May 25, 2024

లా అండ్ ఆర్డర్

రచన: ధనికొండ రవిప్రసాద్

“ఈ రోజు కొత్త కేసు లేమన్నా వొచ్చాయా? అన్నాడు “యస్.ఐ.
“ఇడుగోండి సర్ ! ఈడు బీచ్ లో స్నానాని కొచ్చిన ఇంగ్లీష్ అమ్మాయి మీద చెయ్యేశాడు. ఆమె కంప్లైంట్ ఇచ్చింది.” అంటూ ఒకణ్ని కాలర్ పట్టుకుని యస్.ఐ. ముందుకి తోశాడు కాన్స్టెబుల్.
“ఏరా ! ఒళ్లు కొవ్వెక్కిందా? అమ్మాయిని చూస్తే నీకు తిమ్మిరెక్కుతుం దనుకుంటా.” అంటూ వాణ్ని జుట్టు పట్టుకుని మూడూపు లూపి “అలా ఎందుకు చేశావ్?” అన్నాడు యస్.ఐ.
వాడు కాస్త పాత కేడీయే కావటం తో అంత భయపడ లేదు. “సారీ సారూ ! నే నెట్టాంటోన్నైనా ఆడోల్ల జోలికి పోను గానీ ఆమె బికినీ యేసుకోని నా పక్కనే స్తానం చేస్తంటే తట్టుకోలేకపొయ్యాను” అన్నాడు వాడు.
“ఆమె బికినీ యేసుకుంటది. ఏమైనా యేసుకుంటది. అయన్నీ నిన్నెవడు చూడమన్నాడు. నీ కంట్రోల్ నీ కుండాల” అంటూ రెండు దెబ్బ లేసి “యీణ్ని లాకప్ లో యెయ్యి” అన్నాడు యస్.ఐ.

*****************************

“సార్ ! ఈ కుర్రోడు “ఒకమ్మాయిని టీజింగ్ చేస్తున్నట్టు నిన్న కేసు పెట్టారు కదా ! ఈణ్నియ్యాలే పట్టుకొచ్చా” అంటూ ఒక జీన్ ప్యాంటు కుర్రాణ్ని ముందుకి తోశాడు కాన్స్టేబుల్.
“ఏరా ! ఒళ్లు బలిసిందా! అమ్మాయిలంటే తేలిగ్గా ఉన్నారా?” అని లాటీ ఎత్తాడు యస్.ఐ.
“సర్ !సర్! నన్ను అపార్థం చేసుకోకండి సర్ ! నేను టీజింగ్ చెయ్యటం లేదు. సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవా లనుకుంటున్నాను . అదే ఆమెని రిక్వెస్ట్ చేస్తుంటే టీజింగ్ అని కేసు పెట్టింది.” అన్నాడు కుర్రాడు.
“దాన్ని ప్రేమ అని నువ్వంటే సరిపోదు. ఆమె దానిని ప్రేమ అనుకుంటే ప్రేమ. టీజింగ్ అంటే టీజింగ్. సినిమాలు చూసి అది ప్రేమ అంటే కుదరదు. అమె టీజింగ్ అంది కాబట్టి అది టీజింగ్ కిందే లెక్క. కాన్స్టెబుల్! ముందీణ్ని లోపలెయ్. తరవాత చూద్దాం” అన్నాడు యస్.ఐ.
“సర్!సర్! మరి సినిమాలల్లో, పత్రికలల్లో ఉన్న ప్రేమకథ లన్నీ ఏమై పోవాలి ! ప్రేమే నేరమా !” అని కుర్రాడు అరుస్తున్నా పట్టించుకోకండా లోపలేశాడు కాన్స్టేబుల్.

******************************

ఇంతలో ఒక మధ్యవయస్సు ఉన్న హైక్లాస్ మనిషి స్టేషన్ కొచ్చి “నమస్తే సర్!” అన్నాడు.
పరిచయాలు అయ్యాక “కేస్ ఏమిటో చెప్పండి “అన్నాడు యస్.ఐ.
కేసు వివరించాడతను. క్లుప్తంగా ఆ కేసు ఇది. అతని భార్య అతని స్నేహితునితో అక్రమసంబంధం పెట్టుకుంది. “అదేమిటి?” అంటే నా యిష్టం. చేతైంది చేసుకో. కేసు పెట్టుకో” అంది .
“దీనికి మేము చెయ్యగలిగిందేమీ లేదు సర్ ! మీ ఆవిణ్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఈ మధ్యన చట్టాలు మారాయి. మీకు తెలియదా ? భార్య అక్రమసంబంధం పెట్టుకోవాలంటే దానికి భర్త పర్మిషన్ అక్కర లేదు. ఆమె ఇష్టం ఆమెది.”అన్నాడు యస్.ఐ.
“అదేమిటి సర్! ఇక పెళ్లికి అర్థమేమిటి ?”అన్నాడు ఆ పెద్ద మనిషి .
“అర్థాలు, తాత్పర్యాలు చెప్పటం మా పని కాదు సర్ ! ఉన్నది అమలు చెయ్యటమే మా పని. సారీ.” అన్నాడు యస్.ఐ.

————————————-

ఇంతలో లాల్చీ , ఫైజమా వేసుకున్న ఒక పెద్ద మనిషి స్టేషన్ కొచ్చి ఒక నమస్కారం విసిరాడు. దాన్ని “నమస్కారం” అనటం కంటే “నమస్కారబాణం” అనచ్చు. ఆయన లెవెల్ అది. ఏమిటి సర్ ! అన్నాడు యస్.ఐ.
“మా యమ్మాయి కనబట్టం లేదండీ !” అన్నాడు పెద్ద మనిషి గద్గదకంఠం తో.
“ఎప్పట్నించి ?” అన్నాడు యస్.ఐ.
“రాత్రి పార్టీ కెల్లింది. ఏ టైం కీ రా లేదు.”అన్నాడు పెద్ద మనిషి.
“పార్టీలో అబ్బాయిలు కూడా ఉన్నారా ?”అన్నాడు యస్.ఐ.
“మరి పార్టీ అన్నాక అమ్మాయిలు , అబ్బాయులు ఇద్దరూ ఉంటారు కదండీ ! ఆళ్లు డ్యాన్సులు చేస్తారు. పాటలు పాడుకుంటారు, ఫొటోలు దిగుతారు . అన్నీ ఉంటాయి . మా యమ్మాయ్ సోషల్ గానే ఉంటది లెండి అన్నాడు పెద్ద మనిషి .
“మీ అమ్మాయి ఫొటో ఉంటే ఇస్తారా?” అన్నాడు యస్.ఐ.
ఒక నాలుగైదు ఫొటోలు చేతికిచ్చాడు పెద్ద మనిషి.
“పిల్లాళ్లతో వచ్చే చిక్కు ఇదేనండీ ! ఏ ఫొటో లోను లక్షణంగా చీర ఐతే లేదు. చీర కట్టుకుంటే బండి నడపటానికి, ఎకసర్సైజులు చెయ్యటానికి కష్ట మంటారు . పోనీ ప్యాంటు. షర్టు వేసుకున్నా మరీ ఇంత బిగుతైన డ్రస్సులు, ఎక్స్పోజింగ్ టైప్ లో వెయ్యటం , దాని మీద మళ్లీ “ఐ లవ్ యు”, “కిస్ మి” లాంటి రాతలు ఇయ్యన్నీ మంచివి కాదండీ ! సరే ! చీర కట్టుకుని పద్దతిగా ఉన్న వాళ్లనీ మానభంగం చేసే యెదవ లున్నారు. ఆళ్లని ఉరితీసినా తప్పు లేదు కానీ అమ్మాయిలకీ కొంత పద్దతి అవసరమే నండీ !” అన్నాడు యస్.ఐ.
“అదేంటండీ ! ఎవళ్ల డ్రస్సు ఆ ళ్లిష్టం. మొగ యెదవలకి బుద్దుండక్కర్లేదా ?అమ్మాయిల్ని కాపాడాల్సిన పోలీసులే అబ్బాయిల్ని సపోర్ట్ చేస్తే ఎట్టా? ” అన్నాడు పెద్ద మనిషి. “యం.ఎల్.ఎ. గారు మా బందువే. అవసర మైతే సి.యం గారికి, ఐ.జి. గారికి ఫోన్ చేస్తారు.”అన్నాడు బింకంగా . కానీ ఏడుపు ఆపుకోలేక భోరుమన్నాడు.
“ఆయనకి మంచీ చెడు ఇప్పుడు చెప్పినా లాభం లేదని తెలుసుకుని “సర్లెండి. మా రైటర్ కి చెప్పి కంప్లైంట్ రాయించండి. అర్జెంట్ గా అన్నాడు యస్. ఐ.

—————————-

ఒక ముప్ఫై ఏళ్లమ్మాయిని , ఒక కుర్రాణ్ని స్టేషన్ కి తీసుకోచ్చింది ఒక లేడీ కాన్స్టెబుల్. “సర్ ! ఇది వ్యభిచారం చేస్తోంది. అదేమంటే ఆడు నా చుట్టం అని అబద్దం చెపుతోంది. రెండు తగిలిస్తే నిజం చెప్పింది ” అంటూ ఆ అమ్మాయిని , అబ్బాయిని జుట్ట్లు పట్టుకుని యస్.ఐ ముందుకి తోసింది.
“సార్ ! సార్ ! సార్ ! బుద్ది తక్కువైంది సారు ! కాల్ మొక్తా ! నా తాగుమోతు మొగుడు తిండి పెట్టక సావ బాదతంటే గతిలేక చేశా ! ఈ సారి మొదటి తప్పుగా వొదిలెయ్యండి . నా కాపరం తియ్యకండి. కొట్టినా సంపినా నా మొగుడితోనే బతుకుతా”అని కాళ్లా వేళ్లా పడుతున్నా వినకండా “దీన్ని లోపలెయ్” అన్నాడు యస్.ఐ.

************************

మర్నాటి కేసులు – ఒక ఇరవై ఏళ్ల కుర్రాణ్ని లాక్కుంటూ తీసుకొచ్చాడు ఒక కాన్స్టేబుల్. “కేసేంటి?” అన్నాడు యస్.ఐ.
“ఇది చాలా పెద్ద కేసు సార్ ! ఈ మద్యన ఒకమ్మాయి ఆటోలో పోతంటే ఒక కుర్రాడు ఆమెని చూసుకుంటా అస్తప్రయోగం చేసుకున్నాడని కేసు పెట్టింది. అది పేపర్లో గూడా వొచ్చింది. ఆడి ఫొటోని పట్టుకుని ఆరు పోలీసు బృందాలు దేశమంతా గాలించినయ్. ఆడు మనకి దొరికిండు. ఇదుగోండి. పేపర్లో ఫొటో ఈడిదే ” అంటూ వాణ్ని యస్.ఐ. ముందుకి తోశాడు కాన్స్టెబుల్. “సార్ సార్ ! ఆమని నేనేమీ చెయ్య లేదు సార్ !ఒట్టు” అన్నాడు కుర్రాడు.
“యెదవ ! నీది దేశమంతా అట్టుడికిన కేసురా ! నిన్నొదల. ఆమని నువ్వేం చెయ్య లేదు సరే . ఆమె ఎదురుగా నిన్ను నువ్వు చేసుకున్నా తప్పే. నీకు లా అంతా చెప్పక్కర్లేదు.” అంటూ కాన్స్టేబుల్ కి చెప్పి లోపలేయించేశాడు యస్.ఐ.

****************************

ఇంతలో ఇద్దరు కుర్రాళ్లని చెరొక రెక్కా పట్టుకుని లాక్కొచ్చాడు ఒక కాన్స్టెబుల్. “హబ్బబ్బ ! అన్నీ సెక్స్ స్కాండల్స్ కేసులే. ఇదీ అంతేనా?”అన్నాడు యస్.ఐ.
“ఈ ఇద్దరు కుర్రోళ్లూ సినిమా ఆల్ పక్క సందులో అర్దరాత్రి పూట సెక్స్ యవ్వారం నడుపుకుంటన్నా రండీ ! ఆడ, మగ మద్యన సెక్స్ సంబందమంటే ఏదో అనుకుంటాం గానీ ఇద్దరూ మొగోళ్లే. చ్చి చ్చి ! చెపటానికే అసయ్యప కేసు” అన్నాడు కాన్స్టెబుల్.
“ఆళ్ల ప్రేమని అసయ్యించుకోటానికి నువ్వేవడివి ? పోలీసుద్యోగం లో ఉన్నోడికి” లా” కొంచె మైనా తెలవా లయ్యా . నువ్వు పేపర్ చదవ్వయ్యే . స్వలింగసంపర్కం తప్పు కాదు. ఇది ఆడ మగ సమైక్యంగా సాధించిన సామాజికవిప్లవం. చెరొక చాయ్ ఇప్పించి సారీ చెప్పి వొదిలెయ్యి ” అన్నాడు యస్.ఐ.

*******************

ఇంకో కేసు_ ఒక ఆసామి ఒక చిరిగిన లాగూ,బనీను వేసుకున్న ఒక కుర్రాణ్ని బరబరా ఈడ్చుకుంటూ స్టేషన్ కి లాక్కొచ్చాడు . “ఏంటిది?” అన్నాడు యస్.ఐ.
“ఈడు నా బర్రెని దారుణంగా మానభంగం చేశాడు సార్ ! ” అన్నాడు ఆసామి.
“ఈ దేశం లో మనుషులకే కాదు. బర్రెలకి కూడా రక్షణ లేకండా పోయింది. ఏరా ! ఏం చేశావో వివరంగా చెప్పు. అంటూ రెండు చెంపకాయ లేశాదు యస్.ఐ . వాడు సిగ్గు పడుతూ మొత్తం చెప్పాడు. “ఈణ్ని లోపలెయ్” అని కాన్స్టెబుల్ కి చెప్పాడు. “జంతువులతో సెక్స్ ఒక నేరం. ఒక మగవాడు ఒక బర్రెని పొదుగు మీద చెయ్యేసి పాలు పిండవచ్చు . ఒక దున్నపోతుతో ఒక బర్రెకి మానభంగం చేయించి దానికి చూడి తెప్పించ వచ్చు. కానీ ఒక మగవాడు తానుగా బర్రెని మానభంగం చెయ్య కూడదు . అదే మళ్లీ మొగాడు మగాడితో, ఆడది ఆడదానితో సంబంధం పెట్టుకో వచ్చు.” అంటూ చట్టాన్ని కాన్స్టెబుల్స్ కి వివరించి ఎడ్యుకేట్ చేశాడు యస్.ఐ . “మనం పౌరులం . పైగా పోలీసులం. చట్టాలు తెలుసుకొని కాపాడటం మన బాధ్యత” అంటూ హితవు చెప్పాడు . “సెక్స్ లో ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోవాలంటే ఇన్ని చట్టాల నాలెడ్జ్ ఉండా లన్న మాట. మనకసలు తప్పొప్పులు తెలియవు ” అనుకుంటూ యస్.ఐ. గారు చెప్పినదాన్ని జాగ్రత్తగా విన్నారు కాన్స్టెబుల్స్.

1 thought on “లా అండ్ ఆర్డర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *