March 28, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 45

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

జీవుడి ప్రాణాన్ని ఒక పక్షిలా..చిలుకలా..హంసలా భావించి తత్త్వాలు చెప్పడం మనకు చాలా కాలంగా ఉన్న ఆచారమే! ఇది ఒక తత్త్వప్రబోధకమైన కీర్తన. వీటిని తెలుగుదేశంలో తత్త్వాలు అని పొట్టిపేరు గట్టిగా ప్రచారంలో ఉంది. ఐతే ఇప్పటి యువతరానికి ఆమాటకొస్తే జనబాహుళ్యానికి తత్త్వము అంటే అర్ధం తెలియదు తత్త్వాలు అంటే అంతకంటే తెలియదు. అన్నమయ్య ఆత్మ పరమాత్మల గురించి “చిలుక” అనే భావంతో మనకు తత్త్వబోధ చేస్తున్నాడు. కీర్తనలోని యధాతధ అర్ధంకన్నా గూడార్ధాలే ఇందులో ఎక్కువగా ఉంటాయి. వాటిని చూద్దాం.

కీర్తన:

పల్లవి: జీవాతుమై యుండు చిలుకా నీ-
వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా ॥పల్లవి॥
చ.1 ఆతుమపంజరములోన నయముననుండి నాచేతనేపెరిగిన చిలుకా
జాతిగాఁ గర్మపుసంకెళ్ళఁబడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా
భాతిగాఁ జదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంపురెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా ॥జీవాతు॥
చ.2 బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రులారుగురికిఁగాక అడిచిపడుదువే నీవు చిలుకా
వదల కిటు యాహారవాంచ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁగూడి మెలగిన చిలుకా ॥జీవాతు॥
చ.3 నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ జిలుకా
శ్రీవేంకటాద్రిపై చిత్తములో నుండి సేవించు కొని గట్టి చిలుకా
దైవమానుషములు తలఁపించి యెపుడు నా తలఁపునఁ బాయని చిలుకా
యేవియునునిజముగా వివియేఁటికని నాకు నెఱఁగించి నటువంటి చిలుకా ॥జీవాతు॥
(రాగం ఆహిరి; సం.1 సంకీ.50)

విశ్లేషణ:
పల్లవి: జీవాతుమై యుండు చిలుకా నీ-
వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా

ఓ చిలుకా నీవు జీవాత్ముడవుగా ఉన్నావు. ఇటువైపు ప్రకృతిలో నీవు జీవాత్మవే కావచ్చును. కాని అటువైపు అంటే ప్రకృతికి బయట, నీ నిజమైన స్వరూపంలో నీవు పరమాత్ముడవే.

చ.1 ఆతుమ పంజరములోన నయముననుండి నాచేతనేపెరిగిన చిలుకా
జాతిగాఁ గర్మపుసంకెళ్ళఁబడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా
భాతిగాఁ జదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంపురెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా
నీ యొక్క నిజమైన స్వరూపాన్ని నేనే! చూడు! తెలివి తెచ్చుకో. ఆత్మ అనే పంజరంలో నీవు నీ నిజస్థితిలో నాకు ప్రతిబింబ మాత్రుడివిగా ఉన్నావు. నీ స్వస్వరూపంలో నాచేతుల్లో ఉంటూ నాలాగే మెలిగేవాడివి. కానీ ఇప్పుడు అలా లేవు కదా! నువ్వు చదువులు, పగలు రాత్రి అనేవి నా నుండే నేర్చుకున్నావు. ఈ దేహమనే రెక్కల చాటున నువ్వు శీతల వాయువులకు ఓర్వలేక పోతున్నావు. అంటే ఎప్పుడైతే నానుండి నీవు ‘నేను వేరు’ అన్న భావనను పొందావో ఆ అహంభావం నిన్ను నానుండి దూరం చేసింది. అది ఒక వదలించుకోలేని బంధం ఐపోయింది. అక్కడి నుండీ నీవు ఏది చేసినా అది ‘నేను చేస్తున్నాను’ అన్న పొరపాటు భావనతోనే చేస్తూ వస్తున్నావు. అదే కర్మబంధం! అందులో పడిచిక్కుకున్న నీవు నీతెలివిని పోగొట్టుకొని పేదవైనావు. ప్రకృతిలో అప్పటివరకూ నాలాగే స్వతంత్రంగా వ్యవహరించిన నీకు ప్రకృతికి బానిసగా మారిపోవలసిన స్థితి కలిగింది. ఎప్పుడైతే నీవు అహంకరించి నా అంతవాడిని నేను అన్న తప్పుడు భావనకు వచ్చావో నాకన్నా భిన్నుడను అనుకున్నావో, అప్పటినుండి నీవు కేవలం ఒక దేహివి మాత్రం ఐపోయావు. నీవు ప్రీతిగా పొందిన ఆదేహం అల్పమైనది. దానిలో దాగి ఉండాలని నీ ప్రయత్నం. కాని అది నిన్ను రక్షించలేకపోతోంది కదా. దాని రక్షణలో ఉన్నానని అనుకొనే నీవు ఈ ప్రకృతిదెబ్బలకు ఓర్చుకోలేకపోతున్నావు కదా. ఇప్పటికైనా తెలివితెచ్చుకో. నీవు ఈదేహానికి బధ్ధుడివి కావు. నీవు నీవే. నా ప్రతిబింబానివి. మేలుకో.

చ.2 బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రులారుగురికిఁగాక అడిచిపడుదువే నీవు చిలుకా
వదల కిటు యాహారవాంచ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁగూడి మెలగిన చిలుకా!

నిన్ను ఈప్రకృతిలో అన్నివైపులకు గుంజుతున్న ఈ పంచేంద్రియాలకు భయపడి అన్నివైపులకు పరుగెడుతున్నావే. నీకేమో ఆరుగురు శత్రువులున్నారు. వాళ్ళని నేను అరిషడ్వర్గం అని అంటాను. నీవేమో మంచి మిత్రులనుకుంటున్నావు లాగా ఉంది. ఎంతో గర్వించి వాళ్ళతో చెలిమి చేస్తున్నావే. వారి చెలిమి వలన నీవు టక్కరివైపోయావు. తిండి సంపాదించి ఈ‌ “నీది” అనే భావించుకొనే దేహం కోసం పదివేల పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు నిత్యం. ఒకప్పుడు నువ్వేనా నాతో కలిసిమెలిసి ఉండి నువ్వే నేనని ఎంతో మమతతో మెలిగినది అని ఆశ్చర్యం వేస్తుంది.

చ.3 నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ జిలుకా
శ్రీవేంకటాద్రిపై చిత్తములో నుండి సేవించు కొని గట్టి చిలుకా
దైవమానుషములు తలఁపించి యెపుడు నా తలఁపునఁ బాయని చిలుకా
యేవియునునిజముగా వివియేఁటికని నాకు నెఱఁగించి నటువంటి చిలుకా
నిత్యం నీవు-నేను అంటూ ఉంటావే! నిజానికి నువ్వెవరు? నేనెవరు? ఇద్దరమూ ఒకటే కదా. ఇకనైనా మేలుకో. శ్రీవేంకటాద్రికి చేరుకో. నీ చిత్తంలో నీవు స్థిరంగా నిలచి నీవెవ్వడవో ఆలోచించుకో. తపించి నిజం స్థిరపరచుకో. అలా వేంకటాద్రిని చేరి ఆ వేంకటాద్రీశుడిని సేవించుకున్నావంటే ఆయన కృపతో నీకు తత్త్వం చక్కగా బోధపడుతుంది. నీకు ఏది దైవసంబంధమైన ప్రకాశతత్త్వమో తెలుస్తుంది. ఏది మానుషమై అహంకారం కారణంగా నిలకడలేక తిరుగుతున్న తప్పుడు జీవితమో చక్కగా అవగతం అవుతుంది. నీవు ఇక నెన్నడూ ఆ సత్యస్వరూపాన్నుండి దూరంగా జరిగిపోవటం అనేది జరుగదు. తస్మాత్ జాగ్రత్త! మరలా ప్రకృతిమాయలోనికి జారిపోకు సుమా! సత్యమైన తత్త్వం నీకు బోధపడినపిమ్మట ఇంకా నేనేమిటి నువ్వేమిటి? ఇద్దరమూ ఒకటే అనటం బాగుంటుంది. అవును. నీవే నేను – నేనే నీవు.

ముఖ్యమైన అర్ధాలు: కాలజేత = కాలం కర్మమునకు లోబడి; భాతి = కాంతి, విధము; సీతు = శీతాకాలము; అయిదుగురికి = పంచేద్రియములకు; శత్రులారుగురికి = అరిషడ్వర్గములకు; వదరుట = వాగుట, మాట్లాడుట; తోరము = స్తూలము, అధికము, బలిష్టము; బాయని = వీడని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *