April 23, 2024

గతం నుండి విముక్తి-శ్రీ జిడ్డు కృష్ణమూర్తి

రచన: శారదాప్రసాద్

తన ప్రసంగాలు వినడానికి వచ్చే వారినుండి ఏ రకంగా డబ్బు వసూలు చేయడానికి వీల్లేదని జిడ్డు కృష్ణమూర్తిగారు చెప్తుండేవారు. ‘ఆధ్యాత్మికతను అమ్ముకోవడం కన్నా ఘోరమైన విషయం మరేదైనా ఉంటుందా’’ అని కృష్ణమూర్తిగారు ఏనాటినుండో అంటూ వచ్చారు. ఆయన ప్రసంగానికి‘కృష్ణమూర్తి ఫౌండేషన్’ వారు డబ్బు వసూలు చేయడం ఒక ప్రత్యేక సందర్భంలో జరిగింది. కృష్ణమూర్తి గారు 1986 ఫిబ్రవరి 17న గతించేసరికి డబ్బు పంపిన వారందరికీ తిరిగి చెల్లించవలసి వచ్చింది. అంటే ‘ఆధ్యాత్మిక ప్రసంగాలను ధనానికెలా విక్రయిస్తామండీ’ అని క్షోభిల్లిన శ్రీ కృష్ణమూర్తి పంతం చివరికి నెగ్గింది. ఆయన్ని గురించి ఎందరో ఎన్ని విధాలుగా చెబుతున్నారో అంతులేదు. ఎలాగైతే భగవద్గీత వ్యాఖ్యానాలు ఎన్ని వచ్చినా, ఎవరికి వారు తాము అర్థం చేసుకున్నదాన్ని వివరించారే గానీ, తమదే ‘ఆఖరి మాట’ అనలేదు . అలాగే కృష్ణమూర్తి గారిని కూడా ఇంకా అధ్యయనం చేస్తూ ఉండాల్సిందే. తను ప్రసంగించటం మొదలు పెట్టినప్పుడు దివ్య జ్ఞాన సమాజం వారి భాషను వాడేవాడు. అయితే 1922 నుండి, అమెరికాలో ‘ఒహై’ అనే గ్రామంలో తనకు కలిగిన వినూత్నానుభవం అనంతరం, ‘తన భాషను తాను కనుగొన్నానని’ అన్నాడు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి.

ఈనాటి ప్రపంచంలో ‘మతాలు’ గా మనం స్వీకరించినవేవీ అసలు మతాలే కావు. ఈ ప్రపంచపు మతాలన్నీ వాటి అర్థాల్ని పూర్తిగా కోల్పోయాయి. ఈనాడు ప్రపంచంలోని బుద్ధిజీవులందరూ మతాలని వదిలించుకుంటున్నారు . సత్యానికి ఒక మార్గమంటూ లేదు. ఏ మతవిధానానికో సంబంధించిన వారు సత్యాన్ని దర్శించలేరు. నది ఒడ్డున కూర్చుని నదిలో గిరికీలు కొడుతున్న చేపపిల్లను చూసినట్లుగా జీవితం ఒడ్డున కూర్చుని జీవితం అనే చేపపిల్ల గిరికీలను గమనించండి. జీవితానికి అర్ధమూ, పరమార్ధమూ అర్ధం అవుతాయి అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. మనసులోనున్న ఆలోచనలన్నిటినీ మన మనసులోనే స్థిరీకరించుకోవటం చేస్తే, కొత్త ఆలోచనలకు తావు ఉండదు. మన మనసు అనే గది పూర్తిగా నిండిపోయి కొత్త విషయాలను అది స్వీకరించటానికి ఆవకాశం ఉండదు. ఉదాహరణకు మన గది అంతా పుస్తకాలు, ఇతర వస్తువులతో పూర్తిగా నిండివుండి మనం అడుగు పెట్టటానికి కూడా ఖాళీ లేదనుకొండీ!మనకు ఎంత చిరాకుగా ఉంటుంది?అన్ని వస్తువులను ఒక క్రమంలో సద్దుకుంటే, మనకు ఏది కావాలో, దాన్ని వెంటనే తీసుకోవచ్చు!అసలు గది మొత్తం ఖాళీ చేసి మనకు పనికి రాని వస్తువులు బయట పారేసి, వాటి స్థానాల్లో అన్నీ కొత్త విషయాలతో గదిని నింపుకుంటే చాలా బాగుంటుంది. గది ఖాళీగా ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత ఉపయోగమో అర్ధం అయ్యింది కదా!

మన Brain అంతా పాత విషయాలతో పూర్తిగా నిండిపోయి, కుళ్ళిపోయిన భావాలతో ఎంత కంపు కొడుతుందో ఇంకా మీకు వివరించవలసిన పని లేదనుకొంటాను. గతం ఒక సెకండ్ కింద వెళ్లి పోయింది. అది మళ్ళీ రాదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అందుకని మనం ఎప్పుడూ వర్తమానంలోనే జీవించటం నేర్చుకోవాలి. ‘గతం నుండి విముక్తి'(Freedom from the known)అనే జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం వీలుంటే ఒక సారి చదవండి. అసలు సమస్య ఏమిటంటే, గతాన్ని వదులుకోవటానికి మనం ఇష్టపడం. కారణమేమంటే, దీర్ఘంగా ఆలోచిస్తే, గతం నుండి విముక్తి లభించేది మరణం తర్వాతే!దాన్ని గురించి అంత భయపడనవసరంలేదు. శ్వాస నిశ్వాసల ద్వారా మనం ప్రతి క్షణం పుడుతున్నాం, చస్తున్నాం!

9 thoughts on “గతం నుండి విముక్తి-శ్రీ జిడ్డు కృష్ణమూర్తి

 1. మృత్యువు అంటే ఏమిటో సులభ శైలిలో వివరించారు

 2. జిడ్డు కృష్ణమూర్తి గారి భావజాలాన్ని సులభ శైలిలో తెలియచేసారు

 3. మిత్రమా,
  ‘గతంనుండివిముక్తి ‘ వ్యాసంచాలబాగుంది.భగవంతుడిని అడ్డంపెట్టుకొనిమతాలుచెలగాటమాడుతున్నాయి.విముక్తి అనేది దేనినుండి అవసరమో అవగతంచేసుకుంటే అదిపొందటంశులభం.విముక్తిపొందాల్సినవి జీవితంలో ఎన్నోఉంటాయి.
  ” భవిష్యత్ మీద విశ్వాసం ఉంచకు
  మృతిచెందినగతాన్నిస్మృతిలోకిరానీయకు
  వర్తమానంలో నడువు,సాగిపో…”
  నీకుతోచిందినమ్మితే విశ్వాసం..
  శాస్త్రంచెప్పిందినమ్మితే… భక్తి
  ఈరెంటిసమన్వయం మతంలోచూడటం పరిపాటి.. అదిమూర్ఘభావాలను ఎగదోస్తే అంతకంటెమూడత్వమ్మరొకటి ఉండదు. జీడ్డుకృష్ణమూర్తి రచనలు ఎన్నోపరిష్కారాలు సూచిస్తాయి .
  మంచి ఆలోచనరేకెత్తించేరచన చేసినందుకు ధన్యవాదాలు.
  వి.యస్.కె.హెచ్.బాబురావు.

 4. మీ వ్యాసం ‘జిడ్డు కృష్ణమూర్తి ‘ గారి ‘ గతంనుంచి విముక్తి ‘ చక్కగా వుంది . మానవజాతి ఒక్కటే,యీ మతాలు,కులాలు మనస్వార్ధం కోసం  సృష్టించినయే,యిప్పట్లో విముక్తి లేదనుకుంటాను .ధన్యవాదములతో
  నాగయ్య 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *