April 18, 2024

తెలంగాణా జిల్లాలోని శ్రీరంగం యాత్ర

రచన: రమా భాగి


దీపావళి ఐనవెంటనే ఆ హడావిడికి కొంచెం విశ్రాంతిగా , కార్తీక దామోదరుడికి పెట్టె దీపాలకోసం ఈ సారి భగవంతుడి దర్శనానికి ఏదైనా చూడని ప్రదేశాన్ని చూడాలి అనుకుని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను.

మా పెద్దాడపడచు కోడలు నేను కలిసి కార్తీక వన విహారంగా పెంబర్తి దగ్గరున్న శ్రీ రంగాపూర్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాధుడి దర్శనం చేసుకున్నాము. గుడి పరిసరాలు అద్భుతంగా ఉన్నాయి చుట్టూ పెద్ద పెద్ద చెరువులు , పచ్చని మొక్కలు , గుడి పరిసరాలన్ని చాలా శుభ్రంగా ఉన్నాయి.

అక్కడి గుడి గురించి ప్రధానార్చకులు వివరంగా చెప్పారు. 5 వందల సంవత్సరాల క్రితం అక్కడి వ్యాపారి ఒకతను ప్రతిసంవత్సరం శ్రీరంగం వెళ్లి రంగనాధ దర్శనం చేసుకునే వాడు. పెద్దతనం రావడంతో ఓపిక తగ్గి వెళ్లలేని పరిస్థితిలో రంగనాధుడిని వేడుకున్నాడట ఏంచెయ్యమ0టావని , దానికి శ్రీరంగనాధుడు వ్యాపారి కలలో కనపడి. . . ఒక గ్రద్ద ఎగురుతూ ఎగురుతూ ఎక్కడ ఆగితే అక్కడ తవ్వించమని చెప్పి మాయమయిపోతాడు.

మరునాడు అలాగే ఒకగ్రద్ద ఎగురుతూ కనపడితే వ్యాపారి గుర్రం మీద గ్రద్దను అనుసరించి వెడతాడు. కొంతదూరం వెళ్ళాక ఒక స్థలంలో క్రింద వాలుతుంది గ్రద్ద. అక్కడ తవ్వించగానే శ్రీరంగనాధుని విగ్రహం దొరుకుతుంది.అక్కడే గుడి కడతారు.ఆ వూరికి శ్రీరంగం అని పేరు.


ఇక్కడ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు ఉత్సవాలు జరుగుతాయి , సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

అక్కడినుంచి సోమశిల దగ్గరే అని డ్రైవర్ చెప్పేటప్పటికి అక్కడికి బయలుదేరి వెళుతుంటే దారిలో పెద్ద రాజగోపురంతో ఒక గుడి కనిపిస్తే ఊరుపేరు అడిగితే జటప్రోలు అని చెప్పారు సరే గుడి మూసేసి వుంటుందనుకుని వెళ్ళాము కానీ రుక్మిణి సత్యభామ సమేత మధన గోపాలుడు ఎంత అద్భుతంగా ఉన్నాడంటే లేచి రావాలనిపించదు దర్శనం చేసుకున్నాక రుచికరమైన పులిహారా ప్రసాదం తీసుకుని సోమశిల బయలు దేరాము.


కృష్ణా నది పరవళ్లు త్రొక్కుతూ కొండల మధ్య నుంచి పాయలుగా ప్రవహిస్తూ ఎదురు వచ్చింది అక్కడి ద్వాదశ లింగాలతో కలిపి కొలువైన సోమేశ్వరుడి దర్శనం చేసుకున్నాము.


అక్కడి నుంచి సప్తనదీ సంగమం కృష్ణ, వేణి, తుంగభద్ర ,భీమా ఇంకో రెండు నదుల సంగమం పడవలో ప్రయాణం చేసి సంగమేశ్వరాలాయం ఏడూ నదులు కలిసే చోట చుట్టూ కొండలతో ఉదృతంగా ప్రవహిస్తున్న నదిలో ప్రయాణం అద్భుతమే. సగం నీటిలో మునిగిన లాలితాపరమేశ్వరి సమేత సంగమేశ్వర దర్శనం చేసుకుని మళ్ళీ పడవలో వెనుకకు రావడం మంచి అనుభవం.

సోమశిల దర్శనానంతరం కొల్లూరు సంస్థానంగా పరిపాలన చేసిన రతన్ రాయలవారి ఆస్థానానికి గుర్తుగా ఉన్న కోట చూసి వచ్చాము. పాత గత స్మృతులు మాత్రమే కనిపించాయి అక్కడ.

అక్కడినుంచి దగ్గరలోని శివోటం లోని ఉగ్రనరసింహ స్వామి గుడి దర్శనం నిజంగా మరపురాని విశేషం. ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు గుడి క్రిందనుంచి ప్రవహిస్తున్న జాలపాతంతో గుడి చుట్టూ నదిలా ప్రవహిస్తున్న నీరు చాలా అందమైన చిత్ర పటంలా అనిపించాయి. నరసింహసీమి వారి విగ్రహం శివలింగంలా ఉంది మీసాలతో చాలా బావుంది గుడి పరిసారాలు.


అక్కడి లక్ష్మీ అమ్మవారు కొంచెం దూరంలో మరొక కొండమీద వెలిసింది తప్పక చూడవలసిన గుడి అమ్మవారు చుట్టూ నది ఎత్తుగా కొండమీద కొలువైంది అమ్మవారు మనం ఎటువేడుతున్నా మన వైపు చూస్తున్నట్లే ఉంటుంది చాలా సేపు ఆ భావన నుండి బయటకు రాలేక పోయాను.

కార్తీక మాసం మొదటి రోజు శివకేసవ దర్శనంతో శక్తి మమ్మల్ని వదల లేదని లక్ష్మీ అమ్మవారి దర్శనంతో అనిపించింది నాకు వీలైతే ఒకరోజు చూసి రావచ్చు కానీ ఎక్కడా సరిఅయిన భోజన0 దొరకదు.

ఇదంతా ఒక్కరోజులో చూసి వచ్చే యాత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *