March 29, 2023

మనిషిలోని భిన్నస్వభావాలను బహిర్గతపరచిన కవితావల్లరి.

రచన: సి. ఉమాదేవి

మనిషి అనగానే మానవత్వానికి చిరునామా అని అర్థం చేసుకోవాల్సిన సమాజంలో మనిషి దొంగ అని కవిత్వీకరించి మనుషులలోని భిన్న స్వభావాలను బహిర్గతపరచి మనసును ఆలోచనలతో కుదిపిన కవి మొవ్వ రామకృష్ణగారు. వంద కవితలు రచించిన కవి తన మనసుననున్న భావాలను అక్షరబద్ధం చేసి సమాజతీరును పారదర్శకం చేసారు. ఆశలపల్లకి కవితలో ప్రతివాడికి ఆశ ఉంటుంది అది అత్యాశ కాకూడదని ప్రతిక్షణం తపన మాత్రమే నాకు మిగిలింది అని చెప్తూ కల్మషంలేని మనసు ఏ ఉషస్సుకైనా తట్టుకోగలదు అంటారు. స్వచ్ఛమైన హృదయంలో శ్వేతగులాబీలే పూస్తాయి అనడం వాస్తవమే కదా. గమ్యం చేరాలి కవితలో చివరికి మనస్సే అచంచలం, అనివార్యమైన ఈ జీవితం ఆటుపోట్ల పయనం అంటూ మనిషి జీవిత పయనాన్ని అక్షరబాటలో వివరిస్తుంది.

గమ్యం చేరాలంటే కక్షలో లక్ష్యం చేరుతాయి. సమిష్టిగా దూరదృష్టితో ఆలోచించే ఆ పయనం హద్దు అదుపులేని ప్రయాణమే. ఎదురుచూపులు కవిత నేటి సమాజానికి దర్పణమే. కంటిపాపలకు నిద్రకరువైంది, కన్నపాపలు దూరమై, కలవరింతలే మిగిలాయి, మందగించిన చూపుతో ఎదురు చూపులే మిగిలాయి. ఈ కవిత తల్లిదండ్రుల హృదయ వేదనను వినిపించింది. నాన్న ప్రేమ మరో చక్కని కవిత. చిన్నప్పుడు అడిగినవి కొనివ్వని తండ్రిపై విషబీజం నాటుకోవడం కాదు, సంసారసాగరాన్ని ఈదడానికి ఎంత కష్టపడ్డారో తండ్రివైతే కాని అర్థంకాదు అనడం నిజాన్ని నిక్కచ్చిగా తెలిపింది.

కవిత్వం కవ్వంలాంటిది చిలికే కొద్దీ పేజీలకు పేజీలు అక్షరాలతో వర్షిస్తాయి అనే కవ్వం కవిత మనసును అక్షరాలతో చిలుకుతుంది. ఆత్మధైర్యం కవితలో పట్టుదలే ఆయుధంగా చేసుకుంటే, ప్రతి అడుగూ విజయదర్పమే, గమ్యం ఎంత దూరమైనా అంటారు. అడ్డదారి కవిత కాళ్లు ఉన్నాయికదా అని అడ్డదారిలో నడవలేము, మనస్సు మాత్రం అడ్డమైనదే, అడ్డగోలుగా ఆలోచించి-అడ్డదారిలో నడిపిస్తుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ మంచి వ్యక్తిత్వం వుండాలి, అప్పుడే మనకు మనుగడ సుసాధ్యం. వ్యక్తిత్వం కవిత చెప్పే సూత్రమిదే. ఒక్కరోజు కవిత మనిషిలోని మరో కోణాన్ని చూపిస్తుంది. ఒక్కరోజు కవితలో మనిషి నిస్వార్థంగా బ్రతకాలనే రోజు ఒక్కటికూడా లేదు.. . నిస్వార్థమనే రోజు తప్పక ఎదురుపడేలా చేసుకున్నప్పుడు ఆ రోజే జీవిత డైరీలో స్వర్ణాక్షరాలతో లిఖించుకోమంటారు.

మనిషిలోని చిన్న సమస్యలను సున్నితంగా చెప్పినా మనసును ఆలోచనా వలయంలోకి ప్రవేశింప చేస్తాయి. మనిషి దొంగ.. నిజంగా!? అనే కవితాసంపుటి రచించిన మొవ్వ రామకృష్ణగారు మనిషిలోని భిన్న ప్రవృత్తులను గమనించి కవితారూపాన్నిచ్చి మనిషి మనసున ఆలోచనలకు బీజం వేయడం సంతోషకరం. వారికి నా అభినందనలు, అభివందనాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2020
M T W T F S S
« Jan   Mar »
 12
3456789
10111213141516
17181920212223
242526272829