ఎగరేయటాలు, గుడి దర్శనాలు, రంగవల్లుల అల్లికలు, ఇళ్ళు అలంకరణలు అన్నీ అవుతున్నాయి. ఒకవైపు సంతోషం, ఇంకో వైపు ఆందోళన. వచ్చీ రాని భాష, సైగలతో ఒకరి కొకరు మధుర క్షణాలు గడుపుతున్నా, బద్రి సంగతి సరిగా తెలియక పోవడంతో, ఊరిలో అడిగిన వారితో తోచినట్లుగా పండగకు వస్తున్నాడు అని సర్థి చెబుతున్నారు ఇద్దరూ. మంగయ్య గారికి పందెం గెలిచినట్లా, ఓడినట్లా అర్థం కావడం లేడు, ఆయనకు ఈ ఆలోచనలతో నిద్ర పట్టక కాలు కాలిన పిల్లిలా శంకరం గారి ఇంటి వైపు పదే పదే తొంగి చూడటం సరిపోతోంది రోజంతా. కోడి పందాల మీద ధ్యాసే లేదు కానీ తన భార్యతో కాచిన పందమే ఆయనకు పెద్ద సమస్యగా మారింది. మంగయ్య గారి భార్య కూడా నిర్మలమ్మ గారిని ఏదో సందర్భములో కలిసినపుడు అడిగి అడగనట్లు గా అడిగి ఓదారుస్తూనే ఉంది.
భోగి రోజు రానే వచ్చింది. కొడుకు కోసం ఎదురు చూడని క్షణం లేదు, ఆ గుమ్మం వైపు పదే పదే చూడటంతో పనులు కూడా మందకోడిగా సాగుతున్నాయి. కాతీ అంతా గమనిస్తూనే ఉంది, పరిస్తితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. నిర్మలమ్మ గారు మనవడికి భోగిపళ్ళు పేరంటానికి ఊరిలోఅందరినీ పిలిచారు. కాతీ, ఆ పిల్లవాడు కూడా సాంప్రదాయంగా, పద్దతిగా తయారు అవ్వడంతో వచ్చిన వారందరికీ మరీ ముచ్చట వేసింది. చుట్టు పక్కల పిల్లలని కూడా పాలు పంచుకున్నారు. భోగి పేరంటం ముచ్చటగా గడిచింది, చాలా రోజుల తరువాత శంకరం గారింట్లో అలా జరగడంతో ఊర్లో అందరూ సంతోషించారు, బద్రి రాగానే ఇంటికి తీసుకొని రమ్మని మరీ చెప్పి వెళ్ళారు. నిర్మలమ్మ బుర్రైతే ఊపింది, మనసులో ఎవరికీ చెప్పుకోలేని బెంగ మాత్రం తనను ఉక్కిరి బిక్క చేస్తోంది.
తరువాత రోజు సంక్రాంతి. పొద్దున్నే లేచింది నిర్మలమ్మ. పక్కింటి ఆవిడ కూడా లేచారు నిర్మలమ్మతో భోగి పేరంటం కబుర్లతో పని చేసుకుంటున్నారు. ఇంతలో కాతీ, పిల్లవాడు, శంకరం గారు లేచారు, కాలక్రృత్యాలు తీర్చుకొన్నారు. ఫలహారాలు తీసుకున్నారు. శంకరం గారు ఇంటి ఆరు బయట కూర్చున్నారు. వీధిలో సన్నాయి శబ్థానికి పిల్లవాడు పరిగెత్తుకొచ్చాడు. గంగిరెద్దుల వాడు పిల్లవాడి ముంది దానిని ఆడిస్తున్నాడు. కాతీ కూడా అది చూస్తూ మురిసిపోతోంది. నిర్మలమ్మ గారు బెరుకుగా బయటకు వచ్చి చీర , బియ్యం తీసుకొచ్చి కాతీ తో ఇప్పించారు. ఇంతలో హరిలో రంగ హరి అంటూ రానే వచ్చారు హరిదాసు గారు. హరి నామస్మరణతో, నృత్యం చేస్తూ , భక్తి పాట పాడటం మొదలు పెట్టడం తో నిర్మలమ్మ గారు మళ్ళీ భిక్ష తీసుకు రావటానికి లోపలకు వెళ్ళారు. ఆవిడ బయటకు రావడం చూసి హరిదాసు వంగి అక్షయ పాత్ర చూపించారు. ధ్యాస ఎక్కడో ఉండటంతో సరిగా చూడనే లేదు, కృష్ణార్పణం అంటూ “వచ్చాడా మీ బద్రీనాదుడు” అన్నాడు. నిర్మలమ్మ కు అర్థం అయ్యింది. “ఓ రేయ్ బద్రి …. “అంటూ కౌగలించుకుంది. జాగ్రత్తా. అక్షయ పాత్ర అంటూ అది పక్కన పెట్టి నాన్న శంకరం గారి పాదాభివందనం చేసాడు. శంకరం గారు ఒక్కసారిగా లేచి కౌగలించుకున్నాడు.
కాతీ, పిల్లవాడు కేరింతలకు, సందడి చూసి పక్కింటి మీద కన్నేసిన మంగయ్య గారు బయటకు వచ్చి బద్రిని చూసి దీనంగా “ఈ సంవత్సరం కూడా పందెం ఓడాను బాబు” అన్నాడు. “చాల్లేండి మీ పందాల గోల అంటూ బద్రి ఏలా ఉన్నావు ఇన్నేళ్ళకు గుర్తుకు వచ్చామా నీకు?” అంటూ చెవి పట్టుకొని లాగింది. “క్షమించమని పదే పదే “అన్నాడు. “ఇంతకీ మీ అబ్బాయి పేరేంటి?” అని అడిగింది. “నా పేరే!” అన్నాడు. అందరూ సంతోషంతో సంక్రాంతి సంబరాలతో, కనుమ కనువిందుగా, సుఖంగా గడిపారు. నిర్మలమ్మ బద్రీనాధుడిని తలుచుకొని త్వరలోనే అందరం కలిసి నీ దర్శనానికి వస్తామని మనసారా తలుచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *