March 19, 2024

మహా భారతము నుండి ఏమి నేర్చుకోవచ్చు ?

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు.

మహాభారతమును పంచమ వేదము అంటారు. అంటే వేదాలు మనకు అనేక విషయాలను తెలియజేస్తాయి. చాలా విషయాలకు వేదాలలో చెప్పబడ్డవే ప్రామాణికంగా ఈ నాటికి నిలుస్తున్నాయి. అలాగే మహాభారతము దాయాదుల పోరు అయినప్పటికీ రాజనీతి అనేక ధర్మసూక్ష్మాలు, వేదాంత విషయాలు, యుద్ధ తంత్రాలు మొదలైన అనేక విషయాలు విపులముగా చర్చింపబడ్డాయి. విదురుడు, భీష్ముడు లాంటివారు అనేక రాజనీతి సూత్రాలు వివరిస్తారు. దురదృష్టము ఏమిటి అంటే దృతరాష్ట్రుడు దుర్యోధనుడు లాంటి వారు పెడచెవిన బెట్టి నాశనము అయినారు. శ్రీకృష్ణుడు లాంటి మహానుభావుల సాంగత్యమువల్ల పాండవులు బాగుపడ్డారు. అలాగే జూదము అనే వ్యసనము వల్ల ధర్మరాజు, ఈర్శ్యవల్ల దుర్యోధనుడు నష్టపోయినారు. ఈ విధముగా భారతము చదవటం వల్ల మనము అనేక విషయాలను తెలుసుకోవచ్చు. కాబట్టి నేటికీ సమాజములో సమస్యలను వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవటానికి భారతము ఉపయోగిస్తుంది. భారత పఠనము మనిషి మేధస్సును పెంచుతుంది. కాబట్టి మహాభారతము నుండి మనము చాలా నేర్చుకోవచ్చు
కానీ ప్రస్తుతము ఏమి నేర్చుకోవచ్చో క్లుప్తముగా తెలుసుకుందాము.
1. ఏదైనా చేయబోయేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి:- భీష్ముడు తన సోదరుడైన విచిత్రవీర్యుని కోసము అంబా అంబాలిక, అంబికల స్వయంవరానికి వెళ్లి ఆ ముగ్గురిని ఎత్తుకువస్తాడు (బలవంతుడు కాబట్టి) కానీ అంబా తానూ సాళ్వరాజును ప్రేమించాను, పెళ్లిచేసుకోవాలి అంటే అక్కడకు పంపుతాడు కానీ సాళ్వ రాజు నిరాకరిస్తాడు. అంబ భీష్ముడిని వివాహమాడమంటే తానూ పెళ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేసాను కాబట్టి పెళ్లిచేసుకోను అంటాడు. కోపముతో అంబ తపస్సు చేసి శిఖండి రూపములో భీష్ముడి చావుకు కారణమయింది. భీష్ముడు ఆ ముగ్గురు కన్యలను ఎత్తుకొచ్చేముందు కొద్దిగా అలోచించి ఉంటే ఇంత అనర్ధము జరిగేది కాదు. అందుకే అంటారు. మనము ఏదైనా చేయబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అని. అలాగే కుంతీ దుర్వాస మహాముని ఇచ్చిన వరాన్ని ఆలోచించకుండా వాడుకొని సూర్యుని వల్ల పెళ్లి కాకుండానే కర్ణునిజన్మకు కారణమయింది
2. పిల్లల పెంపకం సక్రమముగా లేకపోవటం వల్ల తలెత్తే సమస్యలు :- గాంధారి దృతరాష్ట్రుడు ఇద్దరు కూడా అమితమైన పుత్రప్రేమ వల్ల దుర్యోధనుడు మిగిలిన కౌరవులు అనేక అధర్మ కృత్యాలు చేస్తున్నప్పటికీ తెలిసి ఉండి కూడా ఏమాత్రము నిరోధించలేదు. ఆ రకమైన పుత్ర ప్రేమ వల్ల వంశము పూర్తిగా నాశనము అయింది. అది పూర్తిగా తల్లిదండ్రుల పెంపకంలో లోపమే, ఏ ఒక్క సందర్భములోను వారు వారి సంతతి చెడ్డపనులను తప్పు అని చెప్పలేదు. చెపితే వినేవారో కాదో తరువాత సంగతి కానీ అసలు చెప్పే ప్రయత్నమూ చేయలేదు.
2. దుర్జన సాంగత్యము జీవితాలను నాశనము చేస్తుంది:- దుర్యోధనుడు శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు వంటి వారి సలహాలు విని అధర్మ కార్యాలు, కుట్రలు, కుతంత్రాలు చేసాడు. పాండవుల పట్ల ద్వేషము పెంచుకుంటాడు. దుర్యోధనుడు ఈర్ష్య అసూయల వల్ల తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు.
3. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడాలి :- అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకుని తల్లి కుంతిని ఏమిచేయమంటావు అని అడిగితే ద్రౌపది విషయము తెలుసుకోకుండా ఐదుగురిని పంచుకోమంటుంది. ఆ కారణముగా ద్రౌపది ఐదుగురు పాండవులకు భార్య అవుతుంది. పూర్తిగా సమాచారం తెలుసుకోకుండా కుంతీ అనటం వల్ల ఇది జరిగింది. ద్రౌపది వర ప్రభావము కూడా కారణము అనుకోండి. అలాగే మయసభలో ద్రౌపది దుర్యోధనుడు కొలనులో పడ్డప్పుడు నవ్వింది అంటారు. నిజానికి ఈ విషయము వ్యాస భారతములో లేదు. కానీ కొన్ని కధనాల ప్రకారము అవమానము పొందిన దుర్యోధనుడు యుద్దానికి కారణమవుతాడు.
4. స్త్రీలను గౌరవించాలి తప్ప అవమాన పరచకూడదు :-ద్రౌపదిని నిండు సభలో అవమాన పరిచిన కౌరవులు ఆ అవమానాన్ని చూసిన అందరు నాశనము అవుతారు(ఆ అవమాన పరచటంలో వారి పాత్ర లేకపోయినా). అందువల్ల స్త్రీలను గౌరవించకపోయిన ఫరవాలేదు కానీ వారిని అవమాన పరచకూడదు అని భారతము చెపుతుంది.
5. ఎప్పుడు కూడా భగవంతుని మించి ఏది కోరుకోకూడదు:-యద్ధానికి ముందు దుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుని వద్దకు సహాయము కోసము వస్తారు. అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని నారాయణ సేనను అడుగగా, అర్జునుడు ఒక్క శ్రీకృష్ణుని మాత్రమే అడుగుతాడు. అప్పటికి శ్రీకృష్ణుడు తానూ ఆయుదము ముట్టనని చెప్పినప్పటికీ, భగవంతుడి ముందు ఏది ఎక్కువకాదు ఇది గ్రహించిన అర్జునుడు భగవంతుడినే కోరుకుంటాడు ఫలితము అందరికి తెలిసినదే.
6.ప్రజ్ఞ పాటవాలు ముఖ్యము కాదు ధర్మమే జయిస్తుంది:- కౌరవ పక్షాన అతిరధ మహారధులైన బీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వథామ, కర్ణుడు వంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ వారి పక్షాన ధర్మము లేదు. కాబట్టి ధర్మము పాండవులపక్షాన ఉండబట్టి పాండవులు కురుక్షేత్ర యుద్దములో గెలిచారు.
7. గురువు దగ్గర నేర్చుకొవటానికి అబద్దాలు చెప్పరాదు:-కర్ణుడు పరుశరాముని దగ్గర విద్య నేర్చుకొవటానికి తానూ క్షత్రియుడినని అబద్ధము చెప్పి నేర్చుకున్న విద్య ఎందుకు కొరగాకుండా పోయింది కాబట్టి ఎప్పుడు విద్య నేర్చుకోవటానికి గురువుతో అబద్ధము చెప్పకూడదు.
8. భగవంతుడిని నిత్యమూ ఆరాధిస్తుంటే భగవంతుడే మన గురించి శ్రద్ద వహిస్తాడు:- ద్రౌపది శ్రీకృష్ణుని పట్ల అచంచలమైన భక్తి భావాన్ని కలిగి ఉండటం వళ్ళ ద్రౌపదిని నిండుసభలో వస్త్రాపహరణము చేసేటప్పుడు భగవంతుడే రక్షిస్తాడు. ద్రౌపది కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడే ఆదుకుంటాడు.
9. పూర్తి పరిజ్ఞానము లేకపోవటం ఏంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది:- అభిమన్యునికి పద్మవ్యూహము చేదించి లోపలి వెళ్ళటం తెలుసుకానీ బయటకు రావటము తెలియదు కాబట్టి లోనికి వెళ్లిన అభిమన్యుడు కౌరవులచేతిలో మరణిస్తాడు. అలాగే అశ్వథామ కుశక్తివంతమైన బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము ప్రయోగించటం తెలుసుకానీ ఉపసంహరించటం చేతకాదు అందువల్ల జరిగిన అనర్ధాలు తెలుసు కదా.
10. ఎప్పుడైనా ఏ స్త్రీకి అయినా ఇష్టము లేని వివాహమును తలపెట్టకూడదు:-. రుక్మిణి సోదరుడు రుక్మి తన సోదరి రుక్మిణి అభీష్టానికి వ్యతిరేకముగా రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి వివాహము చేయదలచి శ్రీ కృష్ణుని చేతిలో పరాభవం చెందుతాడు
11. కురుక్షేత్ర సంగ్రామానికిముందు అర్జునుడు భావోద్వేగానికి లోనయి తానూ యుద్ధము చేయలేనని అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీతను భోదిస్తాడు. భగవత్ గీత ఏ మనిషి అయినా తనకు నిర్దేశింపబడిన కార్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయాలి భగవంతుడే అన్ని నిర్ణయిస్తాడు. మన చేత చేయిస్తాడు. మనిషి నిమిత్తమాత్రుడు అని గీత సారాంశము కాబట్టి అంత కురుక్షేత్ర యుద్దాన్ని శ్రీ కృష్ణ పరమాత్ముడే నడిపిస్తాడు. దీనికి నిదర్శనము యుద్ధము అయిపోయిన వెంటనే శ్రీ కృష్ణుడు అర్జునుడిని రధము దిగమని చెపుతాడు. ఇద్దరు రధము దిగిన వెంటనే జెండాపై గల హనుమంతుడు అదృశ్యము అవుతాడు రధము ముక్కలవుతుంది. ఇవన్నీ భగవంతుని లీలలే. అర్జునుడు లేదా ఏ యోధుని గొప్పతనము కాదు నడిపించింది భగవంతుడు మాత్రమే. మిగిలినవారు అందరు నిమిత్తమాత్రులే. ద్వాపర యుగాంతమున భగవానుడు తన అవతారాన్ని చాలించినప్పుడు పాండవుల శక్తులు నశించి సాధారణ మనుష్యులుగా మారిపోతారు. భారతములోని ప్రత్యేకత భగవత్ గీత. భగవత్ గీత మనిషి యొక్క కర్తవ్యాన్నివివరిస్తుంది అన్ని నేనే చేస్తున్నాను
అంతా నాదే అన్నభ్రమలను తొలగిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కష్టాలలో ఉన్నపుడు భగవత్ గీత చదవటం ద్వారా తన కష్టాలకు పరిష్కారాన్నికనుగొనగలడు. అందుచేతనే ద్వాపర యుగము నాటి మహాభారతము, అందలి గీత నేటికి సామాన్యులకు పండితులకు ఉపయోగకరముగా ఉంది.
వేద వ్యాసుడు చెప్పిన విధముగా మహాభారతము జరిగింది. ప్రతి సందర్భములో వ్యాసుని పాత్ర మనకు స్పష్టముగా కనిపిస్తుంది కాబట్టి జరిగిన సంఘటనలు అన్ని వ్యాసుడు వ్రాసిన విధముగాజరిగినవే అందరు పాత్రధారులే భగవంతుడే సూత్రధారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *