March 28, 2024

రాజీపడిన బంధం – 2

రచన: ఉమాభారతి కోసూరి

యేడాది తరువాత…
ఢిల్లీ మహానగరంలోని ‘రీగల్ లయన్స్ క్లబ్’ వారి ఆవరణ కిక్కిరిసి ఉంది. మిరుమిట్లు గొలిపే జిలుగుల వెలుగులతో నిండి ఉంది ఆడిటోరియం. ‘క్లబ్ వార్షికోత్సవం’ లో భాగంగా ‘ప్రేమికుల రోజు’ – వేలంటైన్స్ డే’ సందర్భంగా “అందాల జంట” కాంటెస్ట్ జరుగుతుంది.
ఆఖరి అంశం కూడా ముగిసి, విశ్రాంతి సమయంలో మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన ఆ పోటీలో మాతో పాటుగా పాల్గొన్న యువజంటలన్నీ పోటీ ఫలితాల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
మరో ఐదు నిముషాలకి చేతిలో కవరుతో క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణవంశీ గారు వేదిక పైనున్న మైక్ ముందుకొచ్చారు…
“లేడిస్ ఎండ్ జెంటెల్ మెన్, ‘అందాల జంట’ ‘అవార్డుని ఈ సారి అందుకుంటున్నది ‘మిసెస్ ఎండ్ మిస్టర్ – నీలవేణి ఎండ్ శ్యాంప్రసాద్ మధురై“…. అని ప్రకటన చేయగానే మిన్నంటే కరతాళధ్వనుల నడుమ మా జంటని వేదిక పైకి ఆహ్వానించారు. అవార్డుతో పాటుగా అందరి అభినందనలను అందుకున్నాము.
అవార్డు అందుకున్న సందర్భంగా మా వివాహం గురించి ఎందరో అడిగిన ప్రశ్నలకి, మైక్ పుచ్చుకుని జవాబు చెప్పారు నా భర్త శ్యాం.
“మా వివాహమై పదకొండు నెలలు అయింది. నీలవేణిని భార్యగా పొందడం నా అదృష్టమే. హైదరాబాదులో ఓ స్నేహితుడి పెళ్ళిలో చూసాను నీలవేణిని. ‘మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ మీ’. నీల అందచందాలు, పొడవాటి వాలు జడ, నడవడి చూసి ప్రేమించి, ఆమెని వివాహమాడాను. ఆమె దేవుడు నాకిచ్చిన బహుమానం” ఎంతో గర్వంగా అన్నారు నా భర్త శ్యాంప్రసాద్.
‘రీగల్ క్లబ్’ వారి ‘అందాల జంట’ అవార్డు నా భర్తకి పట్టలేనంత ఆనందాన్నిచ్చింది. ఆ సంబరాల్లో పాల్గొని ఇల్లు చేరేప్పటికి అర్ధరాత్రి దాటింది.
**
ఆలస్యంగా పడుకున్నా తెల్లారుఝామునే మెలుకువొచ్చేసింది. రాత్రి జరిగిన అవార్డు వేడుకల గురించి నెమరు వేసుకుంటూ క్రిందకొచ్చాను. కాఫీ కలుపుకుని వెళ్ళి ఇంటి ముందున్న తోటలోని గజేబోలో కూర్చున్నాను.
రాత్రి ఫంక్షన్ లో నా గురించి, మా పెళ్ళి గురించి శ్యాం అందరితో అన్న మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి.
నిజమే. వందన పెళ్ళిలో నన్ను చూసి, మధ్య తరగతి కుటంబం నుండి అని తెలిసినా, నన్ను ఏరి కోరి వరించి పెళ్ళి చేసుకున్నారు శ్యాంప్రసాద్. ఢిల్లీలో పేరున్న సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత శ్యాం. పొడగరి, అందగాడు, సమాజంలో పేరున్న వ్యక్తి.
ఢిల్లీ వచ్చినప్పటినుండి దాదాపు ఏడాదిగా, అందరికీ ఆయన పట్ల ఉన్న గౌరవం, మక్కువ, ఆకర్షణ గమనిస్తున్నాను.
శ్యాం మంచి క్రీడాకారుడు కూడానట. కాలేజీలో బాడ్మింటన్, క్రికెట్ లో గుర్తింపు పొందారట. టెన్నిస్ క్రీడారంగాన కూడా జాతీయంగా పేరొంది దీర్ఘకాలం టెన్నిస్ లో రాణించారట. ఇంటిలో ప్రత్యేకంగా ఓ గది నిండా ట్రోఫీలు, మెడల్స్ .. వాటికి సంబంధించి ఎన్నో ఫోటోలు, పత్రికలు ఉన్నాయి. మామయ్యగారే శ్యాంని మంచి క్రీడాకారుడిగా తీర్చిదిద్దారట.
వివాహమయ్యి ఢిల్లీ వచ్చిన రెండు వారాలకి మా పెళ్ళి రిసెప్షన్ కూడా నేను ఊహించని రీతిలో ఓ కలలా జరిగింది. అది నా జీవితాన మరువలేని ఘట్టమే. ఢిల్లీలోని ప్రముఖులు ఎందరో విచ్చేసి అభినందనలు తెలిపారు.
వచ్చిన అతిధులు మమ్మల్ని అభినందిస్తూ, “శ్యాం, నీ వధువు నీకు తగ్గట్టుగా అందంగా నీ పక్కన ఓ అప్సరలా ఉన్నారు” అంటూ కొందరు, “నీవు చాలా అదృష్టవంతుడివి శ్యాం. ఇంత సంప్రదాయమైన అమ్మాయి భార్యగా దొరకడం మాటలు కాదు. కంగ్రాచ్యులేషన్స్” అంటూ మరికొందరు మమ్మల్ని ఆకాశానికెత్తేశారు.
హైదరాబాదు నుండి మా అమ్మావాళ్ళతో పాటు రిసెప్షన్ కి వచ్చిన రమణి, విజయ్ దంపతులు, చిత్ర కూడా మమల్ని అభినందించి నా అదృష్టానికి మురిసిపోయారు.
“ఆడబిడ్డ సాధింపు కాని, తోటికోడలు వేధింపు కాని లేవు నీకు. మకుటం లేని మహరాణివే. ఆ దేవుణ్ణి ఏ పూల పూజించావో? ఇంతటి వాడు వలచి వచ్చి చేయందుకున్నాడు” అన్నవాళ్ళు కూడా లేకపోలేదు ఆ రోజున.
**
అవును మరి, నా భర్త పర్సనాలిటి అటువంటిది. క్రీడాకారుడిగా గుర్తింపు, పలుకుబడి, పాప్యులారిటీ ఉన్న శ్యాంకి అభిమానులుండడం సర్వసాధారణం.
మాములుగా అయితే ఆయన వంటి భర్త ‘పూర్వజన్మ సుకృతమే’ అనవచ్చు.
కాని, మరి నేనెందుకు అంతటి ఆనందాన్ని పొందలేక పోతున్నాను? అన్న తలంపు నన్ను కృంగదీసింది.
కొద్ది రోజుల్లోనే వైవాహిక జీవితమంటే ఓ సంకోచం, భయం, వేదన నన్ను స్తబ్దుగా మార్చాయి. శ్యాం పట్ల, ఆయనతో ఏర్పడ్డ బంధం పట్ల కూడా నాలో గుబులు మొదలైంది.
నా గుండెల్ని పిండేసే నిజం, నాకు మాత్రమే తెలిసిన విషయం –
..నా భర్త శ్యాంప్రసాద్.. సౌమ్యం, సుకుమారం లేని మొరటు మనిషి అని, పెళ్ళయ్యి యేడాదవుతున్నా నాతో అతను ప్రవర్తించే తీరు సహించలేనిదిగా ఉందని మదనపడుతుంటాను.
స్త్రీల పట్ల సుకుమారంగా మెలగాలని తెలియనితనమా? లేక ‘ఎదుటి మనిషిని చిత్తుగా ఓడించాలి’ అనే ఓ క్రీడాకారుడి ప్రవృత్తితో మసులుకోడమా? అని కూడా ఆలోచించాను.
పెళ్ళైన నెలనుంచే సరసత లోపించిన నా భర్త ప్రవర్తన భరించగలగడం ఎలాగో తెలియక, అయోమయమైంది నా మనస్థితి…..గజిబిజి ఆలోచనలతో క్షణం సేపు కళ్ళు మూసుకున్నాను.
వెనుక నుండి, “అమ్మాయిగారు, మీ రెండో కప్పు కాఫీ” అంటూ చేతుల్లో ట్రేతో వచ్చిన వంటమనిషి పిలుపుతో కళ్ళు తెరిచాను…..
కాస్త దూరాన్నించి అత్తయ్య కూడా నా వైపుగా రావడం చూసాను. తరచుగా పొద్దున్నే ఇంటి ముందున్న తోట లోని గజేబోలో చేరుతాము అత్తయ్య, నేను. దేవునికి పూలమాలలు కడుతూ ఆమె, తొడిమలు తీసి ఆ పువ్వులందిస్తూ నేను.. కబుర్లు చెప్పుకుంటాము.
ఇవాళ కూడా పూలసజ్జలో రకరకాల పూలు తెచ్చుకుని నా ఎదురుగా కూర్చున్నారామె.
“ఏమ్మా, సరిగ్గా నాలుగు వారాల్లో మీ పెళ్ళి రోజు. వేడుక జరపాలంటే ఇప్పుటినుంచే ఏర్పాట్లు మొదలెట్టాలి. కానీ, మీరంతా ఏ హంగామా వద్దన్నారుగా! అంటూ నావంక చూసి ఆగారు. నేను తల దించుకున్నాను.
“ఐనా సరే, ఇంకొక్కమారు సాయంత్రం శ్యాంని అడుగుతాను. అదే జవాబైతే ఇక వదిలేస్తాను. ఏం చేస్తాం. ఇక మిగిలిందల్లా ఆ రోజు గుడికి వెళ్ళి దేవుడికి అభిషేకం, అక్కడ ఆశ్రమంలో అన్నదానం చేయించుదాము” అంటూ పూలబుట్ట నా ముందుంచారు.
మాల కట్టడానికి పూలని వేరు చేయసాగాను….. పెళ్ళిరోజు ప్రస్తావన రాగానే, తిరిగి నా ఆలోచనలు శ్యాం వైపు, నా వైవాహిక జీవితం వైపు మళ్ళాయి…..
భర్త కౌగిలిలో కరిగిపోదామని ఎదురుచూసే బదులు, తన చేష్టలతో, ఎప్పుడు ఎలా బాధ కలిగిస్తాడో అని నిత్యం వ్యధ చెందుతుంది మనసు…..అందమైన జడ అని సవరిస్తూ, నేను అమాంతం నేలకొరిగేలా జడ పట్టి లాగిన ప్రతీసారి ఏడ్చి కుమిలిపోయాను.
ఓ రోజు, బెడ్ కాఫీ ఇచ్చి వెనుతిరిగిన నన్ను, బలంగా చేయి పట్టి లాగిన విసురికి మంచం కోడు తగిలి బాధతో విలవిల్లాడిపోయాను. నా నుదుటి మీద గాయమై, ఏడు కుట్లు పడి మాయని మచ్చ కూడా అయింది. సంఘటన జరిగి ఆరునెళ్లయినా ఇప్పటికీ బాధనిపిస్తుంది.
ఆ రోజునే మా అత్తగారికి విషయాలు చెప్పాను. “ఇది సరసమా?” అని ధైర్యం చేసి అడిగి, కన్నీరు పెట్టుకున్నాను కూడా. ఆవిడ అదిరిపోయారు. కలత చెందారు.
నా భర్త సున్నితత్వం లోపించిన శృంగార చేష్టలకు, రెండేసి రోజులు ముఖం చాటు చేసుకుని తిరిగిన తడవలు ఎన్నో… తలుచుకుంటే…మనసు వికలమై పోతుంది.
ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? జీవితాంతం భరించగలనా? శ్యాం మారుతారా? నా వివాహం వల్ల సమాజంలో తమ గౌరవం పెరిగిందని మురిసిపోతుంది మా కుటుంబం. నా తమ్ముడు వినోద్ కి శ్యాం బావగారు ఓ పెద్ద హీరో.
ఎలా నా మనుగడ సాగాలి? నా మనస్థితి, నా భర్త మొరటు వైఖరి గురించి నోరు మెదిపే అవకాశమే కరువైపోయింది. అదీకాక గుట్టుగా మెలగడం అలవాటున్న నాకు ఇటువంటి ఇబ్బందికరమైన విషయాలతో బయటపడగలగడం అనూహ్యమే. ఆఖరికి, నా స్నేహితురాళ్ళు చిత్ర, రమణిలతో కూడా నోరు విప్పి చెప్పుకొనే సాహసం కొరవైంది నాలో…….అని ఆలోచిస్తూ నిట్టూర్చాను…
“ఏమ్మా అంత దీర్ఘాలోచనలో ఉన్నావు… ఎంత మాలయిందో చూడు. ఇది దేవుడికి వెయ్యి. బటన్ గులాబీలు నీ కోసమే గుత్తిగా కట్టాను. అది నువ్వు పెట్టుకో” అన్న అత్తయ్య మాటకి ఈ లోకంలోకి వచ్చాను.
**
వారమంతా ఒంట్లో నలతగా ఉన్న కారణంగా డాక్టర్ వద్ద పరీక్షలు చేయిస్తే, . ‘ప్రెగ్నెన్సీ’ అని నిర్ధారణయ్యింది. అత్తయ్య చాలా ఆనందంగా ఉన్నారు. ‘గొప్ప శుభవార్త’ అంటూ సంబరపడిపోయారు. శ్యాంలోనూ ఓ కొత్త ఉత్సాహం, సంతోషం కనబడ్డాయి. నాకు మాత్రం ఆ సంగతి తెలిసాక అటు ఇటు కాని భావన, స్థబత తోచింది.
**
మా పెళ్ళిరోజు పొద్దున్నే, అత్తయ్య నాకోసం తీసుకున్న పట్టుచీర కట్టి తయారయ్యాను. శ్యాం, అత్తయ్య, మామయ్యలతో గుడికి వెళ్ళాను. దేవుడికి అభిషేకం చేయించాక మా చేత అన్న, వస్త్రదానాలు చేయించారు.
పెళ్ళిరోజంటూ అత్తయ్యతో ఇలా కొత్త చీర కట్టుకుని గుడికి రావడం, పూజలో పాల్గొనడంతో మనసు తేలికయ్యింది. స్తబ్దత కూడా కాస్త సడలింది..
గుడి నుంచి వచ్చాక అందరం కలిసి భోంచేసాము.
**
లంచ్ చేసి శ్యాం ఆఫీసుకి వెళ్ళిపోయాక డైనింగ్ టేబుల్ వద్ద నేను, అత్తయ్యే మిగిలాము.
స్వీట్ తింటూ నేను తల్లిని కాబోతున్న విషయం ఆలోచిస్తున్నాను. మెల్లమెల్లగా నాకూ సంతోషంగానే అనిపించసాగింది..
నా మనసులోని చిరాకుల్ని, సమస్యల్ని కొద్దిగా పక్కకు నెట్టి ఎలాగోలా జీవితాన్ని అనుకూలంగా మలుచుకోవచ్చునేమో అన్న చిన్న ఆశ కలుగుతుంది. శ్యాం కూడా కొంతైనా మారవచ్చునేమోనన్న ఆలోచనతో పాటుగా.
మౌనంగా కూర్చుండిపోయిన నన్ను గమనించారు అత్తయ్య. నా భుజం మీద చేయి వేసి, “నీవు నిస్సంకోచంగా మసులుకో. దేనికైనా నీకు అండగా నేను ఉన్నాను. నీవు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటూ పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. ఏది ఎలా కావాలన్నా చేయి. అన్నిటా నీకు పూర్తి స్వేచ్చ. దేనికీ మొహమాట పడవద్దు” అన్నారు అత్తయ్య ఆప్యాయంగా.
“బయలుదేరు, మీ మొదటి పెళ్ళిరోజు కానుక కొనడానికి రమ్మన్నాడుగా శ్యాం. ఎంపిక చేసేప్పుడు ఫోన్ చేస్తే, ఆఫీసునుండి నేరుగా షాప్ కి వస్తాన్నాడు” అంటూ నన్ను బయలుదేరదీసారు ఆమె.
**
నా తలకి గాయమయిన సంఘటన తరువాత శ్యాం విషయంగా, అత్తయ్య నా ఆవేదన అర్ధం చేసుకొన్నట్టుగా అనిపిస్తుంది. సొంత తల్లిలా నా వెన్నంటే ఉంటూ అన్నిటా సాయం చేస్తుంటారు.
అవకాశం దొరికినప్పుడల్లా ఆవిడ శ్యాంతో కబుర్లు చెబుతూ, “ఓ ఇంటివాడవయ్యవు.. కాస్త దూకుడు తగ్గించి మృదుత్వం అలవరుచుకోవాలి కన్నా” అని మెత్తగా మందలిస్తారు కూడా.
శనివారాలు పెందరాళే ఇంటికి వస్తారు శ్యాం. ప్రతి శనివారం అతనికి ఇష్టమైన పెరుగువడలు, కోవాలు చేస్తారు అత్తయ్య. కొడుకు పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ ప్రేమగా వడ్డిస్తారు.. వారి మాటలు వింటూ ఒక్కోసారి నేనూ వాళ్ళ వద్ద కూర్చుంటాను.
**
అలవాటుగా శనివారం పొద్దుటే గుడికెళ్ళి వచ్చీరాగానే వంటపనిలో మునిగిపోయారు అత్తయ్య. ఎప్పటిలా ఆవడలతో పాటు ఆలూబోండా, రసమలాయ్ కూడా చేసారామె.
శ్యాం వచ్చాక, డైనింగ్ వద్ద కబుర్లు చెబుతూ ఆయనకి వడ్డించసాగారు. అక్కడే కూర్చుని ఆమె మాటలు వింటున్నాను. కొడుకుకి ఆధ్యాత్మికం బోధిస్తూ, ఉదాహరణలిచ్చి స్త్రీలు సున్నితులని చెప్పారు.
“అంతెందుకు? నీ భార్య ఎంతటి సుకుమారో తెలుసా! ఆ అమ్మాయికి తోటలో పనిచేస్తేనే చేతులు కందిపోతున్నాయి. ఈ నాజూకు పిల్లతో నాజుగ్గానే మసులుకోవాలి” అని నవ్వేసారు.
“అందుకే, అన్నిటికీ పనివాళ్ళని పెట్టుకోమ్మని చెప్పేసాను నీలకి. ఇలా కాఫీలు అందివ్వడానికి కూడా” నవ్వుతూ శ్యాం నేనిచ్చిన కాఫీకప్పు అందుకున్నారు.
**
ఏమైనా, శ్యాంతో ఉన్నప్పుడు… నేనే అప్రమత్తంగా మెలగడం అలవరచుకుంటున్నాను.
నా మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను.
నా భర్తతో జీవనాన్ని సంతోషమైనదిగా చేసుకోవాలని గట్టి ప్రయత్నమే ఆరంభించాలని నిశ్చయించుకున్నాక … ఎక్కడ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచించాను…..
అన్ని సమయాల్లో, ముందు నా జడని అందిపుచ్చుకుంటారు శ్యాం. ఇకపై అతనికి ఆ అవకాశం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో… పొద్దున్నే జుత్తు పొట్టిగా కత్తిరించి ముడి వేసుకొన్నాను. ఇకపై నా జుత్తు లాగుతాడేమో అన్న బెరుకు తప్పినట్టే……అనుకుంటూ కిందికి వెళ్ళి వంటింట్లో అత్తయ్యకి సహాయం చేయబోయాను.
“అదేమిటి నీలా? అంత చక్కని జుట్టుని అలా కత్తిరించేసావు? అన్నారామె ఆశ్చర్యంగా నా వంక చూసి. “పైగా ముసలావిడిలా ఆ ముడి ఏమిటి?” అన్నారు కూడా కోపంగా.
ఏమనాలో తోచక మౌనంగా ఉండిపోయాను. ఆమె అంతలా ఫీల్ అవుతారనుకోలేదు. ఆలోచిస్తే, ‘నా యీ చేష్ట అమ్మకైనా నచ్చదు’ అనిపించింది..
“మరోసారి ఆ పని చేయకమ్మా. చక్కని నీ తలకట్టు, పొడవాటి నీ జడ నీకెంత అందాన్నిస్తాయో తెలుసా?” అంటూ బాధపడ్డారు అత్తయ్య…..
నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నా జడ చూసి అత్తయ్య ఎంత ముచ్చట పడ్డారో గుర్తొచ్చింది. “మీ అమ్మాయికి ఇంత వత్తైన జుత్తు, చక్కని తలకట్టు ఉండబోతాయని ముందే ఊహించి ‘నీలవేణి’ అని పేరు ఎంపిక చేసుకున్నారా వదినా?” అని అమ్మని అత్తయ్య అడగడం…..
“లేదండీ, ఆ అవకాశం నాకివ్వలేదు మా అత్తమ్మ…ఆవిడే ఈ మనవరాలికి నామకరణం చేశారు. ఆవిడ అత్తగారి పేరు ‘నీలవేణి’ అట” అంటూ అమ్మ నవ్వేయడం గుర్తొచ్చింది.
**

సశేషం

1 thought on “రాజీపడిన బంధం – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *