April 16, 2024

ఆత్మీయులు

రచన: లక్ష్మీ రాఘవ

తిరుమల రావు ఆఫీసు నుండీ ఇంటికి రాగానే భార్య కవితతో
“షాపింగ్ వెళ్లి వచ్చావా? పని పూర్తి అయ్యింది కదా” అన్నాడు.
“వెళ్లి వచ్చాను. అంతా రెడీ… మీరు ఆలస్యం చేశారేమిటి.?”
“నా సూట్కేసు సర్దావా??”
“అన్నీ అయ్యాయి మీరు స్నానం చేసి రండి. డ్రైవర్ వున్నాడు కదా”
“డ్రైవర్ వున్నాడు మనల్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వెడతాడు.” అంటూ బాత్రూం లోకి దూరాడు తిరుమలరావు.
ఏరోప్లేన్ లో కూర్చున్నాక కొడుకు రాకేశ్ గురించే ఆలోచించింది కవిత. బహుశా తిరుమల రావు కూడా అదే ఆలోచిస్తూ ఉండవచ్చు.
రాజమండ్రి లో దిగినాక టాక్సీ మాట్లాడుకున్నారు. మొదట గా నిడుదవోలు కు ప్రయాణం.
నిడదవోలు లో గోదావరి కాలువ ఒడ్డున వున్న కాలనీలో వారు చెప్పిన అడ్రసు కు వెళ్ళింది టాక్సీ.
టాక్సీ దిగుతూ ఉండగానే “రండి రండి …” ఆప్యాయంగా నవ్వుతూ ఎదురు వచ్చాడు రాజారావు.
వెనుకనే నవ్వుతూ ఆహ్వానించిన పార్వతమ్మ…ఇద్దరూ తమ రాక కు ఎంత సంతోషంగా వున్నారో తెలుస్తూంది.
తను తెచ్చిన పళ్ళు పార్వతి చేతిలో పెట్టింది కవిత.
“ఏమిటో ఇవన్నీ… మీ రాకే మాకెంతో సంతోషం” అన్నాడు రాజారావు.
“ఇక్కడికి రావటం మాకెంత ఆనందాన్ని ఇస్తుందో మీకు తెలుసు.” అన్నాడు తిరుమలరావు.
‘’మీరు కాళ్ళు కడుక్కుని రండి…టేబల్ మీద అన్నీ సర్దేస్తాను. కొంచెం కాఫీ ఇవ్వనా?” చనువుగా అడిగింది పార్వతి.
“కాఫీ వద్దు. భోంచేస్తాము” అని బాత్రూం వైపు నడిచింది కవిత. ఆ ఇల్లు బాగా పరిచయమే.
అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం ముగించారు.
“కాస్సేపు నడుం వాల్చండి. రెస్టు తీసుకున్నాక అందరం ద్వారకా తిరుమల కు వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని వద్దాము” అన్నాడు రాజా రావు.
“ఈ సారి వీలు పడదు లెండి. మరోసారి వచ్చినప్పుడు చూద్దాము. ఒక గంట రెస్టు తీసుకుని బయలు దేరుతాము.”
“ఈ రాత్రికి ఇక్కడే వుండి పోకూడదూ” అభ్యర్థించాడు రాజారావు.
“మళ్ళీ ద్రాక్షారామం వెళ్ళాలి కదా. అసలుకు అన్నీ ఈ రోజునే ముగించి వెళ్ళిపోవాలని అనుకున్నాము కానీ వీలు కాదు.” అంటూ రూములోకి వెళ్లి నడుము వాల్చాడు తిరుమలరావు.
కవిత, పార్వతి హాలులో కూర్చున్నారు.
“ఎలా వున్నారు? అని అడగటం భావ్యం కాదేమో కవితగారూ… కానీ మేము మిమ్మల్ని తలుచు కోని దినం వుండదు…”కంటి నిండా నీళ్ళతో అంది పార్వతి.
“అక్కడ ఉన్నామన్న మాటేగానీ మీరు ఎలావున్నారో అని చాలా అనుకుంటాము పార్వతి గారూ…”
“మీరిచ్చిన వరం…అందుకే మీరు తప్పక వచ్చే ఈ రోజు కోసం సంవత్సరమంతా ఎదురు చూస్తాము.”
“మాకూ ఒక తృప్తి. మీకు తెలీనిది కాదు.” ఇలా సాగింది వాళ్ళ సంబాషణ.
ఒక పది నిముషాలు మాత్రమే రెస్టు తీసుకుంది కవిత. తిరుమల రావు లేవగానే అందరికీ కాఫీలు ఇచ్చింది పార్వతి.
“ఒక ట్రే ఇవ్వండి పార్వతీ..” అని వంటింట్లోకి వచ్చింది కవిత.
“ఏమిటో ప్రతిసారీ వద్దన్నా వినరు…”అంటూనే ట్రే ఇచ్చింది పార్వతి.
సూట్కేసు తీసి తను తెచ్చిన చీర పంచెలు తాంబూలం సర్ది ‘పసుపూ కుంకుమ ఇస్తారా’ అని అడిగింది పార్వతిని.
“రండి రాజా రావుగారూ’అని పిలిచి పార్వతి, రాజారావులను పక్క,పక్కల కూర్చోబెట్టి కుంకుమ పెట్టి తాంబూలం అందించారు తిరుమలరావు దంపతులు.
అందుకున్నాక వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి బట్టలు పెట్టారు రాజారావు దంపతులు. ఇది ప్రతిసారీ జరిగే తంతే!
బయలు దేరేముందు కన్నీటి పర్యంతమైంది కవిత. ఇది చూసి కన్నీళ్ళతో నిండిన పార్వతి కళ్ళని ఆప్యాయంగా తుడిచి పార్వతి ముఖం దగ్గరగా తీసుకుని కళ్ళమీద ముద్దు పెట్టుకుంది కవిత.
అక్కడి నుండీ ద్రాక్షారామం వెళ్లేసరికి చీకటి పడింది. నేరుగా ఒక హోటల్ కి వెళ్లి ఫ్రెష్ అయి బ్యాగ్గు తీసుకుని వెంకటేశ్వరులు ఇంటికి వెళ్ళారు.
“రండి..ఇప్పుడే రాజారావు గారు ఫోను చేశారు…మీ కోసమే కాచుకున్నాము.” అన్నాడాయన.
“దారిలో కొంచెం ట్రాఫ్ఫిక్ వల్ల ఆలస్యం అయ్యింది. బాబు బాగున్నాడా….” ఆత్రుతగా అడిగాడు తిరుమలరావు.
“బాబు రాజా బాగున్నాడు. ఇంతవరకూ మీకోసమే ఎదురు చూసి, పని మీద బజారుకు వెళ్ళాడు…రండి కవితమ్మా “అని సమాధానం ఇచ్చింది వెంకటేశ్వర్లు భార్య పద్మావతి.
లోపల వున్నబెత్తం కుర్చీలలో కూర్చున్నారు అందరూ.
లోపలి వెళ్లి క్షణం లో కాఫీ తెచ్చింది పద్మావతి.
తాగుతూ గుమ్మం వైపుచూస్తున్న కవితతో పద్మావతి
“వచ్చేస్తాడు రాజా…”అంది తెలిసినట్టుగా.
‘ఇప్పుడు అంతా బాగున్నట్టే కదా…”అని అడిగాడు తిరుమలరావు.
“బాగుంది సార్…మీ దయ” అన్నాడు వెంకటేశ్వర్లు తిరుమలరావుతో.
“మా దయ కాదండీ…మా అదృష్టం..సమయానికి బాబు దొరికాడు. ఇంకా జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉన్నాము.”
‘మీరు ఇక మీద డబ్బు పంపవద్దు. మేమే చూసుకోగలము. ఆరోగ్యపరమైన ఇబ్బందులనుండీ బయట పడి నట్టే”
‘మీరు చూసుకోరని కాదు. మాకు సంతృప్తి అంతే..”
వారిసంబాషణ వింటూ కూర్చుంది కవిత ఉద్వేగంతో.
ఇంతలో బయట అలికిడి అయ్యింది. కవిత టక్కున లేచి బయటకు చూసింది. రాజా సైకిలు లోపలి తెస్తూ కనిపించాడు.
ఆనందంగా వాకిలి వరకూ వెళ్ళింది కవిత
“అమ్మా బాగున్నారా?” అని వంగి కాళ్ళకు నమస్కారం చేసాడు రాజా.
లోపలి రాగానే తిరుమలరావుగారి కాళ్ళను కళ్ళ కద్దుకున్నాడు.
పద్మావతి వంటింటి లో నుండీ పలహారాల ట్రే తెస్తూ రాజాను చూసి
‘ఇంత సేపు పట్టిందే..’అంది నవ్వుతూ.
అమ్మకు సమాధానం చెబుతున్న రాజా వైపు ప్రేమతో చూస్తున్నారు తిరుమలరావు దంపతులు.
“రాజా మంచినీళ్ళు తీసుకురా“ అని పురమాయించింది పద్మావతి. వెంకటేశ్వర్లు “ఇప్పుడే వస్తా “అని బయటకు నడిచాడు.
“రాజా ఇటు రా నాన్న” అని ఆప్యాయంగా పిలిచి తిరుమలరావుకూ తనకూ మధ్య కూర్చోబెట్టుకుంది కవిత.
‘మీరు మాట్లాడుతూ వుండండి నేను వంట చేసేస్తా”అని వంటింట్లోకి దూరింది పద్మావతి.
రాజా తల మీద చెయ్యి వేసి నిమురుతూ “ఎలా వున్నావు ?నాన్నా” అని అడిగింది. తిరుమలరావు తదేకంగా రాజాను చూస్తూ వున్నాడు.
“బాగున్నాను అమ్మా, ఈ సారి డిగ్రీ లో చేరుతాను.”
“ఆరోగ్యం బాగుంది కదా“
‘బాగుంది అమ్మా… మీరు పెట్టిన బిక్ష. అమ్మా నాన్న మిమ్మల్ని తలుచుకోని రోజంటూ వుండదు.”
“అలా అనకు రాజా. నీవు ఇలా ఉండటం మా అదృష్టం కాదా?” ప్రేమగా అంది కవిత
“ఒక సారి లేవు నాయనా”అని లేచిన రాజా ని హృదయానికి హత్తుక్కుంది కవిత. ఇది చూసి తిరుమలరావు కూడా లేచి నిలబడి కౌగలించుకున్నాడు రాజాని.
ఇలాటి దృశ్యాలు ఉంటాయనే వెంకటేశ్వ ర్లు, పద్మావతి కాస్సేపు వారికి ప్రైవసీ కల్పిస్తారు వారు వచ్చినప్పుడల్లా.
వాళ్ళ తృప్తి వీరికి తెలుసు కాబట్టి.
కొంచెంసేపట్లో వెంకటేశ్వర్లు వచ్చి “దేవుడి దర్శనం చేసుకు వద్దాం లేవండి” అన్నాడు
అందరూ కలిసి భీమేశ్వర ఆలయానికి కి వెళ్లి దర్శనం చేసుకుని వెనక్కి వచ్చాక కవిత వెంకటేశ్వర్లు దంపతులకు, రాజాకూ బట్టలు పెట్టింది.
‘వచ్చిన ప్రతిసారీ ఇలాగే ఇస్తారు “అంది పద్మావతి నిష్టూరంగా.
“మా కోసమే… మాకు మీరిచ్చిన అవకాశమే అమ్మా…ఇంకా ఇక్కడకు రావచ్చనే ఆశతో వున్నాము. రాజా ను మాతో పంపడానికి ఇష్టపడలేదు కదా మీరు.”
‘అమ్మా మాకు ఒకడే కొడుకు. వాడి మీద ఎన్నో ఆశలు. దూరం చేసుకోవడానికి కాలేదు. మీరు ఎప్పుడైనా రావచ్చు. వాడు ఉద్యోగ౦ వరకూ వచ్చాక మీ దగ్గరకు వచ్చి పోతూ ఉంటాడు. అయినా వాడు మీరు పెట్టిన బిక్ష మాకు” అంది పద్మావతి కన్నీళ్ళతో
“వాడు ఉద్యోగానికి ఎదిగేదాకా మేము పంపే డబ్బును కాదనవద్దు…ప్లీజ్ “అన్నాడు తిరుమలరావు.
పద్మావతి భర్త వైపుచూసింది.”
“ఇప్పటికే చాలా ఆదుకున్నారు సార్…”
“అది మాకు భారం కాదు. అందులో మేము సాయం చేయడానికి కారణం తెలిసి కూడా మీరు ఇలా అనకూడదు.” అన్నాడు తిరుమలరావు.
“బోజనానికి లేవండి..”అన్న పద్మావతికి సాయం చెయ్యడానికి లోపలి వెళ్ళింది కవిత.
అందరూ కూర్చుని ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ బోజనాలు ముగించారు.
రాత్రి పది దాకా అక్కడే గడిపి హోటల్ కు చేరుకున్నారు తిరుమలరావు దంపతులు.
రాత్రి హోటల్ రూమ్ లో కన్నీటి పర్యంతమైంది కవిత.
“ఇదే మన అదృష్టం అనుకోవాలి కవితా…కంటి ముందు రాకేశ్ ఉన్నట్టే వుంది. మంచి పని చేసామన్న తృప్తి మిగిలింది. ముఖ్యంగా వీరందరినీ రాకేశ్ పుట్టిన రోజున కలిసేలాగా దేవుడు అవకాశం ఇచ్చాడు.” అని ఓదార్చాడు భార్యను.
పడకమీద పడుకుని జరిగిపోయిన భయంకర సత్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంది కవిత. రెండేళ్ళ క్రితం తూర్పు గోదావరి జిల్లలో పుణ్యక్షేత్రాలు తిరగాలని బయలు దేరారు తిరుమలరావు, కవిత కొడుకు రాకేశ్ తో
రాజమండ్రి దగ్గర కారుకు ఆక్సిడెంట్ అయ్యింది. ముందు కూర్చున్న డ్రైవర్ అక్కడి కక్కడే చనిపోయాడు. కానీ ముందు సీట్లో కూర్చున్న రాకేశ్ తలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. వెనక కూర్చున్న కవిత వాళ్లకు కూడా దెబ్బలే కానీ ప్రాణ భయం లేదు.
108 ద్వారా రాజమండ్రి హాస్పిటల్ చేరారు. రాకేశ్ కు బ్రెయిన్ డెడ్ అని తేల్చారు డాక్టర్స్. కళ్ళు బైర్లు కమ్మాయి కవిత, తిరుమలరావుకు. ఒక్కడే కొడుకు…ఏమి చెయ్యాలి ??అని తల బాదుకున్నారు. అప్పుడు వచ్చారు మోహన్ ఏజన్సీ ఆర్గాన్ డోనర్స్ వాళ్ళు.
అబ్బాయి పరిస్థితి దృష్టా అతని ఆర్గన్స్ డో నేట్ చెయ్యడం ఎంతమందికి సాయ౦ చేసి బతికించ వచ్చో తెలిపారు.
ఈ విషయం తెలీక కాదు. కానీ ఏదైనా తన దాకా వస్తే వేరుగా వుంటుంది.
తర్జన భర్జనల తరువాత అంగీకరించారు.
కళ్ళు దెబ్బతిని చూపు పోయి హాస్పిటల్ లో వున్నపార్వతికి రాకేశ్ కార్నియా అమర్చారు. కంటి చూపు వచ్చింది.
ఒక ఆక్సిడెంట్ అయి చాల క్రిటికల్ గా వున్న రాజా కు కిడ్నీలు, లివర్ అమర్చారు.
ఇంకా కొన్ని ఆర్గాన్స్ విజయవాడకు తరలించారు.
ఆవిధంగా పార్వతి కళ్ళల్లో రాకేశ్ కళ్ళని, రాజా లో వున్న తమ రాకేశ్ ని చూసుకోవడానికి యాడాదికి ఒకసారి రాకేశ్ పుట్టిన రోజు నాడు వచ్చి కలవటం చేస్తున్నారు. ఇవ్వాళా అదే జరిగింది.
రాజాకు ఆర్ధిక సాయం చెయ్యడం అవసరమని తెలిసాక డబ్బు సాయం కూడా చేస్తున్నారు.
ఆప్తులు చనిపోయినా అవయవ దానం చేసే అవకాసం వున్నప్పుడు ఎంతమందికో ప్రాణ దానం చేసిన వాళ్ళవుతారు.
లక్కీగా అత్యంత అవసరం వున్నపార్వతి, రాజా లు అదే హాస్పత్రిలో వుండటం, తిరుమలరావు దంపతులకు తగిలిన దెబ్బలకు అక్కడే ట్రీట్మెంట్ జరగటం వలన వారి కుటుంబాలతో పరిచయం జరగటం జరిగింది. ప్రతి సంవత్సరం రాకేశ్ పుట్టిన రోజున తప్పనిసరిగా ఈ రెండు కుటుంబాలను కలుసుకోవడం చేస్తున్నారు. ఇరు వర్గాలూ ఎంతో సంతోషంగా గడిపే రాకేశ్ పుట్టిన రోజు ఎంతో ఆనంద దాయకం.
ఒక అవయవదానం వాళ్ళ ఎంతమందికి ప్రాణం పోసి సంతృప్తి చెంద వచ్చో వీరిని చూసి నేర్చులోవాలి.
$$$$$$$

2 thoughts on “ఆత్మీయులు

  1. అవయవాల దానం గురించిన కథ బాగుంది మేడం.అభినంధనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *