June 25, 2024

చీకటి మూసిన ఏకాంతం – 10

రచన: మన్నెం శారద

సుభద్రా నర్సింగ్ హోం ఏ హడావుడులూ లేకుండా అతి నిరాడంబరంగా చిన్న పూజా కార్యక్రమంతో తెరిచింది నిశాంత.
ఆ విషయాన్ని తల్లిదండ్రులకి గాని- సాగర్ కి కాని తెలియజేయలేదు. ఉన్న డబ్బుతో కావాల్సినంత వరకే ఎక్విప్మెంటు కొని నడపడం ప్రారంభించింది. ఇల్లూ, హాస్పిటల్ ఒకటే కావడం వలన ఆమెకి తిరిగే శ్రమ కూడ తప్పింది.
సాగర్ మాత్రం ఆమె నంబరు తెలుసుకొని ఫోను చేసేడు.
“సారీ నిశాంతా! నీకు మొహం చూపించే శక్తి లేదు నాకు. నువ్వు డిస్పెన్సరీ తెరిచేవట! కంగ్రాట్స్!” అన్నాడు.
“ఏదో జీవనభృతికి చేయాలి కదా!” అంది నిశాంత నవ్వుతూ.
“నేనెప్పుడైనా రావొచ్చా?”
“షూర్! ఇక్కడ ఇంకోలా ఆలోచించే వ్యక్తులెవరూ లేరు.” అంది నవ్వుతూ.
నిశాంత రిసీవర్ క్రెడిల్ చేస్తుంటే బయట గొడవగా వినిపించి గబగబా గుమ్మంలోకొచ్చింది.
సుభద్రమ్మ రోడ్డు పక్కన పడివుంది. ఆమె నొసలు పగిలి రక్తం కారుతోంది.
నిశాంత గుమిగూడిన జనాన్ని తప్పించుకొని ఆమెని వళ్ళోకి తీసుకుంటూ “ఏం జరిగింది?” అనడిగింది ఆతృతగా‌.
“మేం చూడలేదు. ఒక కారు కొట్టేసి పోయింది” అన్నారొకరు.
“లేదు. ఈవిడేదో దెబ్బలాడటం చూశాం” అన్నారింకొకరు.
నిశాంత ఆమెని డిస్పెన్సరీలోకి తీసుకెళ్ళి ట్రీట్‌మెంటు చేసింది. వారం రోజులు స్పృహ రానేలేదు సుభద్రమ్మకి.
తన దురదృష్టానికి మొదటిసారి దుఃఖం పొంగుకొచ్చింది నిశాంతకి. తనకేదో ఒక తోడు దొరికిందంటే దేవుడిలా చేసాడనుకొంది బాధగా.
చివరికి సాగర్ ని రమ్మని ఫోను చేసింది.
సాగర్ వెంటనే వచ్చి ఆమెని పరీక్షించాడు. ఎందుకైనా మంచిదని ఆమెని గవర్నమెంటు హాస్పిటల్లో జాయిన్ చేసేరు.
ఒక నెల రోజుల తర్వాత ఆమె కోమాలోంచి బయటపడింది. నిశాంత సంతోషంగా ఆమెనింటికి తీసుకొచ్చింది.
అయినా సుభద్రమ్మ పూర్తిగా మెంటల్ గా కోలుకోలేదు.
“వాడు నీచుడు! నన్నే కారుతో కొట్టి వెళ్ళిపోయేడు. నిన్ను మోసం చేసేడు. బాగుపడడు! సర్వనాశనమవుతాడు!” అనేది ఆవేశంగా.
“ఏంటత్తయ్యా. ఏం జరిగింది?” అనడిగేది నిశాంత.
“ఏం జరగాలి! అంతా జరిగిపోయింది!” అనేడ్చేది ఒక్కోసారి.
ఆమెను కారు డాషిచ్చి వెళ్ళిపోయిందెవరో అర్ధమయింది నిశాంతకీ.
నిశాంత ఎంత శ్రద్ధ తీసుకున్నా ఆమె చివరివరకూ కోలుకోలేకపోయింది.
“నీచుణ్ణి కన్నాను. నేను పాపిష్టిదాన్ని” అని ఏడ్చేది.
చివరికలానే ఓ ఆర్నెల్ల తర్వాత సుభద్రమ్మ ప్రాణాలు విడిచింది.
నిశాంత మళ్ళీ దుఃఖ సాగరంలో మునిగిపోయింది.
ఎవరు సలహా ఇచ్చినా ఆమె హితేంద్రని పిలవడానికెంత మాత్రం యిష్టపడలేదు.
“అతనికి తల్లయ్యేనన్న బెంగతోనే ఆమె మరణించింది. అతను కొరివి పెడితే ఆమె ఆత్మ శాంతించదు.” అంది.
చివరికి సాగర్ తదితరుల సహాయంతో సుభద్రమ్మకి దహన సంస్కారాలు జరిగిపోయేయి.
అయిదు సంవత్సరాలు గడిచిపోయేయి.
నిశాంత జీవితం యాంత్రికంగా సాగిపోతున్నది.
అప్పుడప్పుడు సాగర్ పలకరింపులు, లత దెప్పిపొడుపు మాటలు, తల్లిదండ్రులు తమ దగ్గరకి రాలేదనే నిష్టూరాలు మధ్య ఆమె కెరటాల తాకిడికి నిశ్చలంగా నిలబడిన సముద్రంలోని రాయిలా తయారయింది.
వృత్తే తన లోకంగా బ్రతుకుతోంది.
ఒకే వూళ్ళో వుంటున్న హితేంద్ర విషయాలు తెలుసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదామె.
అతను రికార్డింగ్ ధియేటర్స్ కి తన నర్సింగ్ హోం ముందునుండే వెళ్తాడన్న ఊహ కూడ ఆమెకు తట్టదసలు.
అలా హృదయాన్ని శిలాసదృశంగా మార్చుకుని బతుకుతున్న తరుణంలో అతను ఏమాత్రం ఊహించని విధంగా తన దగ్గరకొచ్చేడు.
ఆమె గతంలోంచి బయటపడేసరికి ఎక్కడో తెల్లావారుతున్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
నిశాంత కళ్ళు మగతగా మూతపడ్డాయి.
***********
తలుపులు దబదబా బాదుతోన్న శబ్దం వినబడి నిద్రలేచి వాచి చూసుకుంది నిశాంత.
టైము ఏడున్నర!
ఆమె గబగబా వెళ్ళి తలుపు తెరచింది.
ఎదురుగా రాజ్యలక్ష్మి!
“ఏంటమ్మా. ఇంతాలస్యంగా లేచేరు!” అంది నవ్వుతూ.
నిశాంత జవాబు చెప్పకుండా సాగర్ కి డయల్ చేసి ఒక వార్డు బాయిని పంపమని చెప్పి మొహం కడుక్కోడానికెళ్ళింది.
ఆమె స్నానం ముగించుకొచ్చేసరికి రాజ్యలక్ష్మి టిఫిన్, కాఫీ సిధ్ధం చేసింది.
నిశాంత టిఫిన్ ముగించేసరికి హితేంద్ర గుమ్మంలో నిలబడ్డాడు.
అతన్ని చూడగానే నరాలన్నీ బిగుసుకున్నట్లయింది నిశాంతకి.
“కూర్చోండి. వార్డు బాయి రాలేదు” అంటూ లోనికెళ్ళిపోయింది.
హితేంద్ర స్తబ్దంగా కూర్చున్నాడు నాలుగు గోడల్ని మార్చి మార్చి చూస్తూ.
మరో పావుగంటలో వార్డు బాయి వచ్చేడు.
నిశాంత చెప్పిన ప్రకారం వార్డు బాయి హితేంద్రని లోనికి తీసుకెళ్ళి సెమెన్ తీసుకున్నాడు.
“రెండ్రోజుల తర్వాత రండి. లాబ్ కి పంపాలి. స్పెర్మ్ కౌంట్ తెలుసుకునేందుకు” అంది నిశాంత.
హితేంద్ర నమస్కరించి వెళ్ళిపోయేడు.
వార్డు బాయికి లెటరు, సెమెన్ బాటిలిచ్చి లాబ్ కి పంపించింది నిశాంత.
ఆమె యాంత్రిక జీవితం ప్రారంభమైంది.
పేటెంట్స్ రావడం మొదలైంది.
టైము గడిచేకొలది రద్దీ పెరిగిపోసాగింది.
మధ్యలో ఒక గంట లంచ్ టైముకి పోతే మళ్ళీ పేషెంట్స్ పెరగసాగేరు.
నిశాంత ఓపిగ్గా వారి బాధల్ని వింటోంది.
కొన్ని తనకు కుదరనివి సాగర్ కి రిఫర్ చేస్తోంది.
ఆమె దగ్గరకొచ్చేది ఎక్కువగా లేడిసే!
చాలవరకు సైకలాజికల్ ప్రాబ్లమ్సే!
వివాహమనేది స్త్రీ పురుషుల సుఖ సంతోషానికి, అనురాగ దాంపత్యం కోసం ఏర్పరిచినా – చాలమంది స్త్రీలకది దుఃఖ హేతువే అవుతోంది. చాలామంది పురుషులు స్త్రీ ధనాన్ని, స్త్రీ శక్తిని తమ స్వ సుఖాల కోసం వాడుకోవడం రివాజయిపోయింది. పెళ్ళి అనేది స్త్రీ పాలిట అందమైన సాలెగూడులా మారింది. చదువుకున్నావు నీకన్నీ తెలుసు అనే పొగడ్త లాంటి పదాన్ని వాడి మగవారు స్త్రీని ఇంటా బయటా తన పనిమనిషిలా వాడుకోవడంతో స్త్రీలు చాలామంది డిప్రెషన్, హిస్టీరియాకి గురవుతున్నారు.
“అమ్మా!”
రాజ్యలక్ష్మి ఎదురుగా నిలబడింది.
“ఏంటి?”
“తమకోసం ఎవరో వచ్చేరమ్మా! మీతో మాట్లాడాలట!”
“పేషెంటా?”
“తెలీదమ్మ, పేరు వీణట!”
ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ పేరు విని నిశాంత.
మెల్లిగా కన్సల్టింగ్ రూమ్ లోకొచ్చింది.
పమిటని భుజాల మీదుగా కప్పుకున్న వీణ నిశాంతని చూసి లేచి నిలబడి నమస్కరించింది.
నిశాంత ప్రతి నమస్కారం చేస్తూ వీణ కూడ వున్న పాపకేసి చూసింది.
పాప నిండు బుగ్గలతో, చక్రాల్లాంటి కళ్ళతో బొద్దుగా, ముద్దుగా వుంది ‌
“ఆంటీకి నమస్కరించు” అంది వీణ.
పాప నిశాంతని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ “డాట్టారాటాడతన్నావా?” అంది చేతిలోని స్టెతస్కోపుని చూస్తూ.
నిశాంత ఫకాల్న నవ్వి “నువ్వు కూడ ఆడతావా?” అంది.
పాప ఆడతానన్నట్లుగా తలాడించింది.
నిశాంత స్టెత్ ని పాపకందించి “చెప్పండి” అంది వీణవైపు చూస్తూ ‌
వీణ కాస్సేపు తలదించుకొని “నాకెలా మొదలుపెట్టాలో తెలియడం లేదు.” అంది.
నిశాంత ఆమెని పరికించి చూస్తూ “ఒక డాక్టరుగా నాకు చెప్పడానికి సందేహించినా ఒక సోదరిగానో, ఆత్మీయురాలిగానో చెప్పండి.” అంది.
వీణ కళ్ళలో నీళ్ళూరేయి.
“నేను మీకు చాల హాని చేసేను.” అంది వేదనగా.
“ఈ విషయం చెప్పడానికొచ్చేరా?” అంది నిశాంత నవ్వుతూ.
“నన్ను క్షమాపణ చెప్పుకోనివ్వండి. మళ్ళీ అవకాశమొస్తుందో లేదో!” అంది బాధగా.
“అతను చేసిన తప్పుకి మీరెందుకు క్షమాపణ చెప్పాలి చెప్పండి. ఆ స్థితిలో ఏ ఆడదున్నా ఆ పనే చేసి వుండేది. ‌మగవాడు అవకాశవాది. ఎప్పుడెవరితో అవసరముంటే అప్పుడా స్త్రీని దేవతని చేస్తాడు. కాళ్ళు పట్టుకుంటాడు, కన్నీరు కారుస్తాడు. మనసు మరో స్త్రీ మీదకి మరలినప్పుడు ఉపయోగించుకున్న స్త్రీని హేళన చేస్తాడు. ఆ స్త్రీ వలన తన జీవితం అన్యాయమైపోయిందంటాడు – తనని వలలో వేసుకుని మోసం చేసిందంటాడు. ఇదే రికార్డుని అతను జీవితమంతా వాడుకుంటూ బతికేస్తాడు. అలాంటి అవకాశవాదుల్ని, నీచుల్ని తలచుకొనే ప్రయత్నం చేయకూడదు. చేసినా జాలి పడాలి గాని… బాధ పడకూడదు.” అంది నిశాంత.
“అంతే జరిగింది. ఆయన నాకు నరకాన్ని చూపిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా తాగి నన్ను హింసిస్తున్నారు. నా శీలాన్ని అనుమానిస్తున్నారు. అతని ప్రవర్తన సరిగ్గా లేక గొంతు పాడయిపోయింది. వచ్చిన ఛాన్సులు కూడ తాగి పోగొట్టుకుంటున్నారు.” అంది వీణ ఏడుస్తూ.
నిశాంత మౌనంగా వింటోంది.
“ఆయన… మీ దగ్గరకొచ్చినట్లుగా తెలిసింది!”
“ఎవరు చెప్పేరు?”
“తబలా ప్రవీణ్!”
“ఎందుకొచ్చేరో తెలుసా?”
“తెలుసు… అతనికి పిల్లలు పుట్టే అవకాశముందో లేదో తెలుసుకోడానికి!” అంది వీణ తలదించుకొని.
“అతనిలోని నీచత్వం పోలేదు. స్త్రీ అతనాడుకునే వస్తువనుకుంటున్నాడు. అతనికి బుద్ధి ఆ దేవుడే చెప్పాలి!” అంది నిశాంత.
“ఏం చేసేరు మరి?”
“ఒక డాక్టరుగా టెస్టులు చేసేను. రిపోర్టులింకా రాలేదు. ఎదురుగా ముద్దులొలికే బిడ్డని పెట్టుకుని… ఆనందించలేక ఆ పిల్ల ఎవరి పోలికలతోనో పుట్టిందంటున్నాడు. అందుకే రిపోర్టులతని మొహం మీద పడేస్తే బుద్దొస్తుంది.” అంది నిశాంత కోపంగా.
వీణ ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుంది.
నిశాంత ఆమెవైపాశ్చర్యంగా చూసింది.
“వద్దు నిశాంత గారూ! మీరంత పని చెయ్యొద్దు‌. అలా చేస్తే నా జీవితమన్యాయమైపోతుంది” అంది కన్నీళ్ళతో.
నిశాంత తెల్లబోయింది.
“మీరు చెప్పేది నాకర్ధం కావడం లేదు. మీ జీవితమెలా నాశనమైపోతుంది?” అనడిగింది వింతగా చూస్తూ.
వీణ సందేహంగా అక్కడే నిలబడి వున్న రాజ్యలక్ష్మి వైపు చూసింది.
నిశాంత అర్థం చేసుకుని “రాజ్యలక్ష్మీ, కాస్సేపు బయట కూర్చో!” అంది.
రాజ్యలక్ష్మి బయటకెళ్ళిపోయింది.
“ఈ కధ విని నన్నసహ్యించుకోరు కదూ!” అంది వీణ బేలగా‌.
నిశాంత తలడ్డంగా తిప్పింది.
“ఆయనకి చాల ఇగో. అస్తమానూ తనకి పిల్లలంటే చాలా ఇష్టమని – పిల్లలు లేనందువలనే మిమ్నల్నొదిలేసేనని – తనలో లోపం లేదని మీరన్నారని – అంటే నాకు లోపముందనేగా, అది వట్టి అహంకారపు స్త్రీ – దానిలో స్త్రీత్వమే లేదని రకరకాలుగా దూషించేవారు. మా కాపురం సంవత్సరం గడిచింది. నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఆయన పిల్లల కోసం కంగారు పడిపోతుండేవారు. నేను నా కధ కూడ మీ కధలానే జరుగుతుందనే భయంతో డాక్టరు దగ్గరకెళ్ళేను రహస్యంగా. రిపోర్టులు పాజిటివ్ గా వచ్చేయి. నాలో ఏ లోపమూ లేదు. కాని ఈ సంగతి నేను ధైర్యం చేసి ఆయనకి చెప్పలేకపోయేను. చెబితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఆయనకి రకరకాల స్త్రీలతో సంబంధాలున్నాయి. తన దగ్గర అవసరం కోసం వచ్చే ప్రతి స్త్రీని అనుభవించాలనే స్థాయికతను దిగజారిపోయేరు. కనీసం భార్య స్థానాన్ని పదిల పరుచుకోవాలనే స్వార్ధం నాలో పెరిగింది. నా కెరీర్ ని కండెమ్ చేసి నన్ను ఇంట్లో పడేసేరు. బయటకెళ్ళి మీలా నిలదొక్కుకోగల చదువు, ధైర్యమూ రెండూ లేవు నాకు. అందుకే తెగించేను. నేను తప్పే చేసేను. ఈ బిడ్డకి తండ్రతను కాడు.” అంది వీణ తలదించుకొని.
మొదట నిశాంత నిర్ఘాంతపోయిందామె చెప్పిన విషయం విని.
కాని వెంటనే సర్దుకొని చిన్నగా నవ్వి ఆమె భుజం తట్టి “చాల తప్పు చేసినట్లలా తల దించుకుంటావు దేనికి?” అంది.
“ఇది తప్పు కాదంటారా?”
“కాదు”
వీణ తెల్లబోయినట్లుగా చూసిందామె వైపు.
“అవును. మనల్నే మనసా – వాచా నమ్మి నీతిగా బ్రతికే భర్తకి అన్యాయం చేస్తే అపరాధం కాని – ఆడకుక్క కనిపించినా చొంగకార్చే నీచ, నికృష్టుడైన వ్యక్తి పట్ల నిజాయితీగా వ్యవహరించలేదని కృంగిపోనక్కర్లేదు. నీకింకో సంగతి కూడ చెబుతున్నాను. కేరక్టరనేది కేవలం స్త్రీకి సంబంధించిన విషయం కాదు. అది ముందు వర్తించాల్సింది మగవాడికే. గర్భం ధరించే భారం, శరీరాకృతి మగవాడికుండి వుంటే మగవాడు చేసే వెధవ పనులకి ఈ ప్రపంచ జనాభా వంద రెట్లుండేదీపాటికి!” అంది నిశాంత ఆవేశంగా.
వీణ ఆమెనలానే బొమ్మలా చూస్తూ కూర్చుంది.
“సరే… నేనిప్పుడేం చేయాలో చెప్పు!” అనడిగింది నిశాంతే తిరిగి.
నామీద కోపం తెచ్చుకోరుగా!”
“లేదు.”
“ఆ రిపోర్టులు తారుమారు చేయాలి. అతనికి బిడ్డలు పుట్టే అవకాశముందని చెప్పి నా కాపురం నిలబెట్టండి. నేనిప్పుడు రోడ్డునపడి బ్రతకలేను. ఈ పాప… మొహం చూసయినా…” అంటూ వెక్కివెక్కి ఏడ్చింది వీణ.
నిశాంత కాస్సేపు మౌనంగా కూర్చుంది.
“డాక్టరుగా మీరు చేయకూడనిది కోరుతున్నానేమో!” అనడిగింది వీణ కన్నీళ్ళు తుడుచుకుంటూ సందేహంగా.
“అదికాదు నేనాలోచిస్తున్నది!”
వీణ ఏమిటన్నట్లుగా చూసింది.
“స్త్రీలింత బేలలు కాబట్టే మగవాళ్ళిన్ని అరాచకాలు చేయగల్గుతున్నారు. తన భర్త ఒక స్త్రీ జీవితాన్ని నాశనం చేసొస్తే ఆ భార్య అతని ప్రవర్తనని అసహ్యించుకోవాల్సింది పోయి నమ్మి మోసపోయిన ఆడదాన్ని దుయ్యబెట్టి తన మొగుడు చాల ఘనుడని పొంగిపోతుంది. నీ భర్త గుణగణాలు తెలిసి ఇంకా అతన్నే అంటిపెట్టుకుని వుండాలని… ఈ బిడ్డని అతనికే కన్నానని నిరూపించుకోవాలని నువ్వు చేసే ప్రయత్నం చూస్తుంటే జాలేస్తున్నది. పెళ్ళాం డెలివరికెళ్తే పనిమనుషులతో తిరిగే భర్త పుంగవుల్ని దేవుళ్లా పూజించే భార్యామణులకి వ్యక్తిత్వముందనుకోవాలా! తన ఎదుటే పరస్త్రీలని తెచ్చి పడకగదుల్లో దూరి తలుపులేసుకునే భర్తలతో ఇంకా కాపురాలు చేసే భార్యలు అసలు చీము, నెత్తురున్న మనుషుల్లోకి లెక్కకొస్తారా? నేను చెప్పేదొకటే! అలాంటి వ్యక్తితో కలిసి జీవించడం కన్నా మరణం మరొకటి లేదు. ఎందుకు నువ్వు బతకలేవు! ఒక నిరక్షరాస్యురాలు భర్త పెట్టే బాధల్ని భరించలేక నాలుగిళ్ళలో గిన్నెలు తోముకు‌ని బతగ్గా లేంది నువ్వు బతకలేవా? ఆలోచించు!”
వీణ కళ్ళార్పకుండా చూసింది నిశాంత వైపు.
“నేను నిన్ను హితేంద్రని వదిలేయమని బలవంతం చేయడం లేదు. ఈ రోజు కాకపోయినా రేపయినా అతను తిరిగి అనుమానంతో మరో డాక్టరు దగ్గరకెళ్ళొచ్చు. అప్పుడు నిజం తెలిసి ఆ తుచ్ఛుడు ఎదిగిన నీ కూతుర్నే నీచ దృష్టితో చూడొచ్చు. ఆలోచించుకుని రేపు ఫోను చెయ్యి. రేపు సాయంత్రం అతనొస్తాడు.” అంది నిశాంత.
వీణ చేతులు జోడించి కూతుర్నెత్తుకుని వెళ్ళిపోయింది.
నిశాంత తలంతా బరువయిపోయింది. భారంగా కళ్ళు మూసుకుంది.
హితేంద్ర తనని అవమానించిన సంఘటనలు, ఇచ్చిన అమానుషపు పేపర్ ప్రకటనలు – తను అతని కోసం ప్రతి నిముషం శ్రమించిన తీరు – చివరికి బీచ్ లో చెప్పులు తెగిపోతే అతనికి కొనుక్కొనే స్థోమత లేకపోతే తను కొనిపెట్టడం – ప్రతి క్షణం తనని దేవతగా అతను పొగిడి తనని ఉక్కిరిబిక్కిరి చేసిన సంఘటనలు – ఆమె ప్రమేయం లేకుండానే కదిలిపోతున్నాయి.
ఫోను రింగవ్వగానే ఉలిక్కిపడి రిసీవరందుకుంది.
“నేను సాగర్ని. అతని రిపోర్టులొచ్చేయి.”
“చూసేవా?”
“చూసేను.”
“పాజిటివా?”
“నువ్వెందుకంత టెన్షన్ ఫీలవుతున్నావు నిశాంతా?”.
అతని ప్రశ్నకామె తడబడింది.
“అది కాదు. అతనప్పుడు నన్ను గొడ్రాలినన్నాడు కదా!”
“యూ సిల్లీ! తనలో లోపమున్నవాడే… ఎదుటివారిలో లోపాల్నెంచి అల్లరి చేయాలని చూస్తాడు. ఇంకా ఆ సంగతులాలోచిస్తున్నావా? అతనెప్పటికీ తండ్రి కాలేడు.”
నిజంగానే నిశాంత గాలి పీల్చుకుంది.
“ఇంతకీ ఇవి రేపతనికిస్తావా? ఇప్పుడున్న కూతురు మాటేంటి?” అనడిగేడు సాగర్.
“వీణ వచ్చింది.”
నిశాంత జవాబు విని “అదేంటి?” అనడిగేడు సాగర్ ఆశ్చర్యపోతూ‌.
నిశాంత జరిగిన సంగతుల్ని క్లుప్తంగా చెప్పిందతనికి.
“నీకు హాని చేసిన వాళ్ళకి హితబోధ చేసేవన్నమాట!”
“ఎవరూ నాకు హాని చేసేరనుకోవడం లేదు సాగర్! చెప్పు నేనామెకేమైనా కాని మాటలు చెప్పి హితేంద్ర మీద కసి తీర్చుకుంటున్నానంటావా?” అనడిగింది నిశాంత.
“లేదు. అయితే రేపు ప్రొద్దుటే రిపోర్టులు నీకు పంపుతాను.”
“థాంక్యూ!” అంటూ లైన్ కట్ చేసింది నిశాంత.
ఆమె ఇటీవలే పెంచుకుంటున్న పామరిన్ కుక్కపిల్ల ఆమె మీదకి గెంతి ప్రేమంతా ఒలకబోసి నాకడం మొదలెట్టింది.
ఆమె దాన్ని ప్రేమగా నిమిరి లోనికి నడిచింది దానికి పాలు పట్టేందుకు.

*************

సాయంత్రం ఆరు గంటల వేళ –
నిశాంత పేటెంట్స్ ని చూస్తుండగా హితేంద్ర వచ్చి నిలబడి నమస్కరించేడు.
“కూర్చోండి” అంది.
హితేంద్ర బయటే కూర్చున్నాడు.
నిశాంత పేషెంట్స్ ని చూస్తూనే వీణ గురించి ఆలోచిస్తున్నది. వీణ నుండి ఫోను రాలేదు. అంటే హితేంద్రతో కలిసి బ్రతకడానికే నిర్ణయించుకున్నదన్న మాట!
నిశాంత మనసు బాధగా మూల్గింది.
సరిగ్గా అప్పుడే రాజ్యలక్ష్మి వీణ కూతుర్నెత్తుకుని లోపలికొచ్చింది.
పాపని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది నిశాంతకి.
“ఆవిడొచ్చేరా?”
“లేదమ్మా, ఈ పాపిక్కడ నిలబడి వుంటే లోపలికి తీసుకొచ్చేను.” అంది రాజ్యలక్ష్మి.
“ఏమ్మా! మమ్నీ ఏది?”
“లేదు. వెళ్ళిపోయింది!” అంది పాప కళ్ళు తిప్పుతూ.
“ఎక్కడికి?”
“ఏమో! ఈ కవరు నీకిమ్మంది.”
పాప చేతిలో కవరు తీసుకుని గబగబా చింపి చదివింది నిశాంత.
నిశాంత గారికి,
నమస్కారం.
మీరు చెప్పిన ప్రతి విషయాన్ని ఆలోచించేను. చివరికి అతనితో కలిసి బ్రతకడమంత ఆత్మహత్యా సదృశమైన విషయం మరొకటి లేదని గ్రహించేను. కాని నేను మీ అంత ధైర్యస్తురాలిని కాదు. అందుకే ఒక్క కోరిక కోరుతున్నాను. భారమైందైనా కాదనరని ధైర్యం. పాపని పెంచే బాధ్యత మీకప్పజెబుతున్నాను. మీ ఒంటరి జీవితంలో పాప ఒక వెలుగవుతుంది. నాలాంటి పిరికిది కాకుండా – మీలాంటి వ్యక్తిత్వం అబ్బుతుందనే నా ఆశ. నేను ప్రస్తుతానికి ఎటెళ్తున్నానో చెప్పలేను. కాని ఆత్మహత్య చేసుకోను. అతని రిపోర్ట్స్ అతని మొహాన పడెయ్యండి –
ఇట్లు
వీణ.
ఉత్తరం చదివి నిశాంత కళ్ళు నీళ్ళతో నిండేయి.
పాపని టేబుల్ మీద కూర్చోబెట్టుకుని “నాతో వుంటావా?” అనడిగింది.
పాప కళ్ళు తిప్పింది అమాయకంగా.
నిశాంత పాపని గట్టిగా ముద్దు పెట్టుకుని “రాజ్యలక్ష్మీ!” అని పిలిచింది.
రాజ్యలక్ష్మి వచ్చి నిలబడింది.
“ఈ రిపోర్టులు ఆ మూల బెంచీ మీదున్న వ్యక్తికివ్వు. ఇక నాతో మాట్లాడాల్సిందేమీ లేదని చెప్పు!” అంటూ ఒక కవరు రాజ్యలక్ష్మికిచ్చింది.
రాజ్యలక్ష్మి దాన్ని హితేంద్రకిచ్చింది.
“ఆమెతో ఒకసారి మాట్లాడాలి!”
“అక్కర్లేదన్నారు!”
చిరు చీకటిలో హితేంద్ర రోడ్డు మీదకి అడుగు పెట్టేడు అన్నీ పోగొట్టుకుని తిరిగి పూర్వపు దౌర్భాగ్యంతో.
నిశాంత పాపనెత్తుకుని గుమ్మంలోకొచ్చి చూసింది రోడ్డు చివరికి. సుదీర్ఘమైన బాట మీద అతనొక బిందువుగా మారి శూన్యంలో కలిసిపోయేడు.
పాప ఆమె భుజాన్ని చుట్టుకుంది “మమ్మీ ఏది?” అనడుగుతూ.
“వస్తుంది.”
పాప నవ్వింది అమాయకంగా.
నిశాంత గాఢంగా నిట్టూర్చి లోనికి తిరిగింది.
కాని – ఆమె ఇప్పుడు ఒంటరిది కాదు.

( సమాప్తం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *