April 16, 2024

తేనెలొలుకు తెలుగు

తెలుగులో కొన్ని ప్రసిద్ధ వాక్యాలు

భాష ఒక సముద్రం. దూరం నుంచి చూస్తే అది ఒక జలాశయమనిపించినా తరచి చూసిన కొలది అపార నిధులు కనిపిస్తాయి. అది విశాలమైనది, లోతైనది, గంభీరమైనది కూడా. మనకు మన పురాణాల్లో లక్ష్మి, చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్ఛైశ్రవము, రత్నమాణిక్యాలు, ముత్యాలు, పగడాలు ఆఖరుకు అమృతం కూడా సముద్రం నుండి లభించినట్లుగానే చదువుకున్నాం. కనుక భాష అనే సముద్రం నుండి కూడా తరచి చూచిన కొద్దీ అనేక విషయాలు తెలుస్తాయి.

గత వ్యాసాల్లో స్థాలీపులాక న్యాయంగా తెలుగు భాషా విశేషాలు తెలుసుకుంటూ వస్తున్నాం. పలు ప్రక్రియలు, సామెతలు, చాటువులు, ప్రహేళికలు, అవధానాలు వంటి వాటి గురించి ముచ్చటించుకున్నాం. అలాగే జాతీయాలు, నుడికారాలు గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే కొన్ని వాక్యాలు అటు సామెతలు కాక, జాతీయాలు నుడికారాలు కాకుండా కేవలం ప్రచలితంలో ఉన్న ప్రసిద్ధ వాక్యాలుగా చలామణిలో ఉన్నాయి. అవి పద్య పాదాలు కావచ్చు లేదా గేయశకలాలు కావచ్చు లేదా కేవలం పొడి వాక్యాలు కావచ్చు. ప్రాసంగికత ననుసరించి అవి ప్రసిద్ధ వాక్యాలుగా భాషలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాటిని ఏర్చి కూర్చి ప్రసిద్ధ సాహితీ వేత్త కీ. శే. ద్వానా గారు వెంటాడే వాక్యాలు అని ఒక పుస్తకమే వెలువరించారు.

మనందరికీ నాలుకల మీద ఆడే మాట ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ఇది కృష్ణదేవరాయల పద్యం
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
ఈ పద్యం లోని చివరి వాక్యం నానుడిగా ప్రసిద్ధికెక్కింది.
అలాగే గురజాడ వారి
‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’
ఇది వారి గేయ భాగం.
కృష్ణ శాస్త్రి గారి ‘నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు’
వారి భావ గీతంలోని వాక్యం
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు
కల విహంగమ పక్షముల తేలియాడి
తారకామణులలో తారనై మెరసి
మాయమయ్యెదను నా మధుర గానమున
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. . . . . .

ఇటీవల తెలంగాణ ఉద్యమంలో మారుమ్రోగిన మాట ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’
మహాకవి దాశరథి కలం నుండి జాలువారిన
గేయం నా తెలంగాణ గేయం లోని చివరి చరణం
‘మూగవోయిన కోటితమ్ముల గళాల
పాట పలికించి కవితా జవమ్ము కూర్చి
నా కలానకు బలమిచ్చి నడిపినట్టి
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
అలాగే విశ్వనాథ ‘మరలనిదేల రామాయణంబన్న ‘
ఆయన రాసిన సీసపద్యపు ఎత్తుగడ .

ఇలా శ్రీశ్రీ ‘కాదేదీ కవితకనర్హం’కాళోజీ ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’, సినారె ‘కప్పి చెపితే కవిత్వం, విప్పి చెపితే విమర్శ’, గరిమెళ్ల ‘మాకొద్దీ తెల్ల దొరతనమూ’,
పోతన ‘పలికించెడు వాడు’, శ్రీనాథుని ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు, రామదాసు ‘మము బ్రోవమని చెప్పవే’. త్యాగయ్య ‘ఎందరో మహానుభావులు’ఇలా ఎన్నెన్నో ప్రసిద్ధవాక్యాలు సమయానుకూలంగా సందర్భశుద్ధితో వాడినప్పుడు రచన అందగిస్తుంది. ముఖ్యంగా పత్రికలకు రాసే వ్యాసాలకు ఇలాంటి వాక్యాలు శోభను చేకూరుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *