March 19, 2024

అమ్మమ్మ – 10

రచన: గిరిజ పీసపాటి

సంవత్సర కాలం గడిచింది. నాగ పరికిణీ, ఓణీల్లోకి ఎదిగింది. పెద్దబావ, చిన్నబావ వారి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని రాముడువలస వెళ్ళిపోయారు. పెద్దబావ చదువులో పెద్దగా రాణించకపోవడం, ఏడ‌వ తరగతి చదువుతున్న సమయంలో ఇస్నోఫిలియా రావడంతో తన తమ్ముడితో కలిసి టెన్త్ క్లాస్ పూర్తి చేసాడు. రాముడువలస వెళ్ళాక ఇద్దరూ పియుసి చదవసాగారు.
రెండు కుటుంబాల మధ్యా రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. ఐదవ తరగతి వేసవి సెలవుల్లో ఒక్కసారి మాత్రమే రాముడువలస వెళ్ళిన నాగని తరువాత రాముడువలస పంపలేదు అమ్మమ్మ. చక్కగా చదువుకుంటూ ప్రతీ ఏడూ మంచి మార్కులు తెచ్చుకుంటూ తండ్రి గారాబం, తల్లి కట్టుదిట్టాల మధ్య చక్కగా పెరగసాగింది నాగ.
ఇక అందచందాల విషయానికొస్తే అమ్మమ్మ అందాన్నే పుణికిపుచ్చుకుని అప్సరసలు కూడా దిగదుడుపే అన్నంత అందంగా ఉంటుంది. కాలక్రమంలో మరో ఏడాది కరిగిపోయి నాగకు పదమూడు సంవత్సరాలు నిండాయి. సెకెండ్ ఫారమ్ పరీక్షలు రాసింది.
పీసపాటి తాతయ్య తెనాలి తాతయ్యతో పెళ్ళి విషయం కదిపారు. ముందుగా అనుకున్న విధంగా తమ పెద్ద కొడుకుతో నాగ పెళ్ళి జరిపించి ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని కోరారు. తెనాలి తాతయ్య సరేనన్నారు. మంచి ముహూర్తం చూసి కబురు చేయమని చెప్పి పీసపాటి తాతయ్య వెళ్ళిపోయారు.
అమ్మమ్మ గుండెల్లో మళ్ళీ రాయి పడింది. ముందుగా అనుకున్న సంబంధమే కాని ఈ సంబంధంలో ఎన్నో లోపాలు కనిపించాయి అమ్మమ్మకి. అబ్బాయి పెద్ద అందగాడు కాదు. నల్లటి నలుపు. బాగా భయస్తుడు. చదువు కూడా పెద్దగా అబ్బలేదు. పియుసి మొదటి సంవత్సరమే పూర్తి చేయలేకపోయాడు.
సంపాదన లేదు. తండ్రి సంపాదన పైనే అతడు ఆధారపడి బతుకుతున్నాడు. రేపు పెళ్ళయ్యాక తన కూతురు, పిల్లలు కూడా పెద్దాయన సంపాదన మీద ఆధారపడల్సిందే. అది ఆత్మాభిమానం ఉన్న మగాడు చేసే పని కాదని అమ్మమ్మ అభిప్రాయం. పైగా వెనుక ఉన్న ఆస్థిని మాత్రమే చూసి పెళ్ళి చేయడానికి అమ్మమ్మ మనసు అంగీకరించడం లేదు.
ఆ ఆస్తి అంతా అతడి తండ్రి సంపాదనే. రేపు ఇందులో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అంటే అతడు చేసేదేమీ లేదు. అదే జరిగితే తన కూతురు, పిల్లలు అన్యాయం అయిపోతారు. దేనికైనా ముందు కీడెంచి మేలెంచాలంటారు. అబ్బాయి బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడినవాడైతే బాగుంటుంది. కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అనే నానుడి ఊరికినే రాలేదు కదా!
అబ్బాయి నాగ కన్నా దాదాపు తొమ్మిది సంవత్సరాలు పెద్దవాడు. ఇవన్నీ కాక తెనాలికి బొబ్బిలి చాలా దూరం. పిల్లను కనీసం ఒకసారి కళ్ళతో చూసుకోవాలన్నా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా అమ్మమ్మ వెలిబుచ్చిన ప్రతీ భయాన్ని తన వాదనతో కొట్టి పడేసారు తెనాలి తాతయ్య. పురుషాధిక్య సమాజంలో భర్త మాటకు ఒక భార్యగా తలొగ్గక తప్పలేదు అమ్మమ్మకి.
తెనాలి తాతయ్య తమ పురోహితుడిని సంప్రదించి మంచి ముహూర్తం పెట్టించి రాముడువలస వెళ్ళి పీసపాటి తాతయ్యకు చెప్పారు. పెద్దలంతా ఆ ముహూర్తం బాగుందనడంతో, ఆ ముహూర్తానికే లగ్నం నిశ్చయించుకుని, లగ్న పత్రిక రాయించుకుని, ఐదు రోజులు పెళ్ళి జరపితే బాగుంటుందనే మగ పెళ్ళివారి కోరికను మన్నించి మరీ తెనాలి వచ్చారు.
మే నెల 24వ తారీఖున పెళ్ళి. అమ్మమ్మ లగ్న పత్రికను చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ పెళ్ళి అమ్మమ్మే కాక తాతయ్య, అమ్మమ్మల బంధువర్గం కూడా ఇష్టపడలేదు. లేకలేక పుట్టిన ఒక్కగానొక్క పిల్లను అంత దూరాన ఇస్తున్నారు. ఈ సంబంధం వలన పిల్ల అందరికీ దూరం అయిపోతోంది. కష్ట సూఖాలకు మనమెవ్వరం ఉండలేని పరిస్థితి అని బాధ పడ్డారు.
ఒక మంచి ముహూర్తాన గోధుమ రాయి పెట్టి, పసుపు దంపి పెళ్ళి పనులు ప్రారంభించారు. పెళ్ళి బట్టలు తియ్యడానికి మగ పెళ్ళివారందరినీ తెనాలి తీసుకొచ్చి దగ్గరుండి ఎవరికి ఏ రంగు వెండి జరీ కంచిపట్టు చీర నచ్చితే ఆ చీర తీసుకోమని ఆడవారికి చెప్పి, మగవారందరికీ పట్టు పంచెల చాపులు కొన్నారు. ఇక రైతులకి, పాలేర్లకు, ఇతర నౌఖర్లకి ఆడ, మగ అందరికీ జరీ పంచెలు, చీరలు తీసుకున్నారు.
పెళ్ళి రోజు దగ్గరకు రాగానే మగ పెళ్ళివారు రాముడువలస నుండి తెనాలి తరలి రావడానికి ఒక బస్సును వేసారు. ఆ బస్సులో మగ పెళ్ళివారు పెళ్ళికి ఒకరోజు ముందుగానే తరలి వచ్చారు. మగ పెళ్ళివారు రాగానే అన్ని లాంఛనాలతో స్వాగతం పలికి విడిది ఇంటికి తీసుకుని వెళ్ళారు అమ్మమ్మ, తాతయ్య.
విడిదింటిలో ఉన్న మగ పెళ్ళవారికి ఏ లోటూ రానివ్వకుండా వేళకి అన్నీ అమర్చిపెడుతున్నారు ఆడ పెళ్ళివారు. ఐదు రోజుల పెళ్ళి కావడంతో ఏ రోజున ఏ కార్యక్రమం జరిపించాలో ఇరువైపు పెద్దలూ, పురోహితులు మాట్లాడుకుని నిర్ణయించుకున్నారు.
మొదటి రోజు తోట సంబరం, రెండవ రోజు కత్తెర, స్నాతకం, మూడవరోజు కాశీ ప్రయాణం, నాలుగో రోజు అలకపాన్పు, దొంగ వెల్లి, ఐదవ రోజు జీలకర్ర, బెల్లం, నల్ల పూసలు, మంగళ సూత్ర ధారణ, మిగతా కార్యక్రమాలు జరిపించాలని నిర్ణయించారు. .
ఉదయం కాఫీలు, టిఫిన్ లు అయాక మధ్యాహ్నం భోజనానికి తరలి రమ్మని మగ పెళ్ళివారిని పిలవడానికి వెళ్ళారు అమ్మమ్మ, తాతయ్య. ఆడవారికి అమ్మమ్మ, మగవారికి తాతయ్య బొట్టు పెట్టి భోజనానికి రమ్మని పిలిచారు.
కానీ… భోజన సమయం మించిపోతున్నా ఒక్కరు కూడా భోజనానికి రాకపోయేసరికి మళ్ళీ ఇద్దరూ విడిదింటికి వెళ్ళి భోజనానికి రమ్మని అభ్యర్థించారు. మీరు పిలిస్తే ఎలా వస్తాం? పెళ్ళి కూతురు కూడా మీతో వచ్చి పిలవాలి. అది మా సంప్రదాయం. అలాగయితేనే భోజనానికి వస్తామన్నారు మగ పెళ్ళివారు.
తెనాలి ప్రాంతంలో ఇలాటి సంప్రదాయం లేనందున ఇదెక్కడి చోద్యం అనుకుంటూ తాతయ్య, అమ్మమ్మ తిరిగి ఇంటికొచ్చి నాగను పల్లకిలో కూర్చోబెట్టి విడిదింటికి తీసుకెళ్ళి అందరినీ భోజనానికి తరలి రమ్మని పిలిచాక అప్పుడు అంతా వచ్చి భోజనం చేసారు.
ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా పెళ్ళికూతురు వచ్చి పిలవాలని వారు చెప్పడం, వీరు ఇదెక్కడి ఆచారం అని బుగ్గలు నొక్కుకుంటూనే చేసేది లేక పల్లకీలో పెళ్ళి కూతురుని తీసుకెళ్ళి పిలవడం జరిగేది. ఈ తతంగమంతా పెళ్ళికి వచ్చిన జనాలకే కాక ఊరిలోని వాళ్ళకు కూడా విచిత్రంగా అనిపించింది. పెళ్ళి కూతురి అన్నదమ్ములు చేయాల్సిన కార్యక్రమాలన్నీ పెద్దన్నయ్య దగ్గరుండి చేస్తున్నాడు.
ఈ విధంగా పెళ్ళి తంతు అంతా ఒకరి పధ్ధతులు మరొకరికి కొత్తగా వింతగా ఉన్నా సరదాగా ఎంజాయ్ చెయ్యసాగారు ఆ పధ్ధతులని. ఒక్కొక్క రోజూ ఒక్కొక్క తంతు చొప్పున జరుపుతూ నాలుగవ రోజుకి చేరాయి సంబరాలు. దొంగ వెల్లి కార్యక్రమానికి సిధ్ధం కమ్మని మగ పెళ్ళివారు ఆడ పెళ్ళివారికి కబురు పెట్టారు.

******** సశేషం ********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *