March 29, 2024

అతనెవడు?

రచన: పారనంది శాంతకుమారి

అందంగా నువ్వు పెట్టుకున్నబొట్టును
అర్ధాంతరంగా తుడిచివేయ మనటానికి అతనెవడు?
అలంకరణకై నువ్వు తొడుక్కున్నగాజులను
ఆ క్షణంనుంచి పగలగొట్టటానికి అతనెవడు?
పెళ్ళిలోకట్టిన మంగళసూత్రాన్ని
పెడమార్గంలో త్రెంచివేయటానికి అతనెవడు?
అర్ధంలేని ఆచారాలను
అతివపై బలవంతంగా రుద్దటానికి అతనెవడు?
మగవాని మోదానికి మూలమైన మగువను
మూల కూర్చోమనటానికి అతనెవడు?
స్త్రీ ఆహారంపై,ఆహార్యంపై
అతిశయంతో ఆంక్షలు పెట్టటానికి అతనెవడు?
పడతి పద్దతిపై,ఉద్ధతిపై
కరుణలేని కాంక్షలు తెలియచేయటానికి అతనెవడు?
వనిత విధానాలపై అతనికున్న హక్కేమిటి?
నెలత నినాదాలపై అతనికున్న టెక్కేమిటి?
ఇంతి ఎదురుతిరిగితే అతనికున్న దిక్కేమిటి?
లలన లాలనను కోల్పోతే అతనికున్న లక్కేమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *