March 29, 2024

అమ్మకేదిగది?

రచన: ఉమాదేవి కల్వకోట

అందమైన ఇల్లది…ఆడంబరంగా జరుగుతోందక్కడ
గృహప్రవేశం.
విచ్చేసారెందరో అభిమానంగా…ఆహ్వానిస్తున్నారు అతిథులనెంతో ఆదరంగా.
అతిథుల కోలాహలం.. యజమానుల ముఖాల్లో ఉల్లాసం.
ఇల్లంతా చూపిస్తున్నారందరికీ ఎంతో సంబరంగా.
అతిథులు కూర్చునేందుకు ముందొక గది.
ఇంటిల్లిపాదీ టీ.వీ.చూస్తూ, సరదాగా కబుర్లు చెప్పుకునేందుకొక పొడవైన గది.
అందమైన బల్లతో, కుర్చీలతో అన్నాల గది.
ఆధునిక సదుపాయాలతో అందమైన వంటగది.
భార్యాభర్తలది పొందికైన పెద్ద పడకగది.
ఎప్పుడయినావచ్చే చుట్టాలకొరకు అన్ని సదుపాయాలతో ఉన్న చుట్టాలగది.
అయిదేళ్ళ పసిదానికీ ఉందొక ప్రత్యేకమైన గది.
కానీ అరవైఏళ్ళు పైబడ్డ అమ్మకేది గది?
అన్నట్టు ఇన్ని హంగులిచ్చిన దేవుడికీ ఉందిగా దేవుడి గది
తొమ్మిదినెలలు పదిలంగా ఉంచుకుంది తన గర్భమనే గదిలో.
ఉష్ణశీతావాతాతపాలకు దూరంగా క్షేమంగా.
మార్చి ఇచ్చింది తన రక్తమాంసాలను ఆహారంగా.
తన ప్రాణాలను పణంగాపెట్టి పోసింది ప్రాణం.
మరి ఆ అమ్మ కాదా దేవత?ఆమెకేది గది?
ఏ ఇంట్లోనయినా అమ్మకో గది ఉంటే ఆ ఇల్లొక స్వర్గం.
ఆ పిల్లలు అమూల్యరత్నాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *